Menu Close
రూమ్ నెంబర్ 117
-- డా. వి. వి. బి. రామారావు

మెస్ గంట కోసం ఎదురుచూస్తున్న భాస్కరం వాచీ చూసి చూసి అలసి పోయాడు. ఏడున్నరకే ఆకలి వేస్తోంది. పొద్దున్న కాఫీ మూడు సార్లు తాగి (ఆ వెధవ పంతులుగాడి వల్లే), మధ్యాహ్నం ఒంటి గంటకు కాస్త కతికాడు. లైబ్రరీకి పోయి పుస్తక లోకంలో మైమరచి పోయాడు. తీరా హాస్టల్ కి వచ్చాక ప్రారంభమయింది ఆకలి. గంట విన్న మరుక్షణం ఒక్క ఉదుటున మెస్ లోకి జొరబడ్డాడు. తనకు ఇష్టమైన చామఫ్రై వండర్ ఫుల్ గా ఉంది. పక్క వాళ్ళతో మాటాడటానికి ఇది సమయం కాదు. గబగబా లాగించి ఇవతల పడ్డాడు. తన రూమ్ మేట్స్ పంతులు గాడు, శేషగిరి ఇంకా భోజనాలకి వెళ్ళడానికి తయారవుతున్నారు. వీళ్ళు తిరిగి వచ్చేసరికి తానో చాప్టర్ పూర్తి చేద్దామని టెక్స్ట్ బుక్ అఫ్ జనరల్ సర్జరీ తీశాడు. ఓ పదినిమిషాలు చదివాడో లేదో, తలుపు శబ్దం. మిత్రుడు భవానీ శంకరం. నిట్టూర్చాడు భాస్కరం, ఇక చదువింతేలే అన్నట్టు.

“ఏరా! ఎక్కడా కనపడ్డం లేదు?” కుశల ప్రశ్న.

“నేకేం! టౌన్ లో ఉన్నావ్ పుట్టింట్లో. మాకీ హాస్టల్ మెతుకులే గతి.. అయినా, ఈ వెధవ జీవితం ఎవడు కనిపెట్టాడో, వెధవ తిండి, వెధవ బతుకు, పోనీ, చదువుకుందామంటే ఎప్పుడూ ఏదో గోల”

“అదంతా పాత పురాణమే గాని మార్కులెలా వస్తున్నాయి?”

“ఏవో, ఓ మాదిరి.”

“ఈ మధ్యేమైనా సినిమాలు చూశావా? ఎప్పుడూ పుస్తకాల గొడవేనా? మంచి ఘోస్ట్ స్టొరీ. లీలామహల్ లో వస్తావా?”

“ఏమిటోయ్ అది?” పంతులు ప్రవేశించాడు.

“ఏం నాయనా, షికారుకెళ్ళలేదా?” కసిగా అడిగాడు భాస్కరం. తననీ తిప్పుతున్నందుకు కక్ష.

పంతులు వెనకాలే సిగరెట్టు కాల్చుకుంటూ వచ్చాడు జాన్. యూనివర్సిటీ లో పారాసైకాలజీ విద్యార్ధి. విపరీతంగా పుస్తకాలు చదువుతాడు. కబుర్ల రాయుడు. కథలిట్టే అల్లేస్తాడు. పంతులికి మహా స్నేహితుడు.

“ఏమిటోయ్ ఆ ఘోస్ట్ స్టోరీ?” పంతులు ఆ టాపిక్ వదలడానికి ఇష్టపడలేదు.

“ఏదో సినిమాలే. ఇంతకీ జాన్ పారాసైకాలజీ వాడు కదా – ఇ.ఎస్ సి. పారానార్మల్ మాన్ ఫెస్టీషన్స్ – ఇలాంటివి నమ్ముతాడా?” భవానీకి సందేహం వచ్చింది.

“ఎంతమాట! నాకు అలాంటి కథలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. ఆ సమయానికి జ్ఞాపకం వచ్చింది – చాలా సంవత్సరాల క్రిందట ఈ హాస్టల్ లోనే కాశీపతి అనే ఒక స్టూడెంట్ ఉండేవాడట. మీరెప్పుడైనా విన్నారా?”

“ఎవరా కాశీపతి, ఏమా కథ?” భవానీకి గాసిప్ అంటే మహా ఇష్టం. కథలంటే పిచ్చి.

భాస్కరానికి సంభాషణ నచ్చలేదు. “వీళ్ళ దుంపతెగ మరి, చదువుకోనిచ్చేట్టు లేరే?” లోలోపల గునుసుకున్నాడు.

“కాశీపతి మా అన్నయ్య విక్టర్ క్లాస్ మేట్”

“కాకినాడలో ప్రాక్టీసు చేస్తున్న విక్టర్ మీ అన్నయ్యా?” భవాని శంకరం ఎందుకో చాలా ఆశ్చర్యం ప్రదర్శించాడు.

“అవును. కాశీపతి కధ చాలా భాగం మా అన్నయ్యే నాకు చెప్పాడు.”

“ఇంతకీ ఏమా కథ?” భవానీ ఊరుకోలేదు.

డ్రమాటిక్ గా మరో సిగరెట్టు ముట్టించి ప్రారంభించాడు జాన్.

“మా అన్నయ్య, కాశీపతి రూమ్ మేట్స్. నూట పదిహేడో గదిలో ఉండేవాళ్లట. కాశీపతి ఓ విషాద గాథకి కధానాయకుడు. ఇప్పటికీ మా అన్నయ్య మాటలే జ్ఞాపకం వస్తాయ్..” గతంలోకి పోబోయాడు జాన్.

“కథ కానీయ్.” కాలరిడ్జి పద్యంలో ఏన్షియంట్ మారినర్ కి కథ చెప్పెస్తేనే గాని నరకయాతన తగ్గదు. ఈ భావానీ గాడికి కథ వినిపిస్తేనే గాని ఆరాటం ఆరదు.

“కాశీపతి ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫామిలీలో పుట్టాడు. కష్టపడి చదివేవాడు. మొండిపట్టు మనిషి. మొదట అతను నూట పదిహేడో గదిలో దిగడానికి సందేహించిన మాట మాత్రం వాస్తవమేనట.కాని, అన్నయ్యా, అతను గొప్ప స్నేహితులు. దయ్యాలేమిటి నాన్సెన్స్ అనేశాడు అన్నయ్య. ఇద్దరూ దిగారు ఆ గదిలో. ఈ సంఘటన వాళ్ళు ఫిఫ్త్ ఇయర్ లో ఉండగా జరిగిందట. ఉన్నట్టుండి కాశీపతి మారిపోయాడు. ఎవరితోనో ప్రేమాయణం లో పడ్డాడని వినికిడి. అన్నయ్య మాత్రం అతన్నెప్పుడూ వెనకేసుకు వచ్చేవాడట గొప్ప లాయల్టీతో.

సుమారు ఇరవై ఏళ్ల క్రిందటి విషయం. కాశీపతి గదిలో దయ్యం ఉందని ప్రచారం అయ్యింది. హాస్టల్ కాంపౌండులో వేపచెట్టు క్రింద ఎముక తెచ్చుకుని గదిలో ఉంచాడని, ఆ ఎముక ఒక భగ్న ప్రేయసిదనీ, ఆ ఎముకతో పాటు దయ్యం సాత్కాక్షరిస్తుందనీ, ఆమె పట్టిన మనిషి రెండు మూడు రోజుల్లో చనిపోవడం ఖాయమనీ అనుకుంటూ ఉండేవారు. కాశీపతి ఆ ఎముక కథ చాలా సార్లు విన్నాడు. ఉన్నట్టుండి ఒక ఎముకను తన గదిలో తెచ్చి పెట్టుకున్నాడు.” జాన్ కొంచెం ఆగాడు -రియాక్షన్ కోసం కాబోలు.

“మెడిసిన్ చదువుతూ ఎముకలు దగ్గరుంచుకోవడంలో ఆశ్చర్యమేముంది? ఇక్కడ ప్రతి ఒక్కడి కప్ బోర్డు లోనూ అవి ఎప్పుడూ ఉండేవే. మా దృష్టిలో అవి మనిషి ఎముకలు మాత్రమే కావు. శాస్త్రజ్ఞానంతో పరికించవలసిన స్పెసిమన్స్. ఇంతకీ ఏమిటి నీ కథ సారాంశం?” భాస్కరం విసుక్కున్నాడు.

“నేనూ ఈ కథ విన్నప్పుడే అలాగే అనుకున్నాను. మన హేతువాదం సంగతి తరువాత ఆలోచిద్దాం...” జాన్ ఇంకా ఏదో చెప్పబోయాడు.

“ఇంతకీ కాశీపతి గదిలోకి దయ్యం వచ్చిందా?" భవానీకి క్యూరియాసిటీ ఆగలేదు.

“వచ్చిందని నువ్వెందు కనుకున్నావ్?” ఎదురు ప్రశ్న వేశాడు జాన్.

“అయితే జాన్, దయ్యాలుంటాయా?” పంతులు గాడడిగాడు.

“దయ్యాలను చూసిన వాళ్ళు లేరు. ఇకపోతే కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం పారానార్మల్ మానిఫెస్టేషన్స్ అని కొంతమంది ఒప్పుకున్నారు. వీటికి నిదర్శనాలు చూపడం కష్టమే.”

“ఇంతకీ ఇప్పుడు కాశీపతి ఎక్కడున్నాడు?” మరోలా ప్రశ్నవేసి చూశాడు పంతులు.

“ఇంకెక్కడి కాశీపతి? హౌస్ సర్జన్సీ అవుతున్నప్పుడే చనిపోయాడు.”

“అయితే, కాశీపతిని దయ్యం చంపిందా?” భవానీ నోరు వెళ్ళబట్టాడు.

“కాశీపతి చనిపోయిన కారణం ఊహించడం కష్టమేమీ కాదు. కానీ, దయ్యం విషయం మాత్రం వింతగా ఉంటుంది. మా అన్నయ్య నా కంటే చాలా పెద్దవాడు. మా వయస్సులోని వ్యత్యాసం వల్ల నేను యూనివర్సిటీలో చేరేవరకు ఎక్కువసేపు మా అన్నయ్య ఎదుటబడే వాడిని కాదు. ఒక రోజు కాశీపతి ప్రస్తావన ఎందుకో వచ్చింది. అన్నయ్య సడన్ గా ఓ రిమార్క్ పారేశాడు.

“జాన్, చెడ్డకు నరకం ఎక్కడో లేదు ఈ ప్రపంచంలోనే ఉంది,” అని.

“ఏమిటన్నయ్యా, కాశీపతి అంత చెడ్డవాడా?”

“అతని గురించి చాలా మందికి నిజం తెలియదు. నువ్వూహిస్తే సంతోషమే” కొంచెం నసిగి మల్లె ప్రారంభించాడు.

“ఆ రోజుల్లో – మేము మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఇంకా విద్యార్థులు కొంచెం ఛాందసంగానే ఉండేవారు. సంఘం ఇంత పెర్మిసివ్ గా ఉండేది కాదు.”

“ఇంతకూ కాశీపతి ఏమయ్యాడు?” భవానీ మళ్ళీ అడిగాడు.

“మిత్రులు అతన్ని గురించి ఏమనుకున్నా, అన్నయ్యకు మాత్రం కాశీపతి అంటే గౌరవం, ఇంకా పోతే జాలి. ఒకనాడు వాళ్ళిద్దరి సంభాషణ ఇలా సాగింది.

అన్నయ్య: ఒరేయ్, కాశీపతి! నీ గురించి వాళ్ళంతా ఏమేమో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆ దయానిధి గాడు, వాడికి దయ్యాలంటే భయం. నువ్వేమో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావని ఏవేవో కూస్తున్నాడు. పైగా ఆ అమ్మాయి కిరస్తానీ అనీ, నిన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాదనీ ఈ గొడవంతా ఎందుకూ, ఆ ఎముక పారేసి వాణ్ని కాస్త ప్లాకేట్ చేయకూడదూ?

కాశీపతి: నీ మొహం! వాడి దుష్ప్రచారం ఆపెయ్యడానికి నేను ఎముక పారేయ్యాలా? ఇంపాజిబుల్. దయ్యాలంటే నాకు భయం లేదు. ఇకపోతే నా దగ్గర ఎముక ఉంటే వాడికేం? వాడు ఉత్తి ఫానటిక్. వాడి మాటలు నమ్మకు. ఈవేళ సినిమాకి వెళ్ళాలి. సరస్వతిలో కొత్తదొచ్చిందట, నువ్వెళ్ళి టిక్కెట్టు తీసుకుని ఉండు. నేవచ్చేస్తా.

అన్నయ్య సినిమా దగ్గర కాశీపతి కోసం చాలాసేపు చూశాడు. ఇంకా వాడి సూచన కనబడక మరో స్నేహితుడితో వెళ్లి ఒంటిగంటకు రూముకు వచ్చాడు. తలుపు తట్టగానే కాశీపతి తలుపు తీసి వెంటనే వెళ్లి ముసుగుతన్ని పడుకున్నాడు. గదంతా మల్లెపూల వాసన. అన్నయ్య మంచం మీద కూడా ఏదో సెంటు వాసన.. నాకు చాల ఆశ్చర్యం వేసింది. అన్నయ్య సీరియస్ గా చెప్పుకుపోతున్నాడు.

**** ముగింపు వచ్చే సంచికలో ****

Posted in October 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!