Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు

(పంచీకరణము మఱియు తారకోపదేశం)

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు కాలజ్ఞాన కర్తగా అందరికీ సుపరిచితులు. వారు కేవలం కాలజ్ఞాన కర్త మాత్రమే కాదు, తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త కూడా. అంటే, వారొక సామాజిక తత్వవేత్త. బ్రహ్మంగారు కాలజ్ఞానమే కాక జీవైక్య బోధ, కాళికాంబ సప్తశతి వంటి గ్రంథాలు కూడా రాశారు.

బ్రహ్మం గారి కాలం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కీ.శే. జవంగుల నాగభూషణదాసు గారు రాసిన బ్రహ్మంగారి జీవితచరిత్రలో వారు జీవసమాధి పొందింది క్రీ.శ 1592వ సంవత్సరంలో అని రాశారు. ఇది సరియైన తేదీ అని మనం భావించవచ్చు. ఎందుకంటే బ్రహ్మంగారి శిష్యగణంలో సిద్ధయ్యతో పాటు వీరహుసేనయ్య అనునొక దూదేకుల కులస్తుడు కలడు. వీరికి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గల మనులాలాపేటకు చెందిన దేవాంగ కులస్తుడు శ్రీ రుద్రమూర్తిగారు శిష్యుడు. వీరు మనులాలపేటలోనే క్రీ.శ 1676వ సంవత్సరమున జీవసమాధి చెందారు. దీనిని అనుసరించి బ్రహ్మంగారు 16వ శతాబ్దానికి చెందిన వారుగా భావించవచ్చు.

సృష్టి, అజ్ఞానం, పునర్జన్మ వంటి అంశాలపై బ్రహ్మంగారు చెప్పిన తత్వముల గురించి స్థూలంగా తెలుసుకుందాం. వీలైన చోట్ల విపులంగా కూడా తెలుసుకుందాం. ముందుగా పంచీకరణము గురించి తెలుసుకుందాం.

పంచీకరణము:-

సృష్టికి పూర్వము నిత్య సత్య నిర్మల నిర్గుణ నిరాకార నిరామయ సర్వాత్మకమైన బ్రహ్మమొక్కటే ఉండేది. ఋగ్వేదంలో “ప్రజ్ఞానమే బ్రహ్మం” అని చెప్పబడింది. శృతులననుసరించి బ్రహ్మమంటే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే శుద్ధ చైతన్యం అని అర్ధం. ఆంగ్లంలో శుద్ధ చైతన్యమంటే “Absolute Consciousness”. అట్టి బ్రహ్మముకు సృష్టి చేయుటకు సామర్ధ్యము కలదు. బ్రహ్మంలోనే అంతర్భాగంగా ప్రకృతి ఉంటుంది. దాని నుండి హిరణ్యగర్భుడు పుట్టును.

హిరణ్యగర్భుడి నుండి సత్వరజస్తమో గుణములు ఉద్భవించును. హిరణ్యగర్భుడు అంటే మనం నాలుగు తలల బ్రహ్మదేవుడిగా ఊహించుకోకూడడు. హిరణ్యగర్భుడు అంటే విష్ణునాభి నుండి పుట్టే శక్తి అని అర్ధం చేసుకోవాలి. విష్ణునాభి అంటే కృష్ణబిలం. ప్రతి పాలపుంత(Milky Way)కి ఒక కృష్ణ బిలం ఉంటుంది. ఆంగ్లంలో కృష్ణబిలం అంటే “Black Holes”. అక్కడే సృష్టి రహస్యం ఉందని స్టీఫన్ హాకింగ్ వంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

సత్వగుణమందు జ్ఞానేంద్రియములు, రజోగుణమందు కర్మేంద్రియములు, తమోగుణం వల్ల వాటి విషయాలు పుట్టును. జ్ఞానేంద్రియముల నుండి పంచ మహాభూతములు బుట్టును. ఈ విధంగా సూక్ష్మ సృష్టి జరుగుతుంది.

సూక్ష్మ పంచమహాభూతములలో ఒక్కొక్క భూతము తక్కిన భూతములతో కలిసి స్థూల సృష్టి ఏర్పడుతుంది. దీనినే పంచీకరణము అంటారు.

పంచమాహాభూతములతో ఏర్పడిన స్థూల శరీరంలో ఇరవై అయిదు తత్త్వాలు ఉంటాయి. ప్రతి భూతములో ఐదేసి తత్త్వాలు ఉంటాయి. అవి

  1. అంతరేంద్రియములు - జ్ఞానము, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం
  2. పంచప్రాణములు - సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపానములు
  3. జ్ఞానేంద్రియములు - శ్రోత్రము, జిహ్వ, త్వక్కు, చక్షువు, ఘ్రాణము
  4. కర్మేంద్రియములు - వాక్కు, ప్రాణి, పాదము, గుదము, గుహ్యము
  5. పంచతన్మాత్రలు - శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము

జ్ఞానేంద్రియములైదును, కర్మేంద్రియములైదును, పంచ ప్రాణములు, మనో బుద్ధులు రెండును కలసిన పదిహేడు తత్త్వములతో కూడినదే సూక్ష్మ దేహము. ఇదే కర్మల వల్ల పునర్జన్మ ఎత్తునది. అనగా దేహాంతరయానము చేయునది.

అద్వైతం ప్రకారము ప్రతి జీవికి ఒక్కొక్క జీవాత్మ ఉండదు. ఉండేది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మే ప్రతి జీవిలోనూ బీజ రూపంలో కొలువై ఉంటుంది. ‘తత్త్వమసి’ (చంద్యోగోపనిషత్ 6/8) అను శృతి వాక్యము ప్రకారము బ్రహ్మము, ఆత్మ అను రెండూ ఒకటే. బ్రహ్మమే ఆత్మ రూపంలో మన దేహాలలో కొలువై ఉంటాడు.

‘అహం బ్రహ్మాస్మి’ అంటే నేనే బ్రహ్మను అని శ్రుతులలో చెప్పబడి ఉన్నప్పటికీ, అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోనంత వరకూ జన్మల పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము.

తెలుసుకోలేకపోవడానికి కారణం ‘అజ్ఞానం’. అంటే మనల్ని మనం ఈ దేహమే నేను అని భావించుకోవడం. ఈ దేహంలో పరమాత్మ అనే చైతన్యం లేకపోతే ఈ దేహం ఉత్త మాంసపు ముద్ద. దేహము,ఇంద్రియాలపై జీవుడికి నేను, నాది అను అహంకార మమకార భావములు ఏవి కలవో దానినే ‘అధ్యాసము’ అంటారు.

ఈ జగత్తు అంతా బ్రహ్మమే చైతన్యం ఆధారంగానే ఉంది. బ్రహ్మానికి వేరుగా దానికి ఉనికి లేదు. కాబట్టి ఈ జగత్తు అంతా మాయ అని అంటారు. మాయ అంటే కనపడే ఈ జగత్తు అంతా అవాస్తవం అని కాదు అర్ధం, ఇది కేవలం వ్యావహారిక సత్యం మాత్రమే అని. పారమార్ధికంగా ఉండేది బ్రహ్మం ఒక్కటే. అంటే జగత్తు సృష్టించబడుతూ ఉంటుంది, మరలా లయమైపోతూ ఉంటుంది. జీవులు పుడతారు, గిడుతారు. కానీ, బ్రహ్మం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అంటే సత్యం ఒక్క బ్రహ్మం మటుకే.

బ్రహ్మం ఒక్కటే ఉంది, అది తప్ప మరేదీ లేదని మనస్సు గ్రహించుటే పరిపూర్ణమును దర్శించుట. అంటే ముక్తి పొందటం. అజ్ఞానం నశించి ముక్తి పొందిన పిదప కర్మలు కూడా నశించి పునర్జన్మ పొందటం జరగదు.

తారకోపదేశం :-

పరబ్రహ్మమును తెలుసుకొనుటకు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చేసిన ఉపదేశమే ‘తారకోపదేశం’.

పద్మాసనంబున కూర్చుండి పవనము కన్నా బహురెట్లు వేగముగా పరిగెత్తే మనస్సును పరుగిడనీయక విద్యుల్లేఖ యందు మనస్సును లయంబు చేయగా చిన్మయరూపుడైన శ్రీ గురుమూర్తి కనపడును. ఇక్కడ గురుమూర్తి అనగా “పరబ్రహ్మము”, విద్యుల్లేఖ అనగా “అణువు” అని స్వాములవారి భావం. అణువు యందే కోటి సూర్యప్రకాశంబులు పుట్టినవి. దీని యందే సర్వలోకములూ పుట్టి, దీని యందే లయించును.

అజ్ఞానమను నువ్వులను శ్రీ గురునామోచ్చారణ అను కల్వమున వేసి, మర్ధించి జ్ఞానమను నూనెను తీసి కనుగ్రుడ్డు అనే ప్రమిద యందు నూనె పోసి జీవభ్రాంతి అనే వత్తి చేసి నిర్వికారం అనే అగ్నితో వత్తిని వెలిగించి కోటి సూర్య ప్రకాశంబైన నిర్వికారములో జేరి అచలంబను ఆనంద వారధిన మునిగి తరించాలని బ్రహ్మం గారు బోధించారు.

పంచీకృతంబులైన సకలేంద్రియంబులు, సత్వ రజస్ తమో గుణములనే త్రిగుణములు, స్థూల, సూక్ష్మ శరీరములు, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు - తాను వీటన్నిటితో కూడిన జీవుడిని కానని మనిషి తెలుసుకుని, తనకు తానుగా విచారించి, అన్ని వికారములను విడనాడి అచలుడై ఉండుటే ‘సాంఖ్యయోగము’ అనబడును.

గురునామోచ్చారణకు బ్రహ్మం గారు ఉపదేశించిన మంత్రం - ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః

Posted in February 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!