Menu Close

Science Page title

పార్శీలు

(ఇన్ ఫో సిస్ సంస్థాపకుడు శ్రీ నారాయణమూర్తి వ్యాసాన్ని ఆధారంగా చేసుకుని రాసిన వ్యాసం ఇది.)

ఇంగ్లీషులోని “ఇమ్మిగ్రెంట్” అన్న మాటకి సమానార్థకమైన తెలుగు మాట లేదు. మరొక దేశం నుండి మన దేశం వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తిని ఉద్దేశించి ఈ మాట వాడతారు. భారతదేశానికి వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్న వారిలో అగ్రగణ్యులు పార్శీలు. ప్రస్తుతం వీరి జనాభా అతి స్వల్పం – ముంబాయి నగరపు దక్షిణ శివార్లలో దరిదాపు 60,000 మంది ఉంటారు.

ముంబాయి నగరపు ఔన్నత్యం దక్షిణ ముంబాయిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దేశంలోనే ఎన్నదగ్గ సుందరమైన భవనాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ పార్శీలు కట్టినవే. ఇక్కడ మనుష్యులలో కనిపించే సభ్యత, నాగరికత, పౌరధర్మ పరిపాలన, క్రమశిక్షణ ఇండియాలో మరెక్కడా కనిపించవంటే అది అతిశయోక్తి కాదు. దీనికి కారణం పార్శీలు దిద్దిన ఒరవడే.

పార్శీలు 17 వ శతాబ్దంలో బొంబాయి వచ్చి స్థిరపడడం మొదలు పెట్టేరు. కోట్లకి పైబడి గణించేరు. గణించినదాంట్లో సింహ భాగం సంఘ సంస్కరణకి, ప్రజాభ్యుదయానికి దానం చేసేశారు. వీరికీ మిగిలిన భారతీయులకి మధ్య తేడాలు చూద్దాం.

ఉదాహరణకి అంబానీలు “ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ పాఠశాల” కట్టేరు. ఇక్కడ ఒక విద్యార్థి సాలుకి చెల్లించవలసిన రుసుం రూ. 3,48,000. ఇక్కడ తలసరి, సాలుసరి ఆదాయం ఇందులో పదో వంతు ఉంటుంది!

కింగ్ఫిషర్ అధినేత మాల్యా తిరుపతిలో స్వామివారి దేవాలయానికి బంగారు తొడుగు చేయించేడు.

అరవై ఏళ్ల లక్ష్మి మిత్తల్ ప్రపంచంలోనే అత్యంత సామంతుల శ్రేణిలో నాలుగవవాడు. అతని ఆస్తి విలువ 40 బిలియను డాలర్లు (ఒక బిలియను డాలర్లు = 600 కోట్ల రూపాయలు). “ఇంత చిన్న వయస్సులోనే దాన ధర్మాల గురించి ఆలోచన ఎందుకు?” అన్నాట్ట.

హైదరాబాదు, జయపూరు, ఢిల్లీలలో బిర్లాలు దేవాలయాలు కట్టించేరు.

హిందువుల దృష్టిలో దానధర్మాలు చెయ్యడం అంటే దేవాలయాలు కట్టించడం. అమెరికాలో ఉన్న భారతీయులలో చాలమంది సంపన్నులే. నేను ఉన్న ఊళ్లోనే కనీసం పది పైబడి దేవాలయాలు ఉంటాయి. మరొక దేవాలయం కట్టాలని సంకల్పించి కొంతమంది పెద్దలు ఒక్క సాయంకాలం సమావేశమై మిలియను డాలర్లు విరాళాలు పోగుచేశారుట.

విశాఖపట్టణంలో ఉన్న “లయన్స్ కేన్సరు ఆసుపత్రి” నిర్మాణానికి నిధులు సేకరించడానికి నేను పడ్డ పాట్లు ఆ పెరుమాళ్లకే ఎరుక! కాలిఫోర్నియా యూనివర్శిటీ, బర్క్లీలో తెలుగు పీఠం స్థాపించడానికి జోలె పట్టుకుని డబ్బులు దండడానికి వెళితే నేను రాసిన విన్నపంలో ఉన్న “బర్క్లీ” అన్న మాటలో వర్ణక్రమదోషాలు ఎన్నిన వాళ్లు ఎక్కువ, విరాళం ఇచ్చిన వాళ్లు తక్కువ.

హిందూ దృక్పథంలో “దానం” అన్న మాటకి అర్థమే వేరు. “వేంకటేశ్వరా! నువ్వు నాకు ఫలనాది వరంగా ఇస్తే నేను నీకు ఇంత ముడుపు చెల్లిస్తాను” అనే బేరసారాల ధోరణే తప్ప “మానవ సేవే మాధవ సేవ” అన్న సూక్తి కేవలం ప్రచారం కోసం “బేనర్” మీద రాసుకుందుకే! “మనం ఉండే సంఘం బలంగా ఉంటే అదే మన బలం” అనే ఆలోచన మనలో తక్కువ. “ఎవరి కర్మ వారిది” అనే వేదాంత ధోరణిలో ఉన్న వారికి సంఘంతో పనేమిటి? మన నుదిటి రాత బాగులేకపోతే ఆ రాసినవాడి దగ్గరకే వెళ్లి వాడికే కాసింత లంచం ఇస్తే సరిపోలే? రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సంపర్కం ఉన్నప్పటికీ అది సంఘానికీ, వ్యక్తికీ మధ్య ఉన్న పరస్పరాధార బంధంపై మన దృక్పథాన్ని మార్చలేకపోయింది.

పార్శీలు వితరణ శీలానికి, సంఘాభ్యుదయనికీ మధ్య ఉండే లంకె బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు. అభివృద్ధి అనేది వ్యష్టిగా కాక సమష్టిగా జరగవలసిన కార్యక్రమం అని వారు గుర్తించేరు. ఈ అభ్యుదయ దృక్పథంతో వారు మన దేశపు పునర్నిర్మాణానికి అవసరమైన సంస్థలు ఎన్నో స్థాపించేరు. ఎవ్వరో కట్టిన భవనాలకి, నిర్మించిన సంస్థలకి పేర్లు మార్చి తమ పేరు పెట్టుకోవాలనే తపన తప్ప పదిమందికి పనికొచ్చే సంస్థలని నిర్మించడానికి దానం చేసిన మరొక్క భారతీయ వ్యక్తిని గాని, సంస్థని కాని వేలెత్తి చూపించండి, చూద్దాం!

పార్శీలు దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు నిర్మించేరు. కళలని పోషించడానికి “నేషనల్ గేలరీ అఫ్ ఆర్ట్” నిర్మించేరు. వైజ్ఞానిక పరిశోధని ప్రోత్సహించడానికి బెంగుళూరులో “ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ని 1911 లో  జంషెడ్జీ నౌషెర్వాన్ జీ  తాతా నిర్మిస్తే, ముంబాయిలో తాతా ఇన్స్టిటూట్ అఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ స్థాపించడానికి హోమీ భాభా కారకుడయ్యాడు. సర్ దొరాబ్జీ తాతా ట్రస్ట్ వారు 1936 లో ఇండియన్ ఇన్స్టిటూట్ అఫ్ సోషల్ సైన్సెస్ స్థాపించేరు. జంషెట్జీ జీజీబోయ్ జె. జె హాస్పిటల్, గ్రేంట్ మెడికల్ కాలేజీ కట్టించేడు. ఇదే విధంగా వాడియా ఆసుపత్రులు, మహిళా కళాశాలలు కట్టించేడు.

ముంబాయి నగరంలో ఎక్కడ చూసినా తాతా ముద్ర కనిపిస్తూనే ఉంటుంది: జెహంగీర్ ఆర్ట్ గేలరీ, సర్ జెజె స్కూల్ అఫ్ ఆర్ట్, తరపోరెవాల ఎక్వేరియం,  ద నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్.  1924లో ICS కి ఎంపిక అయిన అయిదుగురు భారతీయులలో ఇద్దరు తాతా విద్యార్థి వేతనాలు అందుకున్నవారు కావడం గమనార్హం.

పార్శీల గురించి చెప్పుకోదగ్గవి ఇంకా చాలా ఉన్నాయి. విచారించవలసిన విషయం ఏమిటంటే పార్శీల జనాభా క్రమేపీ తగ్గిపోతోంది: పుట్టేవారు తగ్గిపోతున్నారు. వారి విత్తు హరించిపోతే మన దేశానికి అది పూరించడానికి వీలు కాని నష్టమే. ఈ విషయాన్నే శ్రీమతి నజ్మా హెప్తుల్లా (కేంద్రంలో అల్పసంఖ్యాక వర్గాల మంత్రి) "Muslims are not minorities, Parsis are. We have to see how we can help them [Parsis] so that their numbers don't diminish" అని అంటే కొందరు ఆమెని దుమ్మెత్తి పోసేరు.

-o0o-

Posted in October 2020, Science

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *