Menu Close
SirikonaKavithalu_pagetitle

గతమంతా తలచి తలచి బావురు మన్నది చెట్టు!
గుతుకుల ప్రయాణమైనా...
గగనాన సూర్యుడు మండి పడినా..
నడచీ-నడచీ- రొప్పు కలిగినా,
కాసింత సేపు సేదదీరే.. ఏ బాటసారీ నా చేరువ చేరడమే లేదు!
పిల్లల ఆటపాటలన్నీ నా ఒడిలోనే- ఒకప్పుడు...
ప్రేయసీ ప్రేమికుల ఊసులన్నీ
నా నీడలోనే ఎప్పుడూ...
ముదిమి ముసిరినవేళ కసురులే లేని నా కాండమే వారికండై...
గతకాలపు వైభవమంతా ఏకరువు పెట్టే దంతా నా యెదలోనే...
ఏ నాడూ ఒకరి ముచ్చటలొకరికి చెప్పనే లేదు! ఐతేనేం?
ఇపుడెవరూ ఈ ఛాయల రావడానికిష్టపడడమే లేదు!
ఆ మనసుల భారం దింపుకుని వారెళ్ళి పోతే...
ఆ భారమంతా దాచి ఉంచానిన్నాళ్ళూ
నా గుబురులో...
గుట్టు విప్పమంటోంది శిశిరం!
బాటసారులు నచ్చాలనీ,
రంగులెన్నో మార్చాను!
డబ్బు గడించి ఆకుపచ్చగా,
పనులు సక్రమంగా సాగాలని ఎఱుపుగా,
ఆనందాల పూలెన్నో పూసాను,
శ్రేయస్సనే పండ్లెన్నో కాసాను,
చేతుల జవ ఉడిగి ఎండి,
మరో రంగు సంతరించుకున్నాను!
ఐనా! గుర్తింపేలేని చెట్టును!
విసిగి వేసారి పోయి, గతమెంతో ఘనమనే పాట మొదలెట్టాను!

ఒక్కో బాటసారికీ రాల్చానెన్నో
ముచ్చట్ల పత్రాలు!
భుజాలు కుంగిన ఇంటి పెద్దగా..
చింత జార్చి, మోడై నిలిచాను!
వసంతమొస్తేనే... వసివాడని చెట్టౌతాను! మరుజన్మకే...
పచ్చనూహల పునర్దర్శనమిస్తాను!

పదేళ్ళ బాల్యానికి అమ్మగుప్పెట వెచ్చదనం
భరోసా ఇచ్చేది
సముద్రం ఒడ్డున
అమ్మ చేయి చిటికెన వ్రేలు పట్టుకొని
నడుస్తున్న సాయంత్రాలు
ఇప్పటికీ కనుపాపల్లో సజీవంగానే కదులుతూంటాయి
జీవన పోరాటం మొదలయ్యాక కూడా
సముద్రం నన్ను వెంటాడుతూనే వుంది
ఇసకలోని పాదాలను ఈడ్చుకుపోతున్న
రాకాసి అలలు
ఆటుపోటులతో బెదిరిస్తున్నాయి
ఎగాదిగా చూసి వెకిలి నవ్వులు నవ్వే లోకం
చీకటి తప్పుల్లోకి లాగుతూ చేస్తున్న వికట హాసాలు
ఎన్నాళ్ళిలా?
అలల సుడిగుండాలలో కొట్టుకుపోతూ...
బతకడం ఏంటో నేర్పిన
ఈ కడలిని నేనూ వదలను
అమ్మ చేయి పట్టుకుని నడిచినట్టే
ప్రశాంతంగా తీరం చేరడానికి
సముద్రాన్ని వెంబడిస్తూనే వుంటాను

ఏడ్వాలి
గుండెలు అవిసేలా
గూడు కట్టుకున్న దుఃఖం
ఘనీభవించక ముందే
తనివి తీరా ఏడ్వాలి.

మగాడు ఏడవ కూడదన్న
పగవాడికి కూడా పనికి రాని
పసలేని మాటల్ని పక్కకు తోసేసి
మనసులోని గుబులు
మాయం అయ్యేలా ఏడ్వాలి

గది తలుపులు బిగించు కోనైనా
ఒంటరిగా ఓదార్చు కుంటూ
మది మోసిన మౌనానికి
తుది వీడ్కోలు ఇవ్వాలి

ఎన్నాళ్లుగా పేరుకున్న దుఃఖాన్ని
కన్నీళ్ల తో కడిగి వేయాలి
గుది బండ లాంటి గుప్పెడంత మనసును
దూది పింజాలకు వేదిక చెయ్యాలి

గానుగెద్దు జీవితం లో
గతాన్ని అంతా తవ్విపోసి
చివరగా ఏడ్చిన మధుర క్షణాలను
ముందేసుకొని మురవాలి

ఏడ్చి ఏడ్చి ఎర్ర మన్నయి
అమ్మ కొంగు తడిపిన
కమ్మనైనా రోజుల్ని
నాన్న వేళ్ళు తుడిచిన
కంటి కింద చారల్ని
కళ్ళు మూసుకుని కలగానైనా
కళ్ళ ముందు నిలపాలి

ఇసుక మేట వేసుకుని
ఇరుకైన మనసు చిదిమి
కళ్ళ నీళ్ల చలమను
కసి తీరా తవ్వాలి

నాలోని సున్నితత్వాన్ని
నాకు నేనుగా చంపుకుని
నల్ల బండలా ఎందుకు
మెల మెల్లగా మారాను?

ఇంటికొచ్చిన చుట్టం
వెళ్తుంటే ఏడ్చిన కళ్ళు
ఇంట్లో ఒకరు పొతే కూడా
స్పందన లేని బంధాలను మోస్తున్నాయ

మగాడ్ని అన్న భేషజం పక్కకు తోసి
మనసు తీరా ఏడ్చిన నా కళ్ళ సాక్షిగా
మీకో ఆరోగ్యపు చిట్కా చెబుతా
బరువు తగ్గటానికి
కరువు తీరా ఏడవటమే..

మస్తిష్కంలో అగరు ధూపమై
వలయాలు చుడుతోన్న
లోపలి కలలూ కన్నీళ్లూ కల్లోలాలూ
సంక్లిష్ట క్షణాల ఉద్వేగాలూ
ఉద్రేకాలూ....
భయద గీతాలై వెంటాడుతున్నాయి
అవ్యక్త సంవేదనల సరిహద్దుల్లో !
పక్షిలా అనంత దూరాల విషణ్ణ శూన్యంలో
గిరికీలు కొడుతోంది
లోపల వ్యక్తావ్యక్తంగా అణగి ఉన్న
ఆలోచన ఏదో ?

సుప్త చేతనలో  గళమెత్తిన స్వరాలేవో .....
ముక్తకంఠంతో నిశ్శబ్దమైన సముద్రగర్భంలో
నిర్వికల్ప వీణా తంత్రుల్ని
మీటుతున్నాయి.
గగనాన్ని తాకిన అల ఏదో
సంక్షుభిత  గీతమై అల్లుకుపోతోంది !
మృదంగమేదో మోగుతోంది ....
నలుదిక్కుల్ని  ఒకటి చేస్తోన్న
ఉరుమై;
శకల శకలాలుగా రాలిపడుతోంది
పొగమేఘమైన అంతర్దుఃఖం!

అంతట  నాలో .....
దుఃఖమూ మరణమూ అంటని
జీవన గీతికేదో
సన సన్నగా మొదలై ఉధృతమైన జోరు వానై కురుస్తూ;
ఈ లోకాన్నంతటినీ ముంచెత్తుతోంది.

Posted in January 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!