అకౄరుడు బలరామ శ్రీకృష్ణులని మధుర కి తీసుకొచ్చాడు, కంసుడు తీసుకురమ్మని పంపితే. ఈ పిల్లలు ఆయన్ని ఊరి పొలిమేరల్లో వదిలేసి, ‘మేము ఊరు చూసి వస్తాం, నువ్వు కంసుడి దగ్గిరకి వెళ్ళి రేపు కృష్ణుడొచ్చి నీ అంతు చూస్తాడు అని చెప్పు’ అని ఆయన్ని పంపుతారు. ఆ తర్వాత ఊరు చూడ్డానికి బయల్దేరుతూంటే దారిలో కంసుడి చాకలి కనిపిస్తాడు. వాడు రాజుగారి బట్టలు ఉతికి మడతబెట్టి కంసుడి దగ్గిరకి వెళ్తున్నాడు. ఈ కుర్రాళ్ళు వాడిని ఆపి అంటారు, “మేము గొల్లపిల్లలం. ఇలా పల్లెటూరినుంచి వచ్చాం. రేపు రాజుగారి దగ్గిరకి వెళ్లడానికి మంచి దుస్తులు లేవు. నీదగ్గిర ఉన్న బట్టలు ఇస్తే అవి కట్టుకుని కంసుణ్ణి చూడ్డానికి వెళ్తాం.” అలా అడిగిన రామకృష్ణులకి ఈ చాకలి ఇచ్చే సమాధానమే ఈ నెల పోతన భాగవతంలోని శార్దూలం.
శా.
గట్టం బోలుదురే? పయో ఘృత దధి గ్రాసంబులన్ మత్తులై
యిట్టాడం జనెఁగాక గొల్లలకు మీ కెబ్బంగి నోరాడెడిన్;
గట్టా! ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్ బాలకా! [10.1.1260]
ఏవిటేమిటీ? (ఎట్టెట్రా). రాజుగారి బట్టలు ఇవి (మనుజేంద్రు చేలములు) మీకు ఇవ్వాలా (మీ కీఁ బాడియే)? అవి మీరు కట్టుకుని రాజు దగ్గిరకి వెళ్తారా? (మీరలుం గట్టం బోలుదురే), పాలూ పెరుగూ వెన్నా తిని మతిలేక బుర్రపాడుచేసుకుని ఇలా మాట్లాడగలుగుతున్నారేమో (పయో ఘృత దధి గ్రాసంబులన్ మత్తులై) గొల్లపిల్లలైన మీరు. లేకపోతే ఇలా కంసుడి బట్టలు ఇమ్మని అడగడానికి మీకు నోరెలా వచ్చింది? (యిట్టాడం జనెఁగాక గొల్లలకు మీ కెబ్బంగి నోరాడెడిన్). అయ్యో (గట్టా!), కంసుడికి తెలిస్తే మీ ప్రాణాలు తీస్తాడు కుర్రాడా (ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్ బాలకా). గర్వం తో ఏమంటున్నాడో చూడండి, అవతల అడిగేవాడు ఎవరో తెలియకుండా/తెలుసుకోకుండా – కంసుడికి తెలిస్తే ప్రాణాలు తీస్తాట్ట. మా రాజు ఇంత గొప్పవాడు, వాడికి బట్టలుతికే నేను కూడా చాలా గొప్పవాణ్ణి అనే గర్వం ఉన్నప్పుడు ఇటువంటి మాటలే వస్తాయి నోట్లోంచి.
అయితే కృష్ణుడు ఈ చాకలిని ఓ గుద్దు గుద్దాక వాడు ఛస్తాడు భగవంతుణ్ణి ఎదురుగా చూస్తూనే. వాడు మోస్తున్న బట్టల్లో తమకి కావాల్సినవి తీసుకుని కాస్త ముందుకెళ్ళాక కుబ్జ కనిపిస్తుంది. ఈ చాకలి అడిగినట్టే వాళ్ళు ఆవిణ్ణి కూడా తమకి లేపనాలు కావాలనీ అవి రాసుకుని కంసుడికి దగ్గిరకి వెళ్తామనీ అడుగుతారు. ఆ అడగడంలో కూడా శరీరం ఆష్టవంకర్లు తిరిగిన కుబ్జని ‘సుందరీ’ అని సంభోధించి మరీ అడుగుతాడు కృష్ణుడు. అయితే శరీర వైకల్యం ఉంది కనక ఆవిడ వీళ్లన్న మాటలకి కోపగించుకోకుండా, “నన్ను సుందరీ అంటున్నావు సరే, అందరికీ నీవంటి అందం ఎక్కణ్ణుంచి వస్తుంది. మీకు కావాలంటే ఈ లేపనాలు తప్పకుండా తీసుకోండి, నేను మరో సారి కంసుడి కోసం తయారు చేస్తాను వీటిని అంటుంది.” చాకలి అన్న దానికీ కుబ్జ అన్నదానికీ తేడా గమనించారా? ఈ లేపనాలు తీసుకుని కుబ్జ కాలిమీద తన అరికాలు ఉంచి చూపుడు వేలు ఆవిడ గడ్డం మీద పెట్టి పైకి లేపుతాడు కృష్ణుడు. అతిలోక సౌందర్యవతి తయారౌతుంది వెంఠనే. ఇందులో గమనించవల్సినవి రెండు విషయాలు. మొదటిది తన ఎదురుగా ఉండేవారిలో గర్వం, అహంకారం, మానసిక సౌందర్యం భగవంతుడికి ఎవరూ చెప్పక్కర్లేదు. వాటిని ఆయన మన మనసులో సూటిగా చూసి తెలుసుకోగలడు. రెండోది భగవంతుడికి ఏది ఎంత తక్కువలో మనఃస్ఫూర్తిగా ఇచ్చినా అది అనంతమై మన దగ్గిరకి తిరిగి వచ్చి తీరుతుంది. ఈ విషయం భగవద్గీతలో స్ఫష్టంగా చెప్పాడు కూడా – పత్రం పుష్పం ఫలం తోయం… అంటూ. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – ఫలాపేక్ష లేకుండా ఇవ్వగలగాలి. నేను పాసైతే నీకు తలనీలాలు ఇస్తా. నాకు డబ్బులొస్తే నీకు అభిషేకం చేయిస్తా అనే మొక్కుల వల్ల పెద్ద ప్రయోజం లేదు. భగవంతుడి దగ్గిర కూరలు బేరం ఆడినట్టు బేరసారాలు పనికిరావు. అయినా మనకి సంపద, ఇల్లూ వాకిలీ కలిగితే ఇవన్నీ ఎవరివల్ల వచ్చినట్టు? ఇదంతా భగవత్కృపే అనుకుంటే ఫలానా విషయంలో నాకు కోటి రూపాయలు నాకు వచ్చినందుకు నీకు పదివేలు ఇస్తా అనుకోవడం ఎంత హాస్యాస్పదం? ఎందుకంటే అసలు కోటి రూపాయలు నిజంగా మనకి భగవంతుడు ఇచ్చాడనుకుంటే ఆయన మొహంమీద పదివేలు పారేయడం సిగ్గు చేటు కదా?
ఈ పద్యంలో అసలు చాకలి బట్టలు ఇవ్వనూ అనే తెగేసి చెప్తున్నాడు. అదీగాక నువ్వెవరివీ నీకు మదం ఎక్కి రాజు గారి బట్టలు కావాలా? ఛస్తావు సుమా అని వెక్కిరిస్తున్నాడు కూడా. అందుకే వాడికి చావొచ్చింది. అయితే అడగ్గానే లేపనాలు ఇచ్చిన (అదీ బేరసారాలు – నీకు లేపనాలు ఇస్తే నాకేం లాభం, అనే మాట - ఆడకుండా) కుబ్జ మహా సౌందర్యవతి (కృష్ణుడు కూడా సుందరీ అన్నాడు ముందే) అయింది. ఇదే శంకర భగవత్పాదులు అన్న"భవతు భవదర్దం మమ మనః" అనేది. మరో సారి ఆ శ్లోకం గుర్తు తెచ్చుకుందాం.
గృహస్తే స్వర్భూజామర సురభి చింతామణి గణే
శిరస్తౌ శీతాంసౌ చరణ యుగళస్తే అఖిలసుభే
కమర్దం దాస్యే జహం భవతు భవదర్దం మమ మనః [శివానందలహరి. 26]
(బంగారు కొండ నీచేతిలోనే ఉంది. అత్యంత ధనవంతుడైన కుబేరుడు నీ స్నేహితుడే. నీ గృహంలోనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వజ్రం ఉన్నాయి. తలమీద చల్లదనాన్నిచ్చే చంద్రుడున్నాడు. సర్వ శుభాలు నీ పాదాల దగ్గిరే ఉన్న నీకు నేనిచ్చేదేమి కనిపించదు కనక నా మనసే నీదవు గాక).