Menu Close
SirikonaKavithalu_pagetitle

అలిగి కూచున్న ఆషాఢ విరహతాపం
సందేశ విన్నపానికి కాళ్ళావేళ్ళాపడినా
పెడమొహం పెట్టిన మేఘాలు వట్టి పోయిన ఆవులై
మొహం వేళ్ళాడేసుకుని కాళ్ళీడ్చుకుంటూ
తచ్చాడుతూనే ఉన్నాయి.
లోలోనికి కునారిల్లుతూ ఎండిన బీడు భూములై
ఎండమావులను వర్షిస్తున్నాయి.
సుర్యుడికీ చంద్రుడికీ మధ్య కాలాన్ని
చీకటి వెలుగులతో కొలుస్తూ
చిట్టెలుకల్లా పరుగులు తీస్తున్నాయి.

దుఃఖం ఓపలేక భుగభుగలాడుతున్న దినకరుడు
దిక్కుతోచని స్థితిలో కొత్తవైరస్ సోకినట్టు
వేడిని కక్కుతూనే ఉన్నాడు
ఆతప ధాటి తట్టుకోలేని హరితవనాలు
పసుపు అలదుకొన్న పండుమొహాలై
నిమిషానికొకటి ఆవులిస్తూ రాలుతూనే ఉన్నాయి.
వేడి పిడికిట్లో గాలి ఊపిరందక ఉక్కిరిబిక్కిరవుతూనే ఉంది.

అరమాగిన అర్ధరాత్రికూడా కాపాలాకాస్తున్న వెచ్చని వాకిళ్ళ వెనక
ఉక్కపోతలో మగ్గిపోతూ ఆవిరైన కన్నీళ్ళ జాడలు
వేలికొసల్తో చదువుకుంటున్న వెన్నెల రేడు
తుప్పుపట్టిన వెండి కిరణాలను ఓదారుస్తున్న వైనం

టక్కుతూ తారుతూ వచ్చిన శ్రావణం
సుదీర్ఘమయిన పగటి పెనాలమీద తొక్కుడుబిళ్ళాడుతూ
పాలిపోయిన మసక వెలుతురు చెక్కిళ్ళ మీద జీరాడుతూ
కాస్తైనా కరుణ చూపని మేఘాల వేటలో అలసిసొలసి
ఓ పక్కన వాలిపోయింది
గుండెపగిలిన పొలం గుండెలో స్పృహతప్పిన రైతుల
ఊపిరిలా
వాన సన్న గిల్లుతూ మనిషి ఉనికిని గిల్లుతూనే ఉంది.
కాలుష్యం రాహువై ‘గ్రహణం పట్టిన ఋతువు’
గిలగిలలాడుతూ వెర్రిచూపులు చూస్తూనే ఉంది

ఎందుకు ఈ సతత హరితాలు?
వల్ల మాలిన ప్రేమ గీతాలు?
క్షణం క్షణం జారి పోయే క్షణాలు
ఉవ్వెత్తున ఎగిరే భావ తరంగాలు
నువ్వు నేను వేరేగా
ఒకటనే భావనేగా
భావనా లోకంలో ఎంతకాలం?

ఎన్నెన్ని ప్రత్యూషవేళలు
నీ పలకరింపులకై ఎదురుచూసాను
ఎన్నెన్ని పున్నమి రాత్రులు
నీ సమాగమనానికై వేచి
వేడి నిట్టుర్పులతో గడిపాను.

ఎప్పుడూ వసంతరాగాలు
గ్రీష్మ బాణాలను వేసాయో,
‍మేఘాడంబరాలకు ఝడిసి
శ్రావణ మేఘాలను కప్పుకొన్న నింగి
ఝడి వానను కురిపించి
జలతరంగిణీని  మీటిందో,
కలువ భామల కన్నులలో శశి వదనం
ఎలా కనుమరుగు అయిందో?
నులి వెచ్చని హేమంత కిరణాలు
శిశిర పత్రాలలో చేరి ఎలా రాలాయో?

పక్కనే పక్కనే వున్న సమాంతర రేఖలపై
సాగిన చక్రాల బండి
ఒంటి స్తంభం దగ్గర ఆగిందని తెలిసిన క్షణం
మళ్ళీ నువ్వు గుర్తు వచ్చావు సుమా!
ఇంతలో రెక్కలువిప్పుకొని ఎగురుతూ
వచ్చిందేదో పట్టుకు పోతోంది..
వెనకా ముందు చూడక
వేకువ చీకటి అని తెలియక
ఎత్తు పల్లాల్లో, కొండలు కోనలు
తిరుగుతూ తీసుకు పోతోంది.

ఏ దేశమైనా తోడు నీడ లేకుండా
దొరగానో లేక దొంగగానో
అనుకున్నది సాధించే వరకు ఆగక
స్వర్గానికి నిచ్చెనలను వెయ్యాలని
అనుబంధాలను తెంచుకొని
బంధాలను పెంచుకుంటూ
ఎందరి కాళ్ళనో పట్టుకొని
మరెందరినో విసిరికొడుతూ
అవసరానికో ఓ రూపు మారుస్తూ,
సత్యానికి ముసుగేసి,
క్షణం క్షణం అసత్యంతో
సహజీవనం చేస్తూ సాగుతోంది...
నీ జాడే కానని లోకంలో
నీ భావనలతో పని లేకుండా ...
ఓ బాష్పబిందువుగా..

రాదారే లేని ఊరిలో
చీకటితోవల్లో పోతున్న పయనాన్ని ఆపి
ఎక్కడికెళుతున్నావ్? అని
ప్రశ్నించిందా పున్నమి!

బిత్తర చూపుల్ని లాలించి
గుప్పెడు కలల్ని నింపింది!
వంటరిగా వణుకుతున్న చేతుల్ని కలిపి
దోసిట నిండా వెన్నెలను పోసింది!

తడబడుతున్న అడుగుల్ని
ఒకటి చేసి పద్మాసన మేయించి
వొళ్ళో ఓనమాలు కురిపించింది!
చెదురు మబ్బులల్లే ఉన్న ఆలోచనలు
పోగుచేసి వానల్లే కురవడమెలానో నేర్పింది!

చెరువు మింగబోయిన దేహాన్ని
చేప పిల్లలా మార్చి
బతుకు ఈదడమెలానో సాధన చేయించింది!

బొప్పి కట్టిన అనుభవాలను
నొప్పి తెలియని పాఠాలుగా
ఎలా మలుచుకోవాలో
ప్రతి మలువులోనూ ఉండి
హెచ్చరించింది!

నేనో మిణుగురు పురుగునై
స్వయం ప్రకాశమయ్యే వరకూ
తోడుగా నిలిచింది!

ఆ పున్నమికెంత స్వార్ధమో...!!
మట్టిపొరల్లో చిక్కిన
ఏ రాయినీ వదలక
తన వెలుగు సంతకం చెక్కేది!
తన చేతి రాయి
కిరీటంలో వజ్రమై మెరిసినప్పుడు
మరింత సంతోషవెన్నెల కురిపిస్తూ
మైమరచి ఆడేది!

ఆ గుండె కెంత లాభాపేక్షో...!!
ఏ చిట్టి దీపం తన అరచేతుల మధ్య వెలిగినా
తనో ఆస్తికర్తనైనట్టు ఒకటే సంబరం!

చిట్టి నమస్కారానికే
వందేళ్ల జీవితాన్ని ప్రసాదించిన
ఆ "గురు పౌర్ణమి" కి ఎంతటి
నిర్మల హృదయమో!
మరెంతటి అవాజ్య ప్రేమో
తను తీర్చిదిద్దిన అక్షరాలంటే!

ఎన్నో దట్టమైన చీకట్లను కాంతివంతం చేస్తూ చేస్తూ
ఆ పున్నమి అలా సాగిపోతూనే ఉంది!
తను వెళ్లే తోవంతా ఒకటే ప్రతిధ్వనిస్తున్నది...
విశ్రాంతి ఒక్క పదవికే...
తన వెలుగు పథానికి కాదు!
గురుభ్యోనమః!

ఎంత చిత్రమైనవి బంధాలు?
ఎలా ముడివడతాయో
అలా  విడిపోతాయి.
తెగిన తంత్రుల పైన
అపస్వరాన్నైనా పలికించాలనుకుంటావు కానీ;
పలకదు ఏ రాగమూ!

చిక్కుముళ్లూ ప్రహేళికలైన
"రాస్తా"ల రాకపోకల
రహస్తీరాల్లో ....
ఒక క్షణం తటాలున మెరిసి
తత్ క్షణమే మటుమాయమయ్యే
తటిల్లతలేనా మానవ సంబంధాలు?

సర్వజగద్రక్షకుడు
జగన్నాటక దర్శకుడు
దశావతార మూర్తి
శ్రీమన్నారాయణుడు!

ఆశ్రిత రక్షకుడు
అభయ ప్రదాయకుడు
జగదానంద కారకుడు
శ్రీమన్నారాయణుడు!

గజేంద్రుని రక్షణార్ధం
అర్ధాంగికీ చెప్పకుండా
హడావుడిగా
భువికి దిగివచ్చిన
ఆపద్భాంధవుడతడు!

పుండరీకుని రాక కోసం
ఆరుబయట
ఇటుక మీద
నిరీక్షించిన
భక్తవత్సలుడు
పాండురంగడతడు !

ప్రహ్లాదుని
నమ్మకం నిలబెట్టి
ఇందుగలడందులేడని
సందేహం వలదని
స్తంభాన్ని చీల్చుకొచ్చిన
ఉగ్ర నారసింహుడతడు!

మహా విష్ణువుని నమ్మినవాడు
మోక్షాన్ని పొందుతాడు
శ్రీహరిని కొలిచినవాడు
సిరులతో తూగుతాడు!

మనోభీష్ట సిద్ధి కారకుడు
అభయమిచ్చే బ్రహ్మాండ నాయకుడు
శ్రీమన్నారాయణుడే!

నారాయణ మంత్రం జపిద్దాం
శ్రీమన్నారాయణుడ్ని
మనసారా కొలుద్దాం !

ఎక్కడో గగనాంచలాన
తళుక్కున మెరిసే నక్షత్రానివి నువ్వు
నేలమీద గడ్డిపువ్వును నేను
నిన్ను చేరుకోవాలని ఎంత తపన ఉన్నా
చేరలేని అశక్తత.....
మనస్సు మాత్రం మాట వినదే
నీ స్నేహసాంగత్యాన్నే కోరుతుంది

పిడికెడు  ప్రేమకోసం పొగిలి పొగిలి ఏడ్చిన క్షణాలెన్నో
కొన్నిక్షణాల సాంత్వన  కోసం ఎదురుచూసిన రోజులెన్నో…….
ఒక చిన్ని పలకరింపుకై ఎదురుచూపు
అనుభూతులు నింపుకున్న మనసు
ఆ ఆనందానికై పలవరిస్తుంటుంది
నీ స్వరమే నాలో శ్వాస నింపి బ్రతికించే
చైతన్య కాంతి ధార…..

జీవిత రహదారిలో ఎన్నో పరిచయాలు...
పరిమళించి పుష్పించేవి కొన్నే....
స్పర్శా మాత్రాన సహస్రదళాలై
విరిసే ఎద
కలత నిదరలో కూడా ఉలిక్కిపడుతుంది
కలలో విన్న నీ పిలుపుతో....
ఆ పిలుపు వాస్తవమయ్యే
మధుర క్షణాలకై
ఎదురుచూస్తూ……
నీకై ఆలోచిస్తూ గడిపిన నిదురరాని రాత్రులు
మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి..……

మరుపు మంచిదే
ఏ తప్పు మాయాలన్నా
అదే పరిష్కారం
కుదుపు మంచిదే
ఏ సర్దుబాటుకైనా
ఒకే ఒక పరిహారం

అలక మంచిదే
బ్రతిమిలాడే వారుంటే
భలే మజాగా ఉంటుంది
కునుకు మంచిదే
బరువెక్కిన గుండెనుండీ
బడలిక అంతా తొలుగుతుంది.

హితోక్తులు పలకటం
ఎంత మంచిగుంటుందో
ఎవ్వరూ పట్టించుకోకపోయినా
మనకు మనమే మురిసిపోవచ్చు
చరిత్రహృదయం ఎంత గట్టిగుంటుందో
ఎన్ని రక్తపాతాలు చూసినా
నిత్యయౌవనంతోనే నిలుస్తుంది
నీరసాన్ని నెత్తుటితో తుడిచేస్తూ,

గాలిలో కలిసిన బ్రతుకుల వల్లే
గాలి కూడా బరువెక్కి స్తంభిస్తుంది
చితులపై కూడా రాలిన చినుకుల వల్లే
నల్లమబ్బూ ఆవిరై కన్నీళ్ళు క్రక్కుతుంది!

Posted in December 2023, సాహిత్యం

6 Comments

  1. dr klv prasad

    nagajyothi gari kavitha chalaa bavundi
    rachayitriki abhinandanalu ,shubhaakankshalu
    ——-Dr. K L V Prasad
    secunderabad.

  2. D.Nagajyothi

    హృదయపూర్వక ధన్యవాదాలు సిరిమల్లె కు.100 సంచిక శుభాకాంక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!