Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. మానవుడై జన్మించినా, ప్రజకు దైవమె రాముడు,
    ఉడుత సేవ అల్పమైనా, అమిత కరుణ చూపాడు.
  2. మొక్కల యొక్క నిశ్వాసే, మనిషికిస్తోంది శ్వాస,
    శ్వాస ఉన్నంతవరకునూ, మనిషికి చావదు ఆశ!
  3. ఋతువుల పరుగు పందెములో, వేసంగిదేను గెలుపు,
    బ్రతుకు పోరు గెలువదలచిన, దరి రానీయకు అలుపు!
  4. భానుని లేత కిరణములే, జీవము భువి ప్రాణులకు,
    దేవుని దివ్య చరణములే, శరణము భక్త జనులకు!!
  5. కళలకు శ్వాస అందువరకు, బ్రతుకును కళాకారుడు!
    మానవత్వం బ్రతుకువరకు, ధర కాచు లయకారుడు!!
  6. పాపలు చిగురించు మొగ్గలు, విరియకుండా త్రుంచకు,
    అసలు నిజమును తెలుసుకొనక, నిందలెపుడూ వేయకు.
  7. నిరుపయోగమగు వస్తువే, లేనేలేదీ భువిని!
    చెత్తా చెదారమైననూ, కూర్చ గలదులే సిరిని!
  8. అహము వీడనట్టి వాడే, ఎక్కలేడు అందలము!
    పిసినిగొట్టు పరులకెపుడూ, పనికిరాడు అంగుళము!!
  9. సిరుల వెనుక పరుగుపెడితే, భవిష్యత్తే శూన్యము!
    ఆత్మవిశ్వాసము తరిగిన, ముందు సాగదు కార్యము!!
  10. కార్య సాధకుడు యెప్పుడూ, వట్టి మాటలు పలుకడు,
    ధైర్యవంతుడు యెన్నటికీ, వెనుకకు అడుగు వేయడు.

**** సశేషం ****

Posted in January 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!