Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

నాలుగవ మంత్రం

అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తద్ధావతోteneloluku-letter న్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి

భావం: అది చలిస్తుంది. అది చలించదు. అది దూరంగా ఉంది. చాలా దగ్గరగా కూడా ఉంది. అది అన్నింటి లోపల ఉంది. అన్నింటి వెలుపలా కూడా ఉంది.

భాష్యం:
ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలు విచారణకు అతీతమైనవి. వీటిని తెలివితేటలతో గ్రహించలేమని వేదాలు, ఉపనిషత్తులు మొదలైన సకల శాస్త్రాలు చెపుతున్నాయి. అలా ఇంద్రియాలకు అందని దాన్ని, ఇంద్రియాల ద్వారా వివరించడానికి ప్రయత్నించే యత్నం ఇది. ఆత్మ సర్వవ్యాప్తిగా ఉన్నందున ఈ పరస్పర వైరుధ్య భావాలన్నీ ఇక్కడ సాధ్యం. లోక వ్యాపారాన్నింటికీ ఆధార భూతమైనది ఆత్మ. అందువలన ఆత్మ చలిస్తున్నది. ఆత్మ అనే స్థితిలో అంటే సర్వత్ర వ్యాప్తిగాంచిన స్థితిలో దానికి చలనం లేదు.

మన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ నెలకొని ఉన్నది. అందువలన అది అత్యంత సమీపంలో ఉన్నది. కానీ మనం దానిని గ్రహించలేని స్థితిలో అది సుదూరంలో ఉన్నది అని భావిస్తాము. అదేవిధంగా భగవంతుడు అనే స్థితిలో అది సర్వవ్యాప్తంగా ఉండడం మన అన్నింట్లో లోపల ఉన్నది, వెలుపలా ఉన్నది.

అజేయమైన శక్తుల చేత నిర్వర్తింపబడే పరమ పురుషుని దివ్య కార్యకలాపాల వివరణ ఈ మంత్రంలో ఉన్నది. అతని యొక్క అసాధారణమైన శక్తులను నిరూపించడానికి ఇక్కడ పరస్పర విరుద్ధమైన పదాలు వాడబడ్డాయి. ఆయన నడుస్తాడు మరియు నడవడు. సాధారణంగా ఎవరైనా నడవగలిగినప్పుడు అతను నడవలేడు అంటే తర్క విరుద్ధమవుతుంది. ఈ వైరుధ్యం భగవంతుని విషయంలో మనకు అతని అనుహ్యశక్తిని సూచించడానికి తోడ్పడుతుంది. మన పరిమితమైన జ్ఞానంతో మనం అలాంటి వైరుధ్యాలను అర్థం చేసుకోలేము. మన పరిమితమైన అవగాహన శక్తులతో మనం ఆయనను గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. మాయ వాద సిద్ధాంతానికి చెందిన నిరాకారవాదులు భగవంతుని నిరాకార లక్షణాలని అంగీకరించి, సకార లక్షణాన్ని నిరాకరిస్తారు. భాగవత సిద్ధాంతానికి చెందిన వారు అతని అనూహ్యశక్తులను అంగీకరించి భగవంతుని సుగుణుడు గాను, నిర్గుణుడిగాను కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే అతనికి అన్యుహ్యమైన శక్తులు లేకపోతే పరమ పురుషుడనే పదానికి అర్థమే ఉండదు.

ఐదవ మంత్రం

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః

భావం: ఎవరు సకల జీవరాసులను ఆత్మలోనూ, ఆత్మను సకల జీవరాశులలోను దర్శిస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు.

భాష్యం: అంటే సమస్తమును దేవునితో సంబంధముగా గల అంశంగా చూసేవాడు, సర్వ జీవులను దేవుని అంశాలుగా చూసేవాడు అన్నింటిలోనూ ఆ దేవుని దర్శించేవాడు, దేనిని గాని, ఎవరిని గాని, ఎప్పుడూ ద్వేషించడు.
తనను ఆత్మగా గ్రహించినవాడు అంటే ఆత్మానుభూతి పొందినవాడు, లోకంలోని సుఖదుఃఖాలన్నింటి నుండి విడివడుతాడు. అతను అందరిలోనూ అంటే సకల జీవరాశిలోనూ దేవుని దర్శిస్తాడు.

ఈ మంత్రంలో ప్రతి ఒక్కరూ దీనిని స్వయంగా పరిశీలించాలని స్పష్టంగా సూచిస్తుంది. అంటే సమగ్రజ్ఞానంతో కూడిన గత పూజ్యులైన పరమ గురువులను ప్రతి ఒక్కరూ అనుసరించాలని దీనర్థం. ఈ సందర్భంలో అనుపశ్యతి అంటే అను అనగా అనుసరించడం పశ్యతి అంటే పరిశీలించడం లేదా చూడడం. అనుపస్యతి అంటే మానవుడు వస్తువులను చర్మ చక్షువులతో చూచినట్లు చూడ్డం కాదు. పరమ గురువులు చెప్పినట్లుగా అనుచరించాలి. భౌతిక లోపాలు ఉండడం వలన భౌతికమైన జ్ఞానేంద్రియాలతో దేనిని సరిగా చూడలేము. ఉత్తమ ప్రామాణికుల నుండి విన్నవారే వస్తువులను సరిగా చూడగలరు. ఆత్మానుభూతిని పొందగలరు.

**** సశేషం ****

Posted in January 2024, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!