Menu Close
శ్రీ నీలం సంజీవరెడ్డి
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

అవతరణి – రచయిత మనో నేత్రం

Gowrabathina-KumarBabuనేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.

నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.

నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.

ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.

అచ్చుకు నోచుకున్న తొలి కవిత "విడివడని బాధ్యత" విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ "వై" సిరిమల్లెలో, తొలి విమర్శ "పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి" ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం "మునసబు నుండి రాష్ట్రపతి దాకా..." ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు

ముందుమాట

శ్రీ నీలం సంజీవరెడ్డి గారు భారతదేశ రాష్ట్రపతిగా, లోక్ సభ  స్పీకర్ గా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా జాతికి విశేష సేవలందించారు. వారి జీవిత చరిత్రను తెలియజేసే పొత్తాలు బహుశా తెలుగులో లేవు. భావి తరాలకు సంజీవరెడ్డి గారి లాంటి గట్టి నాయకుడి గురించి తెలియజెప్పడం ఎంతో అవసరం. సంజీవరెడ్డి గారి రాజకీయ జీవితం వర్ధమాన రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి వంటిది. సంజీవరెడ్డి గారి జీవిత చరిత్ర చదవడమంటే 1940 నుండి 1982 వరకు ఆంధ్రదేశంలో, భారతదేశంలో జరిగిన అనేక ముఖ్య సంఘటనల గురించి కూడా తెలుసుకోవడమవుతుంది. అనేక చోట్ల నుండి సమాచారం సేకరించి, క్రోడీకరించి మరియు విశ్లేషించి సంజీవరెడ్డి గారి జీవిత చరిత్ర రాయడానికి ప్రయత్నించాను. సంజీవరెడ్డి గారి సమకాలీకులైన పాత్రికేయులెవరైనా ఈ పని చేసుంటే మరింత ఉపయుక్తంగా ఉండేది. వాస్తవానికి ఈ పని చేయడానికి నాకు అర్హత ఉందో లేదో తెలియదు. కానీ, చరిత్ర విద్యార్ధిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమైన ముఖ్య విషయాలు మరుగున పడకూడదనే ఉద్దేశంతో ఈ పనికి సంకల్పించాను. నా ప్రయత్నంలో సఫలమయ్యానో లేదో అనే విషయాన్ని పాఠకలోకానికే వదిలేస్తున్నాను.

జననం:-

సంజీవరెడ్డి గారు మే 19, 1913 న అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నప్పరెడ్డి, చిన్నసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. వారి పూర్వీకులు ఇల్లూరి గ్రామ మునసబులు. నీలం సంజీవ రెడ్డి గారి తమ్ముడి పేరు నీలం రాజశేఖర్ రెడ్డి. వీరు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు. సంజీవ రెడ్డి గారి మేనమామ తరిమెల సుబ్బారెడ్డి తరిమెల గ్రామ మునసబు. ఈయనే ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు తరిమెల నాగిరెడ్డి గారి తండ్రి.

సంజీవరెడ్డి గారి తండ్రి గారు తన బిడ్డలకు మంచి చదువులు అందివ్వాలనే తపనతో సంజీవరెడ్డి గారిని మద్రాస్, అడయార్ లోని థియోసోఫికల్ స్కూల్ లో చేర్పించారు. థియోసోఫికల్ స్కూల్లోని వాతావరణం సంజీవరెడ్డి గారిని ఆధ్యాత్మిక భావాల వైపు మళ్ళించింది. తరువాత పై చదువులకై అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చేరారు.

సంజీవరెడ్డి గారు అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదువరిగా ఉండగానే అప్పుడు దేశంలో జరుగుతున్న శాసనోల్లంఘన ఉద్యమంలోకి  ప్రవేశించారు. కళాశాల చదువు మధ్యలోనే వదలి వేసినందుకు సంజీవరెడ్డి గారు ఎప్పుడూ బాధపడలేదు. “నేను కళాశాల పట్టభద్రుడిని కాదు, కానీ నేను జీవితం లో పట్టభద్రుడిని” అని చెప్పేవారు.

శ్రీ నీలం సంజీవరెడ్డి

చిన్నతనంలోనే సంజీవ రెడ్డి గారి పైన రాజకీయాల ప్రభావం :-

1921 లో తాడిపత్రిలో మహాత్మా గాంధీ నిర్వహించిన సభకు సంజీవరెడ్డి గారు తన తండ్రి, మేనమామ లతో కలసి వెళ్ళారు. నీలం చిన్నప్పరెడ్డి, తరిమెల సుబ్బారెడ్డి గార్లు గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యి సింగనమల ఫిర్కా కేంద్రాన్ని స్థాపించారు. ఈ విషయం లో వారికి పప్పూరి రామాచార్యులు గారు దిశానిర్ధేశం చేశారు. రామాచార్యులు గారే సంజీవ రెడ్డి గారికి తొలి రాజకీయ గురువు. చిన్నప్ప రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఇతర గ్రామాల మునసబుల సహకారంతో జిల్లా మొత్తంగా గాంధేయ సిద్ధాంతాల ప్రచారం చేశారు. ‘దేవర్ల ఉద్యమం’ నీలం, తరిమెల కుటుంబాలకు ఆ ప్రాంతంలో మరింత గుర్తింపు తీసుకు వచ్చింది. గ్రామదేవతలకు మూగజీవలను బలిచ్చే సంప్రదాయాలకు వ్యతిరేకంగా వీరు పోరాడారు. తరువాత పెన్నా నది పరీవాహక ప్రాంత రైతులపై ఆంగ్లేయ ప్రభుత్వం విధిస్తున్న రెండు పన్నుల విధానంపై కూడా వీరు స్థానిక రైతుల మద్ధతుతో పోరాడారు. ఇతర గ్రామాల మునసబులతో ఉండిన మంచి సంబంధాల వలన వీరు ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించగలిగారు. సంజీవ రెడ్డి గారి పైన వారి తండ్రి, మేనమామల ప్రభావం బాగా పడింది.

శాసనోల్లంఘన ఉద్యమ సమయంలోనే సంజీవ రెడ్డి తండ్రి చిన్నప్పరెడ్డి గారు మరణించారు. దాంతో కుటుంబ బాధ్యతంతా సంజీవరెడ్డి గారి భుజాలపై పడింది. కుటుంబ వ్యవసాయాన్ని, ఇల్లూరు గ్రామ మునసబు బాధ్యతలనూ సంజీవరెడ్డి గారు స్వీకరించారు. సంజీవరెడ్డి గారి మేనమామ సుబ్బారెడ్డి గారు తన కొడుకు నాగిరెడ్డి యొక్క వామపక్ష భావజాలం అంటే సరిపడక రాజకీయంగా సంజీవ రెడ్డి గారినే ప్రోత్సహించారు. సుబ్బారెడ్డి గారి కుమార్తె నాగరత్నమ్మ ను సంజీవరెడ్డి గారు జూన్ 8,1935 న వివాహం చేసుకున్నారు.

సంజీవ రెడ్డి గారి రాజకీయ జీవితం తొలిదశలో సింగనమలలో రైతు సంఘం, అనంతపురం జిల్లా యువజన సంఘం స్థాపించారు. రాయలసీమ గ్రామాలలో ఈ యువజన సంఘం జాతీయోద్యమం గురించి ప్రచారం చేసేది. యువజన సంఘం ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక అంశాలకు సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహించేది.

రాయలసీమలో పెరుగుతున్న జస్టిస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యాన్ని అరికట్టడానికి అప్పటి కాంగ్రెస్ నాయకుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రాయలసీమ ప్రాంతంలో పర్యటించేటప్పుడు రాజకీయ కుటుంబానికి చెందిన ఒక యువనేత కోసం అన్వేషించారు. అప్పుడు ఆయన దృష్టి సంజీవ రెడ్డి గారి పైన పడింది. పట్టాభి రాయలసీమలో పాల్గొన్న అనేక సభలను సంజీవరెడ్డి గారు దగ్గరుండి విజయవంతం చేశారు. ఆ విధంగా సంజీవరెడ్డి గారు పట్టాభి గారికి అనుచరుడిగా మారారు.

జనవరి,1938లో ఆంధ్ర పి.సి.సి అధ్యక్ష పదవికి ఎన్నికలు విజయవాడ లో జరిగాయి. డా.పట్టాభి సీతారామయ్య గారు, ఆచార్య ఎన్.జి.రంగా గారు పోటీపడ్డారు. రంగా గారికి 84 ఓట్లు రాగా, పట్టాభి గారికి 143 ఓట్లు వచ్చాయి. పట్టాభి, గొట్టిపాటి బ్రహ్మయ్య గార్లు సంజీవరెడ్డి గారిని పి.సి.సి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయించారు. 1940లో ప్రకాశం పంతులు గారు ఆంధ్ర పి.సి.సి అధ్యక్షుడు అయినప్పుడు, కళా వెంకటరావు గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సంజీవరెడ్డి గారిని, మంతెన వెంకటరాజు గారిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.

ఇక్కడ గమనించవలిసిన ఒక విషయం ఏమిటంటే అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ లోని రెండు వర్గములలో ప్రకాశం గారి వర్గం లెఫ్టిస్టులు కాగా, పట్టాభి గారి వర్గం రైటిస్టులు. సంజీవరెడ్డి గారు పట్టాభి వర్గం వహించారు. కాంగ్రెస్ లో మాదిరిగానే సంజీవరెడ్డి గారి కుటుంబంలో కూడా లెఫ్ట్, రైట్ వర్గాలున్నాయి. సంజీవ రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి, బావ మరిది తరిమెల నాగిరెడ్డి లెఫ్టిస్టులు కాగా, సంజీవ రెడ్డి గారు రైటిస్టు.

Posted in January 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!