Menu Close
SirikonaKavithalu_pagetitle
జ్ఞాపకం -- గంగిశెట్టి ల.నా.

తనేం మనిషో!!
కదిలిపోయే జ్ఞాపకాల ప్రవాహం
తనేం మనిషి?
ఒక్క జ్ఞాపకం ఊసూ లేదు
తనూ మనిషి!
తనకూ జ్ఞాపకాలున్నాయి...

జ్ఞాపకం ―
మనిషితనానికి ఓ పర్యాయం!
జ్ఞాపకం
మనిషితనానికి విలాసం!

అంతమయ్యే జ్ఞాపకం జీవితం
అంతంలేని అనుభవం జ్ఞాపకం!

విశ్వనాధ…. -- వూటుకూరు జానకిరామారావు

తెలుగులు ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు! అందుకే విశ్వనాధ తెలుగువాడిగా పుట్టారు. విశ్వనాధ వారిగురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఒక ఎత్తైన ఎవరెస్టు శిఖరము. ఆయన అనంత విజ్ఞాన ఖని.

విజ్ఞానాన్ని, విశ్లేషణను ఊహకు జోడించి, అపూర్వమైన రచనా వ్యాసంగం చేశాడాయన. కొందరంటారు ఆయన వ్రాసేవి మాకు అర్ధం కావు! అని. నేను తెలుగు నేర్చుకున్నది, నేర్చుకుంటున్నది ఆయన రచనలనుంచే!

ఆ మహానుభావుడిగురించి ఎంత చెప్పినా తనివి తీరదు నాకు!. నీకు విశ్వనాధ అంటే ఎందుకంత ఇష్టం? అని నన్ను అడుగుతారు కొందరు. ఏమో నాకు తెలియదు ! కానీ ఆయన రచనలు చదువుతున్నప్పుడు నా హృదయము, మేధస్సు వేయిరేకులకమలములవలె విచ్చుకొని భావసుంగంధాలు వెదజల్లుతుంటాయి.

ఒక విషయం అడుగుతాను, ఏ మాత్రం భాషా పరిజ్ఞానము లేని ఒక చిన్న శిశువు ఎలా మాటలను అర్ధం చేసుకుంటున్నది? అంటే ఆ శిశువు నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఇప్పటి వరకు మనకున్న కొంచెం భాష అయినా నేర్చుకున్నదే కదా!

ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి నీ కొమ్మలకు బోలెడు పళ్ళున్నాయి నాకివ్వవేం? నేను ఎక్కడానికి వీలు లేకుండా? అంతెత్తుకు పెరిగావేమిటి? అని ప్రశ్నిస్తామా? చెట్టు ఏదోవిధంగా ఎక్కడానికి ప్రయత్నిస్తాము, మధురఫలాలను అంత ఎత్తున ఉన్నవి ప్రయత్నం చేత కోసుకు తిన్నప్పుడు కలిగే ఆనందం ఎంతో గొప్పది.

అలాగే విశ్వనాధ ఒక శిఖరం ! ఆ శిఖరం ప్రయత్నం చేసి ఒక్కసారి ఎక్కామా! అంతకు ముందు చూడని ఊహాలోకాలు చూస్తాము! అద్భుతమైన భాష, అనితరసాధ్యమైన విశ్లేషణ, అపురూపమైన ఊహ! మొక్క వోని ఆత్మవిశ్వాసము !
ఇవి కలిస్తే విశ్వనాధ!

ఇద్దరు ప్రాణ స్నేహితుల విఫల ప్రేమగాధలు, వారి వారి మనసులో సృష్టించిన అగాధాలు,
వాటిలో చెలరేగే భావతుఫానులు మన కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తుంది "ఏకవీర".

ప్రేమను ఎవరు అర్ధం చేసుకోగలరు?
సమాజంలో మనము చెప్పుకుంటున్న సూత్రాలు నిజంగా ప్రేమను నిర్వచించగలవా?
ఒకడిని చూసి తిరుగుబోతు అనుకుంటాము!
ఒక స్త్రీని గురించి చాలా చులకనగా మాట్లాడతాము, కానీ వారి హృదయపు లోతులలో
ఏ అమృత ధారలు ప్రవహిస్తున్నాయో ఎవరికి తెలుసు?
"ప్రభూ నేను జారిణిని కాను, అతడు జారుడు కాడు మా ప్రేమకు
మీ సూత్రములు పట్టవు మాది లింగజ్ఞానానికి అతీతమైన సంబంధము"
అని అంటూ బాదమ్మ చనిపోతుంది!
ఇది ఎందుకో తెలియాలంటే
"బద్దన్న సేనాని" "చదవాల్సిందే!

రాజ్యమెట్టిదో !ధాత్రి ఎట్టిదో ! స్త్రీ అట్టిది !
సేవించినకొలదీ ప్రసన్నయగును
ప్రేమించినకొలదీ సుఖధాత్రి యగును!
విరోధించినకొలదీ కలుషితురాలు అగును.
ఈ సృష్టిలో శరీరము ఒక్కటే దృశ్యమానము (కనబడేది!) తక్కినవన్నియు అదృశ్యములే (కనపడేవికావు) ప్రేమ, గౌరవము, అధికారము, వంశమర్యాద, కీర్తి, అపకీర్తి, మంచితనము, చెడ్డతనము,మొదలయినవన్నీ కూడా మనము భావిస్తే ఉంటాయి లేకపోతే లేదు!. ఎన్ని లోతైన విషయాలు ! ఎంత అద్భుతమైన చర్చ
"భ్రమరవాసిని " చదవండి తెలుస్తుంది.

"దంతపుదువ్వెన" అనే నవల వ్రాశారు ఆయన అందులో నరేంద్రుడు అనేవాడు తన పేరు "గూజా" అని మార్చుకుంటాడు. మార్చుకొని అది దేశీయమైన పేరు అంటాడు! సంస్కృతము కాదు అని అంటాడు!
ఆ పేరు ఏ ధాతువునుండి పుట్టిందో చెప్పి అది సంస్కృత పదమే అని నిరూపిస్తారు.
ఇది మనకు పెద్ద చదువుకాదా!.

ఇక చెలియలి కట్ట నవల, వివాహవ్యవస్థ ద్వారా సంక్రమించిన వాటిలో
శృంగారము ఒక భాగము మాత్రమే అని చెపుతుంది. కేవలం శృంగారమే పెళ్ళి కాదు.
వివాహము అంటే విశేషముగా వహించునది అని అర్ధము !
అంటే ఈ లోకమే గాక పరలోకమునకు కూడా సంబంధించినది అని అర్ధము.
రెండు శరీరాలు కలుసుకొని పునరుత్పత్తి చేయడమే వివాహ లక్ష్యము కాదు అంతకు మించినది అని చెపుతారు విశ్వనాధ!

యోగిలాగ ఉన్న రైతును భోగిలాగ చేసినది నూతన సమాజపు ధనతృష్ణ!
రాజులు రాణులు కేవలం మోతుబరి రైతుకుటుంబాలుగానో, సంపన్నకుటుంబాలుగానో మారిన వైనం, పూర్వపుభావోన్మాదాలు, భావప్రేమలు మచ్చుకు కూడా కనపడకుండా పోవడం మనకు నేడు కనపడుతున్నది కదా
భూమిమీద మనుషులకు దేవతలకు మధ్య ఉండే లంకె గణాచారి వ్యవస్థ! అది నేడు పూర్తిగా తెగిపోయినది.
మా కాపులు మానేలను ఎంత పచ్చగా ఉంచారో! నేడేమైనది అది అంతా! అని అనిపిస్తుంది!
ఎక్కడ చూసినా వరి మాగాణులేనా! వేరే ఇతర పంటలు అవసరములేదా?
ఏ నేలలో సహజంగా ఏ పంట పండుతుందో
దానిని వృద్ధిచేయకుండా మొత్తము మాగాణులేనా!
ఈ రోజు ప్రతి పంటపొలము తూర్పుకృష్ణాలో చేపలచెరువుగా మారి పోయింది!
త్రాగే నీరుకలుషితం!
పీల్చే గాలి కలుషితం
భూమినిండా ప్లాస్టిక్ అవశేషాలే
పంచభూతాలను కలుషితం చేస్తే అవి ప్రకోపించకుండా ఉంటాయా!
ఎన్నో విశేషాలు వేయిపడగలు నవలలో!

ఎంతో వ్రాయవచ్చు! నాబోటివాడికి ఒక జీవితకాలము సరిపోదు! ఆయన ప్రతిభ వర్ణించాలంటే. ప్రతి నవలలో ఏదో ఒక మానసిక విశ్లేషణ కనపడుతుంది. ప్రతి నవల ఒక పూల తోటే! ఎన్నో భావపుష్పాలతో అందంగా విరబూసిన పూదోటే!
విశ్వనాధకు నమస్సుమాంజలి!

పూలు మాట్లాడతాయి -- డా. పాతూరి అన్నపూర్ణ

సౌందర్య మంతా కుప్పపోసినట్లు
హరివిల్లులా అమరిన పూలు
అమ్మతల్లి రూపంగా అవతరించి
బొడ్డెమ్మగా నామకరణం చేసుకున్నాయి

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ
భక్తి భావ హృదయాన్ని ఆవిష్కరించుకుంటూ
మరణించిన మగువలను స్మరించుకుంటాం
ఎన్ని రసావిష్కరణ రంగులో ఇక్కడ!!!

ప్రేమ, ఇష్టం, కష్టం, అనుబంధం, ఆప్యాయత
అన్నీ కలబోసుకున్న గుండెచప్పుళ్ళు
ఈ పాటల్లో, వేసే అడుగుల్లో, ప్రతికదలికలో
ఒక లయతో ఊయలలూగిస్తాయి

ప్రకృతి పచ్చచీరతో ముస్తాబయి
చిరుగాలులను వెంటబెట్టుకుని
మంచు పూల స్వాగతానికి పరవశిస్తూ
అడుగిడుతున్న శుభ సమయంలో

పచ్చ పచ్చని పూబంతులను
తాజా తాజా తంగేడు పూల రాసులను
కోరికతో పూచిన మరెన్నో పూబాలలను
పసుపు కుంకుమలద్ది తీర్చిదిద్ది
కొంగుచాచి కోర్కెలు తీర్చమంటే
ఆపూల దేవతలు ఆశీర్వదిస్తాయి
అడిగిన వరాలిచ్చి ఒడి నింపుతాయి.

ఏ పూలరాసిని చూసినా
బాసలతో ఊసులాడినట్లే వుంటుంది
మగువకీ పూలకీ వున్న అనుబంధమే
ఈ బతుకమ్మ పండుగ!!
ఆడ బ్రతుకుకు అందమే
ఈ బతుకమ్మ పండుగ !!

చిగురెత్తిన తొలకరి --- దుగ్గరాజు లక్ష్మీ పద్మజ

నీ తలంపు కెరటమై తాకగా
ఉలిక్కిపడిన హృదయం
మనసు పాడే మౌన రాగం
గుండె గొంతులోకి వచ్చిన బిడియం
సిరి సిరి మువ్వల శబ్దం
చిన్ని గుండెలో పలికే మోహన రాగం
కల్లా కపటం తెలియని నా మనసు పడే ఆరాటం
ఇందుకోసం మనసుతో ఈ పోరాటం
మనో ఆకాశం అంచుల దాకా లేచిన నీ ఆలాపనా కెరటం
తడబడుతున్న స్వరం
సిగ్గు దొంతరల మధ్య చితికిపోగా.....
చిగురెత్తిన ఈ బేల వలపు
ఎదో తెలియని ఎదురు చూపు
నీ లేఖకి పడిగాపు.....

“నేను” 44 -- విశ్వర్షి వాసిలి

ఆదిమునికి అందని రహస్యాన్ని

నేను
సిరికిన్ చెప్పను
కలంతో కబుర్లాడను
కాగితాన్నీ కౌగిలించుకోను
అయినా
కొలమానంలో కలికాల కవిని
కాలమానంలో కలకాల కవితాత్మని.
••
అవునవును, నేను
రవికానని కవితాత్మనే
నైమిశారణ్య శుకగళాన్నే
హిరణ్యగర్భ నాదసర్పాన్నే
విశ్వజనిత స్వరసరాన్నే.
•••
నేను
చరవాణిని
ఆకాశ విహారిని
అరచేతి కర్ణభేరిని
సకలభాషల స్వరావధానిని.
••••
అందుకే, నేను
కాలాన్ని కనుల పొదుపుకుంటుంటాను
కలాన్ని కనురెప్పల దాచుకుంటుంటాను
వేలికొసల కనుపాపల నవుతుంటాను
కనుచూపుల అక్షరయాత్ర నవుతుంటాను.
అవును, నేను
కాలాతీత కవినే! ఆవలి తరాన్నే.
•••••
నేను
నిమీళిత నేత్రుడ్ని
సంసార వృక్షాన్ని
అంకుర సారాన్ని
స’రస’ ప్ర’కృతి’ని
చతుర్భువన కేళిని
సంధించని అక్షరాస్త్రాన్ని
ఆదిమునికి అందని రహస్యాన్ని.

పూలసింగిడి కోసం వ్రాసిన నా కవిత ‘అంతానేనై’ -- అరుణ నారదభట్ల

మళ్ళీ నేనొచ్చేసాను
అడవులు దాటి
కొండలఅంచుల రాళ్ళను దిగి
చేనుచెలకల గుంపులు విడిచి
పెరళ్ళ ముళ్ళకంచెలు విరిచి

నదులు దాటి
వాగువంకల మరచి
సరిహద్దు రేఖలను తుంచి
పచ్చపచ్చని పసిడి తంగేడు గుత్తులై
ఆకాశాన్ని తొడుక్కున్న కట్లపువ్వునై సంబరంగా వచ్చేసా...

గోడలమీద తీగనై, పెంకుటింటి గుమ్మడి పసుపునై
ఎర్రని మల్లెపువ్వునై
దారిదారంతా మూగిన పాలసంద్రపు పూలగుచ్చాన్నై
కుంటల బురదల వెలిగిన వెన్నెల కలువనై, శ్వేత తామరనై
వికసించిన ప్రకృతి రూపమై జ్ఞానమై మళ్ళీ వచ్చేసా!

అందమై, సుగంధమై
అమ్మనై, అమ్మమ్మనై
సుందర స్వప్నమై రంగుల హరివిల్లునై
మట్టికుండీల్లో పదిలంగా
పెరిగిన గులాబీనై‌, పట్నంబంతినై, చేమంతినై

ఎర్రమట్టి దిబ్బల్లో మల్లెపాదునై, విరజాజినై
చెమేలీ మెరుపునై
మెట్ల అంచులను చుట్టుకుని శంఖుపువ్వునై,
ఇంటివాకిట సదామల్లెనై, సన్నజాజినై

సరదాల గోరింటనై , తపోభూమిన పుట్టిన వన్నెల రుద్రాక్షనై,
రుధిర మందారమై, సీతజడనై
ఆరు రుతువుల ఆమని పాటనై, కోకిల గొంతునై

పసిడిపంటల కంచెబంతినై
అత్తారింటి ముద్దబంతినై, పోకబంతినై, గునుగు శిఖరమై
మేరునై, మెరుపునై
మేలిమి రంగుల మనోసౌందర్యమై
నేను బతుకమ్మనై మళ్ళీ వచ్చేసాను

నా ఉనికి ప్రకృతి
నా ఊపిరి ప్రకృతి
నా నడక ప్రకృతి
నా తనువు ప్రకృతి
నా మేను మేనంతా పూల పులకింతల ప్రకృతి

ఓ అన్నా, ఓ అక్కా
మీ రంగుల పూల జాతరలన్నీ నేనే
మీ మనుగడనూ నేనే
మీ కలలన్నీ నేనే

పచ్చని చెట్లై
ఆకుపచ్చని దారులు పరవండి
నా మేనుమేనంతా హరితం చేయండి
సుభిక్షమై ఆరోగ్యమై ఆనందమై మీ బతుకమ్మనై మీతోనే మమేకమైపోతా

సింగిడిరంగుల మొక్కనైమక్కువై మీ ఊపిరినై వెంటే ఉంట!
భూమి భూమంతా నిత్యం మల్లెపూవై పరుచుకుంట!!

నేను-6‬ -- లలితా కుమారి

నా అంతర్ముఖ
సృష్టి భాండాగారం లో ప్రకృతి ప్రభంధాలను పరికిస్తుంటే
ఆరు అనుబంధాలు
ఒక పక్క గా కనిపించాయి.
అందుకో పోతే ఓ తియ్యని స్వరం
అగు వసంతాన్ని నేనంటూ
ఉగాది కి ఆరంభాన్ని.
హరితం నావర్ణం వేడిమి నానైజం మల్లెల పరిమళాలు
నా పలకరింపులు అంటూ
చిరునవ్వు తో కదిలింది
గడసరి గ్రీష్మం గభాల్న వచ్చేసింది. అదేంటి అలా వెళ్ళింది అంటుంటే
దాని పరాన్నినేనే అంది.

అయితే నువ్వు చెప్పు నేనెవ్వరిని? అమ్మో నేనా
చినుకు పడితే నేనుండనుకదా అంటు పరుగెత్తింది.

ఆ జల్లు జల్లు ఝడి వానగా మారిఉప్పెన లా
ముంచుకు వస్తున్న వర్షాకాలపు వరదలకు
గట్టెక్కి కూర్చున్న నన్ను

(నాకు) చల్లని గాలుల శరత్ పున్నమి
వెన్నెల ఆలింగనాల వింత అనుభూతిని
మరింత గట్టిగాతనలోకి తీసుకుని
మంతనలాడే హేమంత ఋతువు ని
ఏమార్చి సిగ్గిలితూ వచ్చిన శిశిర సింగారనికి పచ్చదనాల
సిరికోన ఆకులు రాలుస్తు ఆహ్వానంపలికింది.

హమ్మయ్య అనుకుంటుంటే
ఇంకా ఇక్కడే వున్నావా అంటూవచ్చిన వసంతాన్ని
చూసిన నేనునా లోని "నేను"కై దృష్టి సారించింది.

Posted in October 2020, సాహిత్యం

3 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!