Menu Close
చెదరని బంధం
-- మధుపత్ర శైలజ ఉప్పలూరి

అలా ఓ సంవత్సరం గడిచింది. ఓ సారి వంశీ తల్లి, రాజ్యలక్ష్మిగారికి ఫోన్ చేసి “వంశీకు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. వాడు మాత్రం ఇంకొంతకాలం అంటూ వాయిదా వేస్తున్నాడు. మీరు ఒప్పించండి వాణ్ణి” అంటూ మాట్లాడింది.

ఆ రోజు వంశీ ఇంటికొచ్చాక రాజ్యలక్ష్మిగారు “మాకు కూడా లక్ష్మీదేవి లాంటి కోడలు నట్టింట్లో తిరుగుతూంటే ఆనందమే కదా!” అని అతనికి నచ్చచెప్పి పెళ్ళికి ఒప్పించారు. ఈ సారి పెళ్ళి ఖాయం చేసుకొని రావాలని భర్తతో కూడా చెప్పించారు ఆమె.

మరో ఆరు నెలలకల్లా వంశీకి పెళ్ళి కుదురింది. వంశీ అమ్మానాన్నలు నిశ్చితార్ధానికి రావలసిందిగా కృష్ణమూర్తిగారి దంపతులను ఆహ్వానించారు. కానీ ఏకంగా పెళ్ళికే వస్తామని వీళ్ళన్నారు. నిశ్చితార్ధమైన తరువాత వంశీ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. పెళ్ళికూతురి పేరు సాహితి అని, ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉందని చెప్పాడు వంశీ.

వంశీ సెల్‌లో తీసిన ఫోటోల్లో ఆ నిశ్చితార్ధ కార్యక్రమం మొత్తాన్ని కృష్ణమూర్తిగారి దంపతులకు చూపించాడు. రకరకాల పండ్లు, స్వీట్లు తెచ్చాడు. కొన్ని తీసికెళ్ళి డా. రమేష్ వాళ్ళింట్లో ఇచ్చోచ్చాడు.

“అమ్మా, నాన్నగారు, చెల్లెలు మీరు ఫంక్షన్‌కు రాలేదని కాస్త నిరుత్సాహపడ్డారు. కాని పెళ్ళికి నాతోపాటే ముందుగానే వస్తారని చెప్పటంతో వాళ్ళు ఆనందించారు” అన్నాడు వంశీ.

“అలాగే వెడదాం నాయనా” ఉత్సాహంగా అంది రాజ్యలక్ష్మి.

ఓ ఆదివారంనాడు డా. రమేష్‌తో కలసి వచ్చిన వంశీ, కృష్ణమూర్తిగారి దంపతులను షాపింగ్ చేయాలని తోడురమ్మని అడగడంతో నలుగురుకలసి కారులో బయలుదేరారు. రమేష్ గైడెన్స్‌లో "చెన్నై షాపింగ్‌మాల్‌కు" వెళ్ళి, తన తల్లితండ్రులకు, మాష్టారు దంపతులకు పట్టుబట్టలు, తనకో సూటు, రమేష్ దంపతులకు ఖరీదైన బట్టలను, పిల్లలకు మంచి రెడిమేడ్ దుస్తులను తీసుకొన్నాడు వంశీ.

రమేష్‌కు వంశీ ప్రవర్తన ఎంతగా అలోచించినా అర్ధంకావటంలేదు. “అతను అనాధ కాడు. తల్లితండ్రులున్నారు. మరి మాష్టారు, అమ్మగార్లపై ఎందుకంతగా ప్రేమ చూపిస్తున్నాడు? అతని మనసులో వారిపై అంతగా ఆపేక్షలెందుకు కలుగుతున్నాయి? పైగా తన మీద కూడా ఎంత ఆప్యాయత కురిపిస్తున్నాడు. తనని ‘అన్నా’ అని పిలవటం, వచ్చిన ప్రతిసారి పిల్లలకేవో కొనిపట్టుకురావటం, తన పెళ్ళి సందర్భంగా తన కుటుంబ సభ్యులందరికి బట్టలు కొనటం, ఇవన్నీ చేస్తున్నాడంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది” మనసులో అనుకున్నాడు డా.రమేష్.

“అన్నా! వదిన మనతో బయటకు రావటానికి ఇష్టపడదని చెప్పావు. మరి వదినకు ఈ చీర నచ్చుతుందా?” అని అడిగాడు వంశీ.

“అయితే నీ చేత్తో నువ్వే ఇచ్చి తనని పొగుడుతూ నాలుగు మాటలను చెప్పు తప్పక నచ్చుతుందీ చీర” నవ్వుతూ అన్నాడు రమేష్.

“అదా సీక్రెట్” అంటూ అందరూ నవ్వుకున్నారు. హోటల్‌లో భోజనాలను పూర్తిచేసుకొని ఇంటికొచ్చారు.

“అమ్మా వాళ్ళను కాసేపు రెస్ట్ తీసుకోనీ అన్నా! సాయంత్రం గుడికి తీసుకెళ్దామనుకొంటున్నాను” అన్నాడు వంశీ.

“మరి నీవు కూడా రెస్ట్ తీసుకో ఆదివారం కదా! నేను ఇంటికెడతాను” అన్నాడు రమేష్.

“అన్నా! వదినకు, పిల్లలకు బట్టలివ్వాలి, వాళ్ళను నాపెళ్ళికి పిలవాలి బోలెడు పనులున్నాయి పద పద నేను కూడా నీతోనే మీ ఇంటికొస్తాను” అంటూ ఉత్సాహంగా బ్యాగ్ తీసుకొని రమేష్‌తో బయలుదేరాడు వంశీ.

అలా వెళ్తున్న వారిని చూసి రామలక్ష్మణుల్లాంటి బిడ్డలని మురిసి పోయారు రాజ్యలక్ష్మిగారు.

“నీ వదినకు నిన్ను పరిచయం చేస్తాను పద ఇంట్లోకి” అంటూ కాలింగ్‌బెల్ కొట్టాడు రమేష్. అతని భార్య చంద్రిక తలుపు తీసింది. ఏదో అందామనుకొని భర్త పక్కన ఉన్న అపరిచిత వ్యక్తిని చూసి ఆగిపోయింది ఆమె.

“చంద్రికా! ఇతను ‘వంశీకృష్ణ’ అని నా స్నేహితుడు. ఏనిముషంలో మేము స్నేహితులమయ్యామోగాని ‘అన్నా’ అని పిలుస్తూ నాకు తమ్ముడులేని లోటును తీర్చేశాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మన మాష్టారి గారింట్లో పైపోర్షన్లో అద్దెకుంటున్నాడు. ఈ మధ్యనే ఇతనికి పెళ్ళి సెటిలయ్యింది. మనలను ఆహ్వానించటానికి వచ్చాడు. పెళ్ళి బెంగళూర్‌లో జరుగుతుంది” అంటూ ఇద్దరికి ఒకరికొకరిని పరిచయం చేశాడు రమేష్.

ఒక్కసారిగా చంద్రికకు. వంశీ వేషధారణ, కళ్ళలోని అమాయకత్వం తన తమ్ముణ్ణి గుర్తుకుతెచ్చాయి. “రా బాబూ ఇక్కడ కూర్చో” సంతోషంగా అంది చంద్రిక.

“ఏ కంపెనీలో పనిచేస్తున్నావు? మీ నాన్నగారు ఏమిచేస్తుంటారు? ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది కదా! నీతోపాటుగా ఇక్కడికి రావచ్చుగా” అంటూ అడిగింది. పిల్లల్ని పిలిచి పరిచయం చేసింది.

ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి, తాను తెచ్చిన కొత్త బట్టలను చంద్రికకు చూపిస్తూ “ఈ బట్టలు మీకు నచ్చాయా? ఈ బాబాయ్ పెళ్ళికి మీరంతా రావాలి. ఈ కొత్త డ్రస్సులను వేసుకోవాలి” అంటూ సొంత అన్నపిల్లల్లా దగ్గరకు తీసుకుంటున్న అతణ్ణి విస్మయంగా చూసింది చంద్రిక.

“వదినా మీకు ఏ కలర్ ఇష్టమో నాకు తెలియదు. నాకు నచ్చిన బ్లూకలర్ చీరను మీ కోసం తీసుకొన్నాను” అంటూ ఆ బట్టల ప్యాకెట్లను చంద్రిక చేతికందించాడు వంశీ.

వంశీ ఇచ్చిన చీరను రమేష్‌కు చూపిస్తూ “చూశారా! మీ వంశీ సెలక్షన్! నేనెవరినో తెలియకుండానే నాకు నచ్చిన చీర తీసుకున్నాడు. మిమ్మల్ని బజారుకు నాతో పాటు రమ్మంటే రారు. ఇరుగుపొరుగువారితో వెళ్ళాల్సి వస్తోంది. ఎప్పుడూ పేషంట్లంటూ కదలరు” అంటూ నిష్టూరాలాడింది చంద్రిక.

“అరే! మా అమ్మగారు కూడా మీమాదిరిగానే నాన్నగారితో ఎప్పుడూ బిజినెస్ అంటూ బిజీ అంటారు, ఓ సినిమా లేదు, షాపింగ్ లేదు” అంటూ చేతులూపుతూ వాళ్ళ అమ్మను ఇమిటేట్ చేసి చూపిస్తున్న వంశీ మాటలకు పిల్లలతో సహా అందరు నవ్వారొక్కసారిగా.

చంద్రిక ఆనందానికి పగ్గాలు లేవు. ఫ్రిజ్‌లోనుండి షరబత్ బాటిల్ తీసి గ్లాసులలో పోసి అందరికి అందించింది. పిల్లల్ని తన పక్కనే కూర్చోపెట్టుకొని కబుర్లను చెపుతున్న వంశీని, పిల్లల ముఖాలలో సంతోషాన్ని చూసి మురిసిపోయాడు రమేష్.

“వదినా! మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నా కోరిక. మరి నా పెళ్ళికి మీరందరు తప్పకుండా రావాలి. అన్న హాస్పిటల్ కారణంగా ముందుగా రాలేడు. మాస్టారు దంపతులు, మీరు, పిల్లలు కలసి అంతా నాతో పాటే ముందుగా రావాలి. ప్రయాణానికి సిధ్ధం కండి” అంటూ హుషారుగా అడిగాడు వంశీ.

“ఇక వెడతాను అన్నా! ఆదివారం నాడే నాకు కాస్త విశ్రాంతి. రేపటినుండి మరల శనివారం దాక రాత్రి పదకొండు గంటలు దాటే వరకు వర్క్ ప్రెషర్ వుంటుంది” అంటూ రమేష్ దంపతులకు నమస్కరించి బయటకొచ్చాడు వంశీ.

వంశీ మాటలను విన్న రమేష్ గుండెల్లో రాయిపడింది. మాష్టారు దంపతుల్ని, చంద్రికను కలిపి తనతో బెంగళూర్ తీసుకెడతానంటుంన్నాడు వంశీ. “వీళ్ళకు చెరో బోగీలో బెర్తులను రిజర్వ్ చేయమని అతనికోసారి చెప్పాలి. లేకపోతే అనవసరంగా చంద్రిక వల్ల మాష్టారు మాటలు పడవలసి వస్తుందేమో” అని మనసులో అనుకొంటూ వంశీను సాగనంపి ఇంట్లోకొచ్చాడు రమేష్.

చంద్రిక చాలా ఉత్సాహాంగా “ఏమిటండీ వంశీను చూస్తే మొదటిసారి చూసినట్లుగా లేదు. మా తమ్ముడు మురళీని చూసినట్లుగాను, వాడితో మాట్లాడినట్లుగాను, వాడే అమెరికా నుండి వచ్చాడా? అనిపించింది నాకు” అంది.

“వంశీ మనతోనే కాదు అందరితోనూ అలాగే ఉంటాడు. అందుకే నాకు కూడా మా తమ్ముణ్ణి చూస్తున్నట్లుగానే ఉంటోంది అతణ్ణి కలసినప్పుడు. మాష్టారింట్లో పైపోర్షన్లో ఉంటున్నాడన్న మాటేగాని వారి సొంత కొడుకు మాదిరిగా మసలుతున్నాడు. వారితోపాటు మనలను తన పెళ్ళికి తీసుకెడుతున్నాడు. ముందస్తుగా ఓ మాటను” అన్నాడు రమేష్. అది ఏ తుఫానుగా మారుతుందోనని భయపడుతున్నాడు రమేష్.

“ఆ మాష్టారువాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతాను? మా బెర్తులు మాకుంటాయి కదా! పిల్లలంటారా? వాళ్ళింకా చిన్నవాళ్ళు. వాళ్ళనెందుకు కట్టేసివుంచటం? పెద్దయిన తరువాత వాళ్ళే గ్రహిస్తారు. పైగా మాష్టారువాళ్ళు వంశీ ఇంటి ఓనర్స్ కదా! అయినా నాకూ పెద్దలంటే గౌరవమే కానీ వారి భావాలతో మాత్రమే ఏకీభవించలేక పోతున్నాను” అంది చంద్రిక.

“వంశీ రాక చంద్రికలో కాస్త ప్రభావం చూపించింది” అనుకొన్నాడు రమేష్.

పెళ్ళి నాలుగు రోజులుందనగా, మాష్టారు దంపతులతోనూ, చంద్రిక, పిల్లలతోను వంశీ బెంగళూరు బయలుదేరాడు. రైలు ఎక్కిన తరువాత వంశీ, చంద్రికతో "వదినా, నీవు మాష్టరు వాళ్ళతో మాట్లాడకపోతే అన్నయ్య బాధపడతాడు. నేను మిమ్మల్ని మా అమ్మానాన్నలకు పరిచయంచేస్తాను కదా, మీరిట్లా అంటీముట్టనట్లుగా ఉంటే బాగుండదుకదా. ఈ నాలుగు రోజులు వాళ్ళతో సరదాగా గడపండి” అని చెప్పాడు.

చంద్రిక కూడా నవ్వుతూ “నాకు వారితో ఏవిధమైన విభేధాలు లేవు, వారి అభిప్రాయాలు నాకు నచ్చక మాట్లాడటంలేదంతే” అని చెప్పింది.

స్టేషన్‌కు కారు వచ్చింది. వంశీ కారు డ్రైవర్‌తో కన్నడంలో ఏదో మాట్లాడాడు. అతను అందరి లగేజిను కారు డిక్కీలో సర్దేశాడు. ఓ అరగంట ప్రయాణం చేశాక ఓ డ్యూప్లెక్స్ ఇంటి ముందు కారు ఆగింది.

వంశీ చెల్లెలు భారతి, “అన్నయ్యా” అంటూ ఒక్క పరుగున కారు దగ్గరకొచ్చింది. తన చెల్లిని అందరికీ పరిచయం చేశాడు వంశీ. డ్రైవర్ లగేజినంతటిని లోపల పెట్టాడు.

“భారతీ, వదిన, పిల్లల లగేజి పైన ఉన్న గెస్ట్‌రూంలో పెట్టించు, వదినా మీరు పైకి వెళ్ళి ఫ్రెష్ అయి, కిందకు రండి” అన్నాడు వంశీ.

“మాష్టారు దంపతుల లగేజిని తనే కిందనున్న ఇంకొక రూంలో పెట్టి, మీకు ఏమికావాలన్నా, ఇదిగో ఈ గంగ మీకు తెచ్చి ఇస్తుంది, మీరు కూడా ఫ్రెష్ అవ్వండి” అన్నాడు వంశీ. అతని తల్లితండ్రులు పెళ్ళి పిలుపులకు బయటకు వెళ్ళారని గంగ చెప్పింది. బాగా ధనవంతుల కుటుంబంలా వైభోగంలా కనిపిస్తోంది ఇంటి వాతావరణం అనుకున్నారు కృష్ణమూర్తిగారు. బయటనున్న వంటమనిషికి ఏవో పురమాయించి తను కూడా ఫ్రెష్ కావటానికి పైకి వెళ్ళాడు వంశీ.

రాజ్యలక్ష్మిగారు “ఏమిటీ పిల్లాడు, ఇలాంటి ఇంటి వాతావరణంలో పెరిగి, మన ఇంటికొచ్చి అద్దెకుండటమేమిటి? సిటీలో మన ఇంటికన్నా చాలా బాగున్న అపార్టుమెంట్స్ ఎన్నో ఉండగా మన ఇంట్లో ఎందుకుంటున్నాడు?” అని ఆశ్చర్యంగా భర్తను ప్రశ్నించింది.

“ఇప్పుడతనికి పెళ్ళవుతోందికదా ఇక మన ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతాడేమో లేదా ఫ్లాట్ కొనుక్కొని కొత్తకాపురం దానిలో పెట్టవచ్చు డబ్బుకు ఇబ్బందిలేని వాళ్ళేకదా” అన్నారు కృష్ణమూర్తిగారు.

ఓ గంటలో అంతా తయారయ్యి, వంశీ పిలుపుతో డైనింగ్‌హాల్‌కు వచ్చారు. వంటామె చాలా రకాలైన టిఫెన్లను తయారుచేసి డైనింగ్ టేబుల్ పై సర్దిపెట్టింది. చంద్రిక టిఫిన్లను ప్లేట్లలోపెట్టి భారతి సహాయంతో అందరికి ఇచ్చింది.

“మాష్టారు! అల్లం చెట్నీ వెయ్యనా? అమ్మా ఇడ్లీపై నెయ్యి వేసుకోండి” అంటూ స్వంత కోడలిలాగా దగ్గరుండి వడ్డించింది చంద్రిక. ఇదంతా వంశీ ప్రభావమేనని గ్రహించటానికి మాష్టారికి ఎక్కువసమయం పట్టలేదు. “సుగంధ పరిమళం అందరిపైన ప్రసరించినట్లుగా వంశీ ప్రేమరవం చంద్రికపై పడి మార్పు తెప్పించింది” అనుకొన్నారు.

పెళ్ళి రేపనగా వచ్చిన రమేష్ “వంశీ ఏడి మాస్టారూ?” అని అడిగాడు. నాన్నను చూసిన పిల్లలు పరుగునవెళ్ళి రమేష్ చంక ఎక్కేశారు.

అప్పుడే భారతితో కలసి మెట్లు దిగుతున్న వంశీ “రమేషన్నా! ఒక్కసారి ఇటు చూడు” అన్నాడు.

“బాబూ రండి” అంటూ వంశీ అమ్మగారు, బంధువులందరికి “ఇడిగో నా పెద్ద కొడుకు రమేష్. ఎంత మంచి డాక్టరో, తమ్ముడి పెళ్ళికి మీరంతా ఉన్నారు కదమ్మా! నేనిక్కడి పేషంట్లను వదలివచ్చేస్తే వాళ్ళు పెద్దపెద్ద ఆస్పత్రులకెళ్ళలేరుకదా? అని చెప్పి కోడల్ని ముందు పంపి, ఈరోజు తమ్ముడి పెళ్ళికి వచ్చాడు. ఇలాంటి కొడుకులున్నందులకు నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ పరిచయం చేశారు. చంద్రిక ఓరగా రమేష్ వైపు చూసింది. ఆ చూపుల అర్ధం తెలుసుకున్న రమేష్ వెంటనే వెళ్ళి వంశీ తల్లితండ్రులకు చంద్రికతో కలసి నమస్కరించాడు.

రమేష్‌కు అమ్మానాన్నలు చిన్నప్పుడే చనిపోవటంవల్లను, బంధువులు అతనిని హాస్టల్ లో పెట్టి చదివించటం వల్లను, రమేష్‌కు ఈ ప్రేమలు, బాంధవ్యాలు పెద్దగా తెలియవు. అందుకే తమ్ముడు వంశీ పెళ్ళిలో అన్నగా నేను చేయాల్సిన పనులన్నింటిని చేయాలి అనుకొన్నాడు. అప్పటి నుండి ఆల్‌రౌండర్‌గా పెళ్ళి పనులన్నింటికి రమేష్ చంద్రికలే తిరిగారు. పిల్లల్ని మాష్టారు చూసుకున్నారు.

పెళ్ళికి వెళ్ళటానికి ముందు వంశీ అమ్మగారు చంద్రికను పిలచి “ఏమ్మా! మాఅబ్బాయి నీఅందాలనే ఆభరణాలుగా భావించాడా ఏమిటి? అంటూ మెడలో ఓ హారం, నెక్లెస్ పెట్టి, చూడు ఇవి ఇక నీవే! నా పెద్ద కోడలికి స్పెషల్ గా కొన్నాను అంటూ ఓ పట్టుచీరను కూడా ఇచ్చి మిగిలిన పనులకోసం వెళ్ళిపోయింది. ఆనందభాష్పాలతో వాటిని అందుకొంది చంద్రిక.

అంగరంగ వైభవంగా వంశీ పెళ్ళి జరిగింది. వంశీ కుటుంబసభ్యులతో పాటుగా కృష్ణమూర్తిగారి దంపతులకు, రమేష్, చంద్రికలకు ఆడపెళ్ళివారు సకల మర్యాదలూ చేశారు.

మరునాడు సత్యనారాయణస్వామివారి వ్రతం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమైన బంధువులు, మిత్రులు ఉన్నారు. అంతా ఆ సందడిలో ఉన్నారు. చంద్రిక వంటవాళ్ళకు కావలసిన సామాన్లనన్నింటిని ఇచ్చి, పైన రూంలో ఉన్న పెళ్ళికూతురు సాహితి దగ్గరకు వచ్చింది. మాటలు కలిపి కొత్త పోగొట్టటానికి ప్రయత్నించింది. భారతి, చంద్రికలు కలసి అత్తగారు పెళ్ళిలో పెట్టిన నగలను సాహితికి చక్కగా అలంకరించారు.

చంద్రిక, భారతి వ్రతానికి కావలసినవన్ని పురోహితులనడిగి తెచ్చిఇచ్చారు. వ్రతం మొదలయ్యింది. సత్యనారాయణ స్వామివారు కలశం నుండి వీరినందరిని కరుణారసదృష్టులతో పరికిస్తున్నారు. వ్రతం చక్కగా జరిగింది. అందరికి తీర్ధప్రసాదాలను అందించారు పురోహితులవారు. “నూతన వధూవరులు పెద్దలందరికి నమస్కారాలు పెట్టండి” అని చెప్పారు పురోహితులు.

ముందుగా మాష్టారిదంపతులకు నమస్కరించటానికి వెళ్తున్న వంశీతో అమ్మానాన్నలకు ముందుగా నమస్కరించాలని హెచ్చరించారు పురోహితులు.

“ఆగండి, వంశీ సరైన పనినే చేస్తున్నాడు. మాష్టారువాళ్ళకు ముందుగా నమస్కరించటమే ధర్మం. మేము వాడిని కన్నామే గాని, వాళ్ళెవరో కాదు, వాడికి పునర్జన్మనిచ్చిన మాతృమూర్తులు” అంటూ వంశీ నాన్నగారు చెప్పారు.

ఆ మాటలకు కృష్ణమూర్తి, రాజ్యలక్ష్మిగార్లు అవాక్కయ్యారు.

ఒక్కసారిగా వారికి వాసు గుర్తుకొచ్చాడు. ఈ వంశీని చూస్తుంటే మన వాసు ఎందుకు గుర్తుకొచ్చేవాడో వారికి అర్ధమయ్యింది. ఇంతలో ఒక పెద్ద వయస్సుగల వ్యక్తి వచ్చి “నేను ‘హృదయాలయ’ హాస్పటల్ లో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్నాను. వంశీకు గుండె సమస్య వచ్చి, గుండె మార్పిడి అవసరం అయినప్పుడు నేనే మీకు అవయవదాన విశిష్టతను గురించి చెప్పాను. అమ్మా! రాజ్యలక్ష్మిగారు ఆనాటి మీ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నా కడుపుకోత మరో తల్లికి వరంగా మారి ఆమెకు కడుపుకోత రాకూడదనుకొన్నారు. నా పర్యవేక్షణలోనే ఆరోజు మీ వాసు గుండెను విమానంలో తీసుకొచ్చి ఈ వంశీకు అమర్చాము.

ఆ విధంగా పునర్జన్మను పొంది మిమ్మల్ని చూడాలని తపిస్తున్న వంశీ, నా ద్వారానే మీ వాసును చేర్పించిన హాస్పటల్ కు వెళ్ళి డా.రమేష్ ద్వారా మీ అడ్రెస్ తెలుసుకొని, మిమ్మలిని పరిచయం చేసుకొని మీ అభిమానం పొంది మీ ఇంటి ముద్దుల కృష్ణుడైనాడు. మన వంశీ తన మోహన రాగంతో మిమ్మలినందరిని ఓ పెద్ద కుటుంబంలా మార్చాడు” అని చెప్పారు.

వంశీ దగ్గరకు ఇద్దరు తల్లులూ వచ్చి ఆప్యాయతతో పొదుముకున్నారు. సాహితి చంద్రికతో “అక్కా! ఇక మనకు ఇద్దరు అత్తయ్యలు, మామయ్యలు కదా” అంటూ వారికి నమస్కరించింది.

**** సమాప్తం ****

Posted in October 2020, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *