Menu Close
Gowrabathina-KumarBabu
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

వ్యక్తి సత్యాగ్రహం

1940 లో వ్యక్తి సత్యాగ్రహం కొరకై సంజీవరెడ్డి గారు గాంధీజీచే ఎంపిక కాబడ్డారు. ఇందు నిమిత్తం డిసెంబర్ 22, 1940 న ఇల్లూరు గ్రామములో బహిరంగ సభ జరిగింది. అనంతపురం జిల్లా నుండి వ్యక్తి సత్యాగ్రహం కోసం రెండవ పట్టీలో సుమారు 100 మంది అంగీకరింపబడ్డారు. బహిరంగ సభ లో ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కళా వెంకటరావు గారు, శ్రీ ఎ.రాయప్పగారును కాంగ్రెస్ సత్యాగ్రహము గురించి సుమారు ఒక గంట కాలము సవివరముగా తెలిపిరి.

అదే రోజు సంజీవ రెడ్డి గారి సత్యాగ్రహ సందర్భంగా ఇల్లూరు గ్రామమంతా పచ్చతోరణములతో పండుగ నాటి వలె అలంకరింపబడింది. చుట్టు పక్కల పల్లెల నుండి యువ రైతులు, జిల్లా పెద్దలు వచ్చారు. చెన్నకేశవ ఆలయ ప్రాంగణమున అలంకరింపబడిన మంటపము ముందు ప్రజలందరూ సమావేశమై నిశ్శబ్దముగా వీధి పొడుగునను, మిద్దెలపైనను, గోడల పైనను వేచియుండిరి. సకాలమున సంజీవ రెడ్డి గారు ఇంటి నుండి బయలుదేరి మంగళ వాద్యములతో, వీధి పొడవునా పుష్ప మాలలు సమర్పించుచుండగా సభా మంటపమునకు వచ్చిరి. అచ్చట వారిని ముత్తైదువులు కుంకుమ పెట్టి దీవించిరి. ఏర్పాటు చేసిన ముహూర్తమునకు సరిగా సంజీవ రెడ్డి గారు యుద్ధ నిషేధ వాక్యములను స్పష్టంగా పలికారు. అక్కడే వేచియున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తమ మోటారు వ్యానులో అనంతపురం తీసుకుపోయారు. రాత్రి తొమ్మిది గంటలకే డెప్యూటీ మెజిస్ట్రేట్ ఎదుట విచారణ జరిగింది. కోర్ట్ లో కళా వెంకట రావు గారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ ప్రముఖులు, బంధు మిత్రులు విచారణ సమయమున ఉండిరి. సంజీవరెడ్డి గారికి కుర్చీ ఇచ్చి కూర్చుండ పెట్టిరి. విచారణ తర్వాత సంజీవ రెడ్డి గారి పైన ఇండియా రక్షణ చట్టం 88(5) సెక్షన్ క్రింద నేరం మోపబడెను. ఆయనకు 6 నెలలు కఠిన శిక్ష, 500 రూ జుల్మానా విధించి బి తరగతి సిఫారసు చేయబడింది. ఆయనను మరుసటి ఉదయం ధర్మవరం మీదుగా వేలూరుకు తీసుకొని వెళ్లిరి.

క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జైలు జీవితం

1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో కూడా సంజీవ రెడ్డి గారిని వేలూరు జైలులోనే ఉంచారు. అక్కడ ప్రకాశం గారు, వి.వి గిరి గారు, తెన్నేటి విశ్వనాధం, కామరాజ నాడార్, భక్తవత్సలం వంటి ఉద్ధండులతో కలసి జైలు జీవితం గడిపారు. వేలూరు జైలు లో కొన్నాల్లుంచిన తరువాత వీరందరినీ అమరావతి జైలుకు తరలించారు. అలా వెళ్లిపోయేటప్పుడు రాబోయే డెటిన్యూలకు వెళ్ళిపోయిన డెటిన్యూలెవరో తెలియడం కోసం గోడల మీద తమ వివరాలు వ్రాసారు. సంజీవరెడ్డి గారు తమ గురించి గోడ మీద కాస్తా విపులంగా వ్రాసుకున్నారు.

తెన్నేటి విశ్వనాధం గారు ఈ జైలు జీవితం వివరాలు రాసేటప్పుడు, కళా వెంకటరావు గారు, నీలం సంజీవ రెడ్డి, ఎం. పళ్లంరాజు, ఎం. బాపినీడు గారు జైలులో ఒక కట్టుగా ఉండి ద్వేషభావంతో ప్రకాశం గారి పట్ల వ్యతిరేకత కనబరిచారని విమర్శించారు.

రాష్ట్ర రాజకీయాలు (1946 -1964)

1946 లో సంజీవ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వుట, తదనంతర రాజకీయాలు

1946లో మద్రాస్ ప్రెసిడెన్సీ కి జరిగిన సాధారణ ఎన్నికలలో సంజీవ రెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం నుండి తరిమెల నాగిరెడ్డి గారి పై విజయం సాధించి శాసన సభ్యుడయ్యారు. తరువాత ఆంధ్ర కాంగ్రెస్ లెజిల్లేచర్ పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయారు. పిమ్మట రాజ్యాంగ సభలో కూడా సభ్యుడయ్యారు.

మద్రాస్ ప్రెసిడెన్సిలో మే 1,1946న ప్రకాశం గారు ప్రధాని గా తొలి మంత్రి వర్గం ఏర్పడి మార్చి 23,1947 వరకు కొనసాగింది. మార్చి 24, 1947 నుండి ఏప్రిల్ 6, 1949 వరకు ఓమండూరు రామస్వామి రెడ్డియార్ నేతృత్వంలో మంత్రివర్గం కొనసాగింది. ఏప్రిల్ 6,1949న పూసపాటి కుమారస్వామిరాజా ప్రధాని అయ్యారు. ఆయన మంత్రి వర్గం ఏప్రిల్ 9, 1952 వరకు కొనసాగింది. ఆయన మంత్రివర్గం లో సంజీవ రెడ్డి గారు మద్య నిషేధం మరియు గృహనిర్మాణ శాఖామంత్రి గా చేరారు.

1951 , ఏప్రిల్ 9 న ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం కోసం సంజీవ రెడ్డి గారు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

రాజీనామా లేఖలో సంజీవరెడ్డి గారు ‘అత్యున్నతమైన ఏ ఇతర హోదా కన్నా మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ మహాసంస్థ ద్వారా ప్రజాసేవ చేయుటయే నా ప్రధాన ధర్మముగా పరిగణిస్తున్నాను’ అని అన్నారు.

సంజీవ రెడ్డి గారు పి.సి.సి అధ్యక్షునిగా ఎన్నికైన విధము – ప్రకాశం గారి వర్గం కాంగ్రెస్ నుండి వేరు పడుట

1950 జనవరి 26 న ఇప్పుడు అమలులో ఉన్న సంవిధానం వచ్చింది. దాని ప్రకారం ఎన్నికలు జరగడానికి 1946 నుండి లెక్క వేస్తే, 1952 అని తేలింది. అప్పటికి ఆంధ్ర కాంగ్రెస్ ప్రకాశం, పట్టాభి సీతారామయ్య వర్గాలుగా చీలిపోయింది.

1946 లో ప్రకాశం గారు, తాము ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని ఆచార్య రంగా గారికి అప్పగించారు. పట్టాభి గారు అది తమ చేతుల్లోకి తీసుకోడానికెంతో యత్నించారు. వారి పక్షాన వారి అనుయాయులు మరియు మంత్రులు అయిన కళా వెంకటరావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి గారలు పనిచేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్ కమిటీని చేజిక్కించుకోవడానికి వారు సవ్యమైన రీతిలో ప్రయత్నించలేదని తెన్నేటి విశ్వనాధం గారు ప్రకాశం పంతులు గారి స్వీయ చరిత్రకు రాసిన అనుబంధ ఖండంలో విమర్శించారు.

తెన్నేటి విశ్వనాధం గారి కథనం ప్రకారం

కాంగ్రెస్ కమిటీ లో సభ్యులను చేర్చి, సక్రమమైన పద్దతిలో కమిటీని వశం చేసుకోవడానికి ప్రయత్నించకుండా సంజీవ రెడ్డి గారి వర్గీయులు, తమ వర్గీయులను ప్రకాశం వర్గీయులు సవ్యంగా సభ్యులు కావడానికి అవకాశం ఇవ్వలేదన్న నెపంతో ఒక లక్ష పేర్లు జాబితాగా రాసి, వేలిముద్రలు అనేకములు తగిలించి, లక్ష మందికి కావాల్సిన చందా ఇరవై వేల రూపాయలు కాంగ్రెస్ అధ్యక్షుని పేర ఢిల్లీకి పంపారని, ఆ డబ్బు ఒకరిద్దరు వర్తకులు, ఒకరిద్దరు జమీందారులూ సమకూర్చారని తెన్నేటి ఆరోపించారు. తరువాత ఈ లక్ష పేర్లు జాబితాలోంచి కొట్టి వేయబడ్డాయి.

తరువాత 1951 లో సంజీవ రెడ్డి మరలా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని చేజిక్కించు కోవడానికి గట్టి ప్రయత్నం చేశారు. సంజీవరెడ్డి మంత్రి పదవి వదులుకుని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీకి దిగారు. ప్రకాశం గారి వర్గం తరపున ఆచార్య రంగాగారు నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో రంగా గారు నాలుగు ఓట్లతో ఓడిపోయారు.

సంజీవరెడ్డి గారు ఎన్నికవ్వగానే వారి వర్గీయులు కాంగ్రెస్ భవనం ఆవరణ గోడలెక్కి లోపలికి దూకి, భవనం గదులలో ఉన్న రంగా గారి వర్గీయులకు చెందిన సామానులను విసిరివేశారని, ఏమైనా, ఆ రోజున సంజీవరెడ్డి వర్గీయులు చూపించిన ముష్కరత్వానికి సమానమైనది మరెన్నడూ చూడలేదు బహుశా డిల్లీ లో 1970లో కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రాంగణంలో జరిగిన ప్రహరణకాండ కొంచెం ఆ స్థాయికి వచ్చిందేమో! అని తెన్నేటి రాసుకొచ్చారు.

ఈ పరిణామాల తరువాత ప్రకాశం, రంగా గార్లు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ఆంధ్ర ప్రజా పార్టీని స్థాపించారు.

1952 సాధారణ ఎన్నికలు

1952 మద్రాస్ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో మళ్ళీ సంజీవ రెడ్డి గారు అనంతపురం నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఈసారి కూడా ప్రత్యర్ధి తరిమెల నాగిరెడ్డి గారే. ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో పోటీ చేసిన సంజీవ రెడ్డి గారు 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ ఎన్నికల్లో మొత్తం 375 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 367 స్థానాలలో పోటీచేసి 152 స్థానాలలో నెగ్గింది. ఆంధ్ర ప్రాంతంలోని 145 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో జాప్యమే కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి ప్రధాన కారణం.

1952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ గారికి సంజీవ రెడ్డి గారు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక లో ప్రస్తుతం ఉండే కాంగ్రెస్ సంఘాల స్వరూపం మార్చివేసి స్వలాభ పరులను, అవాంఛనీయ పరులను బహిష్కరించి నవచైతన్యంతో ఆంధ్ర కాంగ్రెస్ ను సంఘటిత పరచాలని సూచించారు.

1952-53 మధ్యకాలంలో సంజీవ రెడ్డి గారు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. కాళహస్తి శాసన సభ్యులు ఏ. బలరామిరెడ్డి గారు సంజీవ రెడ్డి గారి కోసం తన సీటుకు రాజీనామా చేశారు. 1953 సెప్టెంబర్ లో జరిగిన ఉపఎన్నికలలో సంజీవరెడ్డి గారు శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుండి తమ సమీప ప్రత్యర్ధి సుబ్బరామనాయుడు పై 14083 ఓట్లు ఆధిక్యంతో నెగ్గి మద్రాస్ అసెంబ్లీ సభ్యులయ్యారు.

నాటి పత్రికల్లో భిన్న కథనాలు

1953 సెప్టెంబర్ లో జరిగిన కాళహస్తి ఉప ఎన్నిక గురించి విశాలాంధ్ర పత్రికలో ‘ఒక చేతిలో డబ్బు, మరొక చేతిలో కొరడా - కాళహస్తి ఎన్నికల్లో సంజీవరెడ్డి గారి గెలుపు వెనుక జరిగిన దౌర్జన్యాల గాథ‘ శీర్షికన కథనం వెలువడింది.

ఈనాడు, మనం పత్రికల ఆశ్రిత పక్షపాతం చూస్తున్నాం. కొందరు నాయకులు ఏకంగా సొంత మీడియా సంస్థలనే నడుపుతున్నారు. ఆనాటి పత్రికలు కూడా పక్షపాతానికి మినహాయింపు కాదు. 1955 ఎన్నికల సందర్భంగా ఆంధ్ర పత్రిక కాంగ్రెస్ కు అనుకూలంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వ్యవహరించింది. విశాలాంధ్ర ఎలాగూ కమ్యూనిస్టు పార్టీ పత్రిక.

నాటి కాళహస్తి ఉప ఎన్నిక గురించి విశాలాంధ్ర కథనాన్ని సూక్ష్మంగా పరిశీలిద్దాం. నిజానిజాలు వెలికి తీయడం పక్కన పెడితే ఈ కథనం చదివిన తరువాత నాటికీ, నేటికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది.

“కాళహస్తి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వారు గ్రామాలలోని నిరంకుశ భూస్వాములను ఆసరా చేసుకొని ఎన్ని అక్రమాలకు, దౌర్జన్యాలకు ఒడిగట్టాలో అన్నిటికీ ఒడిగట్టారు. పోలింగ్ ఏజెంట్లను దాచి వేశారు. ప్రచారకులను కొట్టారు. నాగిరెడ్డి గారి సభలో రాళ్ళు రువ్వించారు. చీరలు, బియ్యం, రవికెల గుడ్డలు, వేలాది రూపాయలు వెదజల్లారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ప్రతి పనీ చేశారు. కాళహస్తి తాలూకా రాజకీయంగా వెనకబడి ఉన్నందున, నిరంకుశుల పెత్తనం నిరాఘాటంగా సాగుతున్నందున, తాలూకా ప్రజానీకం కరువు కాటకాలతో మాడిపోతున్నందున, దీన్ని అవకాశంగా తీసుకుని తేలికగా గెలవవచ్చని శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ఈ నియోజికవర్గంలో పోటీకి నిలిచారు. శ్రీ సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ఎలక్ట్రసిటి ప్రాజెక్టులు వెంటనే నిర్మింపజేస్తారని ప్రచారం సాగించారు. గ్రామ నిరంకుశ పెత్తందారులైన అనేక మందిచే కాంట్రాక్టులు, స్కూళ్ళు, ఆసుపత్రులు, నీటి వనరుల వాగ్దానాలు చేయబడినాయి.

అధికార దుర్వినియోగం:- ఈ ఎన్నికలలో అనేకమంది చేత తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయించారు. పాపానాయుడు పేట, బండారు పల్లె స్కూలు ఉపాధ్యాయులు ఎన్నికల రోజున దినమంతా కాంగ్రెస్ కు పనిచేశారు. చిత్తూరు సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ జీపు నెం.యమ్.డి .ఐ 838 ఆ దినమంతా తొండమనాడు బూత్ లో ఓటర్లను చేరవేసింది. కాంగ్రెస్ వారు ఓటర్లను భయ భ్రాంతులకు గురిచేయడానికి, స్వతంత్ర అభ్యర్ధి ప్రచారకులను భయపెట్టడానికి అనేక చోట్ల దౌర్జన్యాలు చేయించారు. కమ్యూనిస్టు నాయకుడు శ్రీ టి.నాగిరెడ్డి ఉపన్యసిస్తుండగా అక్కుర్తి గ్రామంలో వారిపై రాళ్ళు రువ్వించారు.

తొండమనాడులో స్వతంత్ర అభ్యర్ధి తరపున బుర్ర కథ జరుగుతుండగా ఆ గ్రామ రెడ్డి భూస్వాములు అల్లరి ప్రారంభించి ఒకరి తల పగులగొట్టారు. ఒకరి ఇంటి కప్పు పీకి పారేశారు బండబూతులు తిట్టారు. ఈ ఎన్నికలలో దాదాపు అన్ని గ్రామాల మునుసబులు కాంగ్రెస్ కు పని చేశారు.

డబ్బు పంపకం:- స్త్రీలకు ఒక రవికె, పసుపు కుంకుమ కడప రామసుబ్బమ్మ వగైరాల చేత ఇప్పించారు. పురుషులకు ఒక రూపాయి తాలూకా మొత్తం మీద మామూలు అయ్యింది. పాపానాయుడు పేట, తొండమనాడు, గుడి మల్లాం, మోదుగుల పాలెం వగైరా అనేక చోట్ల కాంగ్రెస్ వారు మొత్తం ఎనిమిది బస్తాలు బియ్యం పంచిపెట్టారు. 29వ తేదీ రాత్రి అన్నిహరిజన వాడలకు, గ్రామాలకు మొత్తం రూ .20 వేలు పంచినట్లు రూఢీగా తెలుస్తున్నది. ఏలవేడు జమీందారు గోపాలరావు గారికి, కాళహస్తి చక్రపాణికి చెరీ వెయ్యి రూపాయలు ఇచ్చి వారి ద్వారా 2 వేల ఓట్లు కాంగ్రెస్ సంపాయించింది”.

పై వార్తలో వాస్తవాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో డబ్బు పంపకం, అధికార దుర్వినియోగం, దౌర్జన్యం అనే ప్రవృత్తులకు నాటి రాజకీయాలు కూడా అతీతం కాదు అని తెలుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా హింసా, దౌర్జన్యాలకు అతీతమైనవి కావు.

పై వార్తలో ఏ కొంత నిజం ఉన్నా ఈనాటి దుస్థితికి నాటి ప్రవృత్తులే మూలబీజం అనక తప్పదు. హామీలు ఇవ్వడం, సంజీవరెడ్డి గారికి ఉన్న అవకాశాలను ప్రచారం చేసుకోవడం, గ్రామ మునుసబుల మద్దతు తీసుకోవడం మటుకు అక్రమాల క్రిందకు రావు.

సంజీవ రెడ్డి గారే 1962 ఎన్నికల తరువాత ఎన్నికల్లో జరిగిన హింసా దౌర్జన్యాలు, అక్రమాల గురించి ఏమన్నారో చూద్దాం.

మార్చ్ 4, 1962న గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల్లో అన్ని పక్షాలూ అక్రమాలు జరిపినాయని తేలిపోయింది, ఇక విచారణ ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అప్పటి రాజకీయ స్థితిని తెలియజేస్తాయి. నాడు విలువలు ఏదో ఉన్నత స్థితిలో ఉన్నాయనుకోవటం పొరపాటు, ఇప్పటికంటే మేలైన స్థితిలో ఉన్నాయంతే!

కాళహస్తి ఉప ఎన్నికపై జూన్ 14న ఇతర పత్రికల్లోని కథనం

ఆంధ్ర అసెంబ్లీలో శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి స్థానం కల్పించడానికి చిత్తూరు జిల్లా కాళహస్తి నియోజికవర్గం నుండి ఎన్నికైన శ్రీ ఎ.బలరామిరెడ్డి గారు రాజీనామా చేశారు. జూన్ 10 వ తేదీ నుండి శ్రీయుతులు ఎ.బలరామిరెడ్డి, సంజీవరెడ్డి, అల్లూరు సత్యనారాయణరాజు, ఏ.సి.సుబ్బారెడ్డి గార్లు చిత్తూరు జిల్లాలోని ఎం.ఎల్.ఏ లు, ఎం.ఎల్.సీ లను కలసి కాళహస్తి తాలూకాలోని కేంద్రాలను దర్శించి ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నారు. అన్ని చోట్లా శ్రీ సంజీవరెడ్డి కి పూర్తి సహకారం లభింపగలదని ఓటర్లు హామీ ఇచ్చారు. శ్రీ సంజీవరెడ్డి మాట్లాడుతూ కాళహస్తి తాలూకా ఓటర్ల అనుమతిపై శ్రీ బలరామిరెడ్డి రాజీనామా ఇవ్వడమూ, తాను అభ్యర్ధిగా నిలబడడమూ న్యాయమేనని, కాన, ఓటర్లు కూడా తమ అభిప్రాయం తెలపాలని కోరారు. అంతట ప్రజలు సుముఖత వెలిబుచ్చారు. శ్రీ సంజీవరెడ్డి గారిని కాళహస్తి పంచాయతీ బోర్డు సన్మానించింది. పంచాయతీ అధ్యక్షులు శ్రీ సి.జయరాం రావు సంజీవరెడ్డి గారికి స్వాగత పత్రం సమర్పిస్తూ మా పట్టణమునకు మరుగునీటి సౌకర్యము, మంచినీటి వసతి, అన్నింటి కన్ననూ అత్యవసరమైనది విద్యుచ్చక్తి సరఫరా అని పేర్కొని, మద్రాసు ప్రభుత్వముతో చెప్పి ఏర్పాటు చేయించాలని విన్నవించారు.

శ్రీ సంజీవరెడ్డి సన్మానానికి ప్రత్యుత్తరమిస్తూ, వారు కోరిన సౌకర్యములు కలుగజేయుట ఏమంత గొప్ప విషయం కాదని, శీఘ్రముగా వాటిని చేయవచ్చునని అన్నారు. తాము ఆంధ్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా ఎన్నికైనందున అసెంబ్లీ సభ్యునిగా ఎన్నుకొనబడడం అత్యవసరమైనదనీ, కాళహస్తి తాలూకా నియోజిక వర్గ ఓటర్లు అనుమతించిన ఇచ్చట ఒక అభ్యర్ధిగా నిలబడుటకు తాము ప్రయత్నించగలమనీ అప్పుడు వారి కోర్కెలు శీఘ్రముగా నెరవేర్చగలమని అన్నారు.

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

Posted in February 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!