Menu Close
Galpika-pagetitle
లాక్ డౌన్ వెతలు – 7: మాట వినకపోతే! -- అత్తలూరి విజయలక్ష్మి

“పిల్లలూ! ఇవాళ మీరిద్దరూ నాకు హెల్ప్ చేయాలి.. ఆ గాడ్జెట్స్ పక్కన పడేసి రండి” పిల్లల గది శుభ్రం చేస్తున్న స్వప్న గట్టిగా పిలిచింది.

పిల్లలు ఆ మాట విన్నారో లేదో కానీ సమాధానం రాలేదు.

రాక్స్ లో అన్నీ పుస్తకాలు అడ్డదిడ్డంగా పడేసి ఉన్నాయి.. స్కూల్ బాగులు టేబుల్ మీద, మంచాల మీద, మంచం కింద బొమ్మలు... ఇది ఇల్లా! కిష్కింధకాండనా! ఒంగి మంచం కింద ఉన్న బొమ్మలు లాగింది బలవంతంగా..

నడుం కలుక్కుమంది. నెమ్మదిగా లేస్తూ పనికిరాని ఈ బొమ్మలెందుకు దాచినట్టు పడేయచ్చుకదా.. గాడిదల్లా పెరిగారు ఏ పని చేతకాదు..” చిరాకు పడుతూ అవన్నీ డస్ట్ బిన్లో పడేసింది. ఆఫీస్, ఇంటిపని వీటితో వీళ్ళ గది సంగతి పట్టించుకోలేదు..ఇప్పుడీ లాక్ డౌన్ సమయంలో అయినా చేద్దామంటే వండడం, కడుక్కోడం, తినడం, మళ్ళీ వండడం.. ఇదే గోల. అయినా నేను సర్దడం ఏంటి? వాళ్ళ గది వాళ్ళు సర్దుకోవాలి .. ఒళ్ళు బరువు. అస్తమానం టివి నో  గాడ్జేట్సో చూస్తూ కూర్చుంటారు. స్వప్న మరోసారి పిలిచింది “వస్తున్నారా! లేదా!"

ఇద్దరి నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. కోపం నషాళానికి అంటింది. గబ గబా వచ్చి వాళ్ళ చేతుల్లో ఐ పాడ్ లు లాగేసింది..

“మమ్మీ!  మమ్మీ!  ప్లీజ్... గేమ్ ఆడుతున్నాను. ఇవ్వు .. అని ఒకళ్ళు మమ్మీ వీడియో చూస్తున్నా ఇవ్వు” అని మరొకళ్ళూ ఆవిడ చేతిలోనుంచి లాక్కోబోయారు ..ఆవిడ వాళ్లకి అందకుండా అవి పైన రాక్ లో పెట్టేసి “పదండి... నెల రోజుల నుంచీ చదువు లేదు, సంధ్య లేదు.. వీటితో బతికేస్తున్నారు.. పదండి. అందరం కలిసి అన్ని రూముల్లో రాక్స్  క్లీన్ చేసుకుందాం నేను ఒక్కదాన్నీ చేయలేను.”

“చేయకు.. ఇప్పుడు ఎందుకు అవన్నీ చేయడం ఆల్రెడీ నీకు వర్క్ చాలా ఉందని గొడవ పెడుతున్నావుగా” అన్నారిద్దరూ.

“మూసుకోండి... పదండి...” ఇద్దరినీ బర, బర లాక్కెల్తూ దివాన్ మీద రాజాలా పడుకుని చిద్విలాసం చేస్తూ టివి చూస్తున్న మొగుడిని ఉద్దేశించి అంది “మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా!”

“ఏంటి?” అన్నాడు టివి స్క్రీన్ మీద నుంచి దృష్టి మళ్ళించకుండా అడిగాడు.

“ఏంటా! పక్కింటికి సమంతా వచ్చిందిట.”

“ఏంటీ?” చేతిలో రిమోట్ విసిరేస్తూ దిగ్గున లేచాడు.. “సమంతా! ఎందుకు? ఇప్పుడు రావడం ఏంటి? పైగా పక్కింటికి రావడం మనం ఇక్కడ ఉండగా.”

“వస్తుంది.. నూటొక్క జిల్లాల అందగాడు తమరిక్కడ ఉన్నారని..” రిమోట్ తీసుకుని చీర చెంగులో ముడేసుకుని నోరు మూసుకుని “అందరూ పదండి..” అంటూ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి కదలకుండా మొహాలు మాడ్చుకుని నిలబడ్డ ముగ్గురినీ చూస్తూ “ఇంకాసేపు అలాగే నిలబడితే నేను కూడా అన్ని పనులూ మానేసి టి వి లో తెలుగు సీరియల్ పెట్టుకుని చూస్తా.. ఆ తరవాత” ఆమె మాట పూర్తి  కాకుండానే  పిల్లలిద్దరూ గట్టిగా  “నో” అని అరుస్తూ ఆమె దగ్గరకు వచ్చారు. ఇద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకుని ఓరగా భుజం మీద నుంచి పళ్ళు కొరుకుతున్న మొగుడి వైపు చూసి కళ్ళేగరేసింది.

ఇ(క)ష్టం.... -- గౌరీ కాసాల

ఏంట్రా రాజు ఏమి అడిగావు నువ్వు.. నేను సరిగ్గానే విన్నానా....

వంటింట్లో చారులో పోపు  పెడుతున్న శారద ఆడపడుచు గద్దింపు విని గాభరా పడింది.

పోపు గరిట సింకులో పడేసి ఒక్క గంతులో హాల్లోకొచ్చింది.

ఏమైంది వదినా ఎందుకలా అరుస్తున్నారు అంది.

అరుస్తున్నానా... నా అరుపులే  వినపడ్డాయి నీకు. మీ ముద్దుల కొడుకు నన్ను ఏం అడిగాడో తెలుసా... వాడు.. వాడు... నిండా పాతికేళ్లు లేవు పెళ్లి కూడా కాలేదు. వెధవకి, పెద్దదాన్ని నన్ను పట్టుకుని అమృత్ గ్రీడీ అడుగుతున్నాడు గర్జించింది ఆవిడ.

అంటే...వెర్రిమొహం వేసింది  శారద.

అంటే నా... అంటే.. విస్కీ అతి ఖరీదైన విస్కీ 50 వేల దాకా ఉంటుంది.

ఏంటి రాజేష్ నిజమేనా  అని అడిగింది.

నిజమేనమ్మా ఇందులో తప్పేముంది అత్తకి నేనంటే బోలెడు ఇష్టం కదా నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతోంది కదా అందుకనే ఇది కూడా అడిగాను... ఎప్పుడూ లేని కొడుకు ధోరణికి కంగారు పడిపోయింది శారద. "నేను కనుక్కుంటాను లెండి వదినా" అంటూ రాజేష్ చెయ్యి పట్టుకుని బరబరా పక్క రూంలోకి లాక్కుని  పోయింది.

'ఏమైంది రా రాజేష్ ఎందుకు నన్ను ఇలా కాల్చుకు తింటున్నావ్. ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటేనే కోకోకోలా తాగేవాడివి నువ్వు అత్తని ఎందుకు అలా అడిగావు.'.. గద్దింపు బాధ రెండూ శారద గొంతులో.

శారదా రమేష్ ల ఒక్కగానొక్క కొడుకు రాజేష్. సైకాలజీ చదువుతున్నాడు ఢిల్లీలో. లాక్ డౌన్ పుణ్యమా అని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. అంతకుముందే అమెరికా నుంచి తమ్ముణ్ణి  చూడటానికి వచ్చిన కాంతమ్మ గారు కూడా ఆ కారణంగానే  ఉండిపోయారు. బోరు కొడుతుందేమో అనుకొంటున్న దశలో వచ్చిన రాజేష్ ని చూసి పొంగిపోయి తనకు వచ్చిన విదేశీ వంటలన్నీ వండి పెట్టడం ప్రారంభించింది రాజేష్ కి. ప్రతిసారి నీకు ఇష్టమని చేశానురా నువ్వు నా పెంపుడు కొడుకువి అనే ట్యాగ్ లైన్ ఒకటి....దశలో ఈ సంఘటన..

"చెప్పవేం" మళ్ళీ రెట్టించింది శారద.

'లేకపోతే ఏమిటమ్మా ఢిల్లీలో హోటల్ కూడు తిని నోరు చచ్చిపోయింది. హాయిగా నీ చేతి గుత్తొంకాయ కూర మాగాయ పచ్చడి ముద్ద పప్పు గోంగూర పచ్చడి ఉల్లిపాయ తన్మయత్వంతో లిస్ట్ చదువుతున్న రాజేష్ ని చెయ్యి తడుతూ ఒరేయ్ అంది  శారద.... రాజేష్ తేరుకుని ఇలాంటి ఆశతో వచ్చిన నన్ను కాల్చుకు తింటోంది మీ ఆడపడుచు. ఏదో ఒకటి రెండు ఇస్తే పరవాలేదు రోజూ ఆ చప్పిడి తిండి ఎక్కడ తినమంటావ్.. కడుపులో చోటు లేదన్నా వినదు.

అసలు ఇదో రకమైన (సైకాలజీ)మనస్తత్వం చాలా మంది మనలో ఇలాగే ఉంటారు. ఆలోచించి చూడు. వాళ్లకి నచ్చినవన్నీ అంటే మనకి వాళ్ళు ఏమేమి చేయాలి అనుకుంటారో అవన్నీ చేస్తారు. అది వాళ్ళ మనసుకు సంబంధించింది. అందులో మన ఇష్టాయిష్టాల ప్రసక్తే ఉండదు. ఏమన్నా అంటే 'నీ కోసం చేశాను' అంటారు. నిజంగా ఒక వ్యక్తి మీద నీకు ఇష్టం ఉంటే అతని/ఆమె మనసు తెలిసి అతని/ఆమెకి  తగినట్లు ఉంటే అది అప్పుడు వాళ్ళ  ఇష్టాన్ని మన్నించడం అవుతుంది.

అంతేగాని ఆవిడ శాటిస్ఫ్యాక్షన్ కోసం నా నెత్తిన అన్ని రుద్దటం ఏం న్యాయం చెప్పు.

ఇష్టం అంటే ఇంకో విషయం జ్ఞాపకం వస్తోందమ్మా... ఎవరినైనా ఏదైనా సలహా అడిగారు అనుకో. వాళ్లు మీ ఇష్టం అండి మీకు ఏది నచ్చితే అది చేయండి అంటారు ఇందులో అడిగిన వాళ్ళు ఎటు తేల్చుకోలేక అడుగుతారు......అతని వాక్ ప్రవాహాన్ని ఆపుతూ, చాలు నాయనా ఇవన్నీ మీ స్టూడెంట్స్ కి చెప్పుకో గానీ ఒరేయ్ ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ విస్కీ అడిగావో అది  చెప్పు, నిలదీసింది.

అదా ఆవిడకి తాగుడు అనే మాటలో త అనే అక్షరం వింటేనే చాలా కోపం అని రాత్రి నాన్న చెప్పారు. ఇలా అడిగితే అందులోనూ కాస్ట్లీ విస్కీ పేరు చెబితే ఇవన్ని నీకెలా తెలుసు అని ఆవిడకి నా మీద పీకల్దాకా కోపం వస్తుంది. నా జోలికి రాదు ఇంక... ఏమో అమ్మా ఏదో చిన్న ట్రిక్ ఎంతవరకు పారు తుందో రాజేష్ మొహం చూస్తే నవ్వు ఆగలేదు శారదకి.

నాకు తెలుసు లేరా మీ నాన్న ఏదో పార్టీలో కొంచెం పుచ్చుకుని వచ్చారని మొన్న మొన్నటి దాకా మీ నాన్న తో మాటాడనే లేదు. నేను చూసుకుంటానులే  రూమ్ లో నుంచి బయటికి వెళ్ళబోతూ చిన్న అనుమానంతో వెనక్కి తిరిగింది 'అవునూ ఆ పేరు ఏంటో అది నీకెలా తెలిసిందిరా?

"గూగులమ్మ నాకు చాల మంచి ఫ్రెండులే" రాగయుక్తంగా చిలిపిగా పాడుతున్న రాజేష్ వైపు మురిపంగా చూస్తూ బయటకు నడిచింది శారద.

ప్రయాణం, వృద్ధాప్య ప్రేమ గీతం -- రాజేశ్వరి దివాకర్ల

"తన్ను తాను ప్రేమించుకోలేని మనిషికి ప్రేమేం తెలుసు?" అన్న ఆచార్య జి.ఎల్.ఎన్ గారి వాక్యాలు చదివాక నాకు రాయాలని అనిపించింది...

ఈ మధ్య చదివిన కవితల్లో, సోమరాజు సుశీల గారు రాసిన "ప్రయాణం" కవిత మనసులో గాఢమైన ముద్రను వేసింది. పదే పదే చదివాను. ఒక కన్నె యువతిగా మారి, అనుభవాలతో పండి పక్వమైనా, ఆమె మనసు జీవన మధురిమలను కోల్పోదు. ఆమెలో పసితనం వీడదు. ఆమె ప్రత్యక్ష వర్తమానంలో తన భూమిక ఇపుడు తాత్కాలికమైనదని తెలుసుకొన్న తత్వవేత్త.

సుశీల గారి కవిత చదువుతుంటే ఆ వయసులో నిత్యమూ, ప్రతి స్త్రీకి కలిగే భావాలనే వారు అత్యంత సునాయసంగా చెప్పారని అనిపించింది. విచిత్రమేమిటంటే "ఓ బేబీ" అనే సినిమాను చూడడం జరిగింది. కోమలమైన, ముగ్ధ మనస్కురాలైన యువతి, లేతవయస్సులో భర్తను కోల్పోయి, తన బిడ్డను ప్రాణాధికంగా చూసుకొంది. ఆ బిడ్డను పెంచడానికి కష్ట పడింది. ఆ బిడ్డ పెరిగి ప్రయోజకుడయ్యాడు. గృహస్థుడయ్యాడు. ఆ తల్లి, ఇంకా తన కొడుకు కుటుంబానికి పెద్ద దిక్కుగా అనుక్షణం పలవరిస్తుంది. కోడలికి వంట రుచులను నిర్దేశిస్తూ ఉంటుంది. తనకు నెరవేరని కోరికగా మిగిలిపోయిన సంగీతంలో మనవడు రాణించాలని ప్రోత్సహిస్తుంది. తానే సర్వస్వం అని అనుకుంటున్న కుటుంబానికి, ముఖ్యంగా కోడలికి ఆరోగ్యరీత్యా తన ప్రమేయం వలన, ఇబ్బంది కలుగుతోందని తెలిసి దూరమౌతుంది. కాని ఆమె తన జీవితంలో కష్టాలకే అంకితమైన  జీవన ప్రాయాన్ని 25 సవత్సరాల వయస్సును దైవ కృప వలన తిరిగి  పొందగలుగుతుంది పడుచు పిల్లగా. ఆ వయసుకు తగిన అనుభవాలనన్నింటినీ పొందవచ్చు. ఆమెకిప్పుడు ఎంతో ఆనందం గా ఉంది. కాని, ఆమె జీవితంలో మునుపటి కష్టాలను మరచిపోలేదు. అనుభవాలతో పండిన మనస్సును అలాగే దాచుకుంది. కుటుంబం మీద గల తన ప్రేమను కోల్పోలేదు. పడచుదనం లోని కోర్కెలు, ఆనందము కంటె, ప్రేమ ముఖ్యమని తన మనుమడి శ్రేయస్సును కోరుకుంటుంది. తన జీవన గమ్యాన్ని నిర్ణయించుకొంది . తిరిగి సంతోషంగా వృద్ధాప్యాన్ని స్వీకరించింది.

కాలం విచిత్రమైనది. మనకు తెలియకుండానే, ఏమాత్రం స్పర్శను తెలియనివ్వకుండానే, మనని దాటి వెళ్ళిపోతుంది. మనం ఎక్కిన మెట్లు మన పాదాలకెప్పుడు తగలాయో తెలియకుండానే పైకెక్కాము. కాని నేలమీద నడచిన అడుగుల ముద్రలను మనసు ప్రేమతో దాచుకుంటుంది.  సుశీల గారన్న మాట, "మనకు చెప్పడం రాదుగాని, వాళ్ళు చెప్పినవన్నీ మనకూ తెలుసు. ప్రవచనాలు వింటూ హైరాన పడక్కరలేదు ..చక్కగా పవన్ కల్యాణ్ సినిమాలను చూస్తూ నవ్వుకోవచ్చు...” ఎంత చక్కగానో చెప్పారు. ప్రయాణం చేస్తున్నంతసేపూ ప్రకృతి సిద్ధ దృశ్యాలు, అనేక జీవన పార్శ్వాలు..., స్టేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం ఎందుకు? తీరా వచ్చాక పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా అని అన్నారు. అలా ఆమె రాసిన కొద్ది రోజులకే నిదురలోనే స్వర్గస్థులయ్యారనే మాట కలచివేసింది. అందరూ వృద్ధాప్యం వచ్చేసిందని హడలు గొట్టే మాటకు ప్రతిక్రియగా ఆమె నిన్న, మొన్నలా గడచిన జీవన ప్రేమను నెమరు వేసుకొంది ." పెద్దయితే అయ్యాంగాని ఎంత హాయిగా ఉందో, అన్ని అవసరాలూ ఎంత తేలికగా అయిపోయాయి అంటూ వృద్ధాప్య సౌకర్యాలను అందంగా చెప్పారు.

వారితో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు. కాని వారి "ప్రయాణం"లో నేనెంతో ఆత్మీయురాలినయ్యాను. ఎంతో చిలిపిగా అలఓకగా సాగుతుందనుకున్న ప్రయాణంలో కన్నీటి బరువు మూటలను తోటి వారికప్పగించి అతి నిశ్శబ్దంగా తన స్టేషనులో దిగిపోయిన వారి మెత్తని అడుగు జాడలకు శ్రద్ధాపూర్వక నివాళి.

వాసిలి వాకిలి .... నాయకత్వం.. ఒక కళా ప్రతిభ -- డా. వాసిలి వసంతకుమార్

మానవ జీవితం ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా, ఎంతలా ఆధునికత్వాన్ని వొడిసిపట్టుకుంటున్నా అర్థవంతమైన పాఠాలు నేర్చుకోవటానికి సంసిద్ధమయ్యే ఉంటుంది. ఆ సంసిద్ధతకు ఏ మత గ్రంథమైనా ఒక్కటే.. విలువలను అందించే సిద్ధాంతాలు ఆ విశ్వ రచనల నుండి వెలికిరావాలి. ఈ బాటలో భగవద్గీతకు తొలి తాంబూలం లభిస్తూనే ఉంది.

జీవితం ఎంతలా దూసుకుపోతున్నా మనం ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థులమే. మన జీవన విధానంపై ఎంతటి పట్టు ఉన్నా అప్పుడప్పుడూ తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. మన జీవన పయనంలో విద్యార్థులమైతే తప్ప ఈ తప్పటడుగుల నుండి తప్పించుకోలేం. అందుకే విలువైన పాఠాలు ఏదో రూపంలో మనకు అందుతూనే ఉండాలి. ఆ పాఠాలు వింటూ ‘సెల్ఫ్ మాస్టరీ’ని సాధ్యం చేసుకోవాలి. అంటే సాధికారత మన స్వంతం కావాలి.. మనదైన పంథాలో మన జీవితాలకు మనమే రూపకర్తలం కావాలి.. మన జీవితానికి మనమే నాయకులం కావాలి.

జీవించటం ఒక సృజన. జీవితం తీర్చిదిద్దుకున్న తీరుకు మూర్త రూపం. మొత్తానికి కనిపించే మనమందరం కళాకారులమే. ఈ ‘క్రియేటివిటీ’ అనేది ఒక్క కళాకారులకు మాత్రమే స్వంతం అనుకోవటం ఒకప్పటి మాట. ఈ రోజు అటు పొలిటికల్ ఫీల్డ్‌కైనా ఇటు కార్పొరేట్ వరల్డ్‌కైనా సృజన ధోరణులు అనేక విధాల అవసరమవుతున్నాయి. దీనే్న ‘లీడర్‌షిప్’ అంటాం.. ‘మేనేజ్‌మెంట్’ అంటాం.. ‘అడ్మినిస్ట్రేషన్’ అంటాం. అయితే మనకంటూ కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ ప్రత్యేకతలనే మనం ‘మేనేజీరియల్ స్కిల్స్’ అంటున్నాం.

వృత్తి జీవనంలో మనలోని ప్రతి ఒక్కరం నాయకులమే. అంటే మనం ఉద్యోగిస్తున్న వ్యవస్థలో మనకు ‘ఆర్గనైజేషనల్ స్కిల్స్’ ఉంటే తప్ప మనం ‘ఆర్గనైజ్డ్ లీడర్స్’గా రాణించలేం. ఇలా సంస్థాగతంగానే కాదు అసలు జీవితానే్న నాయకత్వ ప్రతిభతో పండించుకోవాలి. ఈ దిశలో మనలోని ప్రతి ఒక్కరికి ఒక ‘మోరల్ డైరెక్షన్’ కావాలి.. దాంతో ఒక ‘సిస్టమాటిక్ అండర్‌స్టాండింగ్’ సాధ్యం కావాలి. ఇక్కడ మోరల్ డైరెక్షన్ అంటే ధర్మమార్గంతోపాటు సమ్యక్ దృష్టి కూడా సాధ్యమవ్వాలి.

సిస్టమాటిక్ అండర్‌స్టాండింగ్ అంటే ప్రణాళికాబద్ధ అవగాహనతోపాటు సమ్యక్ అవగాహన కూడా. అంటే ఒక పద్ధతి, ప్రస్తుతానికి సంబంధించిన అవగాహన అన్నమాట. ఈ సమ్యక్ అవగాహనను, సమ్యక్ దృష్టిని అందించగల సారధి కృష్ణుడు. అందుకోగల సమర్థుడు అర్జునుడు.

ఇటువంటి కృష్ణార్జునులను మనం దైనందిన జీవితంలో చూస్తుంటాం. మనమే అర్జునులం కాగలిగితే మన చుట్టుపక్కల వున్న వాతావరణంలోను కృష్ణులను చూడగలం. అనుభవాన్ని ప్రోది చేసుకున్న విచక్షణాశీలురే కృష్ణులవుతారు కానీ కేవలం అధికారంతోనో, పైబడిన వయసు రీత్యానో, కృష్ణులు కాలేరు. ఇక్కడ కృష్ణ తత్వానికి కావలసింది ‘క్వాలిటీ మేనేజ్‌మెంట్’.. ‘మేనేజీరియల్ ఇష్యూస్’ని అంటే సంస్థాగత సమస్యల్ని పరిష్కరించగల నేర్పరితనం.

ఇలా చూస్తే గీతలో కృష్ణుడు ఒక లీడర్‌లా, ఒక మేనేజర్‌లా, ఒక అడ్మినిస్ట్రేటర్‌లా, ఒక టీచర్‌లా, ఒక మోటార్‌లా, ఒక ఫ్రెండ్‌లా, ఒక అడ్వైజర్‌లా, ఒక కౌన్సిలర్‌లా.. ఇలా అనేక కోణాలలో కనిపిస్తాడు. అంటే సమర్థతకు, సారథ్యానికి ప్రతిరూపమే కృష్ణుడు. ఈనాటి వ్యవస్థలో మనమూ ఇంతటి సమర్థతతో రాణిస్తే తప్ప మనలోని లీడర్‌కు అస్తిత్వం సిద్ధించదు.

ఈనాటి మన జీవనం వ్యాపార సంస్కృతిలో తలమునకలవుతోంది. ఈ అధునాతన వ్యాపార మనుగడకు కావలసిన వౌలిక సిద్ధాంతాలు భగవద్గీతలో ఉన్నాయి. ఉదాహరణకు ఈనాడు మన కార్పొరేట్ ప్రపంచంలో చెప్పుకుంటున్న మిషన్ అండ్ కోరల్ వాల్యూస్‌ను, న్యూకాపబిలిటీస్‌ను, కనెక్షన్స్ అండ్ కమ్యూనికేషన్‌ను, పర్పస్ సెంట్రిక్ పర్స్పెక్టివ్‌ను మనం గీతలో అనేక సందర్భాల్లో చూడగలం.

మొత్తానికి క్రమశిక్షణ, విలువలు, సమర్థతలు, ఉత్తేజిత చేతలు, భావ ప్రకటనలు, ప్రయోజిత దృక్పథాలు అన్న అంశాలకు సంబంధించిన వివరణలు గీతలో మనకు లభిస్తాయి. ‘ఉన్నతి’ లక్ష్యంగా తెలివితేటలతో ‘వర్కోహాలిక్’లం కావటం, పని విషయంలో స్వార్థాన్ని పక్కనపెట్టి ఫలితం కోసం అంకిత భావంతో, సమర్పణా తత్వంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవలసిన అవసరాన్ని గీత స్పష్టంగా చెప్తుంది.

కృష్ణుడు విశ్వనాయకుడు. అంటే కృష్ణుడి నాయకత్వ చర్యలను ప్రతి ఒక్కరూ ఆదరించటం, ఇలా అందరికీ మార్గదర్శిగా నిలబడటం పూర్ణ పురుష లక్షణం. కృష్ణుడు విశ్వహితాన్ని కాంక్షించేవాడు కాబట్టే-

‘స్వే స్వే కర్మణ్య భారత స్సంసిద్ధిం లభతే నరః
స్వకర్మ నిరతస్సిద్ధిం యథావిందతి తచ్ఛృణు’

అని అంటాడు. అవును, మానవ జన్మలోని ప్రతి ఒక్కరూ కర్మాసక్తులై సంసిద్ధి పొందాలి. కృష్ణుడిదీ మానవ జనే్మ కాబట్టి కృష్ణుడు సైతం కర్తవ్యపరాయణుడై కర్మాచరణతో సంసిద్ధిని పొందవలసిందే. అంటే మన మనుగడలో కర్తవ్య పరాయణత, కర్మాచరణలే అందుకోబోయే ఫలితాలకు మూలాలు అవుతుంటాయి. కురుక్షేత్రంలోని విశ్వ పురుషుడైన కృష్ణుడికైనా, పోరుకు సిద్ధమైన సైనికుడికైనా కర్తవ్య పరాయణత, కర్మాచరణలు సహజాలంకారాలే.

మనం ఉంటున్న వ్యవస్థలో సైతం.. అది కుటుంబం అయినా, వ్యాపార సంస్థ అయినా, ఉద్యోగ వ్యవస్థ అయినా తరతమ భేదాలు, అధికార వ్యత్యాసాలు లేక ప్రతి ఒక్కరికీ వర్తించేదే! బాసిజాలు, సూపర్‌వైజింగ్‌లు కర్మ ఫలితాన్ని సక్రమంగా అందుకోవటం వరకే! సంసిద్ధిని పొందటం అంటే ఇదే.

*published under my column VINADAGU of Aadivaaram AndhraBhuumi of 4th October 2015 issue*

Posted in October 2020, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *