Menu Close
తెలుగు భాష భవితవ్యం 1
- మధు బుడమగుంట

మన తెలుగు భాష ఉనికిని ప్రశ్నించే అంశాలతో కూడిన వార్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అన్నీ వార్తాపత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వస్తున్నాయి. తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి అని చాలా మంది భాషా ప్రేమికులు మరియు సాహిత్య శిరోమణులు, తెలుగు భాషావేత్తలు అందరూ కించిత్ వ్యధను వ్యక్తం చేస్తుండడం జరుగుతున్నది. వారు అంటున్న మాటలలో వాస్తవం కొంత లేకపోలేదు. ముఖ్యంగా మన తెలుగు నేలలో ప్రాధమిక పాఠశాలల్లో వచ్చిన మార్పులు మరియు కొన్ని ప్రభుత్వ విధానాలు ఆ సంశయానికి మరింత ఆజ్యం పోసింది. కాకుంటే అదే విధమైన నిరాశా ధోరణిలో పదే పదే  మాట్లాడుతూ కాలం వెళ్ళబుచ్చడం కన్నా అందరం కలిసి ఏదైనా కార్యాచరణ అమలుచేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆ దిశగా ఎటువంటి ఆర్భాటాలు, హాహాకారాలు లేకుండా తమ వంతు కృషిని చేస్తూ భాషా పరిరక్షణ చేస్తున్న ఎంతోమంది ఉన్నారు. వారిలాగే మనం కూడా మనం చేయవలసిన విద్యుక్తధర్మాన్ని క్రమం తప్పక పాటిస్తూ మన మాతృభాష మాధుర్యాన్ని భావి తరాలకు అందించడం చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ కొంచెం భాష ఉనికిని చాటిచెప్పే రీతిలో కాకుండా, ‘మేము కష్టపడుతున్నాము, మా ఆవేదనను అర్థం చేసుకొని మాతో కలిసి నడుస్తూ మన భాషాభివృద్ధికి చేయూతనివ్వండి’ అని అర్ధించినట్లు ఉన్నది. భాష అనేది సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషికి చెందిన సంపద. దానిని పరిరక్షించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిదే అవుతుంది. అటువంటప్పుడు అర్ధించి ఏదో మనకోసం పనిచేయమని చెప్పవలసిన అవసరంలేదు. కేవలం బాష యొక్క గొప్పదనం, తద్వారా సంఘంలో లభించే గౌరవం గురించి అవగాహన కల్పించడం చేయాలి.

నా ఆలోచనలలో కలిగిన కొన్ని సూచనలను ఇక్కడ ప్రస్తావించి ఆ దిశగా నేను చేస్తున్న సాహిత్యసేవను కూడా ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఏమైపోతుందో అనే భయంతో ఉన్న మనందరిలో కొంచెం నమ్మకాన్ని కలిగించి ‘మన సాహిత్యం మన చేతిలోనే...’ అన్న రీతిలో సాహిత్యప్రియులైన మనందరిలో ఈ ఒక చిన్న భరోసాను కలిగించాలనే ఆత్మస్థైర్యంతో ఈ చిన్ని వ్యాసాన్ని వ్రాస్తున్నాను.

ప్రతి నిత్యం, సత్ సంకల్పంతో మనం కృషి చేస్తే అందులో నేర్పరి అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా మన మాతృభాష మన నరాలలో మొదటినుండే ఉంది. దానిని బయటకు తీసి మన తెలుగు యొక్క ఉనికిని గుర్తించడమే మనందరం చేయవలసింది.

ముందు తరం, నాటి తరం, నేటి తరానికి మధ్య ఉన్న భాషాపరమైన వ్యత్యాసం:

ముందు తరానికి జీవితం సాఫీగా సాగడానికి అవసరమైన వనరులను సమకూర్చుకునే విధానంలోనే అన్ని విషయాలను నేర్చుకునే విధంగా చేసింది. అందుకు సామాజంలో సభ్యతగా మసులుకొనేందుకు కావలిసిన భాషా పరిజ్ఞానం మరియు సంప్రదాయబద్ధ జీవితం గడపడానికి సరైన వాక్చాతుర్యం తదితర అంశాలు భాషను నేర్చుకునేందుకు దోహదపడ్డాయి. జీవిత పాఠాలలోనే తెలుగు భాష మీద పాండిత్యం సంపాదించి అందరూ తెలుగు భాషను మాతృభాషగా మలిచారు. అందుకు పాండిత్య పటిమ కలిగిన గురువులు ఎంతగానో ప్రోత్సహించి సరైన దిశను చూపారు.

నాటి (మన) తరంలో జీవనం సరిగా సాగడానికి కావలిసిన వనరులు సమకూరి పెద్దవారి సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. భాషాపటిమ కలిగిన గురువులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. కనుకనే అనుభవంతో కూడిన సమయస్ఫూర్తి పొంది తద్వారా సమస్యా పూరణ సామర్ధ్యం ఏర్పడింది. మాతృభాష మీద కొంచెం పట్టు కూడా వచ్చింది. అయితే మన తరంలోనే ఆంగ్ల భాషా ప్రభావం మెండుగా చూపడం మొదలుపెట్టింది. అయితే సమతుల్యంతో రెండు భాషలనూ గౌరవిస్తూ జీవితంలో తెలుగును, వృత్తి పరంగా ఆంగ్ల భాషనూ వాడుకోవడం మొదలుపెట్టడం జరిగింది.

నేటి తరంలో పిల్లలకు తెలివితేటలు ఎక్కువగా ఉండి వారికి అవసరమైన విషయాలను మాత్రమె పట్టించుకోవడం జరుగుతుంది. బంధ అనుబంధాలు కేవలం అవసరానికి వాడుకునే ఆయుధాలయ్యాయి. ఆంగ్ల భాష అతి ముఖ్యమైన మాధ్యమైంది. కుటుంబ సభ్యుల మధ్యకూడా తెలుగులో మాట్లాడితే చిన్న చూపు చూస్తారనే భావన పెరిగి విన్గ్లీష్, టెంగ్లీష్ భాషలు క్రొత్తగా పుట్టుకొచ్చాయి. పర్యవసానం అమ్మనుడి ప్రాధాన్యత తగ్గిపోయింది. నేటి తరంలో కూడా తెలుగును ప్రేమించేవారు లేరని అర్థం కాదు. తెలుగులోనే చక్కగా పద్యాలు వ్రాసి స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడే వారు ఎందఱో ఉన్నారు. అలాగే భాషాభిమానులు ఎందఱో తెలుగు బాష ఉన్నతికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయిననూ నేటి సమాజ పోకడల ప్రభావం, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన తదితర అంశాల వలన నేటి తరంలో తెలుగుపై మక్కువ తగ్గుతున్నది. మన మాతృభాష ఔన్నత్యాన్ని చూపుతూ వాడుక భాషగా వాడవలసిన విధానంలో అవగాహన కల్పించవలసిన బాధ్యత పెద్దలుగా మన వంతు కర్తవ్యాన్ని గుర్తెరిగి మనం నిర్వహించాలి.

ఏ విషయాన్నైనా నేర్చుకునేటప్పుడు అది రెండు రకాలుగా ఉంటుంది. అది జీవితం కావచ్చు లేదా చదువులు కావచ్చు.  మొదటిది ఆ సమయంలో తగినవిధంగా అవసరాలను తీర్చే ఆయుధం. రెండవది ఆ విషయంలోని మూలాలను అర్థం చేసుకొని దానిని మనకు తగినవిధంగా విచక్షణతో అన్వయించుకొని ఆచరించడం. అప్పుడు అది ఒక విధంగా శాశ్వతంగా మన ఆలోచనలలో ఉండిపోతుంది. అది భాష కావచ్చు, సంస్కృతీ సంప్రదాయాలు కావచ్చు మరేదైనా సాంకేతిక విషయం అవ్వచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతం వ్రాస్తున్న ఈ ‘తెలుగు భాష భవితవ్యం’ విషయంలో రెండవ రకం ఉపయోగించాలి.

మనం ముందుగా చేయవలసిన కార్యం ‘అందరూ మాట్లాడే భాషే అమ్మ భాష’ అని నమ్ముతూ వ్యక్తిగతంగా  మన ఆలోచనలలో మార్పును మున్ముందుగా కలిగించి మన తెలుగు యొక్క తేనె మాధుర్యాన్ని ఆస్వాదించి, నెమ్మదిగా మన చుట్టూ ఉన్న కుటుంబసభ్యులకు ఆ మాధుర్యాన్ని పంచుతూ మన తెలుగు యొక్క భాషా ప్రాధాన్యతను అర్థమయ్యే రీతిలో వివరిస్తూ, వారిలో కూడా ఆసక్తిని కలుగజేయాలి. అందుకు మన ముందు ఉన్న కార్యనిర్వహణ విధానాన్ని వచ్చే సంచికలో వివరిస్తాను.

**** సశేషం ****

Posted in January 2024, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!