Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు’ అనే నానుడి మహాభారతంలోని ఓ చిన్న సంఘటన నుండి వచ్చింది. పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు, వారి విహరించి ఎదుట తమ విలాసాలతో వారిని గేలిచేయాలనే దుర్బుద్ధితో భీష్మాది కురుముఖ్యులకు తెలియకుండా దుర్యోధనుడు, శకుని, కర్ణులు తదితరులు బయలుదేరి, ద్వైతవనం దగ్గరికి వేట మిషమీద వెళ్ళి అక్కడ నివసిస్తున్న చిత్రసేనుడనే గంధర్వరాజుతో తగువు తెచ్చుకున్నారు. ఆనక ఆ ప్రాంతంలో నివసిస్తున్న గంధర్వుల చేతిలో చిత్తుగా ఓడి, బంధింపబడిన దుర్యోధనుడి భంగపాటును పాండవులు చర్చించుకునే సందర్భంలో వచ్చింది ఈ నానుడి.

మనకు జులుకనయ్యె మన చేయు పనియ గంధర్వవరులు గూడి తగ నొనర్చి
రింత లెస్స యగునె యేభారమును లేక యూరకుండ మనలనొందదే జయము"

‘మన పని తేలికయిపోయింది, మనం చేయాల్సిన పని గంధర్వులు బాగా చేసేరు, మనం కలగజేసుకోకుండా ఊరుకుంటే జయం మనదేకదా” అని భీముడు అన్నాడట. ససేమిరా అన్న ధర్మరాజు ఆజ్ఞపై పిదప భీముడు తమ్ములతో బయలుదేరి వెళ్ళి గంధర్వ రాజు చిత్రసేనుడుతో మాట్లాడి ఆయన్ని ధర్మరాజు వద్దకు తీసుకువచ్చాడు. ధర్మరాజు ఆదరాభిమానాలకు సంతుష్టుడైన గంధర్వరాజు చిత్రసేనుడు - దుర్యోధనుడు, శకుని, కర్ణుడు తదితరులను విడిపించడం తరువాతి కథ. మహాభారతంలో అరణ్యవాసానికి వెళ్ళిన పాండవులను గేలిచేయాలని బయలుదేరిన దుర్యోధనుడి కథ మలుపు తిరగడానికి కారణం అక్కడ నివాసం ఉంటున్న స్థానిక గంధర్వులతో వారు పెట్టుకున్న తగువే. ధర్మరాజు దయతో బయటపడ్డ తరువాత - ఇంతటి అవమానం భరించే కన్నా గంధర్వుల చేతిలో ఓడిపోయినదే బాగుందేమో అనిపించి ఉండిఉంటుంది అభిమానధనుడైన దుర్యోధనుడికి, కదా!. ఆధునిక భారతంలో ఇలాంటి కథ ఒకటి ఉంది. ఆ కథే రామ జన్మభూమి కథ. దాదాపు 500 ఏండ్లు నడిచిన సుదీర్ఘ కథ ఇది. ఈ కథ పై పూర్తి అవగాహన కలిగి ఉండడం అంత సులభం కాదు! ఈ కథపై ఇటీవలి పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా పాఠకులకు కొంత అవగాహన ఉండే ఉంటుంది. కొద్దిగా లోతుకు వెళ్తే ఈ కథలో పాండవుల పాత్ర హిందువులది - గంధర్వుల పాత్ర నిహాంగ్ సిక్కులది, కె కె నాయర్ ది అని చెప్పవచ్చు. కౌరవుల పాత్ర ఎవరనేది మీ వూహకు వదిలేస్తున్నాను. ఈ నెల రచ్చబండ చర్చ గంధర్వుల సమానులైన నిహాంగ్ సిక్కుల గురించి, కె కె నాయర్ గురించి.

ముందుగా కొంత ఉపోద్ఘాతం, ఆ తరువాత కె కె నాయర్ గూర్చి కొంత, చివరిగా నిహాంగ్ సిక్కుల గురించి చర్చిద్దాం. 500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా సోమవారం, జనవరి 22, 2024 న అయోధ్యలో రామజన్మభూమిలో ఐదు ఏండ్ల వయస్సు తో ఉన్న సుందర బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పవిత్ర కార్యక్రమంతో, ఐదు వందల ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. రామమందిర నిర్మాణ కార్యక్రమం అంత సులువుగా ఏం జరగలేదు. రామాలయ నిర్మాణం కోసం ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. సుదీర్ఘ కోర్టు కేసులు రామాలయ నిర్మాణాన్ని సంక్లిష్టంగా మార్చాయి. ఈ క్రమంలో రామ జన్మభూమి ప్రాంతంలో దేవాలయం నిర్మాణం, దాని కూలగొట్టి బాబర్ చేపట్టిన వివాదాస్పద కట్టడ నిర్మాణం నుంచి రామాలయ ప్రాణ ప్రతిష్ట వరకు.. గత 500ఏళ్లలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలను ఇప్పుడు ఓసారి గుర్తు చేసుకుందాం.

1528 కి పూర్వం: రామ జన్మస్థలంగా పరిగణించబడే అయోధ్య, ఉత్తరప్రదేశ్‌లోని సరయు నది ఒడ్డున ఉంది. పురాణాలలో మహారాజైన ఆయుధ్ ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అనే రాజు అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. రాముడు సరయు నదిలో ప్రాయోపవేశం చేసి రామావతారాన్ని ముగించిన పిదప ఆయన కుమారుడు లవుడు రామ జన్మస్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు అని ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తిగా పేరు గాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. తరువాత ఉజ్జయినీ సామ్రాజ్యానికి రారాజు విక్రమాదిత్యుడు (102 BCE నుండి 15 BCE వరకు) అయోధ్యను సందర్శించి శిధిలావస్థలో ఉన్న రామ జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడు అని కూడా ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చెప్పారు. ఇంకా వేదాలలో, పలు పురాతన గ్రంధాలలో కూడా రామ జన్మస్థలం ప్రస్తావన ఉంది - ఇది సుప్రీం కోర్టు కూడా తన తుది తీర్పులో పలుమార్లు ప్రస్తావించింది.

1528: బాబ్రీ మసీదు ప్రారంభం: రామ జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని బలవంతంగా కూల్చి మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మీర్ బాకీ 1528లో ఓక మసీదును నిర్మించాడు. అప్పటి నుంచి రామ మందిర ఉద్యమం రాజుకుంది. రామమందిరంను కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించారన్న గట్టి నమ్మకాల నేపథ్యంలో శతాబ్దాలుగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు అయోధ్య వేదికగా మారింది.

1858: నిహాంగ్ సిక్కుల డిమాండ్ - అయోధ్య రామజన్మ భూమిపై నియంత్రణ కోసం పోరాటానికి తొలి అడుగు 1858లో పడింది. ఆ ఏడాది నిహాంగ్ సిక్కులు శ్రీరాముడి జన్మస్థలంగా బాబ్రీ మసీదును చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వివాదాస్పద స్థలంపై నియంత్రణ కోసం పోరాటానికి నాంది పలికింది. అప్పటి నుంచి వివాదం రాజుకుంది. ఈ సంఘటన గూర్చి ఈ చర్చలో క్రింద విపులంగా ప్రస్తావిస్తాను. 2019 సుప్రీంకోర్టు తీర్పులో ఈ విషయాన్ని పేర్కొంది. అంతేకాదు రామ జన్మభూమిని హిందువులకు కేటాయిస్తూ సుదీర్ఘమైన చట్టపరమైన కథకు ముగింపు పలికింది.

1859: కంచెతో మసీదుని, మందిరాన్ని వేరు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం: 1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని బ్రిటిష్ వారికి విజ్ఞప్తి చేయడంతో అప్పటి బ్రిటిష్ ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు.

1885: బాబ్రీ మసీదుపై మొదటి కేసు - 1885లో మసీదు బయటి ప్రాంగణంలో రామాలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్.. మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబుత్ర నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. బాబ్రీ మసీదుపై ఇదే మొట్ట మొదటి దావా. ఈ దావానే ఈ వివాదాన్ని అధికారికంగా రికార్డు చేసి.. సజీవంగా ఉంచింది. బ్రిటీష్ పాలకులు వివాదస్పద స్థలంలో హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు ప్రార్థనా స్థలాలను గుర్తించి..కంచెలను ఏర్పాటు చేశారు. దాదాపు 90ఏళ్లపాటు అలాగే హిందువులు, ముస్లింలు పూజలు చేశారు.

1949-1952: అయోధ్య, ‘ది బ్యాటిల్ ఫర్ ఇండియాస్ సోల్: ది కంప్లీట్ స్టోరీ’ పేరుతో డిసెంబర్ 10, 2012 కృష్ణ పోఖారెల్ మరియు పాల్ బెకెట్ అనే ఇద్దరు రచయితలు ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ దిన పత్రికకు సోదాహరణంగా 80 పేజీల కథనం రాశారు. ఈ కథనంలో వారు నెహ్రూ పేరు 16 సార్లు ఉపయోగించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కొత్త దేశాన్ని సుస్థిరం చేసే భాగంగా భారతదేశాన్ని దాని పౌరులందరి మత విశ్వాసాలను గౌరవించే లౌకిక దేశంగా స్థాపించాలని నిశ్చయించుకున్నాడు. అయితే అప్పటికే వేల ఏండ్ల ఘనమైన చరిత్ర కలిగి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపునొందిన భారత్ ను అప్పటికప్పుడు లౌకిక దేశంగా మార్చడం సాధ్యమా? అయితే తాను కన్న లౌకిక రాజ్యం కలలను అటు వ్యక్తిగతంగా తన చుట్టూ ఉన్న వందిమాగధుల పై, ఇటు అధికార వ్యవస్థ ద్వారా ప్రజలపై నెహ్రూ రుద్దడం ప్రారంభించాడు. అప్పుడే స్వాతంత్రం పొందిన వేళ యువ భారత్ లో ప్రతిపక్షం బలహీనమైన ఉన్న నేపథ్యంలో నెహ్రూ ప్రజాస్వామ్యం ముసుగులో తన లౌకిక రాజ్య అభిప్రాయాల అమలుకు ఉపక్రమించాడు అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అయితే రామజన్మ భూమి విషయంలో నెహ్రూ కు ఊహించని రీతిలో అభిరామ్ దాస్ రూపంలో దెబ్బ తగిలింది. 1949 లో అయోధ్యలో ఉన్న అప్పటి వేలాదిమంది సాధువులలో అభిరామ్ దాస్ ఒకరు. బలమైన ఆధ్యాత్మిక స్వరం, కోపాన్ని కలిగి ఉన్న కండలు తిరిగిన సాధువు ఆయన. అతను రాముడిని గౌరవించాడు, తాను నమ్మిన దేవుడు పుట్టిన ఖచ్చితమైన రామ జన్మభూమి ప్రదేశంలోనే బాల రాముడి విగ్రహాన్ని పునరుద్ధరించడం ఆయన లక్ష్యం. అయితే తన అన్వేషణలో అతను ఒంటరివాడు కాదు అని ఆయన త్వరలోనే తెలుసుకున్నాడు. ఎందుకంటే అదే లక్ష్యం కోసం అంకితమైన అనేకమంది సాధువులను ఆయన కలుసుకున్నాడు, వారందరూ ఆయనకు అండగా నిలిచారు. అభిరామ్ దాస్ తన ఇద్దరు శిష్యులుతో మాట్లాడుతూ, వివాదాస్పద కట్టడం యొక్క మధ్య గోపురం క్రింద ఉన్న రామ్ లల్లా (బాల రాముడి పేరు) ఉన్నట్లు తనకు కల వచ్చిందని, అని ఆయన అప్పుడు చెప్పాడట. 1949 మధ్యలో ఒకరోజు, అయోధ్య పరిపాలనను పర్యవేక్షిస్తున్న పొరుగున ఉన్న ఫైజాబాద్‌లోని సిటీ మేజిస్ట్రేట్‌ గురుదత్ సింగ్‌ ను కలసి సాధు అభిరామ్ దాస్ తనకు వచ్చిన కలను చెప్పాడు. గురుదత్ సింగ్‌ అప్పుడు ఇలా అన్నాడట ... "సోదరా, ఇది నా పాత కల. మీరు ఇప్పుడు దానిని మళ్ళీ నాకు గుర్తు చేశారు; నేను చాలా కాలంగా ఈ కలను కంటున్నాను". వివాదాస్పద కట్టడం ఉన్న చోటనున్న ఒక హిందూ కాపలాదారుడుకి రాముడి గుణాలు చెప్పడంద్వారా అతడిని తనకు సహకరించేలా అభిరామ్ దాస్ నచ్చ చెప్పాడు. తద్వారా సాధువుల యొక్క చిన్న సమూహాన్ని తన కాపలా కాసే సమయంలో రాముడి విగ్రహంతో వివాదాస్పద కట్టడం లోకి చొచ్చుకుపోవడానికి ఆ కాపలాదారుడు అంగీకరించాడు. 1949లో ఒక రోజు తెల్లవారుజామున 3 గంటలకు, హిందూ మతంలో ఒక శుభ సమయాన, సాధువులు నిర్ణయించిన ముహూర్తానికి అభిరామ్ దాస్ మరియు ఇతర సాధువులు వివాదాస్పద కట్టడం ఉన్న లోపల చిన్న గంటలు మోగించడం ప్రారంభించారు. వారు అక్కడ దీపం వెలిగించి, మధ్య గోపురం క్రింద ఉన్న పల్లకీపై ఉంచిన చిన్న విగ్రహాన్ని ప్రతిష్టించారు. అది సుమారు ఏడు అంగుళాల పొడవు, ఎనిమిది లోహాలతో తయారు చేయబడిన బాల రాముడి విగ్రహం. విగ్రహం విజయవంతంగా ప్రతిష్టించబడిందని, వివాదాస్పద కట్టడం సాధువులతో నిండిపోయిందని అధికారులు తదుపరి గుర్తించారు. విగ్రహాన్ని చూసేందుకు వేలాది మంది హిందూ భక్తులు అప్పుడు తరలివచ్చారు.

వివాదాస్పద కట్టడంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన వార్త విని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఆయన కాలి క్రింద భూమి కంపించినట్లు అయింది. అప్పటికి నెహ్రూ దేశాన్ని ఆధునిక సోషలిజం మరియు తనదైన శైలిలో శాస్త్రీయ ఆలోచనా యుగంలోకి నడిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. "అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను కలవరపడ్డాను" అని నెహ్రూ డిసెంబర్ 26, 1949న యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌కు టెలిగ్రామ్‌లో చెప్పారు, అప్పటి ఈ ప్రావిన్స్ లో ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. "ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా ఆసక్తి చూపుతారని తీవ్రంగా ఆశిస్తున్నాను. చెడు పరిణామాలకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి అయోధ్యలో ఉంది" - అని ఆ టెలిగ్రామ్ లో ఆయన పంత్‌కుచెప్పారు. నెహ్రూ చెప్పిన తరువాత గోవింద్ వల్లభ్ పంత్‌ స్పందించకుండా ఉంటాడా? నెహ్రూ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని తొలగించాలని స్థానిక అధికారులను కోరింది. ఆ సమయంలోనే, నగర మేజిస్ట్రేట్ గురుదత్ సింగ్ రాజీనామా చేశారు. అయోధ్యను పర్యవేక్షించిన ఫైజాబాద్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కెకె నాయర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌ ఆదేశాలను అమలుచేయడానికి నిరాకరించారు. విగ్రహాన్ని తొలగించడం అనేది "ప్రజా శాంతికి అత్యంత ప్రమాదకరం" అని "ఆ పని భయానక విధ్వంసానికి దారి తీస్తుందని" అని కెకె నాయర్ మొండికేసాడు. పంత్ ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ కెప్టెన్ వివాదాస్పద కట్టడంలో ఉన్న విగ్రహాన్ని తొలగించాలన్న నిర్ణయంతో తాను ఏకీభవించటం లేదని నాయర్ పేర్కొన్నారు. "ఒకవేళ విగ్రహాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ తొలగించాలని ప్రభుత్వం కోరుకున్నట్లయితే.. ముందు తనను తొలగించి వేరే జిల్లా కలెక్టర్‌ను ఇక్కడ నియమించాలని" అని పంత్ ముఖ్య కార్యదర్శి భవన్ సహాయ్‌కి కె కె నాయర్ ఒక ఉత్తరం రాశారు. నిజానికి వివాదాస్పద కట్టడంలో ఆంక్షలు ఉల్లంఘించి, విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతిస్తే ఢిల్లీలోని నెహ్రూ మరియు ఆయన లౌకిక ప్రభుత్వం ఎంత ఆగ్రహానికి లోనవుతాయో నగర మేజిస్ట్రేట్ గురుదత్ సింగ్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కె కె నాయర్ ఇద్దరికీ బాగా తెలుసు అని గురుదత్ సింగ్ కుమారుడు ఇటీవల చెప్పాడు. దాంతో విగ్రహాన్ని తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రాజీనామా చేయాలని వారిద్దరూ ముందే నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు.

`ది డెమోలిషన్ అండ్ ది వెర్డిక్ట్’ అనే తన పుస్తకంలో జర్నలిస్ట్ నీలాంజన్ ముఖోపాధ్యాయ ఇలా వ్రాశాడు: “1950లో నెహ్రూ ఆదేశాల మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై చర్య తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నప్పుడు విగ్రహం తీసివేస్తే అక్కడి స్థానిక కాంగ్రెస్ శాసన సభ్యుడు బాబా రాఘవ్ దాస్ అసెంబ్లీకి, పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించాడు". 1948లో స్థానిక శాసన సభ్యుడు నరేంద్ర దేవ్ అనే ఆయన ప్రత్యేక సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ నుండి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రత్యేక సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నుండి వాకౌట్ చేసిన 13 మంది ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఉన్నారు. బాబా రాఘవ్ దాస్‌ను యూపీ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ దగ్గరుండి స్వయంగా ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. హేతువాది నరేంద్ర దేవ్‌కు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపే బాబా రాఘవ్ దాస్ ధీటైన ప్రత్యర్థిగా అందరూ భావించారు. ముఖోపాధ్యాయ పుస్తకంలో వ్రాసిన ప్రకారం నరేంద్ర దేవ్ ఓటమి కోసం అప్పటిలో ముఖ్యమంత్రి పంత్ స్వయంగా అయోధ్యలో బాబా రాఘవ్ దాస్ కోసం ప్రచారం చేసాడు. నరేంద్ర దేవ్ భగవంతుడిని నమ్మని నాస్తికుడు అని పట్టణంలోని ప్రజలకు పంత్ చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, సోషలిస్ట్ అగ్రనేత ఆచార్య నరేంద్ర దేవ్‌ను దాదాపు 1,300 ఓట్ల తేడాతో పంత్ మద్దతుతో బాబా రాఘవ్ దాస్ ఓడించాడు. ఇది గతం. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం.. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు అన్నట్టు, విగ్రహం తొలగింపుకు నడుంకట్టిన నెహ్రూ, పంత్ ద్వయానికి బాబా రాఘవ్ దాస్ "రాజీనామా బెదిరింపుతో" ఝలక్ ఇచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే, సోషలిస్ట్ అగ్రనేత ఆచార్య నరేంద్ర దేవ్‌ను ఓడించాలని "పంతం" పట్టి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పంత్ వదిలిన బాబా రాఘవ్ దాస్ బాణం చివరికి పంత్ మీదకే వచ్చింది. ఇదంతా విన్న తరువాత - అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట - పాట గుర్తుకురాని తెలుగువాడు ఉంటాడా?

బాబా రాఘవ్ దాస్ 1958లో మరణించారు. డిసెంబర్ 12, 1998న, వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో, నెహ్రూతో తలపడిన ‘రామ్ భక్త్’ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ్ఞాపకార్థం ఒక తపాలా స్టాంపును దాస్ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం విడుదల చేసింది.

మరోపక్క వివాదాస్పద కట్టడం కింద రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహం ప్రతిష్ఠాపనతో అయోధ్యలో ఉన్న స్థానిక హిందువులు ఉత్తేజితం చెందారు. మరిన్ని విగ్రహాలు, ఒక చిన్న వెండి సింహాసనం; పూజకు ఇత్తడి పాత్రలు, ఆ విగ్రహాలకు బట్టలు తదితర సామగ్రిని వివాదాస్పద కట్టడం కింద ఉన్న రామ్ లల్లా విగ్రహం వద్దకు తరలించారు. అయితే కలత చెందిన నెహ్రూ తన ఒత్తిడిని ఆపలేదు. "మిస్టర్ పంత్ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు, అయితే అయోధ్యలోని ప్రజలకు ముందుగా పరిస్థితిని వివరించడానికి కొంతమంది సుప్రసిద్ధ హిందువులను కలిసి వారి మద్దతు పొందాలని అతను కోరుకున్నాడు" అని నెహ్రూ జనవరి 7, 1950 నాటి భారత గవర్నర్ జనరల్‌కు ఒక లేఖ రాశారు. నెహ్రూ చెప్పిన "మిస్టర్. పంత్ చర్యలు" అంటే ఏమిటో పాఠకులు ఊహించుకోవచ్చు. బహుశా వివాదాస్పద కట్టడం లోకి పోలీసులను పంపి బలవంతంగా పని పూర్తిచేసేవాడా? తెలియదు! వారాలు గడిచాయి. విగ్రహం మాత్రం అక్కడే ఉండిపోయింది.

1950లో భారత్ మరియు ముఖ్యంగా కాశ్మీర్ పై ఇది తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని కూడా నెహ్రూ భయపడ్డాడు, అతను ఫిబ్రవరి 5, 1950న పంత్‌కు ఇలా ఉత్తరం వ్రాసాడు "ఢిల్లీ నుంచి అయోధ్య వరకు 600 కిలోమీటర్ల యాత్ర చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని", కానీ ప్రస్తుతానికి తానూ చాలా తీరికలేకుండా ఉన్నాను అని కూడా ఆ ఉత్తరంలో నెహ్రూ పేర్కొన్నాడు. చివరికి నెహ్రూ యాత్ర చెయ్యనే చేయలేదు. 1950 మార్చి నాటికి, విగ్రహాన్ని తొలగించడం అనే తన ఆదేశాలను స్థానిక అధికారులు అడ్డుకోవడంతో నెహ్రూ నైతికంగా ఓడిపోయాడు. తన కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది సహకరించడంలేదని అప్పుడు నెహ్రూ విలపించారు. 1952లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం అప్పటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నెహ్రూ పర్యటించారు, అంతేకాదు "అయోధ్య సంఘటన నన్ను సిగ్గుపడేలా చేసింది" అని ఆ ప్రచారంలో నెహ్రూ చెప్పాడు. అంతకు మునుపు జనవరి 1950లో, బాబ్రీ మసీదు స్థలంపై అయోధ్యలోని హిందువులు మరియు ప్రతివాదుల మధ్య దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం ప్రారంభమైంది. మొదటి కేసును పొరుగున ఉన్న ఫైజాబాద్‌లోని విక్టోరియన్ గోతిక్ జిల్లా కోర్టు భవనంలో గోపాల్ సింగ్ విశారద్ అనే హిందువు దాఖలు చేశారు. విశారద్ అనే అతను జిల్లా మేజిస్ట్రేట్ కె కె నాయర్ మరియు నగర మేజిస్ట్రేట్ గురుదత్ సింగ్‌తో సన్నిహితంగా ఉండేవాడు. విశారద్ "ఏదైనా అడ్డంకులు లేకుండా రామ్ లల్లాను పూజించే హక్కు" కోసం దావా వేశారు అంతేకాదు స్థానిక ప్రభుత్వ అధికారులు విగ్రహాలను తొలగించకుండా నిరోధించడానికి "తాత్కాలిక నిషేధం" కోరారు. అప్పటి న్యాయమూర్తి నిషేధాన్ని మంజూరు చేసారు. స్థానిక అయోధ్య నివాసి అనిసూర్ రెహమాన్ ఒక కోర్టు పిటిషన్‌ను దాఖలు చేశాడు - "విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ముస్లింలు తమ మసీదును వెనక్కి తీసుకునేందుకు జిల్లా అధికారులు ఏమీ చేయలేదని" ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. "బదులుగా, జిల్లా అధికారులు కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు" అని కూడా ఆయన ఆరోపించారు. అయితే రెహమాన్ ప్రయత్నాన్ని అయోధ్యకు చెందిన దాదాపు 20 మంది స్థానిక ముస్లింలు ప్రతిఘటించారు, వారు అందరూ స్థానిక న్యాయస్థానంలో ఒకే విధమైన అఫిడవిట్‌లపై సంతకం చేశారు. "వివాదాస్పద కట్టడంను హిందువులు స్వాధీనం చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. రామజన్మభూమిని కూల్చివేసి బాబర్ అక్కడ ఒక మసీదును నిర్మించారని అన్నారు. కాబట్టి ఒకప్పుడు ఆలయం ఉన్నచోట ప్రార్థనలు చేయడం ఇస్లామిక్ చట్టానికి విరుద్ధం’ అని వారు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. రెహమాన్ పిటిషన్ కొట్టివేయబడింది. రెహమాన్ తన దుకాణాన్ని విక్రయించి 1950వ దశకం ప్రారంభంలో, అతను తన కుటుంబంతో కలిసి పాకిస్తాన్‌కు వలస వెళ్లాడని పలువురు స్థానిక ముస్లింలు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ కె కె నాయర్ వివాదాస్పద కట్టడంలో నెలకొల్పబడిన రామ్ లల్లా విగ్రహాలకు పూజల నిమిత్తం పూజారికి ప్రభుత్వమే జీతం చెల్లించాలని, ఆ పూజలను అడ్డుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు. పుండు మీద కారం చల్లినట్లుగా భావించిన నెహ్రూ.. ప్రభుత్వ ఉద్యోగం నుండి కె కె నాయర్ ని సాగనంపాలని పంత్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. తగ్గేది లేదని కె కె నాయర్ అలహాబాదు కోర్టులో ముఖ్యమంత్రి ఆదేశాలకు వ్యతిరేకంగా పోరాడి గెలిచారు. కె కె నాయర్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అంతే కాదు ఆయన్ని ఎక్కడైతే తొలగించారో అక్కడే తిరిగి నియమించాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశం నెహ్రూకు చెంప పెట్టు లా తగిలింది. ఈ నేపథ్యంలో నెహ్రూ వైఖిరితో విసుగు చెందిన అయోధ్య స్థానికులు కె కె నాయర్ భార్యను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అప్పటి విధాన సభ ఎన్నికల్లో గెలిపించారు. పిదప నెహ్రూ ఒత్తిడికి నిరసనగా కె కె నాయర్ 1952 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో చేరారు. ఆయన భార్య శకుంతల నాయర్ జనసంఘ్ తరపున మొత్తం గా ఒక సారి ఎమ్మెల్యే గా మూడు సార్లు ఎంపీ గా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు, ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు. ఎంపీలు గా బహ్రైచ్ మరియు కైసర్‌గంజ్ నియోజకవర్గాలను నాయర్ మరియు అతని భార్య గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేసారు. అప్పట్లో వారిది అది ఒక చారిత్రాత్మక విజయం. కె కె నాయర్ కారు డ్రైవర్ కూడా ఫైసలాబాద్ ఎం ఎల్ ఏ గా గెలిచాడంటే ప్రజలు కె కె నాయర్ ను ఎంతగా అభిమానించారో మనకు అర్ధం అవుతుంది. 1977లో కె కె నాయర్ కేరళలోని తన స్వగ్రామంలో మరణించినప్పుడు ఆయన చితాభస్మాన్ని సేకరించేందుకు అయోధ్యనుండి ఒక బృందం బయలుదేరింది. వారు ఆయన చితాభస్మాన్ని ఒక రథంలో ఊరేగించి రామ జన్మభూమిని ఆనుకొని ఉన్న సరయూ నదిలో నిమజ్జనం చేశారు. జనవరి 22, 2024 న నూతన 51 అంగుళాల రామ్ లల్లా శిలా విగ్రహం ప్రతిష్టాపనకు మునుపు అప్పటివరకు వివాదాస్పద కట్టడం లో ఉన్న ఏడు అంగుళాల రామ్ లల్లా లోహ విగ్రహానికి నిరాటంకంగా పూజలు జరగడానికి జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో అప్పుడు కె కె నాయర్ ఇచ్చిన ఆదేశాలే కారణం.

1964: 1964లో, కోర్టు మొత్తం నాలుగు దావాలను ఏకీకృతం చేసింది - గోపాల్ సింగ్ విశారద్; దిగంబర్ అఖారా నుండి సాధు; నిర్మోహి అఖారా, మరియు వక్ఫ్ బోర్డు వేసిన దావాలు, మొత్తం నాలుగు.

1976: ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కె.కె. మహ్మద్ బృందం వివాదాస్పద కట్టడం కింద సారిగా 1976లో ఒక ఆలయ శిథిలాలను కనుగొన్నారు. 1976లో బాబ్రీ మసీదు స్థలంలో తవ్వకాలు జరిపిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. ఈయన పూర్తి పేరు కరీంగమన్ను కుజియిల్ మహమ్మద్. ఈయన కేరళలోని కాలికట్ లోని కోడువల్లి గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మహ్మద్ అప్పట్లో జరిపిన తవ్వకాల్లో అష్టమంగళ చిహ్నంలో అమర్చబడిన 12 స్తంభాలతో ఒక ఆలయ పునాది బయటపడింది. మనుషులు, జంతువులకు సంబందించిన విగ్రహాలు ఆలయం ఉనికిని ఊహించడానికి కారణమైంది. ఈయన జరిపిన పరిశోధనలో అయోధ్య రామజన్మభూమి గా భావిస్తున్నస్థలంలో దేవాలయం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ బాబ్రీ మసీదు, అయోధ్య వివాద సమయంలో చరిత్రకారుడైన ఇర్ఫాన్ హబీబ్ అలహాబాద్ హైకోర్టును తప్పుదోవ పట్టించారని అప్పట్లో కేకే మహ్మద్ ఆరోపించారు. బాబ్రీ మసీదు, అయోధ్య వివాద స్థలాన్ని హిందువులకు మర్యాదపూర్వకంగా అప్పజెప్పాలని కేకే మహ్మద్ ముస్లిం సంఘాలకు సూచించారు. ముస్లింలు మసీదు ఎక్కడైనా నిర్మించుకోవచ్చునని, మసీదులు నిర్మించిన ప్రదేశాల పట్ల హిందువులకు ఉన్నంతగా ముస్లింలకు సెంటిమెంట్స్ లేవని ఆయన అన్నారు. రామజన్మభూమిగా విశ్వసిస్తున్న ఆ స్థలాన్ని హిందువులకు ఇవ్వడమే న్యాయమని అప్పట్లో ఆయన అన్నారు. రాముడు జన్మ స్థలంగా హిందువులకు ఒక అటాచ్ మెంట్ ఉందని.. కాబట్టి ఆ స్ధలాన్ని వారికి అప్పజెప్పాలని అన్నారు. అంతేకాదు.. మధుర, జ్ఞానవాపి మసీదులను కూడా హిందువులకు అప్పజెప్పాలని కెకె మహ్మద్ అన్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన ఎంతో నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.

1985: షా బానో అనే ముస్లిం మహిళ కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని నిరాశ్రయులయ్యారు. క్రిమినల్‌ కేసు పెట్టింది. అయితే ఇస్లాం ప్రకారం తాను ఇద్దత్‌ కాలానికి (మూడు నెలలు) మాత్రమే భరణం చెల్లిస్తానని షాబానో భర్త వాదించాడు. మూడు నెలలు చాలా కొద్ది సమయమని, పేదరికంతో తనను తానూ పోషించుకోలేని స్థితిలో ఉన్న తనకు భరణం చెల్లించేలా తన మాజీ భర్తను ఆదేశించాలని ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసింది. 1985 వసంతకాలంలో, భారతీయులందరికీ వర్తించే భారతీయ క్రిమినల్ చట్టంలోని పేదరికానికి వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ముస్లిం మతాధికారులలోని ప్రముఖ సభ్యులు ఈ తీర్పును దీర్ఘకాలంగా ఆచరిస్తున్న ఇస్లామిక్ చట్టానికి ముప్పుగా వారు భావించారు. దీని ప్రకారం విడాకులు తీసుకున్న మూడు నెలల తరువాత భరణం అవసరం లేదు. కానీ న్యాయమూర్తులు విడాకులు తీసుకున్న వ్యక్తికి భరణం చెల్లించాలని ఆదేశించారు. తొలుత రాజీవ్ గాంధీ ఈ విప్లవాత్మకమైన కోర్టు తీర్పుగా సమర్థించారు. గాంధీ ప్రభుత్వంలో ముస్లిం మరియు మంత్రి అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా ఈ తీర్పును ప్రశంసిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే ముస్లిం మతపెద్దలు ప్రధానిపై ఒత్తిడి తెచ్చి ఈ తీర్పుపై తమ నిరసన తెలిపారు. పార్లమెంటు చట్టం ద్వారా కోర్టు తీర్పును ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ లొంగిపోయి, సుప్రీం కోర్టు తీర్పును ప్రభావవంతంగా తోసిపుచ్చే చట్టంను పార్లమెంటులో తనకున్న మందబలం ద్వారా తీసుకొచ్చారు. 1986 షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా రద్దు చేయడాన్ని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నిరసిస్తూ కేంద్ర క్యాబినెట్ నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు (ప్రస్తుతం ఈ రచ్చబండ చర్చ రాసేనాటికి ఈయన కేరళ గవర్నర్ గా ఉన్నారు). ఈ లోగా రామ జన్మ భూమి ఉద్యమం ఊపందుకుంది, దీంతో రాజీవ్ గాంధీ వివాదాస్పద కట్టడం గేటుకు ఉన్న తాళం తీసి పూజలకు అనుమతించడం ద్వారా హిందువుల మెప్పు పొందడానికి పావులు కదిపారు. ఒక కోర్టు ఆదేశాలమేరకు జరిగిన ఈ తాళం తొలగించే కార్యక్రమం దేశమంతా ప్రసారం చేయబడింది. మరోవైపు తాళం తెరవడంపై ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ఏదైనా చేయాలన్న ప్రధాని పథకం బెడిసికొట్టింది. ‘రెంటికీ చెడిన రేవడి చందాన’ అంటే ఇదేనేమో! ఈ నేపధ్యంలో హిమాలయాల దిగువన ఉన్న పాలంపూర్‌లో జూన్ 1989లో జరిగిన సమావేశంలో, బిజెపి జాతీయ కార్యవర్గం రామ మందిరాన్ని నిర్మించాలనే డిమాండ్‌ను ఆమోదించింది, దానిని హిందూ పేరు "రామ జన్మభూమి" అని పిలిచింది. మొత్తానికి తన మళ్లీ ఎన్నికల అవకాశాలను పెంచుకోవడానికి అయోధ్యను ఉపయోగించుకోవాలనే రాజీవ్ గాంధీ వ్యూహం విఫలమైంది. 1989లో ముస్లింలు రాజీవ్ గాంధీ అనుమతించిన శిలాన్యాల ప్రదర్శనలో మసీదుకు ప్రత్యక్ష ముప్పును చూశారు. 1989లోనే అనేక మంది ముస్లింలు అప్పుడే అక్కడున్న మసీదు కట్టడానికి మూడింది అనే నిర్ణయానికి దాదాపు వచ్చారు. మరోవైపు రాముని జన్మస్థలంగా భావించే బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో దేవాలయం కావాలని కోరుకునే హిందువులు - మసీదు స్థానంలో కాక దాని సమీపంలోని దేవాలయ నిర్మాణంతో సంతృప్తి చెందలేదు. "మేము ఉపయోగించిన వ్యూహాలు మాపైకి తిరిగి వచ్చాయి, ఏంచేస్తాం!" అని కాంగ్రెస్ నాయకుడు అయ్యర్ అప్పుడు అన్నారు.

1989: పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు మరియు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా మిగిలిపోయింది. కానీ అది చాలా సీట్లను కోల్పోయింది, రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించకూడదని నిర్ణయించుకున్నారు. బదులుగా, అతని ప్రత్యర్థులు ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. గాంధీ ప్రభుత్వంలో మాజీ ఆర్థిక మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జనతాదళ్ లో చేరి ఎన్నికల్లో గెలిచి కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్‌లో బీజేపీ రెండు స్థానాల నుంచి 85కి చేరుకుంది. కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి మరియు పార్లమెంటులో వర్కింగ్ మెజారిటీని అందించడానికి బీజేపీ ముందుకు వచ్చింది. ఈ వ్యూహం రాబోయే నెలల్లో అయోధ్యపై కసరత్తు చేయబోయే బీజేపీకి భారీ బూస్టింగ్ ఇచ్చింది.

1992 - 2018: 1992లో వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చివేశారు. తరవాత దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. 1993,94లోనూ దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది చనిపోయారు. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. 1994లో వివాదాస్పద స్థలాన్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది. దీన్ని కొందరు ముస్లిం నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేంద్ర నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఆ తరువాత రామజన్మ భూమి గురించి పలు సంఘటనలు జరిగాయి. 1993 మార్చి 12వ తేదీన ముంబై 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 257 మంది మరణించారు. మరో 713 మంది గాయపడ్డారు. దావూద్ ఇబ్రహీం ఈ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాడని సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది. దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు, డి - కంపెనీ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ప్రతీకారంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు శిక్షణ తీసుకుని పథకం ప్రకారం పెద్ద యెత్తున పేలుళ్లకు పాల్పడ్డారు. టైగర్ మెమెన్ సహకారంతో దావూద్ ఇబ్రహీం పథకం ప్రకారం ఈ పేలుళ్లకు కుట్ర చేశాడని ఆరోపణలు వచ్చాయి.

2019: 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రాముడి ఆలయ నిర్మాణానికి కేటాయించాలని, 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీం కోర్టు తుది తీర్పుగా ఆదేశించింది. తద్వారా వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలుగా చేసి ముగ్గురికి పంచడమనే 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పు ను, వివాదాస్పద భూమి విభజన జరిగిన తీరు సరికాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 1510-11 ADలో గురునానక్ అయోధ్యకు తీర్థయాత్ర చేసి రామమందిరంలో ప్రార్థనలు చేశాడని నాలుగు జనంసాఖిలు (మొదటి సిక్కు గురువు గురునానక్ జీవిత చరిత్రలు) నిస్సందేహంగా, వివరంగా పేర్కొన్నారని కోర్టు గమనించింది. 1858లో కూడా నిహాంగ్ సిక్కుల బృందం మసీదులో పూజలు చేసిందని కూడా కోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జుఫర్ ఫరూఖీ ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను తీర్పును అంగీకరిస్తున్నానని, దాని కోసం రివ్యూ పిటిషన్‌ను సమర్పించబోనని ప్రకటించాడు. ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ ఈ తీర్పును సమర్ధించాడు, వివాదం ఇకపై కొనసాగకూడదని చెప్పాడు.

2024: ఆనక జనవరి 22, 2024 న అయోధ్య రామజన్మభూమిలో బాల రాముడు కొలువుదీరాడు. ఈ కొత్త విషయాల గురించి మాట్లాడుకుంటే అభినవ గంధర్వులు అయిన నిహాంగ్ సిక్కుల విషయం వెనక్కుపోతుంది. రచ్చబండ చర్చ మొదలుపెట్టిందే వీరి గురించి, కె కె నాయర్ గురించి కూడాను. కె కె నాయర్ నేపధ్యం గురించి కొంత చర్చ జరిగింది కాబట్టి నిహాంగ్ సిక్కుల గురించి కొంత తెలుసుకుందాం.

నిహాంగ్‌లు ఎవరు?

నిహాంగ్ అనేది సిక్కు యోధుల పేరు. వీరు నీలం రంగు వస్త్రాలు, కత్తులు, ఈటెలు వంటి పురాతన ఆయుధాలు, ఉక్కు చక్రాలు, తలపాగాలతో ఉంటారు. నిహాంగ్ సిక్కుల లక్షణాలు అనేవి నిశ్శాంక్ అనే సంస్కృత పదం నుండి వచ్చినట్లు అనిపిస్తుందని బల్వంత్ సింగ్ అనే చరిత్రకారుడు అన్నారు. నిశ్శాంక్ అంటే భయం లేకుండా, పవిత్రంగా, స్వచ్ఛంగా… కోరికలు, సౌకర్యాలపై ఆశ లేకుండా ఉండటమేనని ఆయన తెలిపారు. 19వ శతాబ్దపు చరిత్రకారుడు రత్తన్ సింగ్ భంగు ప్రకారం.. నిహాంగ్‌లకు నొప్పి లేదా అసౌకర్యం ఏ మాత్రం ప్రభావం చూపవు. వీరు ధ్యానం, తపస్సు, దాతృత్వం చేసే మనసు ఉన్న సంపూర్ణమైన యోధులని రత్తన్ సింగ్ వర్ణించారు.

బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు 1510-11 ADలో రామజన్మభూమి ఉన్న ప్రదేశాన్ని గురునానక్ దేవ్ సందర్శించినట్లు సుప్రీంకోర్టులో అయోధ్య వివాద కేసు సందర్భంగా సమర్పించిన ఆధారాలు కీలకంగా మారాయి . సిక్కు విశ్వాసం యొక్క స్థాపకుడు చేసిన ఈ తీర్థయాత్ర దీర్ఘకాల మతపరమైన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. నవంబర్ 1858లో, నిహాంగ్ బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా నాయకత్వంలో 25 మంది నిహాంగ్ సిక్కులు అయోధ్యలోని బాబ్రీ మసీదులోకి ప్రవేశించి లోపల హవాన్ (యజ్ఞం) చేశారు. 165 సంవత్సరాల తర్వాత, అతని ఎనిమిదవ వారసుడు జటేదార్ బాబా హర్జిత్ సింగ్ రసూల్‌పూర్ జనవరి 22, 2024 న అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన సందర్భంగా లంగర్ (సిక్కు అన్నదాన సత్రం) నిర్వహించారు. 1858 నవంబరు నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ, బాబా హర్జిత్ సింగ్ మాట్లాడుతున్నప్పుడు, స్వయంప్రతిపత్తి కలిగిన తమను గురు సైన్యంగా భావించే నిహాంగ్‌లు, అప్పుడు బాబర్ మసీదు గోడలపై "రామ్ రామ్" అని వ్రాసి, కాషాయ జెండాను ఎగురవేశారు, తరువాత అవధ్‌లో 25 మంది నిహాంగ్‌లపై మసీదు అధికారి ఫిర్యాదు మేరకు నవంబర్ 30, 1858న పోలీస్ స్టేషన్ లా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నవంబర్ 9, 2019న అయోధ్య మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పులో కూడా ఈ సంఘటన ప్రస్తావించబడింది. బాబా హర్జిత్ సింగ్ మాట్లాడుతూ, "ఇతర నిహాంగ్‌లతో పాటు లంగర్‌ను తయారు చేయడం ద్వారా రాముడి పట్ల తన పూర్వీకుల భక్తిని మరింత ప్రదర్శించాలని తాను కోరుకుంటున్నాను" అని అన్నారు. నిహాంగ్ సిక్కులు సాధారణ సిక్కుల కంటే ఎక్కువ భక్తిని కలిగి ఉంటారు. "నేను సాంప్రదాయకంగా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేని సిక్కువాడిని, కానీ నేను నా మెడలో రుద్రాక్ష హారాన్ని ధరిస్తాను. నిహాంగ్ మరియు సనాతన ధర్మాల మధ్య సామరస్యాన్ని సృష్టించడానికి నేను చేసిన ప్రయత్నాలను విమర్శించవలసి వచ్చింది. భక్తులకు సేవ చేయడమే నా ఉద్దేశమని" బాబా హర్జిత్ సింగ్ అన్నారు. 1858 లో జరిగిన నిహాంగ్ సిక్కుల నిరసన సంఘటన వివాదాస్పద స్థలంపై నియంత్రణ కోసం పోరాటానికి నాంది పలికింది. ఈ సంఘటన రామమందిరం ఉద్యమంలో నమోదు చేయబడిన మొదటి ఎఫ్‌ఐఆర్‌గా నమోదైంది మరియు 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన 1,045 పేజీల తీర్పులో కీలక సాక్ష్యంగా పనిచేసింది.

కోర్టుకు అందుబాటులకివచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఆనాడు బాబా ఫకీర్ సింగ్ మసీదు లోపలికి దూసుకెళ్లి, 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కీర్తితో నినాదాలు చేస్తూ, 'శ్రీ భగవాన్' (రాముడు) చిహ్నాన్ని ప్రతిష్టించారు. మసీదు గోడలపై 'రామ్ రామ్' అని కూడా రాశాడు. బాబా ఫకీర్ సింగ్ తన తోటి నిహాంగ్ సిక్కులు, 25 మంది మసీదు వెలుపల నిలబడి, బయటి వ్యక్తులెవరూ ప్రాంగణంలోకి రాకుండా కాపలా కాసారు. వారు మసీదు లోపల ఒక వేదికను కూడా నిర్మించారు, దానిపై రాముడి విగ్రహాన్ని ఉంచారు. "మసీదు జనమ్ స్థాన్" పరిధిలో నివసిస్తున్న బాబా ఫకర్ సింగ్‌ను పిలిపించాలని 1858 డిసెంబర్ 1న ఔద్‌లోని తానేదార్ నివేదిక సమర్పించినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అతను బాబా ఫకీర్ సింగ్‌కు సమన్లు ఇచ్చి హెచ్చరించినట్లు నివేదిక పేర్కొంది. ఈ సంఘటన ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది, స్థానిక ముస్లింలు మసీదులో నమాజ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారని అప్పుడు ఫిర్యాదు చేశారు. "అంతేకాకుండా, మోజ్జిన్ అజాన్ పఠించినప్పుడు, ఎదురుగా ఉన్నవారు శంఖం ఊదడం ప్రారంభిస్తారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదు," అని నవంబర్ 1860లో ఔద్ డిప్యూటీ కమీషనర్‌కి మరొక ఫిర్యాదు వచ్చింది. చివరికి, నిహాంగ్ సిక్కులు వివాదాస్పద కట్టడం నుండి బహిష్కరించబడ్డారు. 1858లో అయోధ్యకు సిక్కుల అనుసంధానం తద్వారా ఎగసిన ఉత్తేజం, స్ఫూర్తి అక్కడకు వచ్చిన 25 మంది నిహాంగ్‌లను దాటి విస్తరించింది.

బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు 1510-11 ADలో రామజన్మభూమి ఉన్న ప్రదేశాన్ని సిక్కు గురువు గురునానక్ దేవ్ సందర్శించినట్లు సుప్రీంకోర్టులో అయోధ్య వివాద కేసు సందర్భంగా సమర్పించిన ఆధారాలు హైలైట్. సిక్కు విశ్వాసం యొక్క స్థాపకుడు రామజన్మభూమి ఉన్న ప్రదేశాన్ని సందర్శించి రాముడికి పూజలు చేసిన ఈ తీర్థయాత్ర హిందువులకు మరియు విస్తృత భారతీయ సమాజానికి ఆ ప్రాంతం యొక్క దీర్ఘకాల మతపరమైన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.

"బాబా ఫకీర్ సింగ్, తన జాతా (సైన్యం) తో కలిసి, ఒకప్పుడు బాబ్రీ మసీదు ఉన్న రామ జన్మస్థలాన్ని 1858లో విడిపించారు. 1858లో జరిగిన ఆ సంఘటన కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్, సుప్రీం కోర్టు ప్రకటించిన తీర్పులో కీలక సాక్ష్యంగా మారింది. ఈరోజు జనవరి 22, 2024 న బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను అందుకే మన హిందూ సోదరులు దీపావళి రోజున జరుపుకునే దానికంటే ఎక్కువగా జరుపుకుంటున్నారు’’ అని బాబా హర్జిత్ సింగ్ అన్నారు. అంతేకాదు ‘‘గురు తేగ్ బహదూర్ ఢిల్లీలోని చాందినీ చౌక్‌కు వెళ్లి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. ఆయన అడుగుజాడల్లోనే మన పూర్వీకులు నడుచుకున్నారని.. మనం కూడా అదే పని చేస్తున్నామని.. దీని ద్వారా విదేశాల్లో కూర్చుని దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న వారి నోరు మూయించాలన్నారు. మరియు మన తోటివారు ... మనం అందరం ఒక్కటే అనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాము. మేము సనాతనీయులం" అని గట్టిగా చెప్పారు ఆయన.

ఏతావాతా.. నవంబర్ 1858లో, నిహాంగ్ బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా నాయకత్వంలో 25 మంది నిహాంగ్ సిక్కులు అయోధ్యలోని బాబ్రీ మసీదులోకి ప్రవేశించి లోపల హవాన్ (యజ్ఞం) చేసి, 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కీర్తితో నినాదాలు చేస్తూ, 'శ్రీ భగవాన్' (రాముడు) చిహ్నాన్ని ప్రతిష్టించినప్పుడే మేలుకొని సదరు రామజన్మభూమిని హిందువులకు అప్పగిస్తే సరిపోయేదని - ఇప్పటివరకు వివాదాన్ని కొనసాగించి 2019లో సుప్రీంకోర్టులో ఓడిపోయి అనవసర ప్రయాసకు, లోకువకు లోనయినామని ఉదార ముస్లింలు భావిస్తున్నారు.

రాముని ప్రాణప్రతిష్ఠ.. అయోధ్యలోని ముస్లింలు, మిగతా భారత్ లో ఉన్న ముస్లింలు ఏమనుకుంటున్నారు అనే విషయంలో చాలా ఆసక్తి నెలకొంది. అదృష్టవశాత్తు 'నారద పాత్ర' వహించిన మీడియా మూలంగా వీరి స్పందనలు వాయువేగంగా మిగతా వారికి చేరాయి. అన్నట్లు నారదుడు ఎప్పుడూ కలతలు, విభేదాలు, యుద్ధాలు తెచ్చిపెడతాడు అనే అపవాదు ఉండనే ఉంది. అయితే ఆమాటకొస్తే ఆయన మూలంగా జరిగిన లోక కల్యాణాలు కూడా కోకొల్లలు. ఇంతకీ అభినవ 'నారద పాత్ర' వహించిన మీడియా సేకరించిన వార్తల్లో విశేషాలు ఏమున్నాయ్యో చూద్దాం! 1992 తర్వాత మళ్లీ అటువంటి అల్లర్లు జరగలేదని - అయితే తమ మతపరమైన స్థలాలను కూడా మరమ్మత్తు చేస్తే బాగుండేదని అయోధ్య సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ఇక ఆలయానికి చుట్టు పక్కల ఉండే స్వీట్ షాపుల్లో ముస్లింలు తయారు చేసే స్వీట్లే పంపిణీ అవుతున్నాయి. ఇక్కడ తామంతా సోదరుల్లా కలిసే ఉంటామని.. ఎటువంటి విబేధాలు లేవని అయోధ్య ఎంపీ లల్లూ సింగ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ రామాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తోంది. తహెరా ట్రస్ట్‌కు నిర్వాహకురాలైన సదరు మహిళ పేరు జహరా బేగం. హిందూ దేవుడైన రాముడి గుడి కట్టడానికి ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రజలను డొనేషన్స్‌ ఇవ్వాల్సిందిగా జహరా కోరడం విశేషం. హిందూ పండుగలైన వినాయక చవితి, దసరా, శ్రీ రామ నవమికి ముస్లింలు తోచినంత విరాళాలు అందిస్తారని... ఇదే విధంగా రామాలయ నిర్మాణానికి కూడా డొనేషన్స్‌ అందించాల్సిందిగా కోరుతున్నానని జహరా తెలిపారు. అన్ని మతాల పండుగలను అన్ని మతాలకు చెందిన వారు కలసి చేసుకోవడమే నిజమైన భారత భిన్నత్వంలో ఏకత్వానికి స్ఫూర్తి అని చెప్పారు. 'దర్గాలు, ఈద్దాలు, ముస్లిం శ్మృశానాల (ఖబరిస్టాన్‌) కోసం హిందూ సోదరులు భూమిని విరాళంగా ఇవ్వడాన్ని చూస్తున్నాం. రాముడు పుట్టిన దేశంలో మనం ఉంటున్నాం. అలాంటి రాముడి భవ్య మందిరం మనం ఉంటున్న ప్రస్తుత సమయంలో నిర్మితమవ్వడం అదృష్టంగా భావించాలి. జీవితంలో ధర్మంగా ఉండటం ఎంత ముఖ్యమో ప్రపంచానికి రాముడు నేర్పాడు. పవిత్ర రాముడి ఆలయనిర్మాణంలో మనందరం భాగమవుదాం' అని జహరా పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి జగ్గయ్యపేట వాస్తవ్యులు 11వ వార్డుకు చెందిన ముస్లింలు షేక్‌ బాజీ, షేక్‌ సైదాబీ ఒక్కొక్కరు రూ.116లు విరాళాన్ని అందజేశారు. శ్రీరామ మందిర నిర్మాణానికి కోట్లు అందజేసిన వారి ముందు వీరు ఇచ్చిన మొత్తం చిన్నదే, అయితే ఒక స్వామి కార్యం నెరవేరాలనే వీరి సంకల్పం - వీరి ఉడుతాభక్తి మాత్రం కొండంత అని చెప్పాలి. అయోధ్య రామయ్యకు 21.6 అడుగుల పొడువున్న వేణువును ఉత్తర ప్రదేశ్ జిల్లా ఫిలిబిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కానుకగా పంపించింది. ఫిలిబిత్ కు చెందిన ప్రముఖ హస్త కళాకారుడు నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, అతని కొడుకు అర్మాన్ నబీ, అతని స్నేహితులతో కలిసి ఈ వేణువును తయారు చేశారు. అయోధ్య రామయ్య కోసం తయారు చేసిన ఈ వేణువు ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్‌ జిల్లో 24 పరగణాల జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం శిల్పులు ఉత్తర ప్రదేశ్‌ లో జరగబోయే రామమందిర ప్రారంభొత్పవం కోసం రాముడి విగ్రహ ప్రతిమలను రూపొందించారు. మహ్మద్‌ జమాలుద్దీన్‌, అతని కుమారుడు బిట్టు ఆలయంలో ప్రతిష్టంచే ఈ అద్భుతమైన విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఆన్‌ లైన్‌ ఈ ముస్లిం శిల్పుల గురించి తెలుసుకొని వీరికి అయోధ్య ట్రస్టు నుంచి ఆర్డర్‌ ఇచ్చారు. అయితే ఒక ముస్లిం శిల్పులు అయిన మీరు హిందూ దేవుడి విగ్రహాన్ని తయారుచేస్తున్నారు..ఈ ప్రాజెక్టు గురించి మీకు తెలుసా అని ఒక మీడియా ప్రతినిధి అడిగితే జమాలుద్దీన్‌ ఇలా సమాధానమిచ్చారు. “మతం అనేది వ్యక్తిగతం. దేశంలో వివిధ మతాలకు చెందిన వారున్నారు..ఈ కాలంలో మనందరం కలిసి ఉండాలి. నేను రాముడి విగ్రహాన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సోదర సంస్కృతి ఒక కళాకారుడిగా నా సందేశం ” అంటూ జమాలుద్దీన్‌ చెప్పారు.

అనాది కాలం నుండి ఆధునిక కాలం వరకు ప్రకృతికనుకూల జీవనం, భిన్నత్వంలో ఏకత్వం, సర్వేజనః సుఖినోభవంతు అన్న మానవతా వాదం, వీటికి మూలమైన సనాతనధర్మం, వీటి అన్నింటి మేలు కలయిక మన భారత చరిత్ర. వసుదైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు భావనను కలిగి ఉండడం, వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. మనమంతా భారతమాత సంతానమని, భారతదేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరూ భారతీయులేనని, బహుళత్వాన్ని అలవర్చుకునే గుణం మన జీవన విధానంలోనే ఉందని పాఠకులకు గుర్తుచేస్తూ, ఈ 2024 ఆంగ్ల సంవత్సరానికి ఇది రెండవ రచ్చబండ, మీరందరూ నెలనెలా ఈ చర్చా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు అని భావిస్తూ, సిరిమల్లె పాఠకులకు అభినందనలు తెలియజేసుకుంటూ, వారికి ఎప్పటిలాగే సాహిత్యాభినందనలు అందజేస్తూ ...ఎప్పటిలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో ...

"నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్‌ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,
అది మోసిన బోయీ లెవ్వరు?"

అని ప్రశ్నించిన ఆధునిక తెలుగుకవిత్వానికి చుక్కాని శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) ని స్మరించుకుంటూ, బాల రాముడి విగ్రహంగా మలచడానికి ఎంపిక చేసిన కృష్ణ శిల, దాన్ని ఎత్తిన కూలీల గురించి, ఆ శిలను శిల్పంగా మలచిన స్తపతి (శిల్పి) తదితర ఆసక్తికరమైన పలు విషయాల గురించి వచ్చే నెల రచ్చబండలో చర్చిద్దాం.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in February 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!