Menu Close
Rayavarapu-Saraswathi
నన్ను క్షమించు (కథ)
-- రాయవరపు సరస్వతి --

ప్రక్క ఊరి యూనియన్ బ్యాంకు లో మేనేజర్ గా జాబ్ చేస్తున్న తన భర్త రాంబాబు రెండు రోజులుగా రాకపోవటంతో నవ్యకు చిర్రెత్తుకొచ్చింది. అతనలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆమెకు తెలుసు. అయినా ఆమె మనసు అతని నిర్లక్ష్య వైఖరికి ఒప్పుకోలేదు, ‘రానీ చెబుతాను రాకుండా ఎక్కడికి పోతాడు?' పళ్ళు నూరింది నవ్య.

తన తండ్రి సూరయ్య తమతో పాటూ ఉండటం వలన తమ ఇద్దరు పిల్లల్నిఆయన స్కూల్లో దింపి మళ్లీ సాయంత్రం ఇంటికి తీసుకు రావడం చేస్తుండబట్టీ సరిపోతోంది. లేదంటే తను సాయంత్రం డ్యూటీనుంచి వచ్చి తీసుకురావాల్సి ఉంది.

మర్నాడు సాయంత్రం ఇంటికి వచ్చాడు రాంబాబు. అతన్ని చూసిన నవ్య మండి పడి, "అహ అయ్యగారు వేంచేసారా? లోకంలో చాలామంది మగాళ్లు ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. ప్రక్క ఊళ్ళో పనిచేస్తూ రోజూ రాకపోకలు సాగిస్తున్న వాళ్ళు నూటికి తొంబైమంది ఉన్నారు లోకoలో. తమరికే ఇల్లు పట్టనిది?" దీర్ఘం తీసింది నవ్య.

"ఇక ఆపు నీ స్తోత్రం నాకూ రావాలనే ఉంటుంది కానీ మా బ్యాంక్ లో వర్క్ ఒత్తిడి వలన రాలేకపోతున్నాను. నాది మేనేజర్ పోస్ట్ కాకపోతే నువ్వు చెప్పిన సదరు ఉద్యోగుల్లా నేనూ వచ్చి ఉండేవాడ్ని" అన్నాడు రాంబాబు.

"నేను చేసేది కూడా బ్యాంకు లోనే కాకపోతే తమరిలా కాక క్యాషియర్ని, మేమంతా వర్క్ ముగించి ఇవ్వడంతో మా మేనేజర్ గారు ఇంటికి త్వరగానే వెళ్లిపోతుంటారు, మీలాగా ఎవరూ సాకులు చెప్పరు. నా తండ్రి ఇంట్లో ఉండబట్టీ మీ ఆటలు సాగుతున్నాయి" అంది నవ్య సాధింపుగా.

"సరే నేను వచ్చి అర్ధగంటయింది. నా ముఖాన కాఫీనీళ్ల లాంటివి ఇచ్చేది ఏమైనా ఉందా?" అన్నాడు రాంబాబు.

"నేనూ ఇప్పుడే వచ్చాను. నాకూ కాఫీ కలిపిచ్చినవాళ్లు లేరు. ఎవరిక్కావలిస్తే వాళ్ళు కలుపుకోవాల్సిందే. ఇక్కడెవరూ మీ సేవకుల్లేరు" అంది నవ్య మోహమాటం లేకుండా.

ఇంతలో పిల్లలిద్దరూ "డాడీ" అంటూ వచ్చి తండ్రిని అల్లుకుపోయారు.

"చిట్టి తల్లులిద్దరూ ఎలా ఉన్నారటా" అన్నాడు రాంబాబు కూతుళ్ళిద్దర్నీ అక్కున చేర్చుకుoటూ.

"డాడీ అక్క నన్ను కొట్టింది" అంది ప్రియాంక.

"నిజమా తప్పుకదమ్మా చెల్లిని కొట్టొచ్చా?"

"లేదు డాడీ అదే నన్ను గిచ్చింది" అంది సునీత.

"సరే మీరిద్దరూ అక్కచెల్లెళ్ళు. కొట్టుకోకూడదు కలిసి ఆడుకోవాలి, చదువుకోవాలి" అన్నాడు రాంబాబు ముద్దుగా.

"అలాగే డాడీ" అన్నారు ఇద్దరూ.

పిల్లలిద్దరూ అక్కడి కాన్వెంట్ లో ఎల్.కె.జి ఒకరు, యూ.కేజీ ఒకరూ చదువుతున్నారు.

"ఇక మీడాడీతో కబుర్లు చాలు వెళ్లి హోమ్ వర్క్ చేసుకోండి" అంది నవ్య.

తల్లి కసురుకోగానే పిల్లలిద్దరూ అక్కడి నుంచి తమ గదిలోకి తుర్రుమన్నారు.

"పిల్లల్ని నాదగ్గర కాసేపు ఉంచితే నీ సొమ్మేంపోయిందటా?" అన్నాడు రాంబాబు

"పిల్లల్తో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే సింక్ లో అంట్ల గిన్నెలు ఎప్పుడు తోముతారటా?" నిలదీసింది నవ్య.

"అయితే నా కోసం అంట్ల గిన్నెలు కడక్కుండా అలా ఉంచావన్నమాట చాలా గొప్ప ఆడదానివి నీ లాంటి భార్య ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు"

"అవును మీలాంటి భర్తా ఎవరికీ ఉండరు నాఖర్మ కొద్దీ దొరికారు” నెత్తి బాదుకుంది నవ్య.

ఆమె మాటలు వినలేని రాంబాబు వంట గదిలోకి వెళ్లి సింక్ లోనున్న అంట్ల గిన్నెలు తోమసాగాడు.

'ఈ పని తప్పుతుందనే తను రోజూ రానిది, భర్తగా తనకీ ఇంట్లో మర్యాద ఏమీ లేదు. సర్వెంట్ చేసే ఇంటి పనంతా తనతో చేయిస్తుంది, కనీసం భోజనం కూడా పెట్టదు, తనకు ఆకలేస్తే హోటల్ కెళ్లి తినవలసిందే' అతని మనసు దీర్ఘoగా మూల్గింది. మనసంతా ఆవేదనతో నిండిపోయింది.

ఆ రాత్రి అతనికి కునుకు పట్టలేదు, అలాంటి రాత్రులు ఎన్నో ఎన్నెన్నో. పిల్లలు పుట్టిన తరువాత నుంచి ఆమె భార్యగా తన ప్రక్కలోకి ఎప్పుడూ రాలేదు, తనతో ప్రేమగా ఎప్పుడూ మాట్లాడిందీ లేదు. తననో తక్కువ కులం వాడినన్నట్లుగా తండ్రి మాటలు విని దూరం పెట్టింది. ఏం పెళ్లికి ముందు తెలియదా? ఇద్దరిదీ ఒక కులం కాదనీ 'మేము చౌదరీస్, మీరు యాదవులు' అని ఆమె తండ్రి సూరయ్యగారు పదే పదే తనకు గుర్తు చేస్తూనే ఉంటారు. అదే నవ్య మనసులో నాటుకొని వట వృక్షమై కూర్చుంది. తమ కులాలు పెళ్లికి ముందే తెలుసు కదా పిల్లలు కలిగాక అప్పుడు గుర్తుకొచ్చింది తన భార్య నవ్యకు. అతని మనసు గతం లోకి వెళ్ళిపోయింది.

'తను యూనియన్ బ్యాంకు లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. చదువు కంప్లీట్ అయిన నవ్య యూనియన్ బ్యాంకు లో క్యాషియర్ గా ఉద్యోగంలో చేరింది. కొలది కాలం లోనే ఆమె తన దగ్గరకు ఏదో ఒక మిషతో బుక్ పట్టుకొని వచ్చేది. వర్క్ విషయంలో తన డౌట్స్ తీర్చుకున్న కాసేపటి తరువాత అతి కష్టంతో వెళ్ళేది తన వైపు నవ్వు ముఖంతో చూస్తూ.

మరొక రోజు నవ్య భోజనం టైంలో రాంబాబు దగ్గరకు వచ్చి, "సార్ ఈ రోజు నేను మీల్స్ బాక్స్ తెచ్చుకోలేదు చాలా ఆకలిగా ఉంది మీ బాక్స్ లోది నాకు కొంత షేర్  చేయగలరా?" అంది అతి దీనంగా.

"ఓ దానికేముంది నవ్యగారు ఇదిగో మీరే ఇద్దరికీ వడ్డించండి" అంటూ క్యారియర్ బ్యాగ్ ఆమె ముందు పెట్టాడు రాంబాబు.

ఆమెకది రోజూ అలవాటుగా మారిపోయింది. ఆ రోజు ఎప్పటిలా ఇద్దరూ కలిసి భోజనంచేయసాగారు.

"నవ్యగారూ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు?" అన్నాడు రాంబాబు.

"మా డాడీ వ్యవసాయం సార్, మా అమ్మగారు కాలం చేసాక ఇప్పుడు ఆయన నాతోనే ఉంటున్నారు"

"అయ్యో మీ అమ్మగారు లేరా? మరి ఆయనకు కొడుకులు లేరా?"

"లేరు సార్ ఆయనకు నేను ఒక్కదాన్నే సంతానం. మా అమ్మను మర్చిపోలేని మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు"

"ఓహ్ అలానా! ఆయన ఒంటరిగా ఉండే కంటే మీకు తోడుగా ఉండటమే మంచిది" అన్నాడు రాంబాబు.

"సార్ మీతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ నేటివ్ ప్లేస్ ఏది సార్?" అంది నవ్య.

"మాది తుని ప్రక్కన చింతలూరు గ్రామం, మాది వ్యవసాయ కుటుంబo, మానాన్న గారు ఈ మధ్యనే కాలం చేశారు, నేనూ, మా చెల్లాయి వాళ్ళ సంతానం. మా అమ్మగారు మా పొలాలన్నీ కౌలుకిచ్చి చేయిస్తుంటారు. మా చెల్లాయి రోజాకి వివాహం జరిగింది" అన్నాడు రాంబాబు తమ ఇంటి బోగట్టాలు ఆమె అడగకముందే చెబుతూ.

"మరి మీది ఏ కులం? ఇలా అడిగానని నొచ్చుకోవద్దు. ఊరకనే తెలుసుకుందామని అడిగాను" అంది నవ్య.

"నో పర్వాలేదు ఏ మనిషికైనా కులం అన్నది ఉంటుంది కదా మా కులం యాదవులు"

"ఓహో పర్వాలేదు ఈ రోజుల్లో కులాల్ని ఎవరు పట్టించుకుంటున్నారు సార్. అందరిదీ మానవ కులo" అంది నవ్వుతూ నవ్య.

"మీరు భలే తమాషాగా మాట్లాడగలరు నవ్యగారూ" అన్నాడు రాంబాబు ఛలోక్తిగా.

"కోరుకున్న మనిషికి దగ్గర కాలేకపోవటo ఎంత నరకమో అది ఎంత వ్యధను కలిగిస్తుందో అది అనుభవించిన వారికే అర్ధం అవుతుంది సార్"

"అదేంటి నవ్యగారు మీరు మాట్లాడేది దేని గురించి?"

"ప్రతి మనిషికి తనపట్ల తనకి నమ్మకం, భవిష్యత్తు పట్ల ఆశ ఉండాలని నేనంటాను" అంది నవ్య.

"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజం నవ్య గారు"

"సార్ ఈ సృష్టిలో స్త్రీ..పురుషులిద్దరూ చెరి సమ భాగాలు, వారిలో ప్రేమతో నిండిన ఏకత్వం లేకపోతే పరిపూర్ణత లేదు ఏమంటారు?"

"అవునంటాను"

"సార్ నాదో చిన్న రిక్వెస్ట్..." అంది నవ్య.

"ఏంటది?" అన్నాడు రాంబాబు.

"మనిద్దరం పెళ్లిచేసుకుందామా? మా నాన్నగారు తప్ప నాకంటూ ఎవరూ లేరు సార్. కులాల పట్టింపు నాకైతే లేదు. ప్లీజ్ సార్ మీ అభిప్రాయం చెప్పండి" అంది నవ్య ప్రాధేయపడుతూ.

ఆమె అంత సడన్ గా పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చేసరికి అతనికేం చెప్పాలో తెలియలేదు. ఆమె అతని ముఖంలోకి దీక్షగా చూస్తుండి పోయింది.

అతని ముఖం కవళికల్లో మార్పులేదు.

"సారీ సార్ నేనే తొందర పడ్డాను ఏమీ అనుకోవద్దు"

"ఓహ్ సారీ నవ్యగారు మీరు సడన్ గా అడిగేసరికి నాకేం చెప్పాలో తోచలేదు. మా అమ్మగారు నా పెళ్లిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదీగాక మా మేనమామ కూతురు సుధను నాకిచ్చి పెళ్లిచేయాలనే మా మామయ్య నన్ను చదివించాడు. వాళ్లందరి ఆశలు నామీదే అందుకే మీకేమీ రిప్లై ఇవ్వలేక పోతున్నాను" అన్నాడు రాంబాబు నొచ్చుకుంటూ.

"మీకున్న సమస్యలు మీకుంటాయి సార్ కానీ నేను మాత్రం మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. సారీ సార్ ఈ విషయం ఇంతటితో మర్చిపోండి" అంది నవ్య నిరాశగా.

ఆ మర్నాడు రాంబాబు ఆఫీసుకు వచ్చేసరికి నవ్య ఆఫీసుకు రాలేదనీ పురుగుల మందు తాగి సూసైడ్ attempt చేసిందని ప్రస్తుతం హాస్పిటల్లో ఉందని ఆఫీస్ క్లర్కు చెప్పడంతో అతని మోము చిన్నబోయింది.

'అయ్యో ఎంతపని చేసావు నవ్యా. ఇదంతా నిన్న నా నిర్ణయం చెప్పడం వల్లనే కదా నువ్విలా చేసుంటావు' అని హుటాహుటిన హాస్పిటల్ కు బయలుదేరాడు.

అతనెళ్లి అక్కడి డాక్టర్స్ ను కన్సల్ట్ చేయడంతో ఇప్పట్లో ఏమీ చెప్పలేం సార్ కొంత సమయం పడుతుంది ఆమె తాగిన పురుగుల మందును ట్యూబ్ ద్వారా తీయగలిగాము"

దానితో చేసేది లేక నవ్య తండ్రి సూరయ్య గారి ప్రక్కన చతికిలబడిపోయాడు రాంబాబు.

"చూడవయ్యా నీ నిర్వాకం బతుకుదామని ఉద్యోగానికి వచ్చిన ఆడపిల్లల్ని చూసి కన్ను కుట్టేసుకుంటారు మీరు, నా ఒక్కగానొక్క కూతురు నన్నిడిసిపోవడానికి కారకుడివి ముమ్మాటికీ నువ్వే. నీకు ఆడపిల్లల్ని చూస్తే గోకడం అలవాటట కదా. నీ ఆఫీసోళ్లే చెప్పినారు. నా కూతురికి ప్రాణం మీదకు రావాలా. అప్పుడు నీ పని చెబుతాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిన్నిoతటితో వదలను." తన భుజం మీదున్న ఉత్తరీయoతో కళ్ళొత్తుకున్నాడు సూరయ్య.

"అయ్యో నాకేమీ తెలీదండి ఆమె నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకొమ్మని చెప్పింది. కానీ నాకు మేనరికం ఉందని ఆమెనిచ్చి పెద్దలు నాకు వివాహం చేస్తామన్నారని చెప్పాను. అంతకు మించి నేనేమీ అనలేదు" అన్నాడు దోషిగా రాంబాబు.

ఇంతలో "మీ అమ్మాయికి తెలివి వచ్చిoది వెళ్లి చూడండి " అని చెప్పింది డాక్టరమ్మ.

దానితో ఇద్దరూ లోనికి పరుగెత్తారు. అప్పుడే కళ్ళు తెరిచిన నవ్య

"నాన్నా ..అంది కళ్ళ నీళ్లతో.

"ఎలా ఉన్నావు తల్లీ!! నాకున్న ఒక్కగానొక్క రక్త బంధువువి. నన్నిడిసి పోదామనుకున్నావా? నువ్వు లేకుండా నేనెట్టా బతుకుతాననుకున్నావమ్మా. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయనని నాకు మాటివ్వు" అన్నాడు సూరయ్య కన్నీళ్ళతో.

"అది ఈయన చేతిలోనే ఉంది నాన్నా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను" అంది. ఆమె చూపులన్నీ రాంబాబు మీదే ఉన్నాయి.

"సరే నేను ఈ క్షణమే నా మేనమామకు ఇచ్చినమాటను మర్చిపోతున్నాను మనం పెళ్లి చేసుకుందాము" అన్నాడు రాంబాబు.

మర్నాడు సూరయ్య తన కూతురు నవ్యను రాంబాబు కిచ్చి గుడిలో వివాహం జరిపించేసాడు. రాంబాబు తన భార్యతో తమ ఊరు వెళ్లి తల్లిదండ్రుల ఎదుట నిలబడ్డాడు.

"అమ్మా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము ఇదిగో మీ కోడలు" అంటూ వాళ్ళ కాళ్లపై ప్రణమిల్లారు.

"అదేంటిరా మేము బ్రతికే ఉన్నాము కదా మాకు చెప్పాలనిపించలేదా? నువ్వు మేనరికం కదా చేసుకోవాలి మరి ఇదేంటి? రేపు మీ మామయ్యాకేం సమాధానం చెబుతావు?" నిలదీసాడు తండ్రి శంకరం.

"అసలు వాళ్ళు నిన్ను చదివించింది అందుకే కదరా మరిదేo పని?" నిలదీసింది తల్లి రంగమ్మ.

"అమ్మా మరి..మరి..ఇలా చేయక తప్పలేదమ్మా ఈమె కూడా మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తోంది పేరు నవ్య" అన్నాడు రాంబాబు.

"ఏమ్మా నువ్వు చదివిన చదువు ఇందుకు ఉపయోగపడిందా? మీ వాళ్ళు నీకు ఉగ్గు పాలతో నేర్పింది ఇదేనా? నువ్వు మా కులం దానివి కావు, నువ్వు పెద్ద కులం దానివైతే ఎవరికిగొప్ప? మా కులంలో మాకెంత అప్రదిష్ట? నా కొడుకును వదులుకోలేక నిన్ను ఇంట్లోకి అడుగుపెట్టనిస్తున్నాను" అంటూనే కూతురు రోజా ఎర్రనీళ్లు అందించడంతో కొత్త జంటకు దిష్టి తీసింది రంగమ్మ.

రాంబాబు భార్యతో సహా తల్లిదండ్రులిద్దరికీ పాదాభివందనం చేసాడు.

సంవత్సరం తిరక్కుండానే నవ్య ఓ ఆడపిల్లకు తల్లయింది. మరో రెండేళ్లకు మరో అమ్మాయి కలగడంతో ఆ పుట్టిన పిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు నవ్య.

ఆమె అత్తగారు రంగమ్మ వచ్చి ఆ పురిటి పిల్ల ఆలనా, పాలనా చూసేది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అప్పటి నుంచి నవ్యకు భర్త మీద ప్రేమ తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో పనులు చేయించడం మొదలుపెట్టింది.

అత్తింటి వారెవర్నీ తమ ఇంటికి రాకుండా చేసింది. తానూ అత్తింటికి వెళ్లడం మానుకుంది. భర్త అత్త మామలకు డబ్బులిస్తే గొడవలు పడేది. నవ్య తండ్రి సూరయ్య అల్లుడ్ని పదే పదే సాధించడం మొదలుపెట్టేవాడు. నవ్య తన సంపాదనంతా దాచుకొని బంగారు నగలు కొనుక్కోవడం చేసేది. ఇంటి ఖర్చoతా భర్త రాంబాబు జీతం డబ్బులుతోనే గడిపేది. పిల్లలు పెద్దవారవుతున్నారు, ఎల్.కేజీ, యూ.కేజీ కాన్వెంట్ చదువుకు వెళ్తున్నారు. పిల్లల్ని తాతగారు సూరయ్య కాన్వెంట్ కు తీసుకెళ్లడం సాయంత్రం తీసుకురావడం చేసేవాడు.

రాంబాబుకు ఇంట్లో తన భార్య ప్రేమను కోల్పోవడం మొదలయ్యింది. ఇద్దరూ కలిసి కాపురం చేసి రెండు సంవత్సరాలైంది. నవ్యకు ఎందుకో భర్త మీద ప్రేమ తగ్గిపోయింది. ఇద్దరివీ బ్యాంకు జాబ్ లే అయినా ప్రక్క ప్రక్క ఊళ్లవడంతో రాంబాబు పనిచేసే ఊళ్ళో చిన్న రూమ్ తీసుకోక తప్పలేదు. తీరా ఇంటికి వచ్చిన రోజున అతనితో ఇల్లు తుడిపించడం, సింక్ లో అంట్ల గిన్నెలు తోమించడం లాంటివి చేయించి ఆ పూట భోజనం కూడా పెట్టకుండా హోటల్ కెళ్లి తిని రమ్మనేది ఇదీ నవ్య పరిస్థితి.

సూరయ్యకు అనుకోని విపత్తు రావడంతో కొన్నాళ్ళకు నవ్య తండ్రి స్వర్గస్థుడయ్యాడు. తండ్రి లేకపోవడంతో నవ్యకు కాళ్ళు విరిగినంత పనయ్యింది. ఏడాది కాలం గిర్రున తిరిగి కాలగర్భంలో కలిసిపోయింది.

ఒకరోజు రాంబాబు భార్యతో

"నవ్యా నేనంటే నీకు అసలు పడటం లేదు. నువ్వు నా భార్యగా తగవు, భర్తకు సుఖ శాంతులు ఇవ్వని భార్య ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నీకు భర్త విలువ తెలియటం లేదు. ఇక నీకు, నాకూ పడదు. అలాంటప్పుడు మనం కలిసున్నా ఒకటే విడిపోయినా ఒకటే, మనం కోర్టుకు డైవర్స్ కు అప్లై చేద్దాo" అన్నాడు.

తండ్రి మరణంతో అప్పటికే కుంగిపోయిన నవ్య భర్తను చుట్టుకొని "ప్లీజ్ మీరలా మాట్లాడకండి నన్నర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాలో మీరు ఊహించిన మార్పు సహజమే నన్ను క్షమించండి, మీరు లేకుంటే నేను, పిల్లలూ అనాధలమైపోతాము. ఇదంతా మనిద్దరం ఒకేచోట కలిసి ఉండలేకపోవడం వలన వచ్చిన ఇబ్బంది. మాబ్యాంకు మేనేజర్ పోస్ట్ ఖాళీ అయిపోయింది, మీరా పోస్టు కు ట్రాన్సఫర్ చేయించుకోండి మనం ఎప్పటిలా పిల్లలతో కలిసి హాయిగా ఉందాము" అంది కన్నీళ్ళతో.

"సరే నవ్యా నేను తప్పకుండా మీ బ్యాంకు కు వచ్చేస్తాను' అన్నాడు రాంబాబు. అనుకున్నట్లుగానే ఓ పది రోజుల్లో బదిలీ మీద నవ్య బ్యాంకుకు వచ్చేశాడు రాంబాబు. ఇంట్లో ఇంటి పనికి, వంట పనికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు రాంబాబు.

ఆ రోజు రాత్రి నవ్య భర్త గుండెల్లో తల దాచుకొని "ఏమండీ ఇన్నాళ్లుగా మిమ్మల్ని నా ప్రవర్తనతో చాలా బాధపెట్టాను, నన్ను క్షమిoచండి" అంది కన్నీళ్ళతో.

"ఇక మనం ఎప్పుడూ ఇలాగే ఉందాము నవ్యా. మన పిల్లల్ని మనం బాగా చదివించి మంచి అభివృద్ధిలోకి తీసుకువద్దాము సరేనా! నీకు నేనున్నాను కదా డోంట్ వర్రీ మై స్వీట్ వైఫ్" అంటూ భార్యను మనసారా తన హృదయానికి హత్తుకున్నాడు రాంబాబు.

********

Posted in February 2024, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!