Menu Close
తెలుగు పద్య రత్నాలు 31
-- ఆర్. శర్మ దంతుర్తి --

కొత్త సంవత్సరంలో కొత్త పద్య రత్నాలలో భాగంగా ఈ నెల మొదటి పద్యం పూతన ఖండకావ్యం లోనిది. రచయిత శ్రీ తాడిగడప శ్యామలరావు గారు. శోధిని లేదా మాలిక అనే బ్లాగుల సంకలనంలో రాముడు అనే పదం లేదా రాముడి మీద పద్యాలు, పాటలు ఏవైనా మీకు కనిపించాయంటే అవి ముప్పాతిక మూడొంతులు శ్యామలరావుగారు రాసినవే అయి ఉంటాయి. ఈయన బ్లాగులో ఇప్పటి వరకూ దాదాపు వేయి, ఆపైన పద్యాలు, గీతాలూ రాసి ఉండొచ్చు. ఈ నెల పద్యం లో సందర్భం చూద్దాం ముందు.

పూతన కంసుడి దగ్గిర పనిచేసే రాక్షసి. రాక్షసి అంటే పెద్ద కోరలూ, వికారమైన రూపం ఉంటాయని ఊహించుకోనవసరం లేదు. వాళ్ళు మామూలు గా ఉన్నా మనసులో ఉన్న ఆలోచనలని బట్టి రాక్షసులవ్వచ్చు. ఈ రోజుల్లో కంప్యూటర్లు, అంతర్జాలం, రాజకీయాలూ వాడుతూ జనాలని చంపే రాక్షసుల మాదిరిగానే. ఎప్పుడైతే దేవకికి అష్టమ గర్భంలో ఆడపిల్లగా పుట్టినట్టు కనిపించిన యోగమాయని నిజంగా పుట్టినదే అనుకుని కంసుడు చంపబోయాడో అప్పుడు ఆ పిల్ల ఆకాశంలోకి ఎగిరి ‘నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టి సురక్షితంగా ఉన్నాడు’ అని చెప్పేసరికి కంసుడు అప్పుడే పుట్టిన పిల్లలందర్నీ చంపని ఆజ్ఞలు జారీ చేసాడు. ఈ పిల్లల్ని చంపడంలో భాగంగా పూతనని పిల్చి చెప్పాడు – ఇలా నందవ్రజంలో పుట్టిన పిల్లాణ్ణి చంపేసి రా అని. కానీ పూతన అప్పటికే ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అటువంటి పూతనని కంసుడు ఆజ్ఞాపించేసరికి తనలో తాను తర్కించుకునే చోట రాసిన అద్భుతమైన చంపకమాల ఈ నెల పద్యం.

చం.
సరిసరి నందబాలకుని జంపగ బోవగ దప్పనట్టిదౌ
నరయగ శౌరిగాని యెడ నాతడు చచ్చును నా కరమ్ములన్
హరియగు నేని వాడు నను నక్కట చంపక మానుటుండునే
పురమును జొచ్చి రేపకడ భూవరునిం కడతేర్చకుండునే

మొదట్లో తాను నందవ్రజానికి వెళ్లకూడదనుకుంది పూతన రెండు కారణాలవల్ల – ఒకటి తనకే ప్రసవం అయ్యేటట్టు ఉంది కంసుడు ఆజ్ఞ వేసేసరికి. రెండోది తానే ప్రసవిస్తే తల్లి మనసు ఎలా ఉంటుందో తెలుసు కనక అక్కడ పుట్టిన పిల్లవాణ్ణి, వాడు వేరే ఆవిడకి పుట్టినా, చంపడానికి తనకి చేతులెలా వస్తాయి? కంసుడికి ఇవన్నీ పట్టలేదు; “నువ్వు చెప్పే పిచ్చి కారణాలన్నీ నేను వినను. ఇంతకు ముందు ఏ పని చెప్పినా నోరెత్తకుండా చేసినదానివి ఇప్పుడేమైంది? శషబిషలు అన్నీ కట్టిపెట్టి చెప్పిన పని చేసిరా” అని ఆజ్ఞాపించాడు. అందువల్ల ఇంక ఈ పని తప్పదు లేకపోతే కంసుడు తననే చంపుతాడు ముందు – వాడు అసలే ప్రాణభయంతో ఛస్తున్నాడు ఎప్పట్నుంచో, అదీ హరినామం చేస్తూ. సరే, ఇంక పూతనకి వెళ్ళడానికి తప్పదు (సరిసరి నందబాలకుని జంపగ బోవగ దప్పనట్టిదౌ), నేను చంపబోయే శిశువు పరాక్రమవంతుడు కాకపోతే (నరయగ శౌరిగాని యెడ) నా చేతుల్లో చస్తాడు (నాతడు చచ్చును నా కరమ్ములన్). కానీ అందరూ అనుకుంటున్నట్టూ ఆ పిల్లాడు కాని శ్రీహరి అయితే (హరియగు నేని వాడు), నన్ను చంపకుండా వదలడు కదా? (నను నక్కట చంపక మానుటుండునే). ఆ తర్వాత (రేపకడ) ఈ నగరంలోకి వచ్చి (పురమును జొచ్చి) రాజైన కంసుణ్ణి చంపి తీరతాడు కూడా(భూవరునిం కడతేర్చకుండునే). అలా అనుకుని పూతన బయల్దేరింది.

పూతన సంగతి చూద్దాం. బలి చక్రవర్తి కూతురు పేరు రత్నావళి. వామనుడైన శ్రీహరికి తన తండ్రి మూడడుగుల నేల – నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన… అంటూ మన:స్ఫూర్తిగా దానం చేసినప్పుడూ, ఆ తర్వాత శ్రీహరి ‘ఇంతింతై వటుడింతయై మరియుదానింతై..’ లాగా త్రివిక్రముడైనప్పుడూ తండ్రి పక్కనే ఉండి చూసింది ఈ తతంగం అంతా. ఆ కుర్రాడి మొహంలో వర్ఛస్సుకి సంతోషపడి కంటే నీలాంటి పిల్లవాణ్ణి కని సాకి పాలివ్వాలి అనుకుందిట రత్నావళి. సరే వచ్చే జన్మలలో ఆ కోరిక తీరుతుంది అని వరం ఇచ్చాడు భగవంతుడు. అలా పూతన కంసుడి రాజ్యంలో పుట్టి తయారుగా ఉంది కృష్ణుడు పుట్టేసరికి. బయల్దేరే సమయానికి అప్పుడే ప్రసవం అయిన బాలింతరాలుగా. సమయం, సందర్భం కలిసి వచ్చేటట్టు అన్నీ రత్నావళికి భగవంతుడు ఎలా అమర్చాడో గమనించారా? అలాగే ఆవిడ కుర్రాణ్ణి చూసి పాలివ్వడానికి లోపలకి వెళ్ళింది. మొదట్లో యశోదా, మిగతా గోపికలూ కొంచెం సందేహించినా కృష్ణుణ్ణి ఎలా అనుమతించారు వేరే ఆవిడ ఎవరో పాలిస్తానంటే? అదీ భగంతుడు అమర్చిన పద్ధతి. వద్దనడానికి ఎవరికీ కుదరదు. దీన్నే మనవాళ్ళు ఏది ఎలా రాసిపెట్టినట్టు జరగాలో అలా జరిగి తీరుతుంది అంటారు. ఇలా వెళ్ళిన పూతనకి ఏమైంది?

పూతన ఇచ్చిన పాలతో సహా ఆవిడ ప్రాణాలని కూడా పీల్చేసాడు కృష్ణుడు. ఆ తర్వాత ఆవిడ శరీరాన్ని దగ్ధం చేస్తుంటే అందులోంచి సువాసన వచ్చిందిట. అదేమిటి ఏ శరీరమైనా – అందులోనూ రాక్షస శరీరం - కాలుస్తుంటే చెడువాసన రావాలి కదా అంటే సమాధానం ఏమిటంటే కృష్ణుడు ఆవిడ శరీరంలో ఉండే ప్రాణాలతో బాటు అనేక జన్మలనుంచీ కూడుకున్న అన్ని రకాల మంచి, చెడు వాసనలు (అంటే కర్మలు, వగైరా) అన్నీ పీల్చేసాడు. అవి పోగానే సుగంధం వాసన వచ్చింది. దానితో ఆవిడకి జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తి కలిగింది. అందుకే భగవంతుడు ఎటువంటివాడు అంటే పరసువేది లాంటివాడు. దానికి ఏమి తాకించినా బంగారంగా మారుతుంది. ఎటువంటివారికైనా సరే ఆయన దృష్టి పడితే ముక్తి కలిగితీరవల్సిందే. ‘రా-మ’ అనలేక ‘మ-రా’ అంటూ సిద్ధిపొంది రామాయణం రాసిన వాల్మీకే దీనికి అది పెద్ద ఉదాహరణ.  ఈ విషయం మీద ఘంటాకర్ణుడి కధ కూడా ముందుముందు పద్యాలలో చూద్దాం.

అతి సులభంగా అర్ధమయ్యే ద్రాక్షాపాకంలో రాసిన శ్యామలరావుగారి పూతన ఖండకావ్యం ఇక్కడ చూడవచ్చు.

****సశేషం****

Posted in January 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!