Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

మోదుగ పువ్వు

butea monosperma

మోదుగ ఒక ఎర్రని పూవు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. గుత్తులుగా పూస్తాయి. ఇది ఫాబేసి కుటుంబం లో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. చాలా అందంగా వుంటాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షము అని కూడ అంటారు. అంతేకాక భారతీయభాషల్లో దీనిపేర్లు ఇలావున్నాయి.

సంస్కృతంలో పలాశ అనీ, హిందీ లో పలశ్ అనీ, తెలుగులో మోదుగ, మోదుగు అనీ, మలయాళంలో మురికు, శమత , బ్రీమ వృక్షం అనీ, తమిళం లో పొరొసం, కత్తుమురుక అనీ, కన్నడంలో ముథుగ, బ్రహవృక్ష అనీ, పంజాబ్, హర్యానాల్లో కాకాక్ అనీ, ఒరియాలో కింజుకొ, పొరసు అనీ అంటారు. అంటే, ఇన్ని భాషల్లో ఇన్ని పేర్లున్న ఈ మోదుగ దేశవ్యాప్తంగా వున్నట్లు ఋజువవుతున్నది కదా!

మోదుగ ఎత్తుగా పైకి పెరిగే వృక్షం. ఈ చెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పెరుగుదల నిదానం.

butea monosperma

నారింజరంగుతో, ఎర్రని గుత్తుల ఈ పూలు కనువిందుచేస్తాయి. చాలా తమాషాగా వుంటాయి. కొక్కేలలాగా, కొద్దిగా చిలుకముక్కుల్లాగా వుంటాయి పూలు, ఆకులేకనిపించనట్లు నిండుగాపూస్తాయి.

మృదువైన కేశరాలతో వుంటాయి. ఈ మోదుగ పూలేకాక చెట్టు కూడా ఎంతగానో ఉపయోగపడి తన త్యాగగుణాన్ని చాటుకుంటుంది. వేసవి ప్రారంభానికి చెట్లు ఆరంజిరంగులో నిండుగా పూలతో కళకళలాడుతూ సూర్యుణ్ణి ఆహ్వానిస్తాయి.

ఈ పూల పుప్పొడి నుండి అబిర్ అనే, హోలి రంగుల్లో కలిపే రంగును తయారుచేస్తారు. పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండి, చెట్టు పైన పూలు బాగా పూసి ఎర్రగా అగ్నిశిఖలాగా వుండటం వల్ల వీటిని ''Flame of Forest' అని అంటారు. కాయలను, వైద్యంలో వాడుతారు, చాలా ఔషధ గుణాలున్నాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు.

butea monospermaమోదుగు ఆకులను, కాడలను, కొమ్మలను కూడా, మోదుగు పువ్వులను హిందువుల పూజల్లో ఉపయోగిస్తాం. ఇంటిలో చెడు పోగొట్టను ఎండిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు. వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చెడుహరిస్తుందని నమ్మకం. ఈ పువ్వులు ఒక రకమైన సువాసతో పాటు అందంగా వుంటాయి. నిండు ఆరంజి రంగులోని ఈ పువ్వులను చూస్తే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ పువ్వులు పరమశివుడికి అత్యంత ఇష్టం. లక్క పురుగులు దీనికి అతిథులు. ఈ మోదుగ చెట్టు కలపను ప్యాకింగ్ పెట్టెలతయారీకి వాడుతారు. తుపాకిమందుకు ఈ కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బంక టానింగ్, రంగుల అద్దకంలోనూ వాడుతారు. కాండం యొక్క బెరడును కూడా పరిశ్రమలో ఉపయోగిస్తారు. బెరడునుండి నార తీస్తారు. చూశారా చెట్టు త్యాగం సర్వం మానవ ఉపయోగార్ధమే.

Posted in October 2020, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *