Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుని రచనలలోని కొన్ని విశేషాలు

మహాకవుల దృష్టి వివిధ మార్గాల వైపు ప్రసరిస్తుంది. తాము కనిన, వినిన దానిని అక్షర సూత్రంతో కవితా పుష్ప హారాన్ని కూర్చగల నేర్పు వారికి భగవంతుడిచ్చే గొప్ప వరం.

శ్రీనాథ మహాకవి వివిధ భాషా విశారదుడు. తెలుగు, సంస్కృతం రెంటిని సగౌరవంగా పూజించి ఆ భాషలను తన రచనలలో చక్కగా పోషించిన మహాకవి. శ్రీనాథుడు తన కాలంనాటి సాంఘీక, సమాజ, సంప్రదాయ రాజకీయాది ఎన్నో విషయాలను తన గ్రంథాలలో దాచిపెట్టి మనకు అందించాడు. వాటిలో ఆరుద్ర చెప్పిన వాటిలో నుండి స్థాలీ పులాక న్యాయంగా ఒకటి రెండు విషయాలను ప్రస్తావిస్తాను.

ఆచమనం: ఇది శూద్రులు చేయరాదు అని ఇప్పటికీ వాడుకలో ఉంది. కానీ శ్రీనాథుడు కాశీఖండం లో (3-159-162 దాకా) 4 పద్యాలలో  - శూద్రులు 24 కేశవ నామాలు, అష్టోత్తర శత హరిహర నామాలు కూడా చెప్పి ఆచమనం (పూజ, వివాహాది కార్యాలలో ముందు ఆచరించే కార్యక్రమం) చేసేవారని శ్రీనాథుడు తెల్పాడని ఆరుద్ర వ్రాశారు. (స.ఆం.సా. పుట 738).

శ్రీనాథుడు దేవతలతో పాటు క్షుద్ర దేవతలను గూడా సగౌరవంగా స్తుతించాడు. ‘కాకతమ్మకు సైదోడ ఏకవీర’ (క్రీడా 128) అని, ‘చర్మముండకు చెలికత్తె శైలదమన’ అని కాశీఖండం లో చెప్పాడని ఆరుద్ర తెలిపాడు. అలాగే ద్రాక్షారామం లో 4 దిక్కులా ఉన్న గ్రామ దేవతలైన నూకాలమ్మ, గోగులమ్మ, మండవల్లి, ఘట్టాంభిక చేత భూతకోటితో వసంతాలాడించాడు శ్రీనాథుడని ఆరుద్ర తెల్పారు. ఇది జాతరలో నాడు భీమదేవుని వసంతోత్సవ సందర్భంలో వల్లించడం విశేషం.

సంగీత నృత్యాలలో దేశీ, మార్గ రెంటికీ సమాన గౌరవమిచ్చి తెల్పాడు. దేశీ నృత్యంలో ఒక భాగం మొగ్గవేసి (వెనక్కు వంగి నేలకు తల ఆన్చి అక్కడ ఉన్న పూసలను నాలుకతో గుచ్చడం (దండగా) చేసే దొమ్మరి పిల్లను శ్రీనాథుడు మెచ్చుకొన్నాడు.

ఛందస్సు లో కూడా వివిధ రకాలు 30 వరకు వాడాడు. సీసం శ్రీనాథుని ప్రత్యక ముద్ర. అనంతర కవులు అనుసరించారని, శ్రీనాథుడు వాడినన్ని అలంకారాలు మరే కవి వాడలేదని, శ్రీనాథుని మొత్తం గద్య పద్యాలు 1584 అని ఆరుద్ర లెక్కగట్టి తెల్పారు.

బీభత్స విషయాలు కూడా శ్రీనాథుడు గ్రంథస్తం చేశాడు. ‘చంపుడు గుళ్ళు’ అనేవి ఉండేవని వాటిలో శైవులు భీకరంగా నృత్యాలు చేసేవారని “రవరవ మండు నెర్రని చండ్ర మల్లెల చోద్యంబు...” అన్న పద్యంలో తెల్పాడు. ఈ విధంగా ఆరుద్ర శ్రీనాథుని రచనలలో ఆనాటి వివిధ సాంఘీకాచారాలను గూర్చి ఇతర విషయాలను గూర్చి వివరించి శ్రీనాథుని రచనలను పరిశోధిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయని తెల్పారు.

శ్రీనాథుని చివరిదశ

తన చివరిదశ లో గూడా మహాకవి శ్రీనాథుడు తన కన్నీటి గాథను కవిత్వరూపంలో పఠితల హృదయాలు కన్నీరై కురిసేటట్లు ఈ క్రింది పద్యం వ్రాయడం ఆయన కవితా ప్రతిభను ప్రతిఫలింప జేస్తున్నది.

“కవిరాజు కఠంబు కౌగలించెను కదా 
        పురవీధి నెదురెండు బొగడ దండ
ఆంధ్రనైషధ కర్త యంఘ్రియుగ్మంబున
        పగిలియుండెనుకదా నిగళయుగము 
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత 
        వియ్యమొందెనుకదా వెదురుగొడియ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెనుగదా 
        నగరివాకిట నుండు నల్లగుండు 
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము 
బిలబిలాక్షులు దినిపోయే దిలలుపెసలు 
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి 
నెట్లు చెల్లింతు డంకంబు లేడునూర్లు?” (శృ.శ్రీ.పుట 296)

శ్రీనాథుని చరమ దశ చాలా దయనీయమైనది. ఆదరించిన రాజులు అంతరించారు. తెలుగు గడ్డను పాలించిన మూడు ముఖ్యమైన రాజ్యవంశాల రాజులను మెప్పించి రాజభోగాలు అనుభవించిన శ్రీనాథుడి పేరులోని ‘శ్రీ’ విధి వశాన తొలగిపోయింది. రాజ్యాధినాథులు మారి కనీస భోజనం కూడా చిక్కక అనాథుడైన శ్రీనాథుడు చివరకు కవివర్యుడు కృషీవలుడుగా మారడం విధి నిర్ణయం.

శ్రీనాథుడు తన చివరి దశలో భూమీశులను గాక భూమిని నమ్ముకొని పోతన వలె బతకాలని నిర్ణయించుకొని కృష్ణ ఒడ్డున గల బొడ్డుపల్లి అనే గ్రామంలో కొంత భూమిని గుత్తకు తీసుకొని సేద్యం చేస్తే ఆ పంటంతా కృష్ణ వరదలకు కొట్టుకుపోయింది. తదుపరి మళ్ళీ పెసలు నువ్వులు వేస్తే వాటిని బిలబిలాక్షులు వాలి తినిపోయాయి. శ్రీనాథునికి పంట పోయింది. కానీ శిస్తు మాత్రం కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆనాడు రైతులు శిస్తు కట్టకపోతే కఠినాతి కఠినమైన శిక్షలు ఉండేవి. ఆ శిక్ష నే శ్రీనాథుడు పద్యరూపంలో వివరించాడు.

సేద్యానికి ప్రతిఫలంగా శ్రీనాథుడు కాళ్ళకు సంకెళ్ళు. మెడలో గుచ్చుకొనే ఇనుప దండ, భుజాలమీద నల్లని ఇనుప గుండ మొదలైన వాటితో ఎర్రని ఎండలో నడిచే దౌర్భాగ్యం మిగిలింది. అటువంటి పరిస్థితి నుండి ఎవరు రక్షించారో ఏమో శ్రీనాథుడు,
“దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథుడు డమరపురికి”
అని ఆంధ్రుల గుండెలు తల్లడిల్లిపోగా కన్నుమూశాడు. కలం విడిచాడు. ఆ మహాకవి, బహుభాషా కోవిదుడు, ఆశుకవితాగ్రణి. శ్రీనాథుని ఋణం తీర్చుకోవాలంటే ఆయన వ్రాసిన రచనలు కొన్నైనా చదవడం మన కర్తవ్యం.

****

నిశ్శంక కొమ్మన

రాజమండ్రిని పాలించిన రెడ్డిరాజు వీరభద్రారెడ్డి తమ్ముడు దొడ్డారెడ్డి. దొడ్డారెడ్డికి నిశ్శంక కొమ్మన శివలీలా విలాసము రచించి అంకితమిచ్చాడు.

నిశ్శంక కొమ్మన వంశాన్ని గూర్చి శివలీలా విలాసం కన్నా శాసనాల వల్ల కొంత బాగా తెలుస్తున్నది. వాటిలోని వివరాలు.

పోలవరంలో మహానందీశ్వరాలయం ఉంది. నిశ్శంక కొమ్మన దీనికి స్థానాపతి. ఈ విషయం చెప్పిన శాసన కాలం క్రీ.శ. 1408. ఈ శాసనం నిశ్శంక కొమ్మన బహుశా అన్నదేవుని పోషణలో ఉండవచ్చని గూడా ఊహించడానికి ఆస్కారమిస్తున్నది.

అల్లాడరెడ్డి కి మూడవ కుమారుడు దొడ్డారెడ్డి. ఈ విషయం శివలీలా విలాసంలోని “స్తుతిసేయందగు నల్లాడేంద్ర తనయున్ దొడ్డక్షమాపాలకున్” అన్న పద్యం తెల్పుతున్నదని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పుట 758). తండ్రి తదనంతరం దొడ్డారెడ్డి నిశ్శంక కొమ్మన ను తన కొలువులో కవిగా స్థానమిచ్చి ఉంటాడనుకోవచ్చని ఆరుద్ర మాట.

**** సశేషం ****

Posted in January 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!