Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఊ)

ఒక ద్విజుడు ఎడమ భుజం మీద జందెము ధరిస్తే అతడిని ‘ఉపవీతి’ అంటారు. కుడి భుజం మీద వేసుకున్నప్పుడు అతడిని ‘ప్రాచీనావీతి’ అంటారు. జందెమును మెడలో మాలగా ధరిస్తే అతడిని ‘నివీతి’ అంటారు.

ఎడమ బుజం మీదుగా కుడి చేతి కిందుగా జందెమును ధరిస్తే దానిని ఉపవీతము అంటారు. అలా కాక శ్రాద్ధ కర్మలలో వేసుకున్నట్లు కుడి బుజం మీద ఎడమ చేతి కిందుగా జందెమును ధరిస్తే దానిని ప్రాచీనావీతము అంటాం. మెడ చుట్టూ మాలగా ధరించబడిన జందెమును నీవీతము అంటాం.

మేఖలా (మొలత్రాడు), అజినము (అజినము అంటే చర్మము. ఉత్తరీయముగా ధరించే కృష్ణ సార మృగ చర్మము వంటివని ఇక్కడ భావం), దండము, ఉపవీతము (జందెము), కమండలుమ్ (కమండలువు లేక కమండలం) వంటివి పోయినా లేక తెగిపోయినా వాటిని నీటిలో పడవేసి, కొత్తవాటిని మంత్రపూర్వకంగా స్వీకరించాలి.

కేశాంతః షోడశే వర్షే బ్రాహ్మణస్య విధీయతే |
రాజన్య బంధోర్ద్వావింశే  వైశ్యస్య ద్వ్యధికే తతః || ( 2-65)

కేశాంతము అనే పేరుగల సంస్కారం బ్రాహ్మణుడికి గర్భధారణ కాలం నుంచి ‘షోడశ’ అంటే పదహారవ ఏట చేయాలి. క్షత్రియుని విషయంలో ‘ద్వావింశ’ అంటే గర్భధారణ కాలం నుంచి ఇరవై రెండవయేట చేయాలి. వైశ్యునికి ‘ద్వ్యధికే తతః’ అంటే మరో రెండేళ్ల తరువాత అంటే గర్భధారణ కాలం నుంచి ఇరవై నాలుగవ ఏట చేయాలి. (రాజన్ అంటే రాజు. రాజన్య అన్నా, రాజన్య బంధు అన్నా ‘క్షత్రియుడు’  అని అర్థం.)

స్త్రీలకు కూడా జాతకర్మ మొదలైన సంస్కారాలు నియమిత కాలాలలో వారి శరీర పరిశుద్ధి కోసం చేయాలి. అయితే అవన్నీ అమంత్రకంగా (అంటే మంత్రాలు లేకుండా) చేయాలి.

పురుషులకు చేసే సంస్కారాలకు మనువుచే ఇవ్వబడిన ఈ ప్రాధాన్యం స్త్రీలకు చేసే సంస్కారాల విషయంలో ఇవ్వబడలేదు. స్త్రీలకు వివాహమే ఉపనయన కర్మ అనీ భర్తకు శుశ్రూష చేయడమే గురుకులంలో గురువుకు శుశ్రూషలు చేయడంతో సమానమనీ, ఇంటిలో రోజువారీ గృహకృత్యాలే అంటే వంటా వార్పులే వారికి అగ్నిహోత్రమనీ అంటాడు మనువు.

గురువు శిష్యునికి ఉపనయనం జరిపించి ముందుగా శిష్యునికి శౌచమును, ఆచారాలను, ఉదయ సాయంత్రాలలో చేసే అగ్నిహోత్ర విధిని, సంధ్యోపాసన విధిని నేర్పాలి.

అధ్యయనం చేయబోయే శిష్యుడు శాస్త్ర ప్రకారం ఆచమనం చేయాలి. పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి. ఇంద్రియాలను నిగ్రహించాలి. బ్రహ్మాంజలి చేసి అంటే చేతులు కట్టుకుని ఉదన్ముఖుడై అంటే ఉత్తర దిశకు తిరిగి కూర్చోవాలి. గురువు ఇలాంటి వినయవంతుడైన శిష్యునిచేత వేదాధ్యయనము చేయించాలి.

ప్రతిదినము వేదాధ్యయనము మొదలుపెట్టబోయే ముందు మరియు ముగిసిన తరువాత శిష్యుడు గురువు పాదములను చేర్చి పట్టుకుని నమస్కరించాలి. వేదాధ్యయనము చేస్తున్నంతసేపూ శిష్యుడు  బ్రహ్మాంజలి స్థితిలోనే అంటే చేతులు కట్టుకునే ఉండాలి.

గురువు యొక్క సవ్య పాదాన్ని అంటే ఎడమ పాదాన్ని తన ఎడమచేతితోనూ, దక్షిణ పాదాన్ని అంటే కుడి పాదాన్ని తన కుడి చేతితోనూ శిష్యుడు పట్టుకోవాలి. ఇలా చేయడాన్ని ‘వ్యత్యస్తము’ అంటారు. (దీనిలో వ్యత్యస్తము ఏమిటంటే శిష్యుడు గురువు వైపుకి తిరిగి, ఆయన పాదాలు పట్టుకునేటప్పుడు గురువు కుడి పాదానికి ఎదురుగా శిష్యుని ఎడమచేయి, గురువు ఎడమపాదానికి ఎదురుగా శిష్యుడి కుడిచేయి వస్తాయి. అయినా శిష్యుడు తన ఎడమచేతితో గురువు ఎడమపాదాన్నీ, కుడి చేతితో గురువు కుడి పాదాన్నీ పట్టుకుని నమస్కరించాలి.)

శిష్యుడు ఎప్పుడూ సోమరిపోతుగా ఉండరాదు.(‘తంద్ర’ అనే సంస్కృత శబ్దానికి ‘బద్ధకస్థుడు’ అని అర్థం. శిష్యుడు ఎప్పుడూ ‘అతంద్రితుడు’ అంటే బద్ధకస్థుడు కానివాడుగా ఉండాలి). గురువు తనను చదవమన్నప్పుడు చదువుతూ, ఆపమన్నప్పుడు ఆపేవానిగానూ అతడు ఉండాలి.

వేదాధ్యయనానికి ముందు మరియు తరువాత శిష్యుడు తప్పనిసరిగా ప్రణవము (ఓంకారము) ను ఉచ్చరించాలి. వేదాధ్యయన ప్రారంభంలో ఓంకారం ఉచ్చరించక పోతే విద్యార్థి చదివినదంతా కొద్దికొద్దిగా మరచిపోతాడు. ముగింపులో ఓంకారం చేయకపోతే అసలు అంతకుముందు చదివింది ఏదీ మనస్సులో నిలవదు. అకారము, ఉకారము, మకారముల కలయికగా ‘ఓమ్’ శబ్దం ఏర్పడింది. (అ+ఉ+మ్ = ఓమ్)

శిష్యుడు నేలపై దర్భలను వాటి ముళ్ళు (కొసలు) తూర్పు వైపుకి తిరిగి ఉండేటట్లు పరచుకుని వాటిపై కూర్చుని రెండు చేతులలో దర్భలు పట్టుకొనడం కారణంగా పరిశుద్ధుడు అవుతాడు. ఆ తరువాత మూడు ప్రాణాయామములు ఆచరించి, అనంతరం ఓంకారాన్ని ఉచ్ఛరించాలి.

వేదకాలం నుంచీ మన ప్రాచీనులు తాము గృహావసరాల కోసం వండుకున్న, లేక దేవీదేవతలకు  నైవేద్యంగా సమర్పించనున్న పదార్థాల వంటివి ఒక శుభ్రమైన ప్రదేశంలో దర్భలు (కుశ గడ్డి) పరచి వాటిపై ఉంచేవారు. దర్భ గడ్డికి సహజసిద్ధమైన ఆహార పరిరక్షక (Natural Food Preservative)  గుణాలున్నట్లు ప్రాచీన మానవులకు తెలిసినందునే వారు ఇలా చేసేవారు. గ్రహణ సమయాలలో సహజ క్రిమినాశక గుణం కలిగిన అల్ట్రా- వయొలెట్ కిరణాలు వాతావరణంలో చాలా తక్కువగా ఉండే కారణంగా ఆహార పదార్థాలలో సూక్ష్మ జీవులు (Micro-organisms) అదుపులేకుండా  పెరిగిపోయి ఆహారపదార్థాలను పాడుచేసేస్తాయి. ఆ కారణంగా గ్రహణ కాలంలో పదార్థాలను పులియజేసి పాడుచేసే సూక్ష్మజీవులను అదుపుచేసేందుకు తోడుపెట్టిన పెరుగు పాత్రలలో కాస్త దర్భ గడ్డి వేస్తారు. దర్భకున్న ప్రత్యేకమైన ఈ క్రిమినాశక లక్షణం కారణంగానే  పెరుగు పుల్లబడకుండా ఉంటుంది. పెరుగు తోడుకున్న తరువాత దర్భ ఆకుల్ని తీసివేస్తారు. పోయేసీ (Poaceae) కుటుంబానికి చెందిన ఈ దర్భ గడ్డి శాస్త్రీయనామం Desmostachya bipinnata. దీనికే Eragrostis cynosuroides అనే మరో శాస్త్రీయనామం కూడా ఉంది. దర్భ గడ్డికున్న మనకు తెలిసిన ఔషధ గుణాలు కాక దానికి ఆహారం చెడిపోకుండా కాపాడే (Disinfectant) గుణాలు కూడా ఉన్నట్లు తమిళనాడులోని Sastra University (Thanjavur) లో జరిపిన పరిశోధనలలో వెల్లడైంది. దర్భ లేక కుశ గడ్డి రానున్న కాలంలో ప్రకృతిసిద్ధమైన ఆహార రక్షక పదార్థం (Natural Food Preservative) గా వినియోగింపబడనుంది.  ఆహార రక్షక పదార్థంగా దాని విలువను గుర్తించిన కారణంగానే మన ప్రాచీనులు దర్భ ఆకులను పవిత్రంగా భావించి వాటి పైనే ఆహార పాత్రలు ఉంచేవారు. నేల మీద దర్భ పరచుకుని కూర్చునేవారు. పవిత్ర కార్యాలు నిర్వహించే సమయంలో చేతులలో దర్భ ఆకులు పెట్టుకునేవారు. పవిత్ర కార్యాలు నిర్వహించేటప్పుడు దర్భ ముద్రికను (దర్భ ఆకులతో చేసిన ఉంగరాన్ని) వ్రేలికి ధరించేవారు. దర్భ ఆకులతో దర్భ శయనం లేక దర్భ సంస్తరము వేసుకుని పడుకునేవారు. దర్భలను చేతులతో పట్టుకున్నవారు పరిశుద్ధులవుతారనే విశ్వాసం కూడా అలా ఏర్పడిందే.

ప్రజాపతి (బ్రహ్మ) ఋగ్యజుస్సామ వేద లక్షణాలైనట్టి అకారాన్ని, ఉకారాన్ని, మకారాన్నీ, ‘భూ:’, ‘భువః’, ‘స్వ:’ అనే మూడింటిని వరుసగా మూడు వేదముల నుండి గ్రహించాడు. ( వేదాలు మొదట్లో మూడే. అందుకే వాటిని ‘త్రయీ విద్యలు’ అనేవారు. ఆర్యులు దక్షిణాపథానికి విస్తరించిన అనంతరం నాల్గవ వేదమైనట్టి ‘అథర్వవేదం’ సంకలనం చేయబడిందని విజ్ఞుల అభిప్రాయం. ఇక్కడ (2- 76) శ్లోకంలో ‘వేద త్రయమ్’ అనీ, తరువాత శ్లోకంలో ‘ త్రిభ్య ఏవ తు వేదేభ్య:’ అనీ  పేర్కొనడాన్నిబట్టి  ‘మనుస్మృతి’ రచనాకాలం అంతకు పూర్వపుదైవుంటుందని గ్రహించగలం.)

ఈ ఋక్కు లోని తత్సవితుర్వరేణ్యమ్, భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్ అనే మూడు పాదాలనూ పరమేష్ఠి మూడు వేదాలనుంచి తీసుకున్నాడు.

కనుక రెండు సంధ్యలలోనూ ‘ఓం’ అనే ఈ అక్షరంతో కలిపి ఈ ఋక్కును జపించు వేదవేత్త అయిన విప్రుడు పరిపూర్ణ వేదాధ్యయనము వలన ఒనగూరే పుణ్యమును పొందగలడు.

ఏ ద్విజుడు గ్రామం వెలుపల సంధ్యాకాలములలోనే కాక ఇతర సమయములలోనూ ఓంకారంతో కూడిన, వ్యాహృతి త్రయాత్మకమైన ఈ గాయత్రి మంత్రాన్ని రోజులో వెయ్యిసార్లు జపిస్తాడో, అతడు ఒక నెలలో ‘వాహస్సు’ (సర్పం) ‘త్వచస్సు’ (కుబుసం) నుంచి విడివడినట్లు మహాపాపముల నుండి విడుదల పొందుతాడు.

ఓమ్ అనే శబ్దాన్ని ‘ప్రణవము’ అనీ, ‘భూ:’, ‘భువః’, ‘ స్వ:’ అనే మూడింటినీ ‘వ్యాహృతి త్రయము’ అనీ అంటారు. గ్రామంలోని ద్విజులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములలోని ప్రతి ఒక్కరూ ఇలా రోజుకు వెయ్యిసార్లు గాయత్రి మంత్ర జపం చేస్తే గ్రామంలో శబ్దకాలుష్యం ఏర్పడే అవకాశముంది. అందుకేనేమో మనువు గాయత్రి మంత్ర జపాన్ని గ్రామం వెలుపల చేయమన్నాడు. ఇక్కడ కుల్లూక భట్టు తన వ్యాఖ్యానంలో ‘గ్రామాద్బహి : నదీతీరారణ్యాదౌ’ అంటే ‘గ్రామం వెలుపల నదీతీరాలు, అరణ్యాలలో ఈ గాయత్రి మంత్ర జపం చేయాల’ ని వివరణ ఇచ్చాడు.

శాస్త్రీయ దృష్టితో చూస్తే పాపములనుంచి విముక్తులు కావడమనీ, స్వర్గప్రాప్తి పొందడమనీ చెప్పే వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. మన శరీరంలో ఒక ఆత్మ ఉందనేది, మనం బతికి ఉండగా చేసే పుణ్య లేక పాప కార్యాల వలన మన మరణానంతరం ఆ ఆత్మకు స్వర్గ లేక నరక ప్రాప్తి కలుగుతుందనేది కేవలం కొందరి విశ్వాసం మాత్రమే. శాస్త్రీయ భౌతికవాదం ఆత్మను విశ్వసించదు. నిజానికి మరణానంతరం అప్పటివరకు పనిచేసిన మనిషి మెదడుతో సహా శరీరభాగాలన్నీ క్రమంగా విచ్ఛిన్నమై ప్రకృతిలో విలీనమౌతాయి. ఆధునిక శాస్త్రీయ భౌతికవాదులు మాత్రమే కాదు భారతీయ ప్రాచీన భౌతికవాదులైన చార్వాకులూ ఆత్మను విశ్వసించలేదు. గౌతమ బుద్ధుడు కూడా అనాత్మవాదే. పాపపుణ్యాలు, స్వర్గనరకాలు ఉన్నాయని నమ్మేవారు సైతం ఆలోచించాల్సిన విషయమొకటుంది. కేవలం గాయత్రి మంత్రం రోజుకు వెయ్యిసార్లు జపించినంత మాత్రం చేతనే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయ్యేటట్లయితే ప్రతి ద్విజుడూ ఎంచక్కా తాను చేయదలచుకున్న పనులన్నీ నిర్నిరోధంగా చేస్తూ రోజులో వెయ్యిసార్లు గాయత్రి మంత్ర జపం చేసి, తాను చేసిన పాపాలు ఏరోజు కారోజు ప్రక్షాళన చేసేసుకుంటాడు. అంతిమంగా అతడు స్వర్గప్రాప్తి పొందుతాడు. ఇందులో నైతికత ఏమైనా ఉందా? నిజంగా ఎవరైనా లోకకల్యాణం కోరుకుంటే చేయాల్సింది అందరికీ ప్రయోజనం కలిగించే మంచి పనులు. అంతేగానీ ఉత్తమలోకాలు పొందాలనే దురాశతో చేసే మంత్ర జపాలు కావు.

***సశేషం***

Posted in October 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *