Menu Close
Swathi-Sreepada
ఈ పయనం ఇలా సాగనీ (కథ)
-- స్వాతి శ్రీపాద --

ఉద్యోగ పర్వం ముగిసిపోయినట్టే. ఉరుకులు పరుగుల జీవితానికి ఒక తెరపడినట్టే.

అయినా అదేం పెద్ద సంతోషంగా లేదు.

ఉదయం నుండి హడావిడి మొదలు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి- అనే సందిగ్ధంతో.

ఒక్కరోజూ బీరువాలోంచి తీసిన డ్రెస్ వేసుకున్నది లేదు.

చీర తీసాక దాని బ్లౌౙ్ ఇస్త్రీ చేసి లేకపోవడమో, కాస్త టైట్ అవడమో, లేదంటే రంగు ఫేడవడమో, అదీ కాకపోతే సన్నగా ఉన్న ఆ చీరకు లోన పెటీకోట్ మాచ్ అవకపోవడం.

దాంతో మళ్ళీ వెతుక్కోడం మొదలు.

డ్రెస్ విషయమూ అంతే. ఎక్కడో కుట్లు ఊడిపోడమో, తగిన చున్నీయో, లెగ్గింగ్స్ దొరక్క పోడం.

ఇవన్నీ కుదిరాక బిగుతైపోడం.

రేపటి నుండి ఆ హడావిడి ఉండదు.

అసలు పొద్దున్నే లేచిపోవాల్సిన పనీ ఉండదు.

తీరిగ్గా అలారం ఆఫ్ చేసి మెల్లిగా ఏ ఏడింటికో లేవచ్చు.

హడావిడిగా తొందరగా అయిపోయే వంటలూ, మరింత కంగారుగా లంచ్ పాక్ చేసుకోడం, అవును ఆ హడావిడిలో ఒకసారి చపాతీలు లేకుండా కూర, మరోసారి, ఒట్టి చపాతీలు తీసుకెళ్ళడం గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది.

అఫ్ కోర్స్ కొలీగ్స్ ఉన్నదే అలాంటి సందర్భాలలో ఆదుకునేందుకు కదా.

అది ఓకే.

హడావిడిలో చూసుకోకుండా ఒకసారి బాత్ రూమ్ స్లిప్పర్స్ తో వెళ్ళిపోవడం, ఆ రోజునే కెమిస్ట్రీ టీచర్ వ్యంగ్యంగా,

"ఈ ఆడవాళ్ళు చీరలకూ, నగలకూ, వేలు వేలు వెచ్చిస్తారు కాని చెప్పుల దగ్గర స్లిప్పర్స్ తోనే ఆగిపోతారని" కామెంట్ చేసి పెద్దగా నవ్వడం. మనసులో మెదిలింది.

మరో సారి ఒకకాలికి ఒకరకం మరో కాలికి మరో రకం చెప్పులు వేసుకు వెళ్ళింది.

ఒకటా రెండా తలుచుకునే కొద్దీ ఎన్నో.

ఆరేళ్ళ క్రితమే రిటైర్ అయిన ఆయన తను ఆఫీస్ కి వెళ్ళే సమయానికి బద్ధకంగా నిద్ర లేస్తాడు. కాఫీ చేసి ఉంచడం అతనికి నచ్చదు. తన కాఫీ తనే ఫ్రెష్ గా చేసుకుంటాడు. అలాగే ఏ పదిన్నరకో చేసిపెట్టిన బ్రేక్ఫాస్ట్ మైక్రో వేవ్ లో పొగలు కక్కేలా వేడి చేసుకుని తింటాడు.

ఆడవాళ్ళ మల్లే ఇహ టీవీ సిరియల్స్ అన్నీ చూస్తాడు. మధ్యలో మరో సారి టీనో కాఫీనో చేసుకు తాగుతాడు. ఇద్దరికీ ఉద్యోగాలు అవడం వల్ల ముందునుండీ ఇదే ధోరణి.

టంచన్ గా ఒంటిగంటకు రైస్ కుకర్ ఆన్ చేసి రెండింటికి లంచ్ చేస్తాడు.

మధ్యాన్నం కాసేపు నిద్రపోయి అయిదింటికల్లా రోడ్డున పడితే మళ్ళీ రాత్రి ఏ తొమ్మిదికో వస్తాడు.

సెలవు రోజునా ఇదే రొటీన్.

ఏళ్ళుగా అలవాటయిపోయింది. ఇద్దరూ మాట్లాడుకున్నా ఇంటి గురించీ పిల్లల ధోరణి గురించీ అంతే.

అసలు ఇదేనా జీవితం...

ఏమో!!

ఎవరి జీవితాలు తరచి చూసినా ఏముంది?

అమ్మ సంగతీ అంతే కదా.

ఇద్దరు పిల్లలతో సరిగ్గా తొలి ముప్పైల్లోనే అర్ధంతరంగా నాన్న అదృశ్యమైతే నడి రోడ్డున పడ్డ అమ్మ ఎవరివంకా చూడలేదు.

అధైర్యపడిపోలేదు.

అసలు తనకైతే తండ్రిని ఫొటోల్లో చూడటం తప్ప మరో గుర్తే లేదు. ఆయన పోయేసరికి తనకు ఆరేళ్ళు, అక్కకు ఎనిమిది.

తామిద్దరికోసం కన్నీళ్ళు తుడుచుకుని స్కూల్లో ఆయాగా చేరి, తమనూ అక్కడే చదివించుకుంటూ, తను చదువుకుంటూ, అక్క డాక్టర్ గా తను ఇంజనీర్ గా సెటిల్ అయ్యే సమయానికి అంచెలంచెలుగా నర్సరీ టీచరై, ప్రైమరీ నుండి సోపానాలు అధిరోహిస్తూ పీజీ టీచర్ గా రిటైర్ అయింది.

పాపం అక్క అంత చదువుకున్న దాని జీవితం బావ చేతిలో ఒక తోలుబొమ్మ అయిపోయింది. అక్కకు ఎంతగానో ఉండేది, తననూ, అమ్మనూ దగ్గర ఉంచుకోవాలని.

కాని బావ పడనివ్వలేదు.

చివరికి ఏ పూట ఏ కూర వండాలో కూడా అతనే డిసైడ్ చెయ్యాలి. స్వంత హాస్పిటల్ లో పనిచేస్తూ కూడా అక్కకు ఒక రూపాయి కూడా ఖర్చుచేసుకునే అధికారం లేదు.

ఏదైనా అంటే నానా యాగీ చేస్తాడు. గొడవగొడవ చేస్తాడు.

విసిగి పోయి విడాకులు ఇచ్చెయ్యాలని కూడా చూసింది అక్క. కాని దానికీ ఒప్పుకోలేదు. గట్టిగా పట్టు పడితే వలవలా ఏడ్చి కాళ్ళు పట్టుకుని నువ్వుతప్ప నాకెవరున్నారని దీనమైన మొహం పెడతాడు.

మళ్ళీ రెండు రోజులు పోతే అదే కథ. నిజానికి అక్క చదువు, సంపాదించబోయే డబ్బు చూసి చేసుకున్నాడు కాని అక్కను చూసి కాదనిపిస్తుంది. ఇద్దరుకొడుకులు ఎదిగి కాలేజీల్లో చదువుతున్నా అతని ధోరణి మారలేదు. ఏమైతేనేం దాని బ్రతుకు అలా సాగిపోతోంది.

ఇవన్నీ అమ్మకు తెలుసో తెలియదో కాని ఒక్క రోజూ బయటపడలేదు.

తను కట్టుకున్న చిన్న మూడు గదుల ఇంట్లోనే జీవితమంతా గడిపింది.

పెళ్ళయాక తెచ్చి తమతో ఉంచుకోవాలని చూసింది .

"వద్దులే చిన్నా, ఎవరి ప్రైవసీ వారికుండాలి. ఊళ్ళోనే కదా, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఎంత సేపు సరిగ్గా అరగంట పట్టదు" అనేసింది.

ఒక్కత్తే ఉన్నా అమ్మ తన వ్యాపకం తను పెట్టుకుని ఆనందంగానే జీవితాన్ని గడిపింది.

చివరికి సంక్రాంతి రోజున అందరినీ భోజనానికి పిలిచి అందరికీ తృప్తిగా వడ్డించి, కొత్త బట్టలు ఇచ్చి "కాస్సేపు పడుకుంటాను." అంటూ వెళ్ళి అందరి సమక్షంలో దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయింది.

అక్కకు ఇద్దరు కొడుకులు. తనకు ఇద్దరు కూతుళ్ళు. అమ్మను చూసే వారితోనూ తామరాకు మీద నీటి బొట్లలా ఉండటం నేర్చుకున్నారు.

వారి జీవితాలు వారివి, మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయి బాధపెట్టి బాధపడటం అనవసరం.

"మేడమ్, ఏంటి? కలల్లోకి జారిపోయారా? రేపటి నుండి తీరిగ్గా ఏమేం చెయ్యాలా అని ప్లాన్ చేస్తున్నారా?"

పక్కన కొలీగ్ జానకి పరాచికంతో ఈ లోకంలోకి వచ్చింది.

చిన్నగా నవ్వేసి, "ఈ ఫేర్ వెల్ పార్టీలో మీ అందరి అభిమానం చూస్తే అస్సలు వెళ్ళబుద్ధి కాడం లేదు. కానీ రేపు నేనీ ఆఫీస్ కి వస్తే మీరంతా ఎలా బిహేవ్ చేస్తారా అని ఆలోచిస్తున్నా ... "

"మీకు మాటలకు కొదువా?"

నిజమే. మాటలన్నీ ఇంటి బయటే.

ఇంటికి వెళ్తే మాత్రం ఏకాకితనమే. అలాగని అతనికి దురలవాట్లు లేవు. బావగారిలా దేనికీ సతాయించడు. తనేదో తనలోకమేదో అంతే. చివరికి ఫేర్వెల్ పార్టీకి రమ్మన్నా,

"నేనెందుకులే" అనేసాడు.

ముందునుండీ అంతే. మరి బలవంతం చెయ్యలేదు.

కూతుళ్ళిద్దరూ ఒకరు ఢిల్లీ లోనూ ఒకరు కలకత్తాలోనూ ఉన్నారు. వాళ్ళ జీవనాల్లో వాళ్ళు తలమునకలౌతున్నారు.

పార్టీ ముగిసి అందరికీ వీడ్కోలు చెప్పి బయటకు వచ్చేసరికి ఆరున్నర దాటిపోయింది. ఈసురోమంటూ ఇంటికి చేరాలి, ఎలాగరా దేవుడా అనుకుంది.

కాని ఆశ్చర్యం, పక్కనే వచ్చి ఆగిన కాబ్ డోర్ తెరచి దిగినది. అతనేనా?

"ఆలస్యం చేసానా?" అంటూ చేతిలో బాగ్స్ అందుకున్నాడు.

నిజంగానేనా కలగంటున్నానా అనుకుంది.

"రా భాగ్యం" అంటూ ఆమెను కారు ఎక్కించాడు.

"బాగా జరిగింది కదా ఫేర్వెల్ పార్టీ, మరీ ఇన్ని గిఫ్ట్ లు ఇచ్చారేమిటీ?" తన స్వభావానికి విరుద్ధంగా అతను మాట్లాడటం చిత్రంగా ఉంది.

అయినా ముభావంగానే జవాబులు చెప్పింది.

ఇంటి ముందు కారు దిగి గుమ్మంలోకి వచ్చాక కాని గుర్తించలేదు.

తలుపుకు వేళ్ళాడుతున్న తోరణాలను తాళం తీసి డోర్ ఓపెన్ చేసి-

"లోపలికి మన సామ్రాజ్యంలోకి రా" అంటూ ఆమె చెయ్యందుకుని నడిపించాడు ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో బానర్-

ఉద్యోగ విరమణ చేసిన శ్రీమతికి ఘన స్వాగతం అంటూ ...

చక్కటి పసుపు పచ్చ గులాబీల బొకే అందించి శుభాకాంక్షలు చెప్పాడు.

ఇద్దరు కూతుళ్ళూ వీడియో కాల్ చేసి మాట్లాడారు.

"అమ్మా, ఇహ సెలవు పెట్టుకోడం లాటి గొడవలు లేవుగా, ఒక సారి రండి, కనీసం జాలీ ట్రిప్ లా.." అని ఆహ్వానించారు.

"స్నానం చేసిరా భాగ్యం, ఇద్దరం డిన్నర్ కి బయటకు వెళ్దాం" అంటూ స్వయంగా వేడి వేడి కాఫీ తెచ్చి అందించాడు.

ఒక సంభ్రమం నుండి తేరుకోలేకపోతున్న ఆమెను చూస్తూ ....

"ఎలాగోలా గృహస్థు పర్వాన్ని గడిపేశాం, కాని ఇదివరకులా సన్యాసులమై ఆశ్రమం లోకి పోలేము. ఇహ మిగిలిన జీవితమంతా నాకు నువ్వూ నీకు నేను. నా ఇష్టాఇష్టాలు ఇన్నేళ్ళూ చాలా గౌరవించావు. ఇప్పుడిహ నా వంతు. అది ఈ రోజు నుండే మొదలుపెడదాం. చక్కగా సరదాగా డిన్నర్ చేసి కాస్సేపు వెన్నెట్లో టాంక్ బండ్ మీద తిరిగి వద్దాం, పదపద చాలా మాట్లాడుకోవాలి" అంటూ తొందర చేసాడు.

భర్తలో అంత మార్పును జీర్ణించుకోలేకపోతూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిందామె.

జరిగినదేమిటో ఆమెకు తెలిసే అవకాశమే లేదు.

పొద్దున ఆమె ఆఫీస్ కి వెళ్ళాక తీరిగ్గా కాఫీ టిఫిన్లు ముగించి తనకొలీగ్ వీరబ్రహ్మాన్ని కలుద్దామని వెళ్ళాడు.

కాని అక్కడ ఎదురయ్యే విషాదాన్ని ఎంత మాత్రం ఊహించలేదు.

మరో ఆర్నెల్లలో రిటైర్ అవ్వాల్సిన అతని భార్య వారం క్రితమే తొందరపడి సెలవుతీసుకుని వెళ్ళిపోయింది.

"ఎవరో ఒకరు ముందు ఒకరు వెనకా, మన చేతుల్లో ఉన్నది కాదుగా" అని ఓదార్చాడు.

"నిజమేరా మన చేతుల్లో లేదు. కాని చేతుల్లో ఉన్నవి కూడా ఒక్కటీ చెయ్యలేదు.

లతకు వెకేషన్ కు వెళ్ళడం ఎంత ఇష్టమో. ఖర్చులకు భయపడి ఇన్నేళ్ళ జీవితం లో ఒక్క కోరికా తీర్చలేదు.

ఆర్నెల్ల క్రితం, బాధ్యతలు తీరిపోయాయి కదా సింగపూర్ వెళ్దామని అడిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాక చూద్దామన్నాను.

ఎప్పటికప్పుడూ పిల్లల చదువులు, ఫీజులు కోచింగ్ లూ ఇవ్వే సరిపోయాయి, ఇప్పుడిహ ఏం చెయ్యగలను? మనకోసం మనం బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటాం?" అంటూ ఒకటే బాధపడ్డాడు.

ఎవరో చర్నాకోలా తీసుకుని కొట్టినట్టనిపించింది.

భాగ్యం ఆశలు ఒక్కటైనా తీర్చాడా?

నిజమే ఇద్దరూ జీవితం చివరి అంచుకు వచ్చేసారు. ఇప్పుడైనా ...

ఆ అంతర్మధనం అతనికో దారి చూపింది.

దారిలో ఆపి మల్లెపూల కొన్న అతన్ని ఇష్టంగా చూస్తూ -

"భగవంతుడా, ఈ పయనం ఇలా సాగనీ" అనుకుందామె.

********

Posted in January 2024, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!