Menu Close
Radhakrishna Karri
బొంగరాల రాఘవ (కథ)
-- రాధకృష్ణ కర్రి --

సన్సైడ్ మీద ఉన్న ఒక పెట్టెను తెరిచి అపురూపంగా చూసుకుంటున్నాడు రాఘవ.

"ఏవండోయ్! ఎంత సేపు అలా ఆ పాత పెట్టెను తెరిచి చూస్తూ ఉంటారు? ఆఫీస్ కి టైం అవ్వట్లేదా" వంటింటిలో నుండి ఓ కేక విసిరేసింది రమణి.

"నాన్నా - నాన్నా! ఒకసారి ఆ షెల్ఫ్ లో ఉన్న నా డ్రెస్ అందుకోవా, నాకందట్లేదు" అంది కూతురు సరిత.

ఒక ప్రక్క రమణి, మరో ప్రక్క సరిత ఇద్దరూ ఎన్నిసార్లు పిలిచినా తన్మయత్వంలో నుండి బయటకు రాలేదు రాఘవ.

చేతిలో ఉన్న వస్తువును తడుముతూ, ముద్దులు పెట్టేస్తూ ... ఓ.. కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకుంటున్నాడు.

ఎంత అరిచినా ఇంక లాభం లేదనుకొని, రమణి వేడి వేడి కాఫీ గ్లాసును రాఘవ చేతికి అంటించింది... అదే, తగిలించింది లెండి.

చురక తగిలిన వెంటనే పాపం మన రాఘవుడికి తెలివి వచ్చి... "ఎందుకే అంతలా చురక వేశావు? ఏం కొంచెం గట్టిగా కాఫీ అని చెబితే సరిపోయేదిగా" కాలిన చేతిమీద ఉఫ్ ...ఉఫ్ అని ఊదుకుంటూ అడిగాడు భార్యని.

"ఇంతసేపూ కూతురు దగ్గరే ఉండి పిలిచినా పలకలేదు, అప్పటి నుండి వంటింట్లో నుండి నేను గావుకేకలు పెట్టినా వినబడలేదు గాని, పైగా చురకెందుకు వేశావ్ అని అడుగుతున్నారా!" గయ్య్ మంటూ భర్త మీద అంత ఎత్తున లేచింది రమణి.

అది కాదే అని రాఘవుడు అనే లోపు...

"సరిత, ముందు నువ్ ఈ డ్రెస్ తీసుకొని తయారవ్వు. మీ నాన్న ఆ పాత పెట్టె తెరిస్తే మన లోకంలో ఉండరని తెలిసినా, మనవో పిచ్చివాళ్ళలా అరుస్తూనే ఉంటాం. మన టైం వేస్ట్ గాని, నువ్ త్వరగా వస్తే టిఫిన్ తిని కాలేజ్ కి వెళుదువు, సరేనా!" కూతురుకు చెప్పి పొయ్యిమీద పెట్టిన కూర మాడువాసన వస్తుంటే గబ గబా వంటింటి వైపు పరుగుతీసింది రమణి.

"సరే అమ్మా" అంటూనే, సరిత వాళ్ళ నాన్న వైపు ఓ లుక్ ఇచ్చి...

"నాన్నా, నాదో చిన్న సందేహం, అడగనా" అంది.

"ఏంటమ్మ అది? అడుగు" అన్నాడు రాఘవ కూతురు తల నిమురుతూ.

"నాన్నా! నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్ చాలా సార్లు ఆ పెట్టెను సన్సైడ్ మీద నుండి దింపడం, అందులో వస్తువుల్ని చూసి కంట తడి చేసుకోవడం చూస్తున్న. అసలు అంత విలువైన వస్తువులేమున్నాయి నాన్నా అందులో?" ఇవాళ ఎలాగైనా అందులోని వస్తువుల గురించి తెలుసుకోవాలనే తపనతో అడిగింది సరిత. ఎందుకంటే, ఆ పెట్టికి ఎప్పుడూ తాటికాయంత తాళం వేసి, ఆ తాళం కూడా రాఘవ మొలతాడుకు ఉంటుంది ... అదన్నమాట సంగతి.

"ఇప్పుడవన్నీ ఎందుకమ్మా?" అని దాటేయబోతున్న రాఘవతో, పంతం విడిచిపెట్టకుండా...

"ఇన్ని సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నా. కానీ, ఇవాళ నువ్ ఇంకా చిన్నపిల్లడిలా ఏడుస్తుంటే తట్టుకోలేక అడిగాను. ఎలాగైనా సరే, నాకు వాటి గురించి తెలియాలి నాన్నా" అంటూ అభిమానం, గారం, అంతకంటే మించిన కుతూహలంతో అడిగింది కూతురు.

రమణి వంటింట్లో నుంచి సొణుగుతోంది "ఆ దిక్కుమాలిన పెట్టెను ఓ దుర్ముహర్తంలో బయట పడేయాలి. లేకపోతే ప్రతిరోజు కొంపలో ఓ సంస్మరణ సభ పెట్టేస్తున్నాడీయన."

ఇక్కడ రాఘవ ఆ పెట్టెను పూర్తిగా తెరిచి...

అందులో అపురూపంగా దాచుకున్న ఒక బొంగరం, దానికి చుట్టి ఉన్న తాడు తీసి చూపించాడు.

అది చూసి "ఏంటి నాన్న ఇది?" అని అడిగింది సరిత.

"దీన్ని బొంగరం అంటారమ్మా. ఇది నా చిన్నప్పటి నేస్తం. దీనితో నేను మా ఊరిలో ఎన్ని సార్లు గెలిచానో తెలుసా!" అంటూ బొంగరాన్ని నేలమీద తిప్పుతున్నాడు. అలా తిప్పుతున్నంతసేపు రాఘవ కళ్ళల్లో ఒక ఆనందం. చిన్నపిల్లాడిలా కేరింతలు కూడాను.

"ఓస్! ఇలా తిప్పే వస్తువును చూసా నువ్ ఏడుస్తుంది" ఇప్పుడు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టడం సరిత వంతైంది.

కూతురు అలా అనేసరికి, రాఘవ చంద్రముఖి సినిమాలో గంగలా "ఓస్! ఇలా తిప్పే వస్తువా, ఇలా తిప్పే వస్తువా..." అంటూ ఓ రకమైన గొంతుతో అరవడం చూసి బెంబేలెత్తిన సరిత ఏడుపు లంఘించుకుంది.

కూతురు ఏడుపువిన్న రమణి పరిగెత్తుకుంటూ వచ్చి రాఘవ మీద ఓ చెంబుడు నీళ్లు కుమ్మరించి, కూతురును ఓ పక్కకు లాగింది.

ఆ నీళ్లు మీద పడేసరికి దెబ్బకు మత్తువదిలిన రాఘవ చంద్రముఖి విడిచిన గంగలా, "అయ్యో తల్లీ! ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావ్" అంటూ కూతురుని అడగబోయాడు కానీ, అమ్మవారి పండుగ ఇంకా రాకముందే ఎర్రబడ్డ కళ్ళతో, కోపంతో కందగడ్డలా ఉన్న ముఖంతో కనబడిన రమణిని చూసి....మియావ్ మియావ్ పిల్లిలా బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

వెంటనే సరిత..."అమ్మా! నాన్న ఏంటమ్మా, అలా అరుస్తున్నారు? ఓస్ బొంగరమే కదా అన్నందుకు దెయ్యం పట్టిన వాడిలా ఆ కేకలేంటమ్మా" అని జడుపు, బెదురు వగైరా లాంటివన్నీ కలగాపులగంలా చేసి అడిగింది.

"ఏం లేదమ్మా. ఆ పెట్టెలో మీ నాన్నగారు తన చిన్నతనంలో ఆడుకున్న ఆట వస్తువులన్నీ (పట్టినంత మేర) దాచుకున్నారు. సందర్భోచితంగా, లేదా గుర్తొచ్చినప్పుడల్లా వాటిని తీసి, వాటిని మిస్ అవుతున్నట్లు, వాటితో కాసేపు పిచ్చాపాటి పెట్టి ఓదారుస్తూ, తనని తాను ఓదార్చుకుంటూ ఉంటారు."

"అది సరే అమ్మా, కాని ఇవాళ మరీ అంత విచిత్రంగా ఉన్నారేంటి!?" అని అడిగిన సరితకు...

"ఏం చెప్పమంటావ్! ఆయన ఆడిన ఆటలు...గోటిబిళ్ళ, అల్లికాయలు, ఏడుపెంకులు, బొంగరాలు ఇలా ఒకటేమిటి ఊర్లో ఉండే జట్టుతో అదేపనిగా ఆడుతూ ఉండేవారట. అందులో బొంగరలాట అంటే మరీ ఇష్టం మీ నాన్నకు. అతనికి బాగా వచ్చిన ఆట అది. ఆయన్ని బొంగరాల రాఘవ అని కూడా ముద్దుగా పిలిచేవారట.

కాలేజీ చదువుకోసం మీ తాతగారు ఆయన్ని పట్నం పంపించిన దగ్గర నుండి వాటిని మిస్ అయి, ఇదిగో ఇలా తయారయ్యారు. కానీ, ఇవాళ మరీ ఇంతలా ఎందుకు ప్రవరించారో!!" అని బాధ, జాలి లాంటి పదార్థాల మిశ్రమంతో చెబుతూ, "అవును గానీ, ఇవాళ రోజు ప్రత్యేకత ఏమిటో చెప్పవే ఓ సారి ఆ గూగుల్ చేసి" అంది రమణి.

"అమ్మా! ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవంతో పాటు, బొంగరాల దినోత్సవం కూడాను" అంటూ నోరేళ్ళబెట్టింది సరిత.

"అదీ సంగతి! నువ్వు బొంగరాన్ని తీసిపారేసినట్లు అనేసరికి మీ నాన్న ఆ అవతారం ఎత్తారు. కూతుర్ల దినోత్సవం గుర్తులేదుగానీ, మీ నాన్నకు ఆ బొంగరాల దినోత్సవం బాగా గుర్తుంది. అదీ! ఇప్పటి వరకూ జరిగిన పూనకం వెనక కథ. సరేలే, ఇంకెప్పుడూ ఆ పెట్టె చూస్తున్న టైంలో మీ నాన్న దగ్గరకు వెళ్లకు. మళ్ళీ ఏ నాగవల్లో, కాంచనో పూనితే కష్టం" అంటూ కూతురికి లంచ్ బాక్స్ కట్టడం కోసం వంటింటిలోకి వెళ్ళిపోయింది రమణి.

'హమ్మయ్య' అంటూ ఊపిరి పీల్చుకుంది విషయం తెలుసుకున్న సరిత.

********

Posted in February 2024, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!