Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

పన్నెండు గంటలు అయ్యేసరికి అలవాటుగా జగన్నాధంగారి ఇంటికి వచ్చాడు జీవన్. వస్తూ ఒక డజను బత్తాయిపళ్ళు తెచ్చాడు. అప్పటికే మీనాక్షి వంట ముగించి, వండిన పదార్ధాలన్నీ కేసరోల్సులోకి సద్ది డైనింగ్ టేబులుపైన ఉంచుతోంది.

“తాతయ్యకు రసం తీసి ఇవ్వమ్మా” అంటూ తను తెచ్చిన బత్తాయిలు తల్లి కిచ్చాడు జీవన్.

“రావోయ్ జీవన్! భోజనం చేద్దాం” అంటూ జీవన్ ని పిలిచాడు రఘురాం.

అక్కడే ఉన్న స్రవంతి ఉలికిపడి ఆశ్చర్యంగా చూసింది తండ్రివైపు. తన తండ్రిలో అంతలో ఇంతమార్పు ఎందుకు వచ్చిందో ఆమెకు అర్ధమవ్వలేదు.

జీవన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా, “ముందుగా తాతయ్య పని చూసి ఆ తరవాత తింటాలెండి, తొందరలేదు, ముందు మీరు భోజనం చెయ్యండి” అన్నాడు జీవన్, మొహమాటపడుతూ.

జీవన్ అలా తాతయ్యమీద అభిమానం చూపించడం రఘురాంకి ఎంతమాత్రం నచ్చలేదు. పొంగి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుని నెమ్మదిగా మాట్లాడాడు, “ఫరవాలేదు రావోయ్! ఆయన మంచి నిద్రలో ఉన్నాడు, అంత తొందరగా ఏమీ లేవడు. అప్పటికి మన భోజనాలు అయిపోతాయి. మెహర్బానీ చెయ్యక రా” అంటూ జీవన్ నడుముచుట్టూ చెయ్యివేసి టేబుల్ దగ్గరకు నడిపించాడు రఘురాం. జీవన్ ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి, తను పక్కకుర్చీలో కూర్చున్నాడు.

అకస్మాత్తుగా రఘురాం మారిపోయినందుకు ఆశ్చర్యపోయాడు జీవన్. అతడు చూపిస్తున్న ఆత్మీయత వింతగా తోచింది జీవన్ కి. ఉదయమే అంత అవమానకరంగా ఈసడించిన మనిషి ఇప్పుడింత ఆత్మీయత చూపిస్తున్నాడంటే ఏమనుకోవాలి! ఏమనుకోడానికీ ఏమీ కారణం కనిపించలేదు జీవన్ కి.  కారణమేమీ తోచక తలవంచుకుని కూర్చుండిపోయాడు జీవన్.

“నీ గురించి నాకేమీ తెలియదు. ఏం చదివావు? ఏమి చేస్తూంటావు? అన్నీ వివరంగా చెప్పు, తెలుసుకోవాలని ఉంది” అన్నాడు రఘురాం.

రఘురామ్ కి తనపైన సదభిప్రాయం లేదన్నది జీవన్ కి నిన్ననే తెలిసింది. అతడు తనని ఒక అప్రయోజకుడుగా, నిరక్షర కుక్షిగా, మరీ పనికిమాలిన వాడిగా భావిస్తూ ఉండివుండొచ్చు. తనను గురించి ఆయనకి ఉన్నది ఉన్నట్లుగా తెలియజెయ్యడం మంచిది - అనుకుని చెప్పడం మొదలుపెట్టాడు జీవన్ ...

“నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదండి. మేథమేటిక్సు మెయిన్గా డిగ్రీ తీసుకున్నా. గోల్డు మెడల్ వచ్చింది. ప్రస్తుతం నిరుద్యోగిని. గోల్డు మెడల్ సంపాదించినంత తేలిగ్గా ఉద్యోగం సంపాదించలేము కదండీ! ఇకపోతే హాబీగా కథలు రాస్తూంటా. వచ్చిన పారితోషికం కాగితాలు, కలాలు, పోష్టేజ్ కి పోగా జీవికకు చాలినంత మిగలదు. అందుకని “హెల్పులైన్” అనే పేరుతో ఒక వృత్తిని ఏర్పరచుకుని, ఒక చిన్నపాటి కమీషన్ తీసుకుని అవసరమున్న వారికి సహాయం చేస్తున్నాను. అదే నా వృత్తి, ప్రవృత్తి కూడా. నిరుద్యోగినైన నాకు, ప్రస్తుతానికి అదే నా ఉద్యోగమయ్యిoది” అన్నాడు.

వెంటనే రఘురాం జీవన్ వెన్నుతట్టి, “నువ్వు నాకు బాగా నచ్చావోయ్! నిరుద్యోగులైన యువకులందరూ నీలా ఆలోచిస్తే, మనదేశానికి నిరుద్యోగమన్నది ఒక సమస్యగా మారేది కాదు కదా” అన్నాడు.

స్రవంతి అన్నం తినడం ఆపి, తండ్రి వైపు వింతగా చూసింది. పొద్దుటికీ ఇప్పటికీ, జీవన్ పట్ల తన తండ్రిలో వచ్చిన మార్పు ఆమెను ఆశ్చర్యచకితను చేసింది. తన తండ్రి అలా ప్లేటు ఫిరాయించడానికి తగినంత కారణం ఏదో ఉండే ఉంటుంది - అనుకుంది. అది మొదలు ఆమె తండ్రిని పరిశీలనగా కనిపెట్టి చూడసాగింది. రవి మాత్రం ఏమీ పట్టిoచుకోకుoడా ఒక చేత్తో “హారీ పాటర్” పుస్తకం పట్టుకుని చదువుతూ, రెండవ చేత్తో అన్నం తినే ప్రయత్నం చేస్తున్నాడు.

రజని ఎందుకనో చాలా ఉద్వేగంతో ఉంది. చిన్న చప్పుడైనా ఉలికిపడి, వీధి తలుపువైపు చూస్తోంది. ఉండుండీ భర్తను భావగర్భితమైన చూపులతో పలకరిస్తోంది. అందరి భోజనాలూ కొసకి వచ్చాయి. ఒక్కొక్కరికీ పెరుగు వడ్డిస్తోంది మీనాక్షి.

స్రవంతి జీవన్ వైపు చూసి అడిగింది, “నేను మన తెలుగు పత్రికలు బాగా చదువుతాను. ఎక్కడా మీ పేరు చూసిన గుర్తులేదు. ఏదైనా కలంపేరు వాడుతారా?”

“ఔనండీ. చిరంజీవి - అన్నపేరుతో రాస్తూంటాను. నా పూర్తిపేరు కూడా అదే!” వంచిన తల ఎత్తకుండానే జవాబు చెప్పాడు జీవన్.

స్రవంతి కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. "పాఠకుల చేత “గ్రేట్ రైటర్” అనిపించుకుంటున్న "చిరంజీవి" మీరా! మీ కథలంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఇలా చూడగల్గినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆటోగ్రాఫ్ కావాలి నాకు” అంది.

రఘురాం కూతురువైపు కోపంగా చూసి ఏదో అనబోయేటంతలో డోర్బెల్ మ్రోగింది. పెరుగు అన్నం తిoటున్న రజని ఉలిక్కిపడి లేచి నిలబడింది. ఎవరొచ్చారో చూడాలని వెళ్ళిన మీనాక్షి, తలుపు తెరవగానే కనిపించిన పోలీసుల్ని చూసి నిర్ఘాంతపోయి, పక్కకి తప్పుకుంది.

తింటున్న కంచంలోని పెరుగన్నంలో చెయ్యి కడిగేసుకుని లేచాడు రఘురాం. పోలీసులకు ఎదురువెళ్ళి “రండి, రండి” అంటూ వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు.

పోలీసులు ఇంటికి రావలసినంత అగత్యం ఏమొచ్చిందో తెలియక, కంచం వదిలి లేచివెళ్ళి సింక్ లో చెయ్యి కడుక్కుని వచ్చాడు జీవన్.

రజని పోలీసులతో మాటాడింది, “మా మామగారి చేతినున్న వజ్రపుటుంగరం మాయమయ్యింది. అది మాకు వంశపారంపర్యంగా వస్తున్న అపురూప వస్తువు. ఇప్పుడిక్కడ ఉన్నవారు తప్ప వేరే ఎవరూ ఈ రోజు మా ఇంటికి రాలేదు. పొద్దున్న ఆయన వేలిని ఉంగరం చూశాను. ఇప్పుడది అక్కడ లేదు. పెద్దాయన నిద్రలో ఉండగా ఎవరో కాజేసి ఉంటారు. ఎవరా పాడుపని చేశారన్నది కనిపెట్టడం మా వల్లనయ్యే పనికాదు. అందుకనే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది” అంది.

పోలీసులు తమపని మొదలుపెట్టారు. “ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఇటు వచ్చి, వరసగా నిలబడండి” అన్నాడు పోలీస్ ఇనస్పెక్టర్.

అందరూ వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడ్డారు. మీనాక్షి కూడా తడి చెయ్యి కొంగుకి తుడుచుకుంటూ వచ్చి కొడుకు పక్కన నిలబడింది. అసలు ఇదంతా ఎందుకో, పోలీసులు రావలసిన అగత్యం ఏమిటో ఏమీ అర్ధం కాని సందిగ్ధంతో తబ్బిబ్బైనారు మీనాక్షీ జీవన్ లు. ఉంగరం ఇదివరకులాగే ఇంట్లోనే ఎక్కడో జారి పడిపోయి ఉంటుంది, వెతికితే కనిపిoచకపోదు. ఈరోజు తాతయ్య గుమ్మం దిగింది కూడాలేదు. ఇంతోటి దానికి పోలీసులతో పనేమిటి - అని విస్తుపోయారు తల్లీకొడుకులు.

పోలీసు ఇనస్పెక్టర్ అందరినీ నిశితంగా పరికించి చూసి అడిగాడు, “మీ అందరికీ పెద్దాయన వేలికి ఉంగరం ఉండేదని తెలుసుకదా?”

“తెలుసు!” స్రవంతి రవిలతోసహా అందరూ తెలుసని ఒప్పుకున్నారు.

రజని కొంగుతో కళ్ళు ఒత్తుకుని, “ఆ ఉంగరాన్ని డబ్బుతో వెల కట్టకూడదు సార్! ఎన్నో తరాలనుండే అది తండ్రి నుండి కొడుక్కి వారసత్వంగా వస్తోంది. అచ్చొచ్చిన ఉంగరం. ఇంకా చాలా తరాలు మా వంశంలోనే ఉండాలని మా కోరిక. అందుకే అదెక్కడుందో కనుక్కోడానికి మీ సహాయం కోరాము” అంది.

“రజని గారూ! మీరా ఉంగరాన్ని మీ మామగారి వేలిని ఎప్పుడు చూశారు?”

“ఈ ఉదయమే చూశా! ఆయన ఈ పడక్కుర్చీలో కూర్చుని ఉండగా ఉంగరం ఆయన వేలిని ఉంది. నాకు బాగా గుర్తుంది.”

“ఇల్లూ, బాత్రూములూ, పక్క బట్టలూ - అన్నీ వెతికారా?”

“ఆ! మా వంతు పనంతా అయ్యాకే మీకు కబురు పెట్టాము.”

“మరైతే పెద్దాయన ఏరీ?” అడిగాడు ఇనస్పెక్టర్.

“మా మామగారికి ఆరోగ్యం బాగాలేదు. గదిలో పడుకుని నిద్రపోతున్నారు” అంది రజని.

జరుగుతున్న డ్రామా దేనికోసమో తెలుసుకోలేక తికమక పడుతున్నవారిలో మీనాక్షీ జీవన్ లే కాదు స్రవంతి కూడా ఉంది. అందరిలోనూ రవి ఒక్కడే ఏ చీకూ, చింతా లేకుండా చదువుతున్న పుస్తకాన్ని అంటిపెట్టుకుని, కథలో లీనమైపోయి నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ ప్రదేశమంతా టెన్షన్తో నిoడిపోయి ఉంది.

ఇనస్పెక్టర్ రఘురాం వైపు చూసి అడిగాడు, “సర్! మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా? ఇక్కడున్న అందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వారేనా?”

జీవన్ వైపు ఒక చూపు విసిరి చెప్పసాగాడు రఘురాం, “రజని నా భార్య. జగన్నాధంగారు మా నాన్నగారు. ఈ అబ్బాయీ, అమ్మయీ మా పిల్లలు రవి, స్రవంతీను. ఇకపోతే, ఈమె మీనాక్షి - మా ఇంట్లో వంట చేస్తుoది. అతడు జీవన్ - ఈమెగారి కొడుకు. అనారోగ్యంగా ఉన్న మా నాన్నగారికి ఉపచారం చేస్తాడు. ఆ కారణంగా మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఇంతే, ఇంకెవరూ లేరు. దొరికేవరకూ ఎవరూ దొంగలు కారు. నా కెవరిమీదా అనుమానం లేదు.”

“అందర్నీ ఒకసారి సోదా చేస్తాం. కానిస్టేబుల్!” అన్నాడు ఇనస్పెక్టర్. వెంటనే ఒక పోలీసు ముందుకువచ్చాడు.

ముందుగా ఆ పోలీసు చివరలో నిలబడి ఉన్న జీవన్ ని ఎడంగా తీసుకెళ్ళి సోదా చెయ్యడం మొదలుపెట్టాడు. జేబులు వెతుకుతూండగా జీవన్ "బేక్ పోకెట్" లో దొరికింది తాతయ్య ఉంగరం. జీవన్ నిర్ఘాంతపోయాడు. మీనాక్షి త్రుళ్లిపడింది.

వెంటనే పెద్దాయన గదిలోకి పరుగుపెట్టిoది మీనాక్షి. జీవన్ అటువంటి పని చేశాడని మీనాక్షి నమ్మలేదు. జరిగిన ఘోరాన్ని పెద్దాయనకు తెలియజెప్పి, ఒక నిర్దోషిని కాపాడమని వేడుకోవాలనుకుoది. కానీ పెద్దాయన డాక్టరిచ్చిన ఇంజెక్షన్ మత్తులో పడి గాఢ నిద్రలో ఉన్నారు. తన కొడుకు దొంగని ఆమె నమ్మలేకపోతోoది. దీని వెనకాల ఏదో మతలబు ఉండి ఉంటుంది - అని ఆమె ప్రగాఢ విశ్వాసం. కాని పెద్దాయనని లేపడం ఎలాగో తెలియక అసహాయంగా దుఃఖిస్తూ గదిలో ఒక వారగా నిలబడింది మీనాక్షి.

స్రవంతికి అంతా అర్ధమయ్యింది. తన తల్లిదండ్రులు ఎందుకనో జీవన్ని ఒక క్రిమినల్గా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు - అని గ్రహించింది. “అన్యాయం – అన్యాయం” అని ఆక్రోశించింది ఆమె మనసు. తన తండ్రి ఆప్యాయత నటిస్తూ జీవన్ బేక్ పోకెట్ తడమడం ఆమె కళ్ళారా చూసింది. అలా తడుముతూ ఉంగరాన్ని పోకెట్లో పడెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. తన తండ్రి చేసిన పని ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. ఎలాగైనా నిర్దోషియైన జీవన్ ని రక్షిoచాలనుకుంది. ఆమె వెంటనే తాతయ్య గదిలోకి పరుగెత్తిoది.

తాతయ్య మంచం మీద కూర్చుని, ఆయన భుజం పట్టుకు కుదుపుతూ, “తాతయ్యా! లే తాతయ్యా! నీ రాజకుమారుడు అన్యాయంగా అరెస్టై జైలుకి పోబోతున్నాడు! తొందరగా లే తాతయ్యా” అని ఆయన చెవిలో చెపుతూ ఆయన్ని లేపాలని ప్రయత్నించింది. ఆమె కృషి తొందరగానే ఫలించింది. జగన్నాధంగారు కళ్ళు తెరిచారు. ఏం జరుగుతోందో తెలియక, కంగారుగా లేవబోయారుగాని, విపరీతమైన నీరసంవల్ల మళ్ళీ వెనక్కి వాలిపోయారు.

మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్న ఆయన్ని పదేపదే తట్టి లేపింది స్రవంతి. “లే తాతయ్యా! నువ్విప్పుడు లేవకపోతే మహా ఘోరం జరిగిపోతుంది. అన్యాయంగా జీవన్ ని పోలీసులు వచ్చి అరెస్టుచేసి తీసుకెళ్ళిపోతున్నారు. తొందరగా లే తాతయ్య!” అంటూ గగ్గోలుపడింది.

జీవను - అరెస్టు - అన్యాయం లాంటి మాటలు తలకెక్కడంతో పెద్దాయనకి నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోయింది. కాని నీరసంతో లేవలేకపోయారు. ఐనా మనుమరాలిని ఏం జరిగిందో చెప్పమని అడిగి, జరిగిందంతా తెలుసుకున్నారు. వెంటనే పోలీసు ఇనస్పెక్టర్ని తన దగ్గరకి తీసుకురమ్మని చెప్పి, పంపారు మనుమరాలిని.

ఎలా వచ్చిందో అలాగే సుడిగాలిలా పరుగెత్తిoది స్రవంతి. మరు క్షణంలో పోలీసు ఇనస్పెక్టర్ జగన్నాధంగారి మంచం పక్కన ఉన్నాడు. అతని వెనకే రఘురాం కూడా వచ్చాడు. గదిలో ఒక మూలగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తోంది మీనాక్షి ఇదంతా.

నీరసంతో ఒణకుతున్న కంఠంతో నెమ్మదిగా చెప్పసాగారు జగన్నాధంగారు. “ఇనస్పెక్టర్ గారూ! ఆ అబ్బాయి నిర్దోషి. తప్పంతా నాది. అతడు నా ప్రాణదాత! ఆ ఆబ్బాయికి ఆ ఉంగరం బహూకరిoచాలన్నది నా కోరిక. ఎప్పుడిచ్చినా అతడు తీసుకొనడం లేదు. అందుకని అతనికి తెలియకుండా ఆ ఉంగరం అతని పోకెట్లో వేశా. తరవాత నెమ్మదిగా అతనికి నచ్చచెప్పాలనుకుని మర్చిపోయా, పెద్దతనం కదా! నేను చేసిన దానికి అతనిని శిక్షించడం ధర్మం కాదు” అన్నారు ఆయన. ఆ తరవాత ఆయనకు దగ్గు రావడంతో మరి మాటాడకుoడా పడుకునిపోయారు.

తండ్రి మాటలు విన్న రఘురాం తన పధకం ఫలించనందుకు లోలోన బాధపడ్డాడు. తండ్రి నిద్రలో ఉండగా అంతా ముగిసిపోతుందనుకున్నాడుగాని అలా జరగలేదు, ఆయనకి అంతా తెలిసిపోయింది. అయినా ఆయన తెలివిగా మాటాడి తన కొడుకు పరువు, తనకుటుంబపు పరువు కాపాడారు. తండ్రి పోలీసులముందు తను చేసిన దుర్మార్గం బయటపెట్టనందుకు తను సంతోషించాలి. ఫరవాలేదు, తన పుణ్యం బాగుంది - అనుకున్న రఘురామ్ కి, ఇంతకీ ఆయన్ని ఎవరు లేపారు - అన్న ప్రశ్న వచ్చింది మనసులోకి. రఘురామ్ కి పెద్దాయన గదిలో మీనాక్షి కనిపించడంతో, తన ప్లాను భగ్నమవ్వడానికి కారణం మీనాక్షే అనుకుని ఆమెపై కోపం తెచ్చుకున్నాడు అతడు.

పెద్దాయన మాటలకు మీనాక్షి చాలా సంతోషించింది. “కుటుంబ గౌరవం బజారున పడకుండగా ఈ సమస్యను బాబాయ్ ఎంత బాగా పరిష్కరించారు! పెద్ద ఉద్యోగం చేసిన తెలివి ఎక్కడకి పోతుంది” అనుకుంది ఆత్మీయంగా.

మీనాక్షికి ఉన్న కోరిక, నిర్దోషియైన తన కొడుక్కి ఏ ఆపదా రాకూడదు - అన్నంతవరకే గాని, జగన్నాధంగారి కుటుంబానికి అవమానం జరగాలన్నది కాదు కదా! స్రవంతి చేసిన సాయానికి ఆమె మనసంతా ఆ పిల్లయడల కృతజ్ఞతతో నిండిపోయింది. “సంకల్ప సిద్దితో, సుఖ సంతోషాలతో కలకాలం సుఖంగా వర్ధిల్లు తల్లీ” అని స్రవంతిని మనసారా దీవించింది మీనాక్షిమనసులోనే.

జగన్నాధం గారి గదిలోనుండి బయటికి వచ్చిన పోలీస్ ఇనస్పెక్టర్ జీవన్ భుజం తట్టి సారీ చెప్పాడు. “పెద్దాయన ఈ ఉంగరం నీకు ఇవ్వాలనే నీ పోకెట్లో వేశారుట! పెద్దవాళ్ళు పిల్లలకు ఏమైనా ఇవ్వాలనుకుంటే వాటిని పిల్లలు వద్దంటే, వాళ్ళు ఎంతో బాధపడతారు. ఇదిగో, ఈ ఉంగరం నీదే” అంటూ ఆ ఉంగరాన్ని జీవన్ చెయ్యి పట్టుకుని, అతని అరిచేతిలో ఉంచాడు ఆ పోలీసాయన. ఆపైన రజనివైపుకు తిరిగి, “అమ్మా! నీ తొందరపాటు గుణం వల్ల జరగరాని ఘోరం ఒకటి జరిగిపోయి ఉండేది. సరిగా సమయానికి మీ మామగారికి మెలకువ రావడం మంచిదయ్యింది. మా పోలీసుల ఆదర్శ వాక్యం ఏమిటంటే, "వందమంది నేరస్తులు తప్పించుకున్నా ఫరవాలేదుగాని, ఒక్కడంటే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు" అని! అదృష్టవశాత్తు, కొంచెంలో ఒక ఘోరమైన తప్పిదం జరగకుండా ఆగిపోయింది. థాoక్ గాడ్!”

ఇంక ఏం చెయ్యడానికీ తోచక రజనీ, రఘురాంలు దిగులుగా మొహమొహాలు చూసుకున్నారు.

ఇనస్పెక్టర్ రజనితో అన్నాడు, “ఇంట్లోని మంచి చెడ్డలన్నీ థరోగా విచారిoచిన తరవాతే మమ్మల్ని రంగప్రవేశం చేయించడం బాగుంటుంది. అంతేగాని ఇలాంటి ఫాల్సు అలారంలతో అమూల్యమైన మా సమయాన్ని వృధా చెయ్యకూడదు. ఇది గుర్తుపెట్టుకొండమ్మా” అంటూ మెత్తగా చివాట్లు పెట్టాడు.

ఆ తరవాత ఇనస్పెక్టర్ వెళ్ళిపోయి జీపులో కూర్చున్నాడు. వెంటవచ్చిన పోలీసులు రఘురాం దగ్గరనుండి తమకు రావలసిన ఈనాం వసూలుచేసుకుని మరీ - వెళ్లి జీపెక్కారు. జీపు వచ్చినదారినే తిరిగి వెళ్ళిపోయింది.

రజనీ, రఘురాంలు మొహమొహాలు చూసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంతో ఆలోచించి పకడ్బందీగా వేసిన ప్లాను ఇల్లా ఎదురురావడం వాళ్లకు చాలా కోపం తెప్పించింది. జీవన్ కి “దొంగ” అన్న ముద్రపడితే పెద్దాయనకు ఆ అబ్బాయిమీది మోజు తగ్గుతుందనీ, ఆ తరవాత ఆయన విల్లు మార్చేయడానికి సంకోచించరనీ అనుకున్నారు. కాని, కథ అడ్డం తిరిగింది! పెద్దాయన దృష్టిలో వీళ్ళే అపరాధులుగా మిగిలిపోయారు.

ఒక ప్రయత్నం విఫలంమైనంత మాత్రంలో వాళ్ళు తమ ప్రయత్నాన్ని పూర్తిగా విరమిoచుకోవాలని అనుకోలేదు. సామ దాన భేద దండోపాయాల్లో మొదటిది, మూడోది ముసలాయనమీద విఫలమైనా ఇంకా రెండు మిగిలి ఉన్నాయి కదా! అవికూడా ప్రయోగిoచి చూడాలనుకున్నారు వాళ్ళు.

“నువ్వు విల్లు కాన్సిల్ చేస్తే మేము నిన్నూ మాతోపాటు తీసుకెడతాము“ అని చెప్పి చూద్దాము. అదీ కుదరకపోతే బెదిరిoచైనాసరే విల్లు కాన్సిల్ చేయిస్తాగాని వదలిపెట్టను. చూస్తూ చూస్తూ ఇంత మంచి ఇల్లు పరాయివాళ్ళ పాలు చెయ్యనిస్తాననుకోకు” అన్నాడు రఘురాం భార్యతో. వెంటనే భర్త ప్లానుకు ఆమోద ముద్ర వేసేసింది రజని.

“మీ తాతలనాటి ఆస్తి రవికి ఉంటుందనీ, ఈ ఇల్లు మన అమ్మాయికి పెళ్ళిలో పసుపుకుంకాలుగా రాసి ఇవ్వొచ్చనీ అనుకున్నాను. స్వంత మనుష్యులుండగా ఇంత విలువైన ఆస్తి పరాయివాళ్ళ పాలైపోతూంటే ఎవరైనా ఎలా చూస్తూ ఊరుకోగలము చెప్పండి! ముసలితనంలో కొందరికి మతి స్తిమితం ఉoడదంటారు. దానికి ఇంతకన్నా మంచి నిదర్శనం ఇంకేముందిట!” అంది రజని.

మీనాక్షి వచ్చి కొడుకుపక్కన నిలబడి లోగొంతుతో అంది, “నాన్నా! ఇదేమి ఉప్పలాయంరా! మనమిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పొచ్చు కదా... ఈ ఊరు వచ్చి పదిహేనేళ్ళయ్యింది. ఇంతవరకూ మనం ఎవరిచేతా ఒక్క మాటకూడా అనిపిoచుకో లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ, నడు వెళ్ళిపోదాం” అంటూ కొడుకుని తొందరచేసింది.

“వద్దమ్మా! నువ్వు తొందరపడవద్దు. మనం వచ్చింది వీళ్ళకోసం కాదు. తాతయ్యకు చాలా జబ్బుగా ఉoది. ఈ సమయంలో ఆయన్ని మనంతట మనం వదలి వెళ్ళడం మంచిది కాదు. తగ్గే వరకూ ఉండి, ఆయనతో చెప్పి వెళ్లిపోదాం.”

“నా మనసేమీ బాగోలేదురా. కొంచెం సేపు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రావచ్చులే, నడు” అంది మీనాక్షి.

“తాతయ్య ఇప్పుడే కదమ్మా కళ్ళు తెరిచారు. నువ్వాయనకు భోజనం పెట్టవా?” అడిగాడు జీవన్.

మీనాక్షి కంగారు పడింది. “అయ్యో! ఎంతపని జరిగింది! పొద్దున్ననుoడి ఆయన కాఫీ కూడా తాగలేదు. ఉండు ఆయనకి భోజనం పెట్టి వస్తా...” అంటూ, ఆమె వంటగదిలోకి వెళ్ళబోయింది.

రజని ఆమెకు అడ్డుపడింది. “ఆయన్ని ఆపాటి మేమూ చూసుకోగలం. కావాలంటే మీరు వెళ్ళొచ్చు. అంతా మీతోనే ఉందనుకోకండి” అంది పరుషంగా.

“సరేనమ్మా, వెళ్ళొస్తా” అంటూ వెనక్కు తిరిగింది మీనాక్షి.

“వెళ్ళoడి, కాని మళ్ళీ రావద్దు” అన్నాడు రఘురాం నిర్లక్ష్యంగా.

మరి మాటాడకుండా, చిన్నబోయిన మొహాలతో అక్కడనుండి వెళ్ళిపోయారు మీనాక్షీ జీవన్ లు. వెళ్ళిపోతున్న వాళ్ళవైపు బేలగా చూసింది స్రవంతి. తన తల్లిదండ్రుల ప్రవర్తన ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అప్పటికింకా మీనాక్షి భోజనం చెయ్యలేదన్నది కూడా గ్రహించి స్రవంతి బాధపడింది గాని, తల్లితండ్రులను ఏమీ అనలేక అక్కడనుండి వెళ్ళిపోయింది.

****సశేషం****

Posted in January 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!