Menu Close
తెలుగు భాష భవితవ్యం 2
- మధు బుడమగుంట

గత సంచికలో తెలుగు భాష యొక్క ఉనికిని ప్రస్తావిస్తూ నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామాలను నా పరిజ్ఞానం మేర కొద్దిగా విశ్లేషిస్తూ వివరించాను. ఈ సంచికలో మన తెలుగు భాష భవితవ్యం దివ్యంగా ఉండాలంటే మనవంతు కర్తవ్య క్రియను వివరించే ప్రయత్నం చేస్తాను.

తేనెలొలుకు తెలుగు భాష పదితరాల వరకు పదిలంగా ఉండాలంటే మనం ముందుగా చేయవలసిన కార్యం ‘అందరూ మాట్లాడే భాషే అమ్మ భాష’ అని నమ్ముతూ వ్యక్తిగతంగా మన ఆలోచనలలో మార్పును మున్ముందుగా కలిగించి మన తెలుగు యొక్క తేనె మాధుర్యాన్ని అనుభవ పూర్వకంగా ఆస్వాదించి, నెమ్మదిగా మన చుట్టూ ఉన్న కుటుంబసభ్యులకు ఆ మాధుర్యాన్ని పంచుతూ మన తెలుగు యొక్క భాషా ప్రాధాన్యతను అర్థమయ్యే రీతిలో వివరిస్తూ, వారిలో కూడా ఆసక్తిని కలుగజేయాలి. అందుకు మన ముందు ఉన్న కార్యనిర్వహణ విధానం ఇలా ఉండాలనేది నా అభిప్రాయం.

గ్రాంథిక భాష గౌరవాన్ని పరిరక్షిస్తూ, వ్యావహారిక భాషా రీతిలో సరళమైన తెలుగు ప్రాశస్త్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలి. ముఖ్యంగా మన తరువాతి తరానికి వారి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా మన వివరణ సులభతరంగా ఉంటె మరీ మంచిది. అంటే దానర్థం ముందుగా మన తెలుగు భాష గొప్పతనాన్ని మందికి వివరించడం చేయాలి. అది ఎలాగంటే,

బలుపు, గెలుపు, పిలుపు, మలుపు
విరుపు, మెరుపు, కురుపు, మరుపు
వడలు, ఒడలు, జడలు, మెడలు
ఊరు, వారు, ఏరు, వీరు, మారు, రారు, లేరు
….ఇలా చెప్పుకుంటే కేవలం మొదటి అక్షర మార్పుతో ఎన్నో విభిన్న పదాలు మనకు తెలుగులో ఉన్నాయి.
మొదటి అక్షర మార్పుతో మొత్తం అర్థం మార్చగల మహిమ తెలుగు భాష ఔన్నత్యాన్ని చూపుతుంది.

వడలు – వాడలు
ఒడలు – ఓడలు
మెడలు – మేడలు
జడలు – జాడలు
హ్రస్వ, దీర్ఘాల హంగామా మన మాతృభాషకు మాత్రమే సొంతం.

అమ్మ ఒడిని మించిన హాయి లేదు
అమ్మనుడిని మించిన అమృతం లేదు.
కనుకనే మన మాతృభాష అయిన తెలుగు పట్ల ఆసక్తి కలిగాలి.

తెలుగులో తప్ప వేరే ఏ ఇతర భాషలోనూ ఇన్ని జంట పదాలు ఉండవేమో!
1.కలకల
2.కిలకిల
3.గలగల.
4.విలవిల.
5.వలవల.
6.మలమల.
7.వెలవెల.
8.తళతళ.
9.గణగణ. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.
ద్విపద అక్షరాల ద్విగుణీకృత ధార మన తెలుగు భాష. ఆ జంట పదాల జావళిలో ఒక్కసారి ఓలలాడితే మాతృభాష మీది మమకారం రెట్టింపు అవుతుంది.

కరము, ఖరము. వత్తులకు ఉన్న ప్రాముఖ్యత మరే భాషలో కనపడదు.
వత్తులకు, గుణింతాలకు ఉన్న విలువలను గుర్తెరిగి రోజుకు ఒక పదం అనుకొని దానితో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. ఉదాహరణకు ‘అనుకొని’ బదులు ‘అనుకోని’ అని వ్రాస్తే అర్థం పూర్తిగా విరుద్దమై పోతుంది.

అలాగే, కొన్ని పదాలకు ముందు ‘అ’ అని ఉంచితే అప్పుడు వ్యతిరేకమై పోతుంది. సంపూర్తి అని ఉంటె అసంపూర్తి అవుతుంది. అలాగే సమానత, అసమానత, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు మన తెలుగు భాషలో ఉన్నాయి. మితము అమితము ఇలా ఒకటేమిటి. ఎన్నో ఉన్నాయి.

భారము, క్షారము, నేరము, నరము, నీరము, బేరము, హారము, కీరము, కరము, క్షీరము, తీరము, దూరము, వారము ....మొదటి అక్షర మార్పుతో మొత్తం ప్రపంచం లోని వస్తువులన్నింటినీ తెలుగులో గుర్తించవచ్చు.

ఇక, మనం పూర్తిగా వాడటం మరిచిపోయిన అరసున్న [ ఁ ], బండి 'ఱ' లు ఎందుకు?
ఏడు అంటే సంఖ్య అలాగే ఏఁడు అంటే సంవత్సరం. ఇటువంటి చిన్న చిన్న వ్యత్యాసాలను కూడా అర్థం చేసుకోవచ్చు.
అలాగే,
అరుఁగు = వీధి అరుగు, అరుగు = వెళ్ళు, పోవు, అఱుగు = జీర్ణించు
కరి = ఏనుగు, కఱి = నల్ల

ఇటువంటి విషయాల పూర్తి సమాచారాన్ని ఎంతోమంది సాహిత్య శిరోమణులు నిత్యం అందిస్తూ ఉన్నారు. సమయోచితంగా వాటిని గుర్తించి, చర్చించి తద్వారా మన తెలుగు భాష ఔన్నత్యాన్ని చూపించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని నా భావన.

‘ఇంటగెలిచి రచ్చ గెలువు’ అనే సామెత మనకు సుపరిచితమే. మన మాతృభాష విషయంలో కూడా ప్రస్తుతం ఆ సిద్ధాంతాన్ని పాటించాలి. మా పిల్లలు తెలుగు బడికి వెళ్లి పట్టా పుచ్చుకునే విధంగా మేము చేశాము కనుక మావంతు బాధ్యత అయిపొయింది అంటే చాలదు.

వినాయకుడిని భక్తితో పూజించి కుడుములు తింటూ డు ము వు లు, ప్రధమా విభక్తి అని నేర్చుకోవచ్చు. సమోసాలు తింటూ సమాసాలు అర్థం చేసుకోవచ్చు. మన హడావుడి యాంత్రిక జీవనంలో కూడా సందు చేసుకొని సంధుల గురించి చదువుకోవచ్చు. తెలుగు పదాల మీద పట్టు వచ్చిన రోజున మనలోని కవి బయటకు వస్తాడు. అప్పుడు తెలుగులోనే చక్కగా వ్రాసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం కుటుంబ కార్యం లాగా ఇంటిలోని పిల్లలు పెద్దలు అందరూ నిత్యం సాధన చేయవలసిన అవసరం ఉంది. రోజుకో కొత్తపదం పిల్లలకు నేర్పవలసిన కనీస బాధ్యత తెలుగు భాష తెలిసిన పెద్దల మీద ఉంది.

జానపదుల నుండి జనించిన జానపద గీతం నేడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమై, ఆస్కార్ వేదిక మీద కూడా డాన్స్ చేసి పురస్కారం పొందే స్థాయికి మన తెలుగు భాష విస్తరించింది. నాటి తరం నేటి తరం వరకు ఈ నాటు నాటు పాత తెలియని తెలుగోళ్ళు ఉండరేమో.

మన జీవన విధానంలో ఏర్పడిన మార్పులకు అనుగుణంగా మరియు చేతికందివచ్చిన అభివృద్ధి అవకాశాలను అందుకునే భాగంలో మనందరం పరభాషా ప్రీతులమై మాతృభాష లోనికి ఇతర భాషలను మన సౌలభ్యం కొరకు ముఖ్యంగా చెప్పాలంటే ఆంగ్లభాషను మన తెలుగులో ఇముడ్చుకున్నాము. దాని పర్యవసానం, సరళమైన అచ్చ తెనుగు, సంస్కృత మిళితమైన గ్రాంథిక తెలుగును మరిచిపోయి కలగాపులగం చేస్తున్నాము.

ఒక చిన్న ఉదాహరణ;

మన ఇంట్లో ఉన్న పిల్లలకు

నాన్నా బంగారం, ఈ అరటిపండు తిను. అని అతి సులభంగా చెప్పవచ్చు కానీ

Re Come and Eat this banana అంటాం. అలాగే

పుత్రుడా ఏతెంచి ఈ కదళీ ఫలమును భుజింపుము అని అనవలసిన అవసరం కూడా లేదు. ఆ విషయాన్ని కొన్ని దశాబ్దాల క్రిందటే తెలుగు భాషలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారు చెప్పారు.

గ్రాంధిక భాషకు, వాడుక భాషకు మధ్య ఏర్పడిన అత్యంత సున్నితమైన పొరను తొలగించవలసిన బాధ్యత మనందరిపైన వుంది. తెలుగు భాష లోని మాధుర్యాన్ని అందరికీ రుచి చూపించాలి. తెలుగులో పట్టాలు ఇవ్వడం అనేది ఒక ప్రోత్సాహకం అవ్వాలి కానీ పట్టా సాధించడం కోసం మాతృభాష ను నేర్చుకోకూడదు. అసలు ఆ భావనే రాకూడదు. అమ్మ నుడి అంటే మనతో ఉండే కుటుంబ ప్రేమ, మనలో చెలరేగే భావావేశాల ప్రవాహ ధార కావాలి.

అమ్మ ప్రేమ వలన మన జీవన విధానంలో ఒక మహత్తరమైన శైలి అలవరుతుంది అలాగే మాతృభాష లో మనం వ్యక్తపరిచే భావాలు అందరికీ అర్థమై, సజీవమై ఆనందాన్ని అందిస్తాయి.

**** సశేషం ****

Posted in February 2024, ఆరోగ్యం

7 Comments

  1. చందు

    “‘ఇంటగెలిచి రచ్చ గెలువు’ అనే సామెత మనకు సుపరిచితమే. మన మాతృభాష విషయంలో కూడా ప్రస్తుతం ఆ సిద్ధాంతాన్ని పాటించాలి.”

    ఆలోచించి ఆచరించాలి!!

  2. మాలపాటి కోదండరామిరెడ్డి

    చాలా బాగుంది మధూ.మనకే తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.మరి ఈతరం వారికి వీటిలో కొన్నైనా తెలుసా అని

  3. Vijay Bhaskar Jonnalagadda

    Very interesting, rich in knowledge, and well presented article. I can see the author Madhu garu passion in each word in this article. As part of Folsom library books mission, we will be conducting some competitions where we can use these ideas 💡.
    Thank you

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!