Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

ఈ యాంత్రిక జీవన ప్రవాహంలో స్థిరత్వం కోసమని డబ్బు సంపాదనలో పడి మన పిల్లలకు, ఎదిగే వయసులో అవసరమైనప్పుడు మనం అందుబాటులో లేకపోతే, వారికి మన అనుభవాల సారాన్ని అందించకపోతే, కష్ట నష్టాలను వివరించపోతే, వారికి మన మీద, మనం వారికి అందిస్తున్న భరోసా మీదా నమ్మకం ఎట్లా కలుగుతుంది. అదే అపనమ్మకము తరువాతి కాలంలో మనలను వెంటాడుతూ అభద్రతా భయానికి లోనై తద్వారా ఒకవిధమైన మానసిక ఆందోళనకు గురిఅవడం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాము. పోనీ, మనం సంపాదించిన ఆస్తి, అంతస్తు మనకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు. అయితే అది తప్పు చేసి సరిదిద్దుకోవడం అవుతుంది కానీ సహజమైన అనుబంధాల ఆప్యాయతను మరల పొందడం అంత సులువు కాదు.

మన ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లను అదేదో social status అంటూ నియంత్రణ లేకుండా మన శరీరానికి ఇబ్బంది కలిగించుకుంటూ పోతూ, ఒక దశలో పరివర్తన కలిగి ఆ అలవాట్లను, అభిరుచులను నియంత్రించిన తరువాత కూడా ఆ శేషాలు అలాగే ఉండి మన రోగనిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు మనలను ఇబ్బంది పెడుతుంటాయి. అది అవసరమా! ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, మన మనస్సును నియంత్రించు కోవడానికి ఒక వయసు వచ్చేంతవరకు వేచివుండవలసిన అవసరం లేదు. మొదటినుండే మన అలవాట్లను ఒక క్రమ పద్ధతిలో ఉంచుకుంటే చాలు. అదేమంటే, పుట్టుకతోనే అన్ని విషయాలు తెలియవు అనుభవంతో అవగాహనకు వస్తాయని చెబుతారు. అది నిజమే కానీ పుట్టుకతోనే మనకు అన్ని అలవాట్లు కూడా కలగవు కదా! ఏ సందర్భమో, వేరే వ్యక్తి ఎవరో నిన్ను ప్రభావితం చేసే స్థితికి మనం చేరకూడదు. అట్లని అన్ని అలవాట్లను మానుకొని ఆకులు, పండ్లు తింటూ బ్రతకమని కాదు. అన్నీ సమపాళ్ళలో ఉన్నప్పుడే ఆహారం మీదా ఆసక్తి కలుగుతుంది. ‘మన ఆరోగ్యం మనచేతిలో’ లాగే ‘మన ఆహారం మన నియంత్రణలో’ అని అనుకుంటే చాలు. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవడానికి నామూషి ఎందుకు? ఆ విధంగా మనకు శరీరానికి కావలిసిన వ్యాయాయం దొరుకుతుందని ఎందుకనుకోము? ఎందుకంటే అక్కడ అహం, అభిమానం అడ్డువస్తుంది. మన స్థితిగతులు గుర్తుకువస్తాయి. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అన్న అతి చిన్న విషయాన్ని విస్మరిస్తాము. ఒక విషయాన్ని లేక సలహాను ఎదుటివారికి మనం ఇచ్చేముందు మనం ఆచరించి ఆ తరువాతే సూచించాలి. అప్పుడే నిజమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది.

నేటి జీవన శైలిలో మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, క్రమం తప్పక ఆహారం తీసుకొంటూ, తగిన వ్యాయామం చేస్తూ, ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ అప్ చేయించుకుంటూ ఉంటే చాలు, జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుంది అని అనుకొని ‘నేను’ అనే అహాన్ని మాత్రం అలాగే ఉంచుకొని జీవిస్తున్నాము. మనకు భౌతిక ఆరోగ్య సామర్ధ్యం తో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ఎంతో అవసరం. మనలో జరిగే మానసిక సంఘర్షణలకు అనుగుణంగా మన శరీరం కూడా స్పందిస్తుంది. కనుకనే మనకు ఆనందాన్ని పంచే మంచి స్నేహితులు, నాలుగు మంచిమాటలు, కొలది సేపు మానవత్వంతో కూడిన కార్యక్రమాలు... ఇలా మంచితనం మనతోనే ఉందనే మధురానుభూతి, దాని పర్యవసానం మనలో కలిగే మాటలలో చెప్పలేని అత్యంత ఆనందకర భావోద్వేగం. దానికోసమే మన గురువులందరూ మనలను ఆధ్యాత్మిక అంశాల వైపు దిశానిర్దేశం చేసి మనలను రక్షిస్తుంటారు. సకల జీవరాశిని సహృదయంతో సమానంగా చూస్తూ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ మన జీవితాన్ని సాంగించడమే మన ప్రస్తుత కర్తవ్యం. ప్రకృతిలోని మార్పులకు మనం మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. సృష్టిలో, ఈ అనంత విశ్వంలో మనవంతు బాధ్యత అణువంత మాత్రమే. దానిని సక్రమంగా నిర్వర్తించడం అనేది మన చేతిలో ఉంది. Do your best, leave the rest.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in October 2020, ఆరోగ్యం

2 Comments

  1. అయ్యగారి మూర్తి

    సందేశం చక్కగా ఉంది.
    వివరించపోతే, శ్లేషాలు, భూవోద్వేగం లో టైపోలు తొలగించండి.

    • Sirimalle

      అక్షరదోషాలు గమనించినందుకు కృతజ్ఞతలండీ! సరిచేయటం జరిగింది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!