Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. ప్రకృతి వనరులు వ్యర్థ పరచి, తిరిగి పొందుట కుదరదు!
    గడచిపోయిన సమయమెపుడు, మరలి వెనుకకు కదలదు!!
  2. స్వాభిమానమును విడిచితే, బ్రతుకునకర్థముండదు!
    ఆధునికతకు భాష్యముగా, వికృత చేష్టే ఇమడదు!!
  3. మంచి వారితో చెలిమియొక, వాడని విరుల గుచ్ఛము,
    చెడు సహవాసము విడకుంటే, మిగులు బ్రతుకున ఖేదము!
  4. పరులను చులకన పరచితే, కోల్పోదువు గౌరవము,
    ఆత్మ గౌరవమే మనిషికి, అమూల్య ఆభూషణము!
  5. శత్రువుపై గెలుపుకొరకై, ఆయుధములను ధరించు,
    ద్వేష రక్కసి తరుముటకై, ప్రేమ జ్యొతి వెలిగించు!
  6. జటిల కార్య సాధనకొరకు, కావలె నేర్పరితనము,
    కఠినత్వమును బాపునదగు, ఔషధమే మృదుత్వము!
  7. అసందర్భపు ప్రేలాపన, తప్పక తెచ్చు బాధలు,
    వాక్కు సుద్ధి కలిగియుంటే, దరికి రావు సమస్యలు!
  8. పెద్దల అనుభవమ్ములతో, సుఖమౌ బ్రతుకు పయనము,
    అనాథలను ఆదరించిన, సఫలమగును జీవితము!
  9. చేదు జ్ఞాపకాల పుటపై, గీయకు బ్రతుకు చిత్రము,
    తీపి గురుతుల మేళనతో, జీవితమౌ విశిష్టము!

**** సశేషం ****

Posted in February 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!