Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 18
సత్యం మందపాటి

స్పందన

ఈ కథ వ్రాసి దాదాపు నాలుగున్నర దశాబ్దాలయింది. మగపిల్లలు పుట్టకపోతే పున్నామనరకానికి వెడతారనే ఒక మూఢ నమ్మకం ప్రభలంగా ఉన్న రోజులవి. భర్తకు భార్య ఆరోగ్యం అనవసరం. మగపిల్లవాడు పుట్టేదాకా ఆవిడ ఊసురోమంటూ పిల్లల్ని కంటూనే ఉండాలి. ఎందుకంటే మరి ఆ మగమహారాజు పున్నామనరకానికి పోవటానికి వీల్లేదు. మరి అతని భార్యకి ఈ భూమి మీదే అలా ఆడపిల్లల్ని కంటూ భరించే ఆ ప్రసవ వేదన ఒక నరకం కాదా? ఈ భావన వచ్చి వ్రాసిన కథ ఇది. తర్వాత రోజులు మారి, పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని సాంకేతిక పరికరాలతో ముందుగానే తెలుసుకోవటం మొదలయాక, ఆడవారికి నరక బాధ ఇంకా ఎక్కువయింది. అమ్మాయిలు అసలు పుట్టకూడదనీ, అబ్బాయిలే కావాలనీ, భర్తలు ఆమెని ఎబార్షన్ చేయించుకోమని పట్టుబట్టి బొందితో భార్యని మళ్ళీ ఆ ప్రసూతి నరకానికి పంపించటం మొదలుపెట్టారు. దానితో భారతదేశంలో ఆడవారి సంఖ్య విపరీతంగా పడిపోయింది. 2011 గణాంకాల్లో ప్రతి 1000మంది మగవారికి, భారతంలో 943 ఆడవారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితి కొంచెం మెరుగవుతున్నదని తెలుస్తున్నది. అయినా మిగతా దేశాలతో పోల్చి చూస్తే మనకే ఆడ/మగ నిష్పత్తి ఎంతో తక్కువగా ఉన్నది. మరి ఇది ఎప్పుడు మారుతుందో! ఈ కథకు నా ప్రియ మిత్రుడు దివంగత ‘చంద్ర’ వేసిన బొమ్మ చూడండి, ఎంత అర్థవంతంగా ఉన్నదో! నా మిగతా కథలకి కూడా బొమ్మలు వేయకుండా, ఎందుకయ్యా అంత తొందరపడి హడావిడిగా వెళ్ళిపోయావు! We miss you!

‘పున్నామనరకం’

(ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక మార్చి, 1978 సంచికలో ప్రచురింపబడింది.)

Punnaamanarakam story image

“మీకు పోయినసారే చెప్పాను. కానీ నా మాట పెడచెవిన పెట్టారు” అన్నది డాక్టర్ అనసూయ.

ప్రభాకరం మాట్లాడలేదు. అనసూయను కొంచెం కోపంగా చూసి తల పక్కకు తిప్పుకున్నాడు.

శ్యామల వంచిన తల పైకెత్తలేక పోయింది. రెండు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు.

డాక్టర్ అనసూయ దీర్ఘంగా నిట్టూర్పు వదిలి, “ఓకే. ఈసారికి ఇక మనం చేసేదేమీ లేదు. కనీసం ఇక ముందైనా జాగ్రత్తపడితే మంచిది” అన్నది.

ఈసారి కూడా ప్రభాకరం ఏమీ మాట్లాడలేదు. లేచి నుంచున్నాడు. జేబులోనించి కొన్ని నోట్లు తీసి విసురుగా ఆవిడ చేతిలో పెట్టి, ‘మీ ఫీజ్” అన్నాడు కొంచెం కోపంగా.

“పద” అన్నాడు శ్యామలతో తను బయటికి నడుస్తూ.

“ఆగండి!” అన్నది అనసూయ. ఆమె అన్న తీరులో అతని అమర్యాద ఆమెకు కష్టం కలిగించిందని తెలుస్తూనే ఉన్నది.

ప్రభాకరం వెనక్కి తిరిగాడు.

“శ్యామలకి ఇప్పుడు ఎనిమిదో నెల. ఇది ఐదవ కాన్పు. ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూడండి. హెమోగ్లోబిన్ ముప్పై శాతం మాత్రమే ఉన్నది. ఆవిడ చాల నీరసంగా కూడా ఉంది. ఆమెకీసారి కాన్పు కష్టమవుతుందేమో!”

ప్రభాకరం అప్పటికే బయటకు వెళ్ళిపోయాడు.

అనసూయ ఒక్క క్షణం మాట్లాడలేదు. వంచిన తల ఎత్తి నెమ్మదిగా అన్నది శ్యామల. “క్షమించండి డాక్టర్. ఆయన ప్రవర్తనకి నేను చాల బాధపడుతున్నాను”

“శ్యామలా! నాకు అన్నీ తెలుసమ్మా. ఈసారి నా శాయశక్తులా నీకు సుఖంగా ప్రసవం అవటానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇలాటి మనుష్యుల్ని మార్చటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను” అన్నది అనసూయ.

“శ్యామలా, ఇంకా లోపలేం చేస్తున్నావ్?” బయట నుంచీ ప్రభాకరం గొంతు గట్టిగా వినపడింది.

“వస్తాను డాక్టర్” అని డాక్టర్ అనసూయ కళ్ళల్లోకి చూసి తల వంచుకుని చకచకా బయటికి వెళ్ళిపోయింది శ్యామల.

శ్యామల కనుకొలుకులలో నిలచిన నీటి బిందువులు అనసూయను కదిల్చివేశాయి. శ్యామలకు ప్రభాకరంతో వివాహం అయినప్పటినించీ అనసూయకు పరిచయమే.

శ్యామలకిప్పుడు నలుగురు ఆడపిల్లలు. తను ఇద్దరు పిల్లలు పుట్టగానే చెప్పింది, శ్యామల ఆరోగ్యం దృష్ట్యా, ప్రభాకరం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇక అంతటితో ఆపితే మంచిదని.

శ్యామల అంగీకరించినా, ప్రభాకరం ససేమిరా అన్నాడు.

‘పున్నామనరకం నుంచి మనల్ని తప్పించే మగపిల్లవాడు లేకపోతే ఎలా? మగపిల్లాడు పుట్టేదాకా అలాటివేం కుదరవు’ అన్నాడు.

ప్రభాకరం తల్లీ తండ్రీ కూడా సలహా ఇచ్చిన డాక్టర్ అనసూయని మొహమాటం లేకుండా అనాల్సిన మాటలన్నీ అన్నారు.

శ్యామల మీద ఉన్న సదభిప్రాయం, ఆప్యాయతల వల్ల డాక్టర్ అనసూయ ఇక ఏమీ అనలేక ఊరుకుంది. ప్రభాకరం దురదృష్టమో, శ్యామల ఖర్మోగానీ, వాళ్ళకు వరుసగా నలుగురూ ఆడపిల్లలే పుట్టారు. డాక్టర్ అనసూయ ప్రతిసారీ వద్దని చెబుతున్నదేగానీ, ప్రభాకరం ఆమె మాట పాటించలేదు.

“మగపిల్లాడికి తండ్రిని కాకపోతే ఎలా? రేపు నేను పోయిన తర్వాత, నా తలకు కొరివి పెట్టేవాడు ఉండొద్దూ? నన్ను పున్నామనరకం నుండి తప్పించే వాడు లేకపోతే ఎలా?”

“కానీ ఆవిడ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. కాన్పు కూడా కష్టమయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె ప్రాణాలకు కూడా… “

“ఎంత డబ్బు ఖర్చయినా నేను భరిస్తాను. బ్రహ్మాండంగా పనిజేసే మందులెన్నయినా నేను కొనగలను. మీకు ఈ కేసు టేకప్ చేయటానికి భయంగా వుంటే చెప్పండి, ఇంకో డాక్టరుకి చూపిస్తాను. అంతేగానీ, నా దగ్గర ఇంక ఇలాటి మాటలు మాట్లాడవద్దు” ఖచ్చితంగా అన్నాడు ప్రభాకరం.

ఏమీ అనలేక శ్యామల కూడా దీనంగా చూసింది డాక్టర్ అనసూయను.

“ఆయన మన మాట వినడు. నా ఆరోగ్యం కన్నా, ఆయనకు పున్నామనరకం నించీ తప్పించుకోవటమే ముఖ్యం. ఆయనతో ఇక వాదించటం అనవసరం. నా ఖర్మ ఎలా జరగాలో అలా జరుగుతుంది” అన్న భావం నీళ్ళు నిండిన ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనపడింది అనసూయకు.

ఈసారి ఏదో చేయాలి. ఈ మూఢ నమ్మకాన్ని అతనిలోనించీ పోగొట్టాలి. కానీ ఎలా? అదే అర్థం కావటం లేదు అనసూయకు. కాన్పు కష్టమైంది అని చెప్పి శ్యామలకు ఆపరేషన్ చేసేసి, ఇక పిల్లలు పుట్టకుండా చేసేయవచ్చు. కానీ మగపిల్లాడి కోసం అంత పట్టుదలతో మూర్ఘంగా ఉన్న ప్రభాకరం, శ్యామలను సరిగ్గా చూస్తాడా? చూడకపోగా మళ్ళీ పెళ్ళి చేసుకున్నా ఆశ్చర్యపోనఖ్కర్లేదు. ‘పున్నామనరకం’ అనే అభిప్రాయం అంత మూఢంగా పాతుకుపోయింది అతనిలో. దానికితోడు సనాతనులైన అతని తల్లిదండ్రులు అతన్ని పూర్తిగా సమర్ధిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే కనపడింది అనసూయకు. ప్రభాకరం ఈ విషయంలో అంగీకరించి తనే ఆపరేషన్ చేయించుకోవటం. కానీ ఇది జరిగే పనేనా? శ్యామల ఆరోగ్య పరిస్థితి చెప్పినా వినకుండా ఎగిరిపడుతున్నాడు. పైగా తన మీద అతనికి గౌరవం కూడా పోతున్నది.

డాక్టర్ అనసూయ, ఆ రోజే కాదు, ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని ప్రతిరోజూ ఆలోచిస్తూనే ఉంది.

ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు, డిస్పెన్సరీలో రోగులను చూస్తున్న అనసూయ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చాడు ప్రభాకరం.

“డాక్టర్, శ్యామలకు నొప్పులు వస్తున్నాయి. రక్తస్రావం అవుతున్నది. తీసుకు వచ్చాను” అన్నాడు రొప్పుతూ.

అనసూయ సూటిగా చూసింది ప్రభాకరాన్ని. అతను ఒకటే గాభరా పడుతున్నాడు.

“నర్స్” కేకేసింది అనసూయ. “లేబర్ రూముకి తీసుకురండి” అంటూనే అటుకేసి నడిచింది డాక్టర్ అనసూయ.

లేబర్ రూములో పక్క మీద పడుకున్నశ్యామల నొప్పులతో మెలికలు తిరిగిపోతున్నది.

అనసూయ వచ్చి పరీక్ష చేసింది. “చాల రక్తం పోతున్నది” అని నర్సుని పిలిచి ఏదో చెప్పింది.

నర్స్ బయటికి వెళ్ళి ఒక్క క్షణం తర్వాత ప్రభాకరంతో లోపలికి వచ్చింది.

“ప్రభాకరంగారు, శ్యామల పరిస్థితి ఏమీ బాగాలేదు. రక్తం బాగా పోతున్నది. చాల నీరసంగా ఉన్నది. రక్తం అవసరం కావచ్చు కూడాను. ఆమె ప్రాణాలకు అపాయం లేకుండా సాయశక్తులా సుఖప్రసవం అవటానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒక రిక్వెస్టు”

“ఏమిటి?” ఆ పరిస్థితిలో కూడా ప్రభాకరం కోపంగానే కనపడ్డాడు.

“కోపం తెచ్చుకోకండి. నేనేమీ ఉపన్యాసాలు ఇవ్వటం లేదు. శ్యామల పరిస్థితి బాగా లేదు. ప్రాణాపాయం లేదు అనటానికి వీలులేని పరిస్థితి. అందుకే ఆమె కాన్పు అయేదాకా మీరూ ఇక్కడే ఆమె చేయి పట్టుకుని నిలబడండి. ఆమెకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. మీరు పక్కనే ఉన్నారనే మానసిక బలం ఆమె సుఖప్రసవానికి అవసరం. నా ఈ ఒక్క కోరికా కాదనకండి” అన్నది.

వింతగా చూశాడు ప్రభాకరం. “అదేమిటి? నేను ఇక్కడ ఉండటం ఏమిటి? భార్య కాన్పుకు భర్త పక్కనే ఉండటం నేనెక్కడా వినలేదు. మీరేదో విచిత్రంగా మాట్లాడుతున్నారు”

“లేదు ప్రభాకరంగారు. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ ఎనీ మోర్. ఒకసారి శ్యామల ముఖం చూసి అనండామాట. మీరు ఇక్కడ ఉన్నందువల్ల లాభమేగానీ, నష్టం లేదు కదా. ఇది పశ్చిమదేశాల్లో సామాన్యమే. దానివల్ల భార్యకెంతో మానసిక ధైర్యం వస్తుందని చెబుతున్నారు. దయచేసి ఇక్కడే ఉండండి. నర్స్, ఆ సిరెంజ్ ఇస్తారా?” అన్నది.

నర్స్ ఇచ్చిన సిరెంజ్ తీసుకుని ఇంజక్షన్ చేసింది అనసూయ. ఇంజక్షన్ చేసిన తర్వాత శ్యామల బాధ ఇంకా ఎక్కువయింది. శ్యామల నొప్పులు ఇంకా ఎక్కువయాయి. బాధతో వంకర్లు తిరిగిపోతున్నది.

ప్రభాకరం వచ్చి ఆమె తల దగ్గర నుంచున్నాడు. ఆమె ప్రభాకరం రెండు చేతులూ పట్టుకుంది. ఇంకా గట్టిగా పట్టుకున్నది. పళ్ళు బిగపట్టి నొప్పులని భరిస్తున్నది.

“మీరిలా తల వెనుక నిలబడండి” అన్నది అనసూయ, నర్సుతో ఏదో చెప్పి.

ప్రభాకరం మంచం తలకట్టున, శ్యామల ప్రక్కన నిలబడ్డాడు. శ్యామల ఒక చేత్తో అతని చేయి పట్టుకుని, రెండో చేత్తో కడుపు మీద నెమ్మదిగా వత్తుకుంటున్నది. నొప్పులు భరించలేక ఏడుస్తున్నది. మధ్యే మధ్యే అరుస్తున్నది.

ఒక సీసా రక్తం తీసుకుని నర్స్ వచ్చింది.

“బ్లడ్ చాల తక్కువగా ఉంది. కనీసం ఒక సీసా అయినా ఎక్కించాలి” అంటూ నర్స్ ఆ సీసాను స్టాండుకి వ్రేలాడదీసి, శ్యామల ముంజేతి దగ్గర సూది ద్వారా ఎక్కించటానికి ప్రయత్నం చేస్తున్నది.

ప్రభాకరం అన్నీ చూస్తూ శ్యామల తల దగ్గరే నిఠారుగా నుంచున్నాడు.

శ్యామలలోకి రక్తం ఎక్కుతున్నది. ఇంకొక పక్కన రక్తం పోతున్నది.

నర్స్ వచ్చి ప్రభాకరం చేత ఒక కాగితం మీద అతని సంతకం తీసుకున్నది, ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే తనకేమీ అభ్యంతరం లేదని.

శ్యామలకు నొప్పులు పెరుగుతున్నాయి. పెద్దగా అరుస్తున్నది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి.

అనసూయ బ్లడ్ ప్రెషర్ చూస్తూ, “కొంచెం ఓపికపట్టు శ్యామలా, పాపాయి వచ్చేస్తుంది.” అంటున్నది.

శ్యామల ముఖం మీద చెమటలు క్రిందకు కారుతూ ఆమె బట్టల్నీ, దిండూ, దుప్పట్లను తడిపేస్తున్నాయి. ముఖం బాగా ఎర్రబడింది.

కళ్ళు పైకెత్తి ప్రభాకరాన్ని చూసింది. అతన్ని చూస్తుంటే ఆమెకు కొండంత దైర్యం కలుగుతున్నది.

ప్రభాకరం జేబులోనించీ కర్చీఫ్ తీసి, ఆమె ముఖం మీద చెమటను తుడుస్తున్నాడు.

“బాధగా ఉందా?” అడిగాడు నెమ్మదిగా.

ఆమె కళ్ళతోనే ‘లేదు’ అని అబద్ధం చెప్పింది. అది ఆమె బాధ చూస్తున్న అతనికీ తెలుసు.

“కొంచెం ఓర్చుకో. అంతా సవ్యంగా జరుగుతుంది” అన్నాడు ఆమె బుగ్గల మీద చేయి వేసి, నెమ్మదిగా రుద్దుతూ.

అలా అన్నాడు కానీ, పేలవంగా ఉన్న ఆమె ముఖం చూసి అతనిలో ఏదో అనుమానం తొంగి చూసింది. ఆ అనుమానాన్ని దాచుకుంటూనే ఆమె చేయి మృదువుగా పట్టుకున్నాడు.

నర్స్ అక్కడే ఏవో పరికరాలు సర్దుతున్నది.

శ్యామల రెండు కాళ్ళ మధ్యా నుంచుని పరీక్ష చేస్తున్న అనసూయ ఎర్రబడిన గ్లవ్స్ తీసేసి అక్కడే ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో పడేసి, కొత్త గ్లవ్స్ వేసుకుంటూ, “ఆపరేషన్ అవసరం రాకపోవచ్చు. కానీ కొన్ని కుట్లు వేయాల్సివస్తుందేమో” అన్నది.

మళ్ళీ ఎర్రబడిన ఆమె చేతిలోని ఎర్రటి గ్లవ్స్ చూసి కళ్ళు మూసుకున్నాడు ప్రభాకరం. అతని నుదుటి మీద చెమట పట్టటం గమనించింది అనసూయ.

శ్యామలతో అంటున్నది అనసూయ. “శ్యామలా, నువ్వు కొంచెం అలా... అలా... పుష్ చేయి. ఆఁ! అలా... ఇంకోసారి చేశావంటే చక్కటి అమ్మాయి… కాదు అబ్బాయి పుడతాడు. ఏదీ ఇంకా ప్రయత్నం చేయాలి, ఈసారి పండంటి పిల్లాడు పుడతాడు. మళ్ళీ… అలా… అలా… ఇంకొంచెం… మళ్ళీ… మిమ్మల్ని పున్నామనరకం నుంచి తప్పించే పిల్లాడు పుడతాడు. ఏదీ... అలా… అలా…”

శ్యామల చాల అలసటగా, ఇబ్బందిగా, బాధతో అసహనంగా కళ్ళు మూస్తూ తెరుస్తున్నది. మంచం మీద మెలికలు తిరిగిపోతూ, ఏడుపుతో కూడి బయటికి వస్తున్న అరుపులను ఆపుకుంటూ అనసూయ చెప్పినట్టు చేస్తున్నది.

“గుడ్ గర్ల్! అలా కోపరేట్ చేయాలి. ఏదీ మళ్ళీ… ఎగైన్...”

ప్రభాకరం ఊపిరి పీల్చటం ఆపి అటే చూస్తున్నాడు.

అతని నుదుటి మీద చెమటలు పట్టి, మెడె మీదుగా షర్టును తడిపేస్తున్నాయి.

శ్యామల అతని చేతులు గట్టిగా తన రెండు చేతులతోనూ పట్టుకున్నది. ఆమె పట్టుకున్న పట్టు క్షణక్షణానికీ బిగుసుకుపోతున్నది. ఆమె అరిచేతుల్లోని చెమట అతని చేతుల మీదుగా కారిపోతున్నది.

శ్యామలకు నొప్పులు రానురాను అధికమయాయి. అనసూయ ఏదో చిన్న కత్తి తీసుకుని చర్మాన్ని కత్తిరిస్తున్నది.

మధ్యమధ్యలో శ్యామలతో, “అయిపోయింది. అలా కొంచెం... ఓపిక పట్టు. ప్లీజ్. వెరీ గుడ్. మీ వంశోద్ధారకుడు త్వరలో రాబోతున్నాడు. అలా...”

శ్యామల అంత బాధలోనూ కళ్ళెత్తి ప్రభాకరం వేపు చూసింది.

ప్రభాకరం ఆమె ముఖాన్ని తన చేతులతో ఆప్యాయంగా నిమిరాడు.

ఆమె ప్రభాకరన్నే దీక్షగా చూస్తూ తన నొప్పులు మరచిపోవటానికి ప్రయత్నం చేస్తున్నది.

నర్స్ ఏవో అందిస్తుంటే, డాక్టర్ అనసూయ తను చేయవలసింది తను చేస్తున్నది.

ప్రభాకరం కళ్ళ ముందు ఎర్రటి చక్రాలు ఏవో తిరుగుతున్నాయి. శ్యామల బాధ ఇంకా ఎక్కువైంది. ఉన్నట్టుండి పెద్దగా అరిచింది.

అనసూయ బిడ్డను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నది.

శ్యామల పెద్దగా అరుస్తున్నది. అరుస్తూనే తల పక్కకు వ్రేలాడేసింది.

ప్రభాకరానికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెన్నులో వణుకు ప్రారంభమైంది.

అక్కడున్న వస్తువులన్నీ అతని చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది.

తర్వాత ఏమయిందో అతనికి తెలియలేదు.

కళ్ళు తెరిచి చూసేసరికీ, బయట కారిడార్లో బల్ల మీద పడుకుని ఉన్నాడు. ప్రక్కనే నర్స్ ఏదో మందు రాసి దూదిని అతనికి వాసన చూపిస్తున్నది. చటుక్కున లేచి కూర్చున్నాడు ప్రభాకరం.

ప్రక్కనే ఆదుర్దాగా అతని తల్లీ, తండ్రీ, పిల్లలూ కనపడ్డారు.

“శ్యామల…. శ్యామల ఏదీ?” నీరసంగా అడిగాడు ప్రభాకరం.

టవల్‍తో చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చిన అనసూయని ఆదుర్దాగా అడిగాడు.

“ఆమె డెలివరీ అవగానే ఫెయింట్ అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉందిలెండి. మీరేమిటి అలా కళ్ళు తిరిగి పడిపోయారు?” అడిగింది అనసూయ.

“శ్యామలకేమీ ఫరవాలేదు కదూ డాక్టర్ గారూ” అతని గొంతులో గాభరా, వణుకూ తెలుస్తూనే ఉన్నాయి.

“రండి చూద్దురుగాని” అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది అనసూయ.

ఆమె ముఖంలో అలసట కనిపిస్తున్నా, పెద్ద గాలివాన వెలిసిన తర్వాత ఆకాశంలా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంది శ్యామల. యుధ్ధం అయిపోయాక రణరంగంలో ఉన్నంత నిశ్శబ్ధంలా ఉంది అక్కడ.

“శ్యామలా!” ప్రేమగా పిలిచాడు ప్రభాకరం. కళ్ళెత్తి చూసింది శ్యామల.

విశాలమైన ఆమె కళ్ళల్లో ఏదో తృప్తి. ఏదో ఆనందం.

ప్రభాకరం ఆమెకు దగ్గరగా వెళ్ళాడు.

ఆమె కళ్ళు మూసుకుంది. కనురెప్పలకు అడ్డం వచ్చిన కన్నీటి బిందువులు క్రిందకు జారాయి.

“సారీ, మిస్టర్ ప్రభాకరం. ఈసారి కూడా మీకు ఆడపిల్లే పుట్టింది. మీరనుకున్న పున్నామనరకం మిమ్మల్ని వదిలేటట్టు లేదు” అన్నది అనసూయ.

ప్రభాకరం తల పక్కకి తిప్పుకున్నాడు. కొంచెం ఆగి శ్యామల పక్కనే ఉన్న పసికందుని చూశాడు.

తర్వాత శ్యామల వేపు తిరిగాడు. అతను ఏమంటాడోనని భయపడుతూ తననే చూస్తున్నది శ్యామల.

ప్రభాకరం శ్యామలనూ, పసికందునూ చూస్తూనే డాక్టర్ అనసూయ వేపు తిరిగాడు.

“నన్ను క్షమించండి డాక్టర్. ఇంత చదువూ చదివి నేనెందుకింత అజ్ఞానంగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది, అసలు ఉన్నదో లేదో ఏమాత్రం తెలియని పున్నామనరకం గురించి ఆలోచించానేగానీ, అంతకన్నా ఎంతో ఎక్కవ నరకం అనుభవించిన శ్యామల గురించి ఆలోచించలేదు. నా కళ్ళారా ఆ నరకం ఎలా ఉంటుందో చూశాను. కాదు… మీరే చూపించారు. నా కళ్ళు తెరిపించారు. ఈకాలంలో ఆడపిల్ల అయినా, మగవాడయినా ఒకటే. తల్లీ, పిల్లలూ ఆరోగ్యంగా ఉంటే చాలు కదూ!”

శ్యామల ప్రభాకరాన్ని వింతగా చూస్తున్నది.

“మళ్ళీ నిన్నా నరక బాధ పడనివ్వను శ్యామలా!” అన్నాడు ప్రభాకరం తృప్తిగా చూస్తున్న ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ!

Posted in February 2024, కథలు

6 Comments

  1. ఉమాభారతి కోసూరి

    సత్యం మందపాటి గారి కధలు చదివాను. నాకు వారి రచనా శైలి నచ్చుతుంది. ప్రతిసారీ ఈ కధ అన్నింటికన్నా బాగా రాశారు అనుకుంటాను. ఈ పై కధ మాత్రం నిజంగానే మరో స్థాయిలో ఉంది. పాత విషయమే అయినా తెలిసిన విషయమే అయినా .. కధ సాగిన తీరు అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. ‘సిరిమల్లె’ layout కూడా బాగుంది

    • సత్యం

      ధన్యవాదాలు ఉమాభారతిగారు. ఇది కూడా ఆరోజుల్లో జరిగిన ఒకటి రెండు సంఘటనలు చూసి అల్లిన కథే! మీకు నచ్చినందుకు, మీరు మెచ్చుకున్నందుకు సంతోషం.

    • Satyam

      స్త్రీలను గౌరవించని సమాజాలు వెనకపడక తప్పదు. ఈ కథ నచ్చినందుకు సంతోషం, కుమారిగారు. ధన్యవాదాలు.

    • సత్యం

      ఈ కథ నచ్చినందుకు సంతోషం శ్రీనివాస్. ధన్యవాదాలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!