Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

తానెంతో జగమంత - అన్నది ఒక ఆర్యోక్తి. ప్రతి వ్యక్తీ తన ఆలోచనలనుబట్టే ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. కామెర్లరోగికి జగమంతా పచ్చగానే కనిపించినట్లు, తమ స్వభావం ఎలా ఉందో ఎదుటివారి స్వభావంకూడా అలాగే ఉంటుందని భావిస్తారు జనం.

రఘురాం మీనాక్షిని పంపించెయ్యడం రజనికి నచ్చలేదు. ఇంటి పనిని తలుచుకుని ఆమె భయపడింది. “అదేమిటండి, వంటామెను అలా యిట్టె పంపేశారేమిటి! కమ్మగా వండి పెడుతూంటే తినలేకనా?” భర్త మీద నిష్టూరం వేసింది.

“నీ తెలివి తేగలు తిన్నట్లే ఉంది. మా నాన్న బాగుంటేనే కదా మన ప్లానుని అమలుజెయ్యగలం. అంతేకాదు, ఒకవేళ ఆయనకనక అర్ధంతరంగా పోతే ఆయన రాసిన విల్లు ఖాయమైపోతుంది. ఏమో, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు! అసలే ఆయన అనారోగ్యంగా ఉన్నాడు. వాళ్ళు ఆయనకు ఏ కీడైనా తలపెడితే... విల్లు కాన్సిల్ అయ్యేదాకా ఆయన బ్రతికి ఉండడం మనకు చాలా అవసరం. మందూ మాకూ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళతో మరో ఇబ్బంది ఏమిటంటే, వాళ్ళు ఇంట్లో ఉండగా మనం మన ప్లాను అమలుచెయ్యడం కూడా కుదరదు కదా… అర్థం చేసుకో!”

ముడుచుకుని ఉన్న రజని ముఖం వికసించింది. భర్త ఆలోచనను మెచ్చుకుంది.

“మొదట్లో నాకు తెలియలేదుగానీ, మంచిపని చేశారు.”

“అది సరేగాని, పొద్దుటినుండి మా నాన్న పచ్చిమంచినీళ్ళు కూడా తాగినట్లు లేదు. కాస్త పెరుగూ అన్నం తీసుకురా, కలిపి రెండు ముద్దలు పెడదాము ఆయనకు."

తన కోసం అన్నం తెచ్చిన కొడుకూ, కోడళ్ళను చూసి, “మీనాక్షి ఎక్కడ” అని అడిగారు. జగన్నాధంగారు.

మొగుడూ పెళ్ళాలు మొహ మొహాలు చూసుకున్నారు. రజని జవాబు చెప్పింది. “ఏదో పనుందని చెప్పి, కొడుకుతో కలిసి వెళ్ళింది మీనాక్షి. ఇంకా రాలేదు. మీరు శాంతంగా భోజనం చెయ్యండి. ఉదయం నుండే మీనాక్షి మీకేమీ ఇచ్చినట్లు లేదు” అంది.

వెంటనే రఘురాం మాట కలిపాడు, “వాళ్ళ కెందుకు ఉంటుంది బాధ్యత! వాళ్ళతో మనకున్నది ఉత్తి డబ్బు సంబంధమేగాని, రక్త సంబంధం కాదుకదా. నెలనెలా జీతం చేతిలో పడితే చాలు వాళ్లకి, ఇక మనమేమైపోయినా లెక్క ఉండదు” అన్నాడు.

రజని, “బలే చెప్పావు” అన్నట్లు భర్తవైపు మెప్పుగా చూసింది. “మనం ఎంతబాగా చూసుకున్నా వాళ్ళ బుద్ధి మారదు. ఎంత సాగదీసినా కుక్కతోక వంకర తీరేది కాదు” అంది.

పెద్దాయనకు చిర్రెత్తుకొచ్చిoది. “ఔనమ్మా! కుక్కకి తోక వంకరే! అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఎవరూ చెప్పనక్కరలేదు. ముంజేతి కంకణానికి అద్దం కావాలా ఏమిటి “అన్నారు వ్యంగ్యంగా. మరేమీ మాటాడలేకపోయారు ఆ భార్యాభర్తలు.

పెరుగన్నం రెండు ముద్దలు కంటే ఎక్కువ తినలేకపోయారు జగన్నాధంగారు. ఈ లోగా జీవన్ తెచ్చిన బత్తాయిపళ్ళు రసం తీసి తెచ్చింది స్రవంతి తాతయ్యకోసం. ఆ రసం త్రాగి తృప్తిపడ్డారు ఆయన. ఆపై కొడుకు ఇచ్చిన మందులు వేసుకుని విశ్రాంతిగా మంచం మీద పడుకున్నారు.

* * * * * *

మరునాడు “హెల్పులై న్” పనిమీద ఆ వీధివెంట వెడుతూ జగన్నాధంగారి గుమ్మం వైపుకి చూసిన జీవన్ కి గుమ్మంలో అంబులెన్సు కనిపించింది. “తాతయ్యకి ఏమైనా అయ్యిందేమో” అనిపించడంతో అతని గుండె ఝల్లుమంది. ఇక కాలు ముందుకి సాగలేదు. అంతలో జగన్నాధంగారిని స్ట్రెచర్ మీద తీసుకువచ్చి అంబులెన్సు ఎక్కించారు. ఇక ఆగలేక “తాతయ్యా” అంటూ ఒక్క పరుగున ఆయనకు దగ్గరగా వెళ్ళాడు జీవన్. అంత బాధలో ఉండి కూడా జగన్నాధంగారు జీవన్ చెయ్యి పట్టుకున్నారు. దాంతో రఘురాంకి జీవన్ ని వెంట తీసుకు వెళ్ళడానికి, అయిష్టంగా నైనా, అంగీకరించక తప్పలేదు. కాని అంబులెన్సు హాస్పిటల్ చేరకముందే జగన్నాధంగారి గుండె ఆగిపోయింది.

జగన్నాధంగారి పార్దివదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. గుమ్మం ముందు చాప పరిచి ఆయన దేహాన్ని భూశయనం చేయించారు. ఈ భవబందాలనుండి ఆయనకు శాశ్వత విముక్తి కలిగింది. ఇక ఆయన పార్ధివ దేహానికి అగ్నిసంస్కారం చేసి, ఆపై అపరకర్మలు జరిపించి ఆయన ఆత్మకు సద్గతులు కల్పించడం మిగిలి ఉంది. ఆ పనులు నిర్వహించే బాధ్యత కొడుకుది.

ప్రాణం పోయిన తరువాత ఇరవైనాలుగు గంటలలోపుగా ఆ పార్దివదేహానికి అగ్నిసంస్కారం జరిపించవలసి ఉంటుంది. ప్రాణతేజం శరీరాన్ని వదలి ఆకాశాన్ని చేరుకున్న మరు క్షణంలో ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసిపోతాయి. అక్కడితో ఊపిరి ఆగిపోయి శరీరం నిర్జీవమౌతుంది. అంతవరకూ శరీరాన్ని నడిపించిన అగ్ని నెమ్మదిగా తనదారి తాను చూసుకుంటుంది. ఆ తరువాత ఆ శరీరం చల్లబడి కట్టెలా మారుతుంది. ఆ శరీరానికి అగ్నిసంస్కారం జరిగినప్పుడు నీరు ఆవిరై మేఘాలను చేరుకోగా, మిగిలిన వ్యర్ధపదార్ధము మంటలో కాలిపోయి బూడిదై మట్టిలో కలిసిపోతుంది. ఈ విధంగా పంచభూతాత్మకమైన శరీరం తిరిగి పంచభూతాల్లో లయమైపోతుంది.

జీవులన్నిటికీ జననమరణాలన్నవి సహజమే కదా! ఒకళ్ళు కొంచెం ముందు, మరొకరు కొంచెం వెనుక - అంతేకదా! అనుకున్నాడు కన్నీటితో జీవన్. అంతలో, తాను తాతయ్యకి కడసారంగా చెయ్యవలసిన సర్వీస్ ఒకటి ఉందని గుర్తువచ్చింది. వెంటనే ఇంటికివెళ్ళి ఆ దుర్వార్తను తల్లికి తెలియజేశాడు. ఆ పై సైకిలు తీసుకుని వేగంగా వెళ్లి తనకు తెలిసిన తాతయ్య మిత్రులందరికీ ఈ వార్త అందజేసి వచ్చాడు. వాళ్ళ ద్వారా ఈ సంగతి మరికొందరికి చేరింది.

జగన్నాధంగారి మరణవార్త తెలియగానే ఆయనకు కావలసిన వారందరూ కడసారి చూపులకు ఒకరొకరే బయలుదేరి రావడం మొదలుపెట్టారు. అందరి కంటే ముందుగా మీనాక్షి వచ్చింది. ఆమె తనను “అమ్మాయీ” అని పిలుస్తూ, తండ్రిలా ఆదరించిన ఆ పెద్దాయన మరణాన్ని జీర్ణించుకోలేక, శవం పక్కన చతికిలబడి భోరున ఏడవసాగింది. ఆయన తమపై చూపించిన ప్రేమాభిమానాలు అనుక్షణం గుర్తుకు రావడంతో ఆమె ఏడుపు ఆపుకోలేకపోతోoది.

మామగారు మరణించినందుకు రజనికూడా ఏడ్చింది. వీలునామా రద్దు చెయ్యకముందే ఆయన చనిపోవడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. రఘురాం, తండ్రి శవాన్ని చూడగానే నిలువునా చలించిపోయాడు. తాత్కాలికంగా స్వార్ధం తలదించుకుంది. తనను కని, గారాబంగా పెంచి పెద్దచేసి, దివ్యమైన జీవితాన్నిచ్చిన కన్నతండ్రికి తాను చేసిన నిర్వాకమంతా తలపుకువచ్చి గోడుగోడున ఏడ్చాడు. స్రవంతి ఒకవారగా నిలబడి, ఒక్కరోజులో తాతయ్య తనపై చూపించిన ప్రేమను తలుచుకుని కన్నీరు కార్చింది. ఇక జగన్నాధంగారి మిత్రుల సంగతి సరేసరి. అక్కడ చేరిన జగన్నాధంగారి ఆత్మీయులంతా ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ బిక్కమొహాలతో దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. కబురు తెలిసి జగన్నాధంగారి లాయరు ఫ్రెండ్ రామేశం కూడా వచ్చారు అక్కడకు చేతిలో ఒక బ్రీఫ్కేస్ పట్టుకుని.

ఎలాతెలిసిందో మరి అపరకర్మలు చేయించే బ్రాహ్మడు చేతిసంచీతో అక్కడకు వచ్చాడు. జగన్నాధంగారి పార్ధివ దేహానికి వేదవిహితంగా అపరకర్మలు చెయ్యడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. “కర్మ చేసే వారెవరో ఇటురండి” అని పిలిచాడు పురోహితుడు, చేతి సంచీలోననుండి దర్భలు పైకి తీస్తూ. గమ్మున ఆయన ముందుకు వచ్చాడు రఘురాం. అతని ఎదపై యజ్ఞోపవీతం లేకపోవడం చూసి, పురోహితుడు అతని మెడలో అవసర జందెం వేశాడు.

అంతలో లాయరు రామేశంగారు కూడా ముందుకువచ్చారు, “ఒక్క క్షణం ఆగండి. ముందుగా నన్ను నా స్నేహితుడు జగన్నాధం రాసిన వీలునామా చదవనీయండి” అంటూ.

“ఈ సమయంలో విల్లు చదవడమేమిటీ” అంటూ అక్కడున్న వాళ్ళలో కొందరు అభ్యంతర పెట్టారు.

“ఇది నా ప్రియ మిత్రుడు జగన్నాధం పూర్తి  ప్రజ్ఞతో రాసి, రిజిష్టర్ చేయించిన వీలునామా. ఇది ఈ సమయంలోనే చదవాలన్నది నా మిత్రుని కోరిక. ఈ వీలునామా చదివేకే తేలుతుంది, ఆయనకు తలకొరివి ఎవరు పెట్టాలన్నది. అడ్డుపెట్టవద్దు, నన్ను చదవనియ్యండి” అన్నారు ఆయన. ఇంక ఎవరూ మాటాడలేదు. ఆయన చదవడం మొదలుపెట్టారు...

వీలునామా అందరికీ అర్థమయ్యే భాషలో ఉండదు, విచిత్రమైన లీగల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అందుకని ఒకసారి దాన్ని చదివి, అందరి ముఖాలూ చూసి, మరొకసారి అందరికీ అర్ధమయ్యేలా మార్చి చదివారు లాయరు రామేశంగారు...

ఇది సీతారామయ్యగారి పుత్రుడైన జగన్నాధం పూర్తి ప్రజ్ఞతో తన ఇష్టపూర్వకంగా రాసి, రిజిష్టర్ చేయించిన వీలునామా...

“నా భార్య మరణం తరువాత, నా ఏకైక పుత్రుడు దూరాన ఉండడంతో, వృద్ధాప్యoలో ఏకాకినైన నన్ను చూసేవారు, చేసేవారు లేక పట్టెడు తిండికి కూడా మొహంవాచి అష్టకష్టాలూ పడుతూ, తినడానికి ఏమైనా తెచ్చుకోడానికి వెళ్లినప్పుడు భయంకరమైన యాక్సిడెంటుకి గురికాబోతున్న నన్ను, నే నెవరో తనకు తెలియకపోయినా, కేవలం కారుణ్యభావంతో ప్రాణాలకు తెగించి నన్ను రక్షించి, నేనెవరో, ఏమీ తెలియకపోయినా, స్పృహ తప్పి పడిఉన్ననన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి, తన డబ్బుతో నాకు వైద్యం చేయించడమే కాకుండా, అస్తవ్యస్తంగా ఉన్న నా జీవితాన్ని చక్కదిద్ది, నాకొక మంచి వసతి కల్పించిన చిరంజీవి జీవన్ కి, నా స్వార్జిత విత్తంతో ప్లాట్ నంబర్ 24 లో నేను కట్టించిన ఇంటిని, స్థలాన్ని నా ఇష్టపూర్వకంగా సర్వహక్కులతోనూ అతనికి దఖలు పరుస్తున్నాను,

ఒక వేళ నా ఏకైక పుత్రుడైన చిరంజీవి రఘురాం ఈ ఏర్పాటు నచ్చక నాకు తలకొరివి పెట్టడానికి నిరాకరించినట్లయితే, నేను నా దౌహిత్రుడిగా భావించే జీవన్ చేతే నా తలకొరివి పెట్టించి నాకు ఉత్తరగతులు సద్గతులు గావించమని నా మిత్రులను కోరుతున్నాను.

ఇట్లు

జగన్నాధం వ్రాలు.

ఇదండీ నా మిత్రుడు రాసిన వీలునామా” అని చెప్పి లాయరు రామేశం మాటలు ఆపి, ఆ వీలునామా కాగితాన్ని, రిజిస్ట్రేషన్ ష్టాoపూని రఘురాంకి చూపించి, ఆ డాక్యుమెంటుని జీవన్ కి అందించాడు.

జీవన్ నిర్ఘాంతపోయాడు. వీలునామాని అందుకుని కళ్ళకు అద్దుకున్నాడు. తాతయ్యకు తనపై ప్రేమ ఉందని తెలుసు, కాని మరీ ఇంత ఎక్కువగా ఉందని తను ఊహించనైనాలేదు. దుఃఖంతో వివశుడై కన్నీరు కార్చాడు జీవన్. అంతలో తేరుకుని అక్కడున్న అందరినీ పరికించి చూశాడు...

అక్కడున్న జనం గుసగుసలాడుకుంటున్నారు. దగ్గరలోనే రజనీ, రఘురాంలు ముటముటలాడుతున్న మొహాలతో జీవన్నే కొరకొరా చూస్తున్నారు. వాళ్ళ ముఖాలలో పేరుకుని ఉన్న నిరాశ చూస్తూంటే, తనమీద వాళ్లకు అంత కక్ష ఎందుకో అర్థమయ్యింది. “ఆహా! డబ్బుమీది వ్యామోహంతో మనిషి ఎంతటి నీచానికైనా దిగజారుతాడు కదా... అందుకే జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా, డబ్బుని తన అదుపులో ఉంచుకుంటాడే తప్ప, దాని మాయలో తాను పడడు ఎప్పుడూ! డబ్బు మాయలో పడిన మనిషి తాను మనిషన్న సంగతికూడా మర్చిపోయి, డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బుకోసం చెయ్యరాని అకృత్యాలు చేస్తూ, డబ్బే లోకంగా బ్రతుకుతాడు కదా! కాని వెళ్ళేటప్పుడు ఏదీ వెంటరాదు, అన్నీ ఇక్కడే విడిచిపోవాలి. ఇంతోటి దానికోసం ఇన్ని తరిమిట్లు అవసరమా” అనుకున్నాడు జీవన్.

జీవన్ మళ్ళీ ఒకసారి ఆ కాగితాన్ని కళ్ళకి హత్తుకున్నాడు. తన కన్నీటితో తడిసిన ఆ కాగితాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని ముక్కలు ముక్కలుగా చింపేశాడు.

అది చూసి అక్కడున్న జనం హాహాకారాలు చేశారు. రజనీ రఘురాoలు తెల్లబోయారు. అది వాళ్ళు ఎంతమాత్రం ఊహించని విషయం. స్రవంతి కళ్ళు తళుక్కున మెరిశాయి.

లాయర్ రామేశం గారు, గమ్మున జీవన్ చెయ్యి ఒడిసి పట్టుకున్నారు. “పెద్దాయనంటే నీకు గౌరవం లేదా? ఇదేమి పని” అని అడిగారు జీవన్ వైపు కోపంగా చూస్తూ.

కారే కన్నీరు తుడుచుకుంటూ జవాబు చెప్పాడు జీవన్. “క్షమించండి సార్! తాతయ్యమీద నాకు అంతులేని గౌరవం ఉంది. అందుకనే ఆ వీలునామా చింపేశాను. ఆయన నా యెడల చూపించిన ఆత్మీయత నాకు చాలు. ఆయన ఆస్తిమీద నాకు ఆశలేదు. అది ఆయన కుటుంబం లోని వారిది. కన్న కొడుకుని కాదని, ఏమీకాని వాడికి ఆస్తిని కట్టబెట్టాడు - అని ఆయనను గురించి ఒక్కరు అనుకున్నా నేను సహించలేను. ఆయనకి  చెడ్డపేరు రాకూడదని విల్లుని చింపేశా. తప్పుగా అనుకోవద్దు. నేను శ్రమించి బతకగలను. ఇప్పటి వరకూ తాతయ్య ఇలాంటి విల్లు ఒకటి రాశారన్న సంగతి నాకు ఎంతమాత్రం తెలియదు. తెలిసుంటే మొదట్లోనే నేను దీన్ని రాయకుండా ఆపేసి ఉండే వాడిని” అంటూ దుఃఖం పోటెత్తగా తాతయ్యను తలుచుకుని భోరున ఏడ్చాడు జీవన్.

“ఎంత తెలివి తక్కువ! సిరి రాగా మోకాలు అడ్డం పెట్టాడుట ఇలాంటివాడే ఒకడు!” అక్కడున్న వాళ్ళలో కొందరు గుసగుసగా చెప్పుకున్నారు.

“ఆహా! ఇంత చిన్నవయసులోనే అంత నిగ్రహమా!” ప్రశంసించారు మరికొందరు.

నోట మాటరాక, చేష్టలుదక్కి నిలబడిపోయారు రఘురాం దంపతులు. వాళ్ళ మనసంతా సిగ్గుతో, తమ ప్రవర్తనకి పశ్చాత్తాపంతో నిండి చిన్నబోయింది.

నెమ్మదిగా తనని తానే సంబాళించుకుని, జీవన్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి, అందరికీ చూపించాడు. “ఇది తాతయ్య నాపై తనకున్న ప్రేమకు గుర్తుగా స్వయంగా తానే నాకిచ్చినది. దీనినిమాత్రం నేను ఎవరికీ ఇవ్వను. ఇది నాకు తాతయ్య ఇచ్చిన వరం” అంటూ తిరిగి తన వేలిని పెట్టేసుకున్నాడు.

“ఇంటితో పోలిస్తే ఆ అరిగిపోయిన పాత ఉంగరం ఎంత లే” అనుకుంది రజని.

ఒక్క ఉదుటున వచ్చి రఘురాం జీవన్ని కౌగిలించుకున్నాడు. “నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు” అంటూ చెవిలో గుసగుసగా చెప్పాడు. “నువ్వు ఈ పదిరోజులూ నాకు తోడుగా ఉండి తాతయ్య కర్మకాండలన్నీ చక్కగా జరిగేలా చూడాలి. నువ్విక్కడ లేకపోతే ఆయన ఆత్మకు శాంతి దొరకదు” అన్నాడు.

రజని మీనాక్షిదగ్గరకు వెళ్లి, ఆమె చేతులు రెండూ పట్టుకుని, “అమ్మా మీనాక్షీ! మీరు దగ్గరుండి మీ బాబాయ్ గారి దశదిన కర్మలూ సరిగా జరిగేలా చూడాలి. మామీద దయ ఉంచి, మమ్మల్ని మన్నించి మీరు ఈ పన్నెండురోజులూ ఇక్కడే ఉండిపొండి. కర్మకాండలన్నీ సవ్యంగా జరిగేలా చూడమని ప్రాధేయ పడుతున్నా. నన్ను మన్నించి ఉంటారు కదూ” అంది, అసలు విషయం పక్కవాళ్ళకు తెలియనీకుండగా నర్మగర్భితంగా క్షమించమని కోరుతూ.

“వారెవ్వా, కథానాయకుడా! నీకు నువ్వేసాటి! నిన్ను ద్వేషించిన వాళ్ళే నిన్ను క్షమించమని ప్రాధేయపడేలా చేశావు కదా!” అనుకుంది మెప్పుగా స్రవంతి తన మనసులో.

కలతలు సమసిపోడంతో, అందరూ కలిసికట్టుగా జగన్నాధంగారి అంతిమయాత్రకు సన్నాహాలు మొదలుపెట్టారు. సూర్యాస్తమయం కాకముందే శవయాత్ర మొదలయ్యింది. జగన్నాధంగారి మిత్రులలో ఓపికున్న వాళ్ళు మూడు కొమ్ములు కాయగా, జీవన్ ఒక కొమ్ముపట్టాడు. కొడుకైన రఘురాం అగ్నిహోత్రం పట్టుకుని  తోవచూపుతూ ముందునడవగా జగన్నాధంగారి పార్దివదేహం, ఆయన జీవనప్రస్థానంలోని ఆఖరు మజిలీని చేరుకుంది.

ధర్మోదకాల రోజున జీవన్, మీనాక్షీలచేత కూడా తన తండ్రికి ధర్మోదకాలు ఇప్పించాడు రఘురాం. అలా జరక్కపోతే తన తండ్రి ఆత్మకు శాంతి ఉండదని, ఆలస్యంగానైనా, అర్థమయ్యింది అతనికి. వేదవిహిత కర్మలతో జగన్నాధంగారి అంత్యక్రియలు, అపరకర్మలూకూడా సంతృప్తికరంగా ముగిశాయి. విభేదాలు మరచి, మీనాక్షీ, జీవనూ కూడా అడుగడుగునా రఘురామ్ కి, రజనికి సాయపడుతూ తాతయ్యకి కర్మకాండలన్నీ సక్రమంగా యధావిధిగా జరిగేందుకు తోడ్పడ్డారు. అక్కడితో జగన్నాధంగారి ఉనికి ఒక జ్ఞాపకంగా మారిపోయింది.

"ఇప్పటికే చాలారోజులు సెలవు పెట్టాను, ఇక కుదరదు" అని చెప్పి రఘురాం తను ఉద్యోగం చేస్తున్న ఊరికి ప్రయాణ మయ్యాడు కుటుంబ సమేతంగా. ఇంటిని, "ఫర్నిష్డు హౌస్" గా ఎవరికైనా అద్దెకిచ్చి, అద్దె డబ్బుని బ్యాంకులో వెయ్యమని చెప్పి, కావలసిన ఏర్పాట్లన్నీ చేసి, ఇంటిని తన మిత్రుడు లాయర్ రమేశ్ కి అప్పగించి వెళ్ళిపోయాడు రఘురామ్.

* * * * * *

ఇంటికి తిరిగిరాగానే మీనాక్షి చేసిన మొదటిపని కొడుక్కి దిష్టి తియ్యడం. గుప్పిడి నిండా ఎండు మిరపకాయలూ ఉప్పూ తీసుకుని వచ్చిన తల్లిని వారించాడు జీవన్.

“ఏమిటమ్మా ఇది! నేనేమైనా పసివాడినా? నాకు దిస్టేమిటమ్మా” అంటూ మారాం చేశాడు.

“నువ్వుండు, నీ కసలు ఏమీ తెలియదు. “నరుల దృష్టి తగిలితే నల్లరాళ్ళు కూడా పగులుతాయి” అంటారు. ఈమధ్య నువ్వు పడిన జనఘోష ఇంతా అంతానా ఏమిటి! నాది తల్లిప్రాణం, చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పు... ఏదైనా పరిహారం చేస్తేగాని నాకు మనః స్థిమితం ఉండదు” అంది మీనాక్షి.

జీవన్ మరి మాటాడలేదు. తన తల్లికి శాంతి సుఖాలు దక్కాలంటే తను తలవంచి దిష్టి తీయిoచుకోక తప్పదు. తనకు దిష్టి తీశాకగాని ఆమెకు స్థిమితం ఉండదు - అని అర్థం చేసుకున్నాడు. తలవంచుకుని తల్లికి ఎదురుగా నిలబడ్డాడు.

జగన్నాధంగారు పోయినప్పుడు జరిగిన విశేషాలు నెమ్మదిగా ఊరంతా పాకేయి. చిన్నతనంలోనే జీవన్ ని మంచి బాలుడుగా గుర్తించారు చాలామంది. ఇదివరకు గుర్తిoచని వాళ్ళు కూడా ఇప్పుడు జీవన్ మంచితనాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. కాని మంచిపేరు అన్నం పెట్టలేదు కదా...  మళ్ళీ ఆ తల్లీ కొడుకులకి బ్రతుకుతెరువు ప్రశ్నఅయ్యికూర్చుoది. మీనాక్షికి మిఠాయిదుకాణం పని తప్ప మరో పనేదీ లేదు. ఇకపోతే, "ఆంధ్రులు ఆరంభ శూరులు" అన్న మాటను మరోసారి ఋజువుచేస్తూ, చాలామంది హెల్పులైన్ కి పనివ్వడం మానేశారు. పత్రికలలో పడ్డ కథలకు వచ్చిన రెమ్యూనరేషన్ లో ఖర్చులకు పోగా మిగిలిన డబ్బు కూడా కలిపినా, రాబడికీ ఖర్చుకీ పొంతన కుదరడం అన్నది కష్టమైపోతోంది. పులిమీద పుట్రలా, తరువాతి నెలనుండి ఇంటద్దె రెండు వందలు పెంచమనీ, లేకపోతే ఇల్లు ఖాళీ చెయ్యమనీ చెప్పి వెళ్లారు ఇంటివారు.

“ఉన్నకర్మకు ఉపాకర్మ కూడా తోడయ్యింది” అన్నట్లు, అకస్మాత్తుగా ప్రపంచంపైన విరుచుకుపడిన “ద్రవ్యోల్బణం” వల్ల ఏర్పడిన ఆర్ధిక మాంద్యం ప్రపంచదేశాలనన్నిటినీ పట్టి కుదిపెయ్యడంతో అకస్మాత్తుగా అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. “అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి” అన్న సామెత అక్షరాలా నిజమయ్యింది. భయంకరమైన ఈ ఆర్దికమాంద్యాన్ని తట్టుకోలేక మధ్యతరగతి జనం గడగడా వణికారు. ఎవరికీ వారే కొన్ని ఖర్చులు తగ్గించాలని చూశారు. నెల కింతని నికరాదాయం ఉన్న మధ్యతరగతి వాళ్ళనే గడగడలాడిస్తున్న ఈ ఎకనామికల్ డిప్రెషన్ సమయంలో సరైన ఆదాయం లేక, గాలి బతుకులు బ్రతికేవాళ్ళ పరిస్థితి ఏమిటో ఊహకందని విషయమయ్యిoది.

ఆ ఊరు మరీ అంత పెద్ద పట్టణమేమీ కాదు. ఆ ఊరిజనం చాలావరకూ మధ్యతరగతి వాళ్ళే. విపరీతంగా పెరిగిన ధరలకు భయపడి వాళ్ళు కొనుగోళ్ళు తగ్గించేశారు. అంతేకాదు, ఎవరికైనా పని చెప్పి చేయించుకోడం కంటే, ఎంత కష్టమైనా పడి, ఎవరి పని వాళ్ళు చేసుకోడంవల్ల నాలుగు రాళ్ళు కలిసివస్తాయన్న ఆలోచనకూడా వచ్చింది జనానికి. దాంతో “హెల్పులైన్” రాబడి చాలావరకూ తగ్గిపోయింది.

మీనాక్షి తనకు పని ఇప్పించమని ఎందరినో అడిగింది. కాని, ఫలితం శూన్యం. ఒకళ్ళిద్దరికి వంటమనిషి కావలసి ఉన్నా-  కొద్ది నెలల్లో, యాజులుగారు తిరిగి రాగానే మీనాక్షి, తను చేస్తున్న పని మాని వారి ఇంటికి వెళ్ళిపోతుందన్నది ఆమెకు ఒక “బేడ్ క్వాలిఫికేషన్” అయ్యింది. ఎవరి చేతిలోనూ డబ్బు ఉండకపోడంతో, ఇదివరకులా అప్పు పుట్టే దారి కూడాలేదు ఇప్పుడు. చివరకు ఆ తల్లీ కొడుకులకు రోజు గడవడం కష్టమయ్యింది.

“మళ్ళీ మనకు కానిరోజులు వచ్చిపడ్డాయి గావును. యాజులుగారు రావడానికి ఇంకా ఆరు నెలలు పట్టొచ్చు. అంతవరకు గడిచేది ఎలాగురా భగవంతుడా” అనుకుని, కొడుక్కు చెప్పి బాధపడసాగింది మీనాక్షి.

ఇన్నాళ్ళూ సంపాదించినదంతా జీవన్ చదువుకోసం చేసిన అప్పులు తీర్చడంతో సాంతం ఖర్చైపోయింది. అందువల్ల డబ్బు చేతికి వచ్చినప్పుడుకూడా దాచినదేమీ పెద్దగా లేదు. ఆ ఉన్నది కాస్తాకూడా చూస్తూండగా ఐపోయింది. రేపెలా గడుస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది వాళ్ళకి.

చూస్తూండగా ఒకటో తారీకు వచ్చింది. ఐదోతారీకు దాటకముందు ఇంటద్దె కట్టాలి. అది ఏనాడో ఈ ఇంట్లో ప్రవేశించినప్పుడు చేసుకున్న ఒప్పందం. వాళ్ళదీ ఇంటద్దెల ఆధారంగా చేసుకుని బ్రతికే బతుకులే కావడంతో, వాళ్ళు అద్దెలు వసూలు చెయ్యడం విషయంలో కరాఖండే గా వ్యవహరిస్తారు. క్రితం నెల జీవన్ ర్యాలీ సైకిల్ అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బు ఇంటద్దెకు పోగా మిగిలినదానితో ఇప్పటివరకూ పొదుపుగా ఇల్లు గడిపింది మీనాక్షి.

ఆ నెల ఎలాగో ఓలా గడిచిపోయింది. మరోనెల వచ్చింది. ఇప్పుడు ఈ నెల గడవాలంటే ఏమి అమ్మాలా - అని ఆలోచించిన జీవన్ తన చేతికున్న వాచీవైపు చూసుకున్నాడు. అది జగన్నాధం తాతయ్య తన చేతికి స్వయంగా పెట్టిన వాచీ! అది అమ్మినా వచ్చిన డబ్బు నెలసరి ఖర్చులకు కూడా సరిపోదు. కొని ఎక్కువ రోజులు కాకపోయినా, అది సెకెండ్ హేండ్ వాచీ – అంటూ దానికి సరైన వెల ఇవ్వరు ఎవరూ. దానిని అమ్మడంలో అర్ధం లేదు, వ్యర్ధం తప్ప - అనుకున్నాడు జీవన్.

****సశేషం****

Posted in February 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!