Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 97
- వరూధిని
vikshanam-97

వీక్షణం-97 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా సెప్టెంబరు 13, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ ఎస్.నారాయణ స్వామి గారు "బయటి ప్రపంచంతో మాట్లాడుతున్న అమెరికా తెలుగు కథ" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.

"అమెరికా కథలో ఇళ్ల గోడల్నించి బయట అడుగుపెట్టినవి తక్కువ. అయినప్పటికీ మన కథలు మనమే చెప్పుకోవాలి. అమెరికా జీవితం గురించి అమెరికా తెలుగు వారు తప్పకుండా రాయాలి. కేవలం నాస్టాల్జియా మాత్రమే కాదు. నిజజీవితంలో ఎదురయ్యే సక్సెస్ స్టోరీస్, సమస్యలు కూడా రాయాలి. స్టీరియో టైప్స్ నించి దూరంగా ఉండాలి. అమెరికన్లు ప్రపంచం నలుమూలల నించి వచ్చిన వలసలు. ఇది రచయితలకు గొప్ప వనరు. అది వాడుకోకపోవడం అన్నది దురదృష్టం." అంటూ అమెరికా తెలుగు కథల గురించి వివరిస్తూ తన దృష్టిలోకి వచ్చిన దాదాపు 15 కథలను గురించి నారాయణ స్వామి గారు ప్రస్తావించారు.

ఇందులో విన్నకోట రవిశంకర్ "తోడు" కథ లెబనీస్ అమెరికన్ కథ, మధు పెమ్మరాజు "ఇనుపతెర" ట్రావెలింగ్ ఐటీ ప్రొఫెషనల్ గా ఎదుర్కొన్న అనుభవాలు, సుస్మిత "ఎంతెంత దూరం" భారతీయులు, భారతీయేతర జంటలు బయటి వత్తిళ్ళ కారణంగా జీవితాన్ని వృథా చేసుకోవడం గురించిన కథ, చంద్ర కన్నెగంటి రాసిన “పాప”, విజయ కర్రా "విండో షాపింగ్", సత్యం మందపాటి "సౌమ్య", ఆరి సీతారామయ్య "దూరపు కొండలు" మొ. కథలు అమెరికా తెలుగు కథలను కొత్త కోణంలోంచి చూపించినవని పేర్కొన్నారు.

ఇటువంటి కథల్లో ఉన్న కామన్ లక్షణాలు అంటూ కథ అబ్జర్వర్ దృష్టి లోంచి చెప్పబడడం, చూసినవీ, విన్నవీ రాయడం, బయటివారితో ఉన్న ఇంటరాక్షన్ గురించి రాయడం..  మొ.న విషయాల గురించి సోదాహరణంగా వివరించారు.

తరువాత చాలా ఆసక్తిదాయకంగా జరిగిన చర్చలో కిరణ్ ప్రభ, డా|| కె. గీత, ఆరి సీతారామయ్య, నీహారిణి, రమణారావు, శారద, అన్నపూర్ణ దేవరకొండ, అపర్ణ గునుపూడి మొ.న వారు పాల్గొన్నారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీధర్ రెడ్డి, డా. కె.గీత, దాలిరాజు, కొండపల్లి నీహారిణి, రేణుకా అయోలా, డా. సీతాలక్ష్మి, రమణారావు, మల్లాది వెంకట లక్ష్మి మున్నగు వారు కవితల్ని చదివారు.

ఎప్పటిలాగే  కిరణ్ ప్రభ, శారద గార్ల ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరికీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

చివరగా సుభద్ర గారు "పదములె చాలు రామా" అంటూ ఆలపించగా, గీత గారు "ఏలేలేలో సందమావా" అంటూ స్వీయ జానపద గీతాన్ని ఆలపించి సభను అలరించారు.

ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ వేమూరి, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ లెనిన్ అన్నే, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ దాసరాజు రామారావు, శ్రీ సూరి దర్భా, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కాంతి, శ్రీమతి ఉమా వేమూరి మొ.న  స్థానిక ప్రముఖులు అనేకులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

Posted in October 2020, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *