Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

“ఓ పాము కనబడ్డ ప్రతివారిని కాటేయడం మొదలు పెట్టింది. ఆ పాము బాధ భరించలేక ఆ ఊరి ప్రజలంతా ఓ సాధువు దగ్గరికి పోయి తమ బాధను వెళ్ళబోసుకున్నారు. ఆ పాము మిమ్మల్ని కరవకుండా చేస్తాను అని చెప్పి ఆ సాధువు పాముతో 'ఈ రోజు నుంచి నువ్వు ఎవరినీ కరవకు’ అని ఆదేశించి వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళు పోయాక ఆ సాధువు అటువైపుకు వచ్చాడు. ఒళ్లంతా గాయాలతో చిక్కిశల్యమైన పాము కనిపించింది.

'ఏమిటీ దురవస్థ నీకు?' అని అడిగాడు పామును ఉద్దేశించి సాధువు.

'మీరే కదా స్వామి ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పారు‌.' గొంతు పెగుల్చు కొని చెప్పింది పాము.

'నేను కరవద్దు అని చెప్పాగాని నీ సహజ స్వభావమైన బుసకొట్టడాన్ని మానమని చెప్పానా?’ అన్నాడుట.

అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లను గౌరవిస్తూ... లోబడిన వాళ్ళను చేతకాని వాళ్ళుగా తలపోసి హింసకు గురి చేసినప్పుడు ఓర్చుకుంటూ... కుమిలిపోతూ ఉండటం ఎంతవరకూ న్యాయం? ఆలోచించు.

ఓ నోరు లేని పిల్లిని బంధించి భాదిస్తే ... తన సహజ స్వభావాన్ని వదిలేసి అది పులిలా విజృంభించి తనను తాను కాపాడుకుంటుంది. హాని కలిగించనంతసేపే ఏ నియమాలైనా! కట్టుబాట్లైనా! వాటి ముసుగులో దాగి కాటేయజూస్తే ఆ విషపు నాగుల కోరలు పీకాల్సిన బాధ్యత ఉంది తప్పదు. అది నియమోల్లంఘన కాదు. సాంప్రదాయాలను మీరినట్లూ కాదు. నీకు అర్థమైనది అనుకుంటా" అంది నూర్జహాన్. అర్థమైంది అన్నట్లుగా తల ఊపింది ప్రణవి.

"గతం గతః. ఇప్పుడు నీ, నీ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ బిడ్డలను ఉన్నతులుగా తీర్చి దిద్దాలి. ఆ దిశగా ఆలోచించు," చెప్పింది నూర్జహాన్. జాబ్స్ కు అప్లై ఎలా చేయాలో చెప్పింది.

ముందు టెక్నికల్ కోర్స్ నేర్చుకుంటే ఆఫర్స్ ఎక్కువ వస్తాయని చెప్పింది. అలాగే నేర్చుకుంటానని చెప్పింది ప్రణవి. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. మిత్రబృందం గురించి ఒకరికి తెలిసిన విషయాలు ఒకరు... ఒకరికొకరు షేర్ చేసుకున్నారు.

ప్రణవికి అంత చెప్పినా భర్త గురించే ఆలోచిస్తోందని గ్రహించిన నూర్జహాన్... ప్రణవి అత్తవారింటి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. స్పీకర్ ఆన్ చేసింది.

"హలో" అంది .

"హలో ఎవరూ" అవతలి వైపు నుంచి రాజన్ గొంతు.

"జంబేష్ గారు ఉన్నారా?" అడిగింది.

ప్రణవి చేయించిందని గ్రహించాడో ఏమో "ఆ పేరు గల వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు" అని ఫోన్ కట్ చేసేసాడు.

"ఇప్పటికన్నా గ్రహించావా? వాళ్ళ బుద్ధి. నిన్ను వాళ్ళు ఇష్టపడి చేసుకోలేదు. డబ్బు కోసం చేసుకున్నారు. మీ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని గడించాలని అనుకున్నారు. వీలు పడక పోయేసరికి వదిలించుకో చూసారు. నీవు అక్కడే ఉండి సాధించాల్సింది... ఎనీవే ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనలను నీ మైండ్ లోంచి డిలీట్ చేసి కొత్తజీవితానికి నాంది పలుకు" అంది.

దృఢమైన నిశ్చయంతో ఇంటిదారి పట్టింది ప్రణవి.

****

టెలిఫోన్, టెలెక్స్ ఆపరేటింగ్ కోర్స్ లో చేరింది ప్రణవి. లోకల్ గా ఉండే ప్రైవేట్ కంపెనీ లకు అప్లై చేస్తూ వచ్చింది. ఒకసారి ఒక కంపెనీకి టెలిఫోన్ ఆపరేటర్ కం రిసెప్షనిష్ట్ పోస్ట్ కి అప్లై చేసింది.

ఆ కంపెనీ నుంచి కాల్ లెటర్ వచ్చింది. మరుసటి రోజు ఉదయం తొమ్మిది కల్లా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనేది దాని సారాంశం.

ఆ రోజు తెల్లవారుజామునే లేచి ... గబగబా తయారై టిఫిన్ కూడా తినకుండా... వాళ్లు ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళింది. అప్పటికి స్టాఫ్ ఎవరు రాకపోవడంతో సెక్యూరిటీ వాళ్ళు బయటే ఆపేశారు. కాల్ లెటర్ చూపించింది.

9 గంటలకి రమ్మన్నారు కదా! అప్పుడే పంపిస్తాను. అప్పటివరకు లోపలికి వెళ్లడానికి వీలుకాదు. అన్నాడు సెక్యూరిటీ గార్డు. తొమ్మిదింటి వరకు రోడ్డు మీద పడిగాపులు పడి 9 కాగానే లోపలికి వెళ్ళింది ప్రణవి.

అక్కడ ఒక కుర్చీ చూపి కూర్చోమన్నాడు ప్యూన్. కూర్చుంది ప్రణవి. తను తప్ప ఇంకా ఆఫీస్కి ఎవరూ వచ్చినట్టు లేదు. దిక్కులు చూస్తూ కూర్చుంది. స్టాఫ్ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు.

10:00 అవుతూ ఉండంగా ప్యూన్ వచ్చి లోపల పిలుస్తున్నారు అని చెప్పాడు. లోపల ఇంటర్వ్యూ కి పిలిచారు.

క్వాలిఫికేషన్ అడిగారు. చెప్పింది ప్రణవి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తయింది.

టైపు వచ్చా అని అడిగారు. నిజానికి ఆ ఉద్యోగానికి టైప్ తో పనిలేదు. కానీ రాదు అని చెబితే ఉద్యోగం ఇవ్వరేమో! అనే ఆలోచన రావడంతో...

'వచ్చు' అని మొదటి సారి అబద్దం చెప్పింది ప్రణవి.

"అయితే ఈ పేరా టైప్ చేయండి" అంటూ టేబుల్ మీద ఆ రోజు వచ్చిన హిందూ పేపర్ తీసి అందులో ఒక పేరా చూపిస్తూ...ప్రణవి చేతికి పేపర్ ఇచ్చింది ఇంటర్వ్యూ చేసే ఆవిడ.

టైప్ మిషన్ చూపించారు. ఓ తెల్ల కాగితం కూడా ప్రణవికి ఇచ్చారు. ప్రణవికి పేపర్ ని ఎలా టైప్ మిషన్ లో పెట్టాలో తెలియలేదు. అందులో పెట్టటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. అన్ని విఫల ప్రయత్నాలే అయ్యాయి. తనని చూసి ఎవరైనా నవ్వుతున్నారేమోనని చుట్టూ చూసింది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.

పేపర్ ఎలా పెట్టాలి? మళ్ళీ క్వశ్చన్ మార్క్... ఏదైతే అది అయిందని...మనసులో ఒక నిశ్చయానికి వచ్చి తనకు దగ్గరలో ఉన్న వ్యక్తిని ఎక్స్క్యూజ్మీ అని అడిగి...

"ప్లీజ్ ఈ పేపర్ ఎలా పెట్టాలో చెప్పరూ... " అని అడిగింది.

అతను నవ్వి కుర్చీలోంచి లేచి వచ్చి, పేపర్ పెట్టిచ్చి, "టైపు చేయగలరా? నన్ను ఏమన్నా సహాయం చేయమంటారా?" అంటూ మర్మగర్భంగా అడిగాడు.

"ఆ వచ్చు వచ్చు నే చేసేస్తాను. ఆ పేపర్ ఎలా పెట్టాలో తెలియక పిలిచాను అంతే అంతే" అని అతనికి థాంక్స్ చెప్పింది. అతను వెళ్లి తన పనిలో నిమగ్నం అయిపోయాడు. ఒక్కొక్క అక్షరం వెతుక్కుని టైప్ చేయడం మొదలుపెట్టింది. ఒక లైను పూర్తయింది. నెక్స్ట్ లైన్ కది ఆటోమేటిగ్గా వెళ్ళలేదు. మళ్ళీ సమస్య మొదలు.

మళ్ళీ తలెత్తి ఇందాక హెల్ప్ చేసిన ఆయన వంక చూసింది. ఈసారి ఎక్స్క్యూజ్ మీ అని అడగకముందే తలెత్తి ప్రణవి వంక చూశాడు.

"మిషను ట్రబుల్ అనుకుంటాను... టైప్ అయిపోయాక నెక్స్ట్ లైన్ లోకి రావటం లేదు." అంటూ చెప్పింది. అతను వస్తున్న నవ్వు ను ఆపుకుంటూ..." మీరు టైప్ నేర్చుకోలేదా?" అని అడిగాడు.

"లేదు సార్. టెలెక్స్ ఆపరేటింగ్ నేర్చుకున్నాను. అది ఇది ఒకలాగే ఉంటుందని... థియరీలో ఉంటే... టైపు కూడా చేయగలను అని అనుకున్నాను. దీనికి దానికి చాలా తేడా ఉంది." అని అసలు విషయం చెప్పేసింది.

అతను నవ్వి నెక్స్ట్ లైన్ కి ఎలా రావాలో చెప్పారు.

12:30 అయింది టైం. ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. పాపం ప్రణవి కిచ్చిన పేరా పూర్తి అవ్వలేదు.

ఒంటిగంట అవుతూ ఉండంగా...

ప్రణవి కి టైప్ చేయమని చెప్పిన ఆవిడ వచ్చారు. అయ్యిందా అని అడిగింది.

"ఇంకొక్క లైనే ఉంది మేడం" సిన్సియర్గా చెప్పింది ప్రణవి.

"పర్వాలేదా ఆపేసేయండి" చెప్పింది.

"పర్వాలేదు నాకు ఇబ్బంది లేదు లెండి. నేను మీరిచ్చిన పని పూర్తి చేసేస్తాను." అంది ప్రణవి. ఏమీ అనలేక... లంచ్ కు వెళ్ళిపోతున్న వాళ్ళ వంక ఈర్ష్య గా చూస్తూ ప్రణవి కి ఆ పని ఎందుకు ఇచ్చానురా భగవంతుడా! అని మనస్సులో తనను తాను తిట్టు కుంటూ ఎప్పుడు పూర్తి చేస్తుందానని అసహనంగా కూర్చొంది. మొత్తానికి ఒంటిగంటకల్లా పూర్తి చేసి ఆ పేపరు ఇంటర్వూ చేసిన ఆవిడ కు ఇచ్చేసింది ప్రణవి.

సెలెక్ట్ అయినది లేనిది ఏ విషయం తర్వాత ఇన్ఫాం చేస్తామని చెప్పి ప్రణవిని పంపించేసింది ఆవిడ.

ప్రణవి ఆశగా ఎదురు చూస్తూ ఉంది. కానీ వారినుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

నూర్జహన్ కి ఈ విషయం చెప్పింది. నూర్జహన్ పగలబడి నవ్వి...

“నీకు వచ్చిందే చెప్పు. వాళ్లు ప్రకటనలో అడగని దాని గురించి అడిగినప్పుడు నువ్వు రాదనే చెప్పాల్సింది. ఎందుకు అబద్దం చెప్పి శ్రమ పడ్డావు? వాళ్ళు అలా అడిగారు అంటే ఆ ఉద్యోగం ఎవరికో ముందే ఫిక్స్ అయిపోయిందని అర్థం. ఎనీ హౌ ఒక ఇంటర్వ్యూ ని ఫేస్ చేసావ్. ఎప్పుడు కూడా ఒక్కదానిమీదే ఆధారపడి ఉండక. నాలుగైదు రకాలుగా ప్రయత్నాలు చేయాలి. నాలుగు రాళ్లు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది. వస్తుంది అని ఎదురుచూస్తూ ఎప్పుడు కూర్చోక. నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపద్దు. వచ్చినప్పుడు బెటర్ ఆప్షన్ చూసుకోవచ్చు." అని చెప్పింది.

గురుబోధ వినే శిష్యురాలిలాగా ఊ కొట్టింది ప్రణవి.

చాలా ఉద్యోగాలకు అప్లై చేసింది. అందరూ ఫీల్డ్ వర్క్ చేయాలని అడుగుతున్నారు. ఆఫీస్ వర్క్ గా ఎవరు అడగడంలేదు. అవసరం తనది. ఏదైనా చేయాలి తప్పదు అని అనుకుంది.

వాణి మహిళా కోపరేటివ్ సొసైటీలో కమిషన్ బేస్ మీద జాయిన్ అయింది. 30 మంది మహిళలని ఒక గ్రూపు గా ఫామ్ చేయాలి. అలాగా ప్రతి ఊర్లోనూ టీమ్స్ ఫామ్ చేయాలి. వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి సాఫ్ట్ టోయ్స్ తయారీ, హెయిర్ ఆయిల్ తయారు చేసే విధానం, గ్రైఫ్ వాటర్ తయారు చేసే విధానం, సర్ఫ్, క్లీనింగ్ పౌడర్ తయారీ విధానాలు నేర్పించడం.

అయితే అలా నేర్పినందుకు గాను ఒక్కొక్కరూ ఫీ 200 పే చేయాలి. అందరూ పైన తెలిపిన వాటిలో ఏవో రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.

అలా గ్రూప్ ఫామ్  చేసిన లీడర్ అందరి దగ్గరా డబ్బులు కలెక్ట్ చేసి సొసైటీ కి ఇవ్వాలి. ఆ వర్క్ చేసినందుకు గానూ ఆ లీడర్ రెండు వందలు కట్టనవసరం లేదు. సొసైటీ వారు పైన తెలిపిన కోర్సు లన్నీ బ్రాంచిలో  నేర్చుకోవడానికి 500 కట్టించుకొని నేర్పారు.

ఇలా నేర్చుకున్న వారిలో ఏక్టివ్ గా ఉండి, ఇతరులకు నేర్పాలనే కుతూహలం చూపించిన వారిని ట్రైనర్లు గా వేసుకున్నారు. వీరు గ్రామాల్లో ఫాం అయిన టీం దగ్గరకు వెళ్ళి, గ్రూప్ లీడర్ ఇంట్లో వారికి నేర్పి రావాలి. అలా నేర్పటానికి వెళ్ళే టీచర్లకు టిఏ డిఏ లతో కలిపి ఒక కోర్సు కి ఐదు వందలు ఇస్తారు. సదరు టీచర్ ఒక కోర్సు ను మూడు రోజులలో కంప్లీట్ చేసుకోవాలి. అలా తయారైన వస్తువులను అక్కడే అమ్మేస్తే అమ్మిన దాని కమీషన్ వేరేగా వచ్చేది.

ఇలాంటి సొసైటీ లో చేరి ప్రణవి ఆ విద్యలన్నీ నేర్చుకుని గ్రూప్ లకు నేర్పేందుకు టీచర్ గా ఆ గ్రామాలకు వెళ్ళడం మొదలు పెట్టింది.

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in February 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!