Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

తాళికోట యుద్ధం

(విజయనగర సామ్రాజ్య అంత్య దశ)

రామరాయలు తన పరిపాలనాకాలంలో బిజాపూరు, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదరు నవాబుల మధ్య కలహాలు రేపి, ఒకరినొకమారు, ఇంకొకరిని వేరొకమారు బలపరుస్తూ గందరగోళం వ్యాపింపజేశాడు. మరో  వైపు పోర్చుగీసు గవర్నర్ విజయనగరంతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి క్రీ.శ. 1547లో జరిగింది. దీని ప్రకారం పోర్చుగీసు వారు ఒక్క విజయనగరం రాజులకే గుర్రాల్ని అమ్ముతారు. అందుకు ప్రతిగా విజయనగర రాజ్యపు ఎగుమతి దిగుమతులు పోర్చుగీసు వారి ద్వారా, పోర్చుగీసు వారి అధీనంలో ఉన్న రేవుల మీదుగా జరుగుతాయి. వేరొకరి ఓడల్ని విజయనగరం రేవులకు రానియ్య కూడదు. వస్తే పట్టుకుని పోర్చుగీసు వారికి అప్ప జెప్పాలి. ఈ పోర్చుగీసు వారు గోవా రాజధానిగా పశ్చిమ కోస్తా వెంబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇటు విజయనగరం వారుగాని , అటు ముస్లిం సుల్తానులుగాని పోర్చుగీసు వారి దుష్ట చర్యల్ని పట్టించుకోలేదు.

అయితే తమ అంతః కలహాలతో రామరాయలు లబ్ధి పొందుతూ బలపడుతూడడం ముస్లిం సుల్తానులు గమనించారు. గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ షా చొరవ తీసుకుని బద్ధ విరోధులైన బీజాపూర్, అహ్మద్ నగర్ నవాబుల మధ్య బంధుత్వం కుదిర్చాడు. ఆ సందర్భంగా నలుగురు నవాబులు ఒకటయ్యారు.

ఇక్కడ ఒక విషయం మనం పరిశీలించాలి. ముస్లిం రాజ్యాలకంటే పెద్దది, బలమైనది అయిన విజయనగరం శత్రు రాజ్యాలలో ఏమైనా దురంతర చర్యలకు పాల్పడిందా? అవి కూడా రాజ్య వినాశనానికేమైనా కారణమయ్యాయా? అధికార రాజకీయాలు ఎంత స్వార్ధ పూరితంగా, నిస్సిగ్గుగా ఉంటాయో విజయనగరం, బిజాపూరు రాజ్యాల సంబంధాలను చూస్తే అర్ధమవుతుంది.

తమ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా పోర్చుగీసు, విజయనగరం రాజులిరువురూ బిజాపూరు నవాబుతో జరిపే యుద్ధాలలో జయించబడే భూములను పంచుకుంటారు. పడమటి కనుముల ఆవల ఉన్న సముద్ర తీర భూముల్ని పోర్చుగీసు వారు తీసుకుంటే, ఇవతలి భూముల్ని విజయనగరం తీసుకుంటుంది.

అయితే క్రీ.శ. 1555లో బీజాపూర్ సుల్తాన్ పై అతని సోదరుడు తిరగబడినపుడు పోర్చుగీసు వారు అతని పక్షం వహించగా రామరాయలు బీజాపూర్ సుల్తాన్ కు సైన్య సహాయం అందించాడు. తరువాత బీజాపూర్, విజయనగరం రాజులిరువురూ అహ్మద్ నగర్, గోల్కొండ నవాబులతో యుద్ధాలు చేశారు. క్రీ.శ. 1557 లో అహ్మద్ నగర్ సైన్యాలు బీజాపూర్ పై దాడి చేసినపుడు నవాబ్ అలీ ఆదిల్షా విజయనగరం పారిపోయివచ్చాడు. రామరాయలి దంపతులు అలీ ఆదిల్షాను ఆదరించారు. దత్తతు కూడా తీసుకున్నారు.

బీజాపూర్ తిరిగివచ్చిన తరువాత అలీ ఆదిల్షా కల్యాణి, షోలాపూర్ కోటలను తిరిగి తనకు స్వాధీనం చేయమని హుసేన్ నిజాంషాను కోరాడు. అందుకు నిజాంషా ఒప్పుకోలేదు. దాంతో క్రీ.శ. 1558-59ల మధ్య అలీ ఆదిల్షా రామరాయలుతో కలసి అహ్మద్ నగర్ పై యుద్ధం చేసి భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు.

యుద్ధానంతర పరిస్థితుల గురించి ఫెరిస్తా అనే చరిత్రకారుడి కథనం ప్రకారం: "ఆ ప్రాంతాన్ని ఎంత నిర్ధూమధామంగా చేశారంటే పొరుండే నుండి ఖిబేర్ వరకు, అహ్మద్ నగర్ నుండి దౌలతాబాద్ వరకు జనాభా చిహ్నాలే కనిపించలేదు. బీజనగర అవిశ్వాసులు అలాంటి అవకాశం కోసమే ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. తమ చేతిలోని ఏ క్రూరత్వాన్ని ప్రయోగించక వారు వదలలేదు. ముసల్మాను స్త్రీల గౌరవాన్ని అవమానపరిచారు, మసీదులను నాశనం చేశారు, పవిత్ర ఖురానును కూడా గౌరవించలేదు.”

విజయనగర సైన్యం చేసిన అకృత్యాలు ఇటు అహ్మద్ నగర్, గోల్కొండ వంటి శత్రు రాజ్యాలలోని ముస్లిం మతస్తులతో పాటు బీజాపూర్ లోని వారికి కూడా ఆగ్రహం తెప్పించాయి. ఇక్కడే ముస్లిం రాజ్యాల ఐక్యతకు బీజం పడింది.

సఖ్యత ఏర్పడి బంధుత్వాలు కలిశాక అంతకు ముందు విజయనగరంతో చెలిమి చేసిన బీజాపూర్ నవాబే తమ రాజ్యం నుండి తీసుకున్న భాగాల్ని తమకి ఇచ్చివేయాలని రామరాయలికి కబురు పంపారు. రామరాయలు నవాబుల కోర్కెను తిరస్కరించడమే కాకుండా వచ్చిన రాయబారిని అవమానించి పంపడంతో, నవాబులు దాన్ని సాకుగా చూపి యుద్ధం ప్రకటించారు.

నలుగురు నవాబులూ సైన్యాల్ని కూర్చుకుని 1564 డిసెంబర్ 25న బయలుదేరి కృష్ణానది ఉత్తరపు ఒడ్డున ఉన్న తాళికోట చేరారు. ముస్లిం సేనలకు రెట్టింపు సేనలను సమకూర్చుకుని రామరాయలు నదికి దక్షిణ దిశన మోహరించాడు.

యుద్ధాలలో వ్యూహం, ఆధునిక ఆయుధ సంపత్తి సైన్య సంఖ్య కంటే అధిక ప్రాధాన్యత వహిస్తాయని తాళికోట యుద్ధం మరోసారి రుజువు చేసిందనవచ్చు. ముస్లిం సేనలకు కేంద్రీకృత నాయకత్వం కూడా ఏర్పడింది. వారి సైన్యాధిపతి చలబీరూబీఖాన్ సమర్థుడేగాక అనేక యూరోపియన్ యుద్ధాలలో ఆరితేరినవాడు. అలానే వారి ఫిరంగి దళం కూడా విజయనగరం కంటే సుశిక్షితంగా ఉండడం యుద్ధం గతిని మార్చింది. వీటికి వెన్నుపోటు, నమ్మక ద్రోహం, దురదృష్టం కూడా తోడైతే? అదే తాళికోట యుద్ధ ఫలితం.

ముస్లిం సేనలు రాయల సేనల్ని ఏమార్చి నదిని దాటాయి. క్రీ.శ. 1565 జనవరి 22న రక్షసి - తంగ్డి గ్రామాల వద్ద ఇరుపక్షాలూ యుద్ధానికి తలపడ్డాయి. ముస్లిం సేనల చర్యలతో ఆశ్చర్యానికి లోనైనప్పటికీ తేరుకుని సేనలను యుద్ధానికి సమాయత్తం చేశాడు రామరాయలు. రామరాయలు ఏడు పదుల వయసులోనూ నేరుగా రణక్షేత్రంలోకి దిగాడు. సేనలకు మధ్యలో హుస్సేన్ నిజాంషాకు ఎదురుగా తాను మోహరించాడు. ఎడమ వైపున అతని తమ్ముడు తిరుమలరాయలు బీజాపూర్ నవాబు అలీ ఆదిల్షాకు ఎదురు నిలిచాడు. కుడివైపున మరో తమ్ముడు వెంకటాద్రి అహ్మద్ నగర్, బీదరు, గోల్కొండ ఉమ్మడి సేనలకు ఎదురు నిలిచాడు. ఇరు పక్షాల నడుమ భీకర పోరు సాగింది. విజయనగరం పైచేయి సాధించిన తరుణంలో రామరాయలి పక్షాన ఉన్న గిలానీ సోదరులు ఎదురు తిరిగారు. తమ సైన్యంలోని హిందూ సైనికులని గిలానీ సోదరుల క్రిందనున్న ముస్లిం సైనికులు చంపసాగారు. దాంతో విజయనగరం సేనలలో కలకలం, కలవరం తలెత్తాయి.

రామరాయలు ధనం వెదజల్లి తన సైన్యాన్ని, సైన్యాధిపతులను ఉత్సాహపరచసాగాడు. నిజాంషా తల తేవాల్సిందిగా, ఆదిల్షా, కుతుబ్షా లను సంకెళ్లతో బంధించి తన ముందు నిలబెట్టవలసిందిగా సైన్యాలను ప్రోత్సహించాడు. నిజాంషా క్రిందనున్న సర్దార్ రూమీఖాన్ రెండు తుపాకులలో రాగి నాణేలను, తుపాకీ మందును నింపి విజయనగర కాల్బలం పై సంధించాడు. దాంతో పెద్ద ఎత్తున సైనికులు హతులయ్యారు. రామరాయలు తన సేనాధిపతుల సలహాకు విరుద్ధంగా గుఱ్ఱంపైన కాకుండా పల్లకీలో ఉన్నాడు. రూమీఖాన్ ఏనుగు పైకెక్కి రామరాయలు ఉన్న ప్రదేశం పై దాడి చేశాడు. రామరాయలు పల్లకీ నుండి క్రిందకి పడిపోయాడు. గాయపడిన వ్యక్తి రామరాయలని రూమీఖాన్ వెంటనే గుర్తించలేదు. రామరాయలి మంత్రి దళపతిరాయుడు ఏనుగు దాడి నుండి రామరాయలిని రక్షించడం కోసం అడ్డుగా నిలిచాడు. అయినా ఫలితం లేకపోయింది. కొంత సేపటికి రామరాయల్ని గుర్తించిన రూమీఖాన్, రామరాయల్ని తాళ్లతో బంధించి, ఏనుగు పైకి ఎక్కించి , తన రాజు నిజాంషా ఉన్న గుడారానికి తీసుకుపోయాడు.

బందీగా పట్టుబడిన రామరాయలిని చూసి నిజాంషా "బాగానే ఉన్నావా?" అని ప్రశ్నించగా, అంతా తన తలరాత అంటూ వ్రేలి సైగతో చూపాడు రామరాయలు. ఇంతలో రామరాయలు పట్టుబడిన విషయం అలీ ఆదిల్షాకు తెలిసింది. పితృ సమానుడైన రామరాయల్ని ఆదిల్షా చంపనివ్వడని సంకటంలో పడ్డ నిజాంషాను అతని అనుచరుడైన ఖాసీం బైగ్ హకీమ్ "ప్రభూ! సంకోచం వద్దు, వెంటనే విధించండి" అని తొందరపెట్టడంతో, నిజాంషా రామరాయలి తలను నరికివేశాడు. ఇవతల రామరాయలి తమ్ముడు వెంకటాద్రి కూడా మరణించాడు. నిజాంషా రామరాయలి తలను బల్లెముకు గుచ్చి వేయించి, రణభూమిలో ప్రదర్శింపజేశాడు. దాంతో విజయనగర సేనలు కకలావికలయ్యాయి. పరిస్థితిని ముందే ఊహించిన తిరుమలరాయలు రాజధానికి పలాయనమయ్యాడు.

పడమటి కనుమల మధ్య రవి అస్తమించాడు.

*సర్వేభవంతు సుఖినః*

Posted in January 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!