Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

"కథ కంచికి మనం ఇంటికి" నానుడి లో "కంచి" అనే పదంలో కంచి అనేది ఊరా? అయినట్లయితే 'కంచి' అనేది గమ్యంగా ఎందుకు సూచిస్తున్నాం, కానట్లయితే దాని అసలు అర్థం ఏమిటి? కథకు కంచిని అనుసంధానం పైనే ఈ నెల రచ్చబండ చర్చ.

ముందుగా కంచి గూర్చి కొంత తెలుసుకుందాం. దక్షిణ భారతంలో కాంచీపురం (కంచి) ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఒకప్పుడు ఇది ఒక గొప్ప విద్యాకేంద్రం. ఉత్తరాదిలో కాశీ, నవద్వీపం ఎలాంటి ప్రముఖ విద్యాకేంద్రాలో, దక్షిణంలో కంచి అలాంటి విద్యాకేంద్రం. ఇక్కడి విశ్వవిద్యాలయాన్ని ఘటిక అంటారు. ఘటికలో ఆ రోజుల్లో ప్రముఖాతి ప్రముఖ పండితుడు దండి. ఈయన 6 -7 శతాబ్దాలకు చెందిన సంస్కృత రచయిత, కవి. ఆయన దశకుమారచరితం పేరుతో సంస్కృతంలో కథాకావ్యం రాశాడు. ఇందులోని కథలను యధాతధంగా, కొద్దిగా మార్పులు చేసుకొని తదుపరి అనేక సాహిత్యకారులు తమ కావ్యాలలో అనుసరించారు. వీరు దశకుమారచరితంను అనుకరిస్తూ లేదా కొంత మార్పు చేర్పులతో కథాకావ్యాలు రాశారు. ఇలాంటి కథావాఙ్మయానికి మూలం కంచి నుండి వెలువడిన దశకుమార చరితం కథా కావ్యం కాబట్టి, దాని గౌరవార్ధం కథ పూర్తయిన తరువాత కథ కంచికి చేరిందని అంటారని కొందరి చరిత్రకారుల భావన. మరో చరిత్రకారుడు .. కంచిని పాలించే పురదేవత కామాక్షి, అయితే ఈమె ఉగ్రరూపంతో బలి కోరి రాత్రి వేళ గ్రామ జంతువులను తింటుండేది. అపుడు శంకరుల వారు శ్రీ చక్ర ప్రతిష్టాపన చేసి ఆమె ఉగ్రతను నివారించారు అట. కథ కంచి కి చేరింది అంటే అర్ధం కథ చివరికి మెల్లగా ఆమె సన్నిధి లో చేరి అమ్మ వలె ప్రశాంతంగా విశ్రాంతి లో ఉందని అర్థం.

ఆధ్యాత్మిక తత్వ చింతన ఉన్న ఒక విశ్లేషకుడు “కథ కంచికి మనమింటికి” అంటే ఏమిటో …ఇలా వివరించాడు. చిన్నపుడు "కథ కంచికి మనం ఇంటికి" అర్థమయ్యేది కాదు. కానీ అణుక్షణం అమ్మనే ధ్యానిస్తూ జీవితములో ముందుకి సాగుతున్నకొద్దీ ఇప్పుడర్థమవుతున్నది.

1) కథ అంటే :- శరీరాలను మారుస్తూ ఆత్మ చేస్తున్న ప్రయాణ ప్రయాస.

2) ఇంటికి అంటే :- మనలో ఉన్న జీవాత్మకు పరమాత్మయే పుట్టినిల్లు. ఆత్మజ్యోతికి పరంజ్యోతియే అసలు ఇల్లు.

3) కాంచీపురి(కంచి) అంటే :- జీవుడికి మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ధన్యతను చేకూర్చే మోక్షపురి.

“కథ కంచికి మనమింటికి” అనే మాటకు క్లుప్త సారాంశం: ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో కంచి కామాక్షి తల్లిని దర్శించుకొని తరిస్తారో వారికి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. పునర్జన్మ రాహిత్యాని పొంది పరంజ్యోతిలో ఐక్యమవుతారు. ఇహంలో సర్వ సౌఖ్యాలను అనుగ్రహిస్తూ పరంలో మోక్షాన్ని ప్రసాదించే కరుణ గల తల్లియే “కామాక్షి" - అని సందేహాలు - సమాధానాలు వర్డ్ ప్రెస్ వెబ్ సైటులో ఆ అజ్ఞాత విశ్లేషకుడు ఈ సమాచారాన్ని ఆధ్యాత్మిక కోణంలో పరిశోధించి పొందుపరచాడు.

"కథ కంచికి మనం ఇంటికి" ఇటీవల 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ట్రైలర్‏కు భారీ రెస్పాన్స్. అని మీడియా ఊదరగొట్టిన ఉదంతం నా దృష్టికి వచ్చింది, అయితే కొందరు సమీక్షకులు “కథ కంచికి మనం ఇంటికి” సినిమాపై చేసిన వ్యాఖ్యలు - ఉదాహరణకు "ఆకట్టుకోని కామెడీ థ్రిల్లర్", "రొట్ట కొట్టుడు కథ" (రొటీన్ కథ), "ఊహకందే ముగింపు" వంటివి చదివి ఈ సినిమాను చూసే ఆలోచనను విరమించుకున్నాను. ట్రైలర్‏ చూసి ఒక స్థాయిలో ఉత్తేజితుణ్ణి అయి "ఆదిపురుష్" సినిమాకు వెళ్లి తల బొప్పికట్టించుకున్న అనుభవం నాకు ఉండనే ఉంది. రచ్చబండ చర్చ కాబట్టి మధ్యలో కొత్త సంగతులు వచ్చి చేరుతాయి. కాదేది చర్చకు అనర్హం అనుకొని చర్చిద్దాం! వరుస వివాదాలు ‘ఆదిపురుష్’ సినిమాను చుట్టుముట్టాయి. ఇవి చాలవన్నట్లు కొత్తవి సృష్టిస్తున్నారు ఆ సినిమా రచయిత మనోజ్ శుక్లా. చిత్రంలోని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శలపాలైన ఈయన.. తాము తీసింది రామాయణమే కాదని మొన్నటికి మొన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. తాజాగా హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి డైలాగ్స్ విషయంపై ఓ జాతీయ చానెల్ లో మాట్లాడుతూ.. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన కేవలం భక్తుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ‘‘హనుమంతుడు శ్రీరాముడిలా మాట్లాడడు. తాత్వికంగా మాట్లాడడు. ఆయన భగవంతుడు కాదు.. భక్తుడు. రాముడికి హనుమంతుడు వీర భక్తుడు. అంతేకానీ దేవుడు కాదు’’ అని అన్నారు. మనోజ్ శుక్లా అంతటితో ఆగలేదు.. ‘‘హనుమంతుడి భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. ఆయన్ను మనం దేవుడిని చేశాం’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ లో తప్పేముందీ అంటూ సమర్థించుకున్నారు. ఈయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తుంటే ముందు సినీ రచయితగా ఈయన "కథ ముగిసే" సమయం దగ్గరపడ్డట్లు కనిపిస్తుంది.

"కథ కంచికి" నానుడిని మనవారు పలు సందర్భాలలో నేర్పుగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు... దశాబ్దాల తరబడి ఏ రాష్ట్రంకు లేనంతగా జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని నిలబెడుతూ వచ్చిన 370వ అధికరణను కేంద్రప్రభుత్వం రద్దుచేయడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో "ఇక  జమ్మూకశ్మీర్‌ కథ కంచికే" అని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. "కథ కంచికి" నానుడిని కొంతమంది మంది "కథ ముగిసింది" నానుడిగా కూడా వాడుతుంటారు. ఇటీవల 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో పాక్ లీగ్ మ్యాచ్ లలో పలు ఓటములు ఎదుర్కొన్నతరువాత పాక్ జట్టు సెమీస్ ఆశలు దాదాపు అడుగంటాయి. అయితే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ విజయంతో సెమీస్ కు చేరే అవకాశాలు పాక్ జట్టుకు ఉన్నాయి. ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ ప్లేస్ లోకి వెళ్లాలంటే ఇంగ్లాండ్ పై జరిగే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఛేదనలో అయితే 284 బంతుల తేడాతో పాక్ విజయం సాధించాల్సి ఉంటుంది అంటే మొదటి 16 బంతుల్లోనే విజయానికి అవసరమైన పరుగులు సాధించాలి. ఇది దాదాపు అసాధ్యం. ఇంగ్లాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగినా చాలు: పాకిస్తాన్ ఖేల్ ఖతం అని క్రికెట్ పండితులు మ్యాచ్ ముందుగానే హెచ్చరించారు. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఈ మ్యాచ్ కు ముందు బాబర్ ఆజమ్‌కు ఉపాయం చెప్పాడు పాక్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్. ఇంగ్లాండ్ జట్టు మొత్తాన్నీ ఒకేసారి టైమ్ అవుట్ చేయగలిగితేనే పాకిస్తాన్ సెమీస్ చేరుతుందని ఆయన వ్యాఖ్యానించాడు.ఇంగ్లాండ్‌ను సామూహికంగా టైమ్ అవుట్ చేయడానికి ఒక చిట్కా చెప్పాడు వసీం అక్రమ్. పాక్ తొలుత బ్యాటింగ్ చేయాలని, అనంతరం ఇంగ్లాండ్ టీమ్ ప్లేయర్లందరినీ వాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేయాలని చురకలు అంటించాడు. అది జరిగితేనే పాకిస్తాన్ సెమీస్ వెళ్లగలుగుతుందని ఎద్దేవా చేశాడు.

'టైమ్ డ్ అవుట్' విషయానికి వస్తే... శ్రీలంక బ్యాట్స్ మన్ ఏంజెలో మాథ్యూస్ సకాలంలో బ్యాటింగ్ కు రావడంలో విఫలం కావడంతో అతడిని 'టైమ్ డ్ అవుట్' గా అంపైర్లు ప్రకటించారు. శ్రీలంక - బంగ్లా దేశ్ క్రికెట్ మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మన్ సమరవిక్రమ అవుటైన వెంటనే మాథ్యూస్ మైదానంలో అడుగుపెట్టినప్పటికీ, హెల్మెట్ కు ఉన్న స్ట్రాప్ ఊడిపోవడంతో డగౌట్ నుంచి మరో హెల్మెట్ తెప్పించుకునే క్రమంలో జాప్యం జరిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాట్స్ మన్ అవుటైన 3 నిమిషాల లోపు కొత్త బ్యాట్స్ మన్ బంతిని ఎదుర్కొనేందుకు క్రీజులోకి రావాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ లో ఈ సమయం 2 నిమిషాలుగా ఉంది. కానీ, ఆ సమయం దాటిపోవడంతో బంగ్లాదేశ్ ఫీల్డర్లు అంపైర్ కు అప్పీల్ చేశారు. అంపైర్లు నిబంధనల ప్రకారం మాథ్యూస్ 'టైమ్ డ్ అవుట్' కింద అవుటైనట్టు ప్రకటించారు. మాథ్యూస్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. దాంతో ఒక్క బంతి ఆడకుండానే అవుటైనట్టయింది. క్రికెట్ చరిత్రలో ఈ విధంగా అవుటైన మొదటి బ్యాట్స్ మన్ గా ఏంజెలో మాథ్యూస్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాటింగు కు రానివ్వకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్లను పెవిలియన్ లోనే పెట్టి తాళాలు వేసి బంధించి వేస్తే ఆటోమాటిక్ గా పాక్ మ్యాచ్ గెలుస్తుంది అని అక్రమ్ సెటైర్ వేసాడు అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆటతీరు ఏ విధంగా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది, కానీ పాక్ జట్టు యధావిధిగా తన అభిమానుల అంచనాలు అందుకొంది - 93 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పాక్ మట్టికరవడంతో పాక్ "కథ ముగిసింది". పాక్ "కథ ముగియడం" వెనుకాల ఇంత కథ ఉన్నదన్నమాట!

''కథ కంచికి మనం ఇంటికి'' అని కథ ముగించడం వెనుకటి తరాలవారి ఆచారం. ఆ కాలంలో కథ చెప్పడం ఒక కళ. తాతయ్య చూట్టూ చేరి కథ చెప్పించుకోవటం నా చిన్నతనంలో ఒక వేడుక. ఎక్కువగా ప్రశ్నలు అడిగితే మాత్రం మా తాతయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాడు - తద్వారా "నరసింహ" అనే తన నామధేయంను ఆయన సార్ధకం చేసుకున్నాడు అని నేను అప్పుడు అనుకునేవాడిని. కథ చెప్పడం గొప్ప ఆర్ట్‌ అని ఆయన్ని దగ్గరగా చూసిన తరువాత నాకు అనిపించింది. ఆయన చెప్పిన కథలు వినిఉండకపోతే నా బాల్యం అసంపూర్ణంగా ఉండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. కథ ఎంపిక దగ్గర నుంచి దానిని మాకు అర్ధమయ్యేలా, మమ్మల్ని ఆకట్టుకునేలా వివరించడంలో ఇప్పటి బాహుబలి స్థాయి స్క్రీన్ ప్లే రైటర్స్‌ కంటే అద్భుతంగా ఆయన నడిపించేవాడు.

కానీ, ఇప్పుడు తరాలు మారాయి. పాత కథలు “ఏడు చేపలు”, “నాన్నా పులి", '"కుందేలు-తాబేలు'", “పులి - మాట తప్పని ఆవు" 'పంచతంత్ర", “అక్బర్ బీర్బల్‌", "తెనాలి రామకృష్ణుడి" కథలు వంటివి బాల బాలికలకు వినోద, విజ్ఞానాన్ని అందించేవి. అవి ఇప్పుడు కలగా మిగిలిపోయాయి. తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ ఒడిలో చిన్నారులు ఇప్పుడు నిద్రపోవడం లేదు. సాయంత్రం వేళ వారి మంచం చుట్టుముట్టి చేసే సరదా కబుర్లు లేవు. కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. పని ఒత్తిడిలో ఎవరికివారే యమునా తీరే - ఎవరి గది వారిది - ఎవరి దారి వారిది అయిపొయింది. పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలనిపించినా ఏదీ ఆధునిక తల్లిదండ్రులకు గుర్తుకురాదు. నేటి కార్పొరేట్ విద్యలో పుస్తకాలతోపాటు మోసుకొచ్చే హోంవర్క్‌తోనే పాపం పిల్లల కళ్లమీదకు నిద్ర ముంచుకొస్తోంది. ఇక కథలు వినటానికి వారికి ఆస్కారం ఎక్కడ! ఈ క్రమంలోనే కథను వినిపించేవారు, వినేవారు లేక కథ మూగబోయింది. మన ఇంటి నుంచి దూరమైపోంది. పాత కథ యొక్క "కథ దాదాపు ముగిసింది". కొత్త రూపు దాల్చిన కథ గురించి చెప్పుకుందాం. ప్రస్తుతం కథ... కొత్త రూపుదాల్చింది. 'తెరబొమ్మగా మారింది. సినిమాలు, నాటికలు, లఘు చిత్రాలుగా కనిపిస్తోంది. కాలక్షేపంగా కార్టూన్‌ సినిమాలు, వీడియో గేమ్‌లలోకి వచ్చేసింది. మొబైల్‌/టీవీలకు అతుక్కుపోతున్న పిల్లలకు కంటి సమస్యలు రావడం తప్ప కథా విషయాలు బొత్తిగా తెలియడం లేదు. కథ చెప్పడంలో కొత్త మార్పులొచ్చాయి కానీ నీతిని, జ్ఞానాన్ని పంచడంలో నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది - పాత కథకు కొత్త కథకు చాలా తేడా ఉంది.

అయితే ఆధునిక యుగంలో పిల్లల్ని మరలా కథలకు దగ్గర చేద్దాం, తద్వారా మనం బాల్యంలో అనుభవించిన సంగతులను వారికి పరిచయం చేద్దాం! క్రిస్మస్, నూతన సంవత్సర, వేసవి సెలవల్లో పెద్దోళ్లు, పిల్లలు ఇంటిలోనే గడుపుతున్న ఈ కాలంలో పిల్లలను కథల్లోకి తీసుకెళ్లగలిగితే, సెలవులు ఆమేర సద్వినియోగం అయినట్లే కదా! యూట్యూబ్‌ చానళ్లలో కూడా తెలుగు కథలు లభిస్తున్నాయి, అయితే సరైన కథలను మనం ముందే వెతికి పెట్టుకోవాలి.

ఈ 2024 ఆంగ్ల సంవత్సరానికి ఇది మొదటి రచ్చబండ, మీరందరూ నెలనెలా ఈ చర్చా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు అని భావిస్తూ, సిరిమల్లె పాఠకులకు 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారికి సాహిత్యాభినందనలు అందజేస్తూ ...ఎప్పటిలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో  స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ "కథ కంచికి, మనం ఇంటికి". సరేనా? వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం.

నమస్కారములతో, మీ వెంకట్ నాగం.

********

Posted in January 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!