Menu Close
PrakriyalaParimalaalu_pagetitle

కవితా ప్రక్రియల పరిమళాలు-2

ఈ నెల ప్రక్రియ: కైతికాలు

కైతికాలు అనేది 6 పాదాల లఘుకవితా ప్రక్రియ. కవిత ప్రకృతి, కైత వికృతి. కవిత్వము ప్రకృతి కైతికము వికృతి. కైతికాలు ఎల్లరకూ సులభ గ్రాహ్యంగా ఉండాలనే ఉద్దేశ్యం కావచ్చు.

కైతికాలు ప్రక్రియ సృష్టికర్త శ్రీ గోస్కుల రమేశ్. హుజూరాబాద్ నివాసి. తెలుగు ఉపాధ్యాయులు.

మాత్రానియమ సహితమైనప్పటికీ సరళంగా ఉండడం వలన ప్రకటింపబడిన కొద్దికాలానికే విశేష ఆదరణ పొందింది. ఒక సందర్భం, ఒక చమత్కారం, ఒక చురుక్కు, ఒక చమక్కు, ఒక లయ, ఒక ప్రాస ప్రత్యేకతలుగా ఉండడంవలన కవిసమ్మేళనాలలో, పత్రికలలో, సోషల్ మీడియాలో కైతిక ప్రభంజనం జోరందుకోవడానికి ఆట్టే కాలం పట్టలేదు.

ప్రారంభమైన కొద్ది నెలలకే 60మంది కవులతో కైతికాలు ప్రథమ లఘుకవితా సంకలనం వెలువడడం మరో విశేషం. అన్నిటికన్నా ముఖ్యంగా సంవత్సర కాలానికే 50మంది కవులచే సంపుటులు ఆవిష్కరింపబడి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోగలిగిన ప్రక్రియ కైతికాలు. 120 మందికి పైగా కవులు 100 పైబడి కైతికాలు రాయగా వారిలో 20మంది పైనే సహస్రం దాటేశారు.

ఈ నెల మనం "కైతికాలు" ప్రక్రియ నియమాలను తెలుసుకుందాం. ఆసక్తి గల పాఠకులకు, ఔత్సాహిక కవులకు, తెలుగు విద్యార్థులకు ఈ సమాచారం ఉపయుక్తం కాగలదని భావిస్తున్నాను. వికీపీడియాలో కూడా కొంత సమాచారం పొందుపరచబడింది.

కైతికాలు నియమాలు:
 1. ఆరు పాదాలుండాలి.
 2. మొదటి నాలుగు పాదాలలో మాత్రలు 9-12 మధ్యలో ఉండాలి.
 3. 2,4 పాదాల చివర ప్రాస ఉండాలి (సున్న ప్రాస అక్షరం కాదు).
 4. 5,6 పాదాలకు మాత్రా నియమం లేదు కానీ లయాత్మకత దెబ్బతినకుండా క్లుప్తత చూసుకోవాలి.
 5. 5వ పాదంలో వారెవ్వా అని కానీ పై 4 పాదాల కవితావస్తువును బలపరిచే వ్యంగ్యాత్మక పదం వాడాలి.
 6. 6వ పాదంలో ఒక కవితాత్మక వాక్యం లేదా నూతన పదబంధం లేదా జాతీయం కొసమెరుపులా ఉండాలి. లయ, కవిత్వం రెండూ కలగలిసినపుడు అది గజలైనా పాటైనా గేయమైనా రంజింపజేస్తుంది. ఈ సత్యం ఇప్పటికే సుప్రసిద్ద రచనల రూపేణా ప్రకటితమై నిరూపింపబడింది కూడా. లయ ప్రధానమైన ఈ కైతిక ప్రక్రియను మాత్రల నిబంధన ప్రాస నియమాలు సరిగ్గా పాటిస్తూ 5వ పాదాన్ని 6వ పాదానికి కవితాత్మకంగా అనుసంధానం చేయగలిగినపుడు అద్భుతమైన కైతిక సృష్టిని కవి ఆనందించగలుగుతాడు.

jeevitha-satyaalu-coverకైతికాల ఆత్మను కవి సరిగ్గా పట్టుకోగలిగితే పాఠకులు ఒక్కో కైతికాన్నీ ఒక్కో ఆనందగుళికగా, ఉపశమనపు ఊటగా అనుభూతించగలుగుతారు. విశేషమేమిటంటే కైతికాల సృష్టి లయాత్మకంగా ఉంటూనే కవికలాన్ని సంక్లిష్ట నిబంధనల సంకెళ్ళతో కట్టివేయదు. పైగా ఇతర ప్రక్రియలవలె కాక దీనిని 60పదాల కైతికంగా, 600పాదాల దీర్ఘకైతికంగా మలచగలిగే అవకాశం ఈ ప్రక్రియ ఉజ్జ్వల భవిష్యత్తుకు సూచికగా నిలుస్తోంది.
5 వ పాదం ఒక మకుటంగా తీసుకుని 600పాదాలు ఒకే అంశంపై రాస్తే దీర్ఘ కైతికం, విభిన్నాంశాలపై రాస్తే కైతిక శతకం అవుతుందని నేను భావిస్తున్నాను.

ఈ ప్రక్రియలో నేను ఇప్పటికి 1200 కైతికాలు రచించి వాటిలో 250 కైతికాలను జీవితసత్యాలు పేరుతో సంపుటిగా వెలువరించాను.ఆ సంపుటినుండి కొన్ని కైతికాలు ఉదాహరణగా పాఠకుల కోసం.

అడగకనే సలహాలను
ఉచితంగా ఇస్తారు
తగుదారిని చూపమంటె
తమదారిన పోతారు
వారెవ్వా లోకులు!
ఎంతకైన తగుదురు (01)

అందలాలనెక్కిననూ
బంధనాలు తెంచరాదు
అంతస్థులు పెరిగిననూ
ఆత్మీయుల మరువరాదు
మరవకోయి మనిషీ!
మారవోయి మనీషిగ (02)

గొప్ప ఇంజనీరుయైన
మనసులోతు కొలవలేడు
గొప్ప ఆటగాడైనను
మనిషిమనసు గెలవలేడు
వారెవా మనసు!
చూడలేని సొగసు  (03)

కులమతాల కుమ్ములాట
తప్పదికడ పుట్టినాక
ఆధిపత్య పోరుబాట
తప్పదిపుడు పెరిగినాక
వారెవ్వా జీవితం!
ప్రతిబ్రతుకొక గ్రంథం  (04)

పాలలోన వెన్నముద్ద
దాగిననూ కనబడునా?
విత్తులోన వృక్షమొకటి
దాగిననూ త్వరపడునా?
వారెవ్వా జీవితం!
సహనంతో సత్ఫలం  (05)

ఎదుటివారిపై నిరసన
మౌనంతో తెలుపవచ్చు
వాదనతో వేదనొద్దు
మౌనంతో గెలవవచ్చు
వారెవ్వా మౌనము!
పదునైన ఆయుధము  (06)

చీకటిలో నీనీడే
తోడుండదు ఏనాడూ
ఆపదలో ఆయుధమై
మిత్రుడెపుడు ఉంటాడూ
వారెవ్వా దోస్తులు!
వారే మన ఆస్తులు  (07)

మేనెలలో వానలాగ
సమాజాన సమతయుండె
అడవిలోన మేడలాగ
మనుషులలో సఖ్యతుండె
వారెవ్వా సంఘము!
కులమతాల మేఘము  (08)

ఏడురంగులేకమయ్యి
ఐక్యతనే బోధించును
కష్టమందు ఒకటైతే
మనిషిజాతి గొప్పదగును
వారెవ్వా దాతలు!
అగుపించే దైవాలు  (09)

చీకటిలో తమ ఉనికిని
చాటుతాయి తారకలు
కష్టంలో బావురుమని
మనుషులేల శోకాలు?
వారెవ్వా ప్రకృతి
నీతిపాఠాల నిధి  (10)

***సశేషం***

Posted in October 2020, సాహిత్యం

4 Comments

 1. తాళ్ల సత్యనారాయణ

  కైతికాలు ప్రక్రియగురించి చాలా చక్కగా వివరించారు.నేను కూడా “సామాజిక సుమాలు”అను పుస్తకాన్ని అవిష్కరించాను.వండర్ బుకాఫ్ రికార్డ్స్ లో నాకు స్థానం దక్కింది చాలా సంతోషం.కైతికాలు సృష్టికర్త గోస్కులరమేష్ గారికి అభినందనలు💐.మేడం గారు శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారికి ధన్యవాదాలు🙏💐

 2. వసంత ఇంజపురి

  చాలా బాగుంది మేడం…మంచి ప్రక్రియ లెప్పుడు ప్రజాదరణ పొందుతాయి…
  కవులు సమాజహితాన్ని…వారి భావాలతోనే పంచుకుంటారు అనేది చాలా వాస్తవం…
  మీ కైతికాలు చాలా బాగున్నాయి మేడం

  • రమేశ్ గోస్కుల

   చాలా బాగుంది కైతిక కవిభూషణ్ శ్రీమతి గుడిపూడి రాధికా రాణి గారు చేసిన ఈ ప్రయత్నం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *