Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
స్వార్ధ రహిత సేవ

ప్రశాంతిపురంలోని శాంతమ్మ ఒంటరి. చాలా సాధు స్వభావమూ, పరోపకారమూ ఆకారం దాల్చినట్లు నిరంతరం అందరికీ సాయం చేస్తుండేది. తన పూరి ఇంటిచుట్టూ కాయకూరలూ, పండ్లచెట్లూ వేసి పెంచుతుండేది. వాటి ఫలాలను పేదలకు పంచేది ధనాశ ఆమెకు లేనేలేదు.

ఓమారు శివాలయంలో ఓ పండితుడు కార్తీకపురాణం చెప్పసాగాడు. ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో ఉండి దోమల నివాసంగా ఉండటంతో పురాణం వినను వచ్చే వారెంతో ఇబ్బంది పడసాగారు.

అది గమనించిన శాంతమ్మ అందరి కంటే ముందుగానే వచ్చి ఆ ప్రదేశాన్నంతా పరిశుభ్రంగా చిమ్మి, పేడనీళ్ళు చల్లి, చక్కని రంగవల్లులు తీర్చేది. వచ్చిన వారికి దాహం వేస్తే త్రాగను రెండు బానల నిండా మంచి నీరు పోసి ఉంచేది. ఎండువేపాకు, ఆవ ఆకులు, కర్పూరం తెచ్చి ఆ ఆవరణ చుట్టూతా నాల్గు దిక్కులా మంటలు వేసేది. దోమలు రాకుండా వేపనూనెతో ప్రమిదలు చేసి చుట్టూతా పెట్టేది. పెద్దలతో వచ్చేపిల్లలు దోమల బారికి గురి కాకుండా తగు శ్రధ్ధవహించేది.

పురాణశ్రవణం చేస్తున్న వారి బిడ్డలు ఏడుస్తుంటే తాను వారిని తీసుకు వెళ్ళి ఆరు బయట ఆడించేది. ఐతే పురాణశ్రవణం పూర్తై హారతి ఇచ్చే సమయానికి ఆమె హడావిడిగా వెళ్ళిపోయేది.

ఇదంతా గమనిస్తున్న ఆ పురాణంపండితుడు ఒక రోజున ఆమెతో ”అమ్మా!మీరు ఇక్కడికి వచ్చే వారికంతా ఎంతో సౌకర్యం కల్పిస్తూ హారతి వేళకు వెళ్ళిపోవడం బావు లేదు. ఏదైనా కారణం ఉందా?" అని అడిగాడు.

"అయ్యా! హారతి అందుకోకపోతే దయామయుడైన భగవంతుడు కోపించడు, కాని మా యింటి పక్కనే ఉంటున్నఅనాధ వృధ్ధ మహిళ అన్నానికి ఆలస్యమైతే ఉండలేదు. ప్రతి రోజూ ఈ వేళకు ఆమెకు పట్టెడన్నం పెట్టడం నా పనిగా భావిస్తాను .." అంటూ శాంతమ్మ వెళ్ళిపోయింది.

పురాణం 40 రోజులూ పూర్తయ్యాక ఆ వేద పండితుడు "అయ్యలారా! మీరంతా ఎంతో శ్రధ్ధగా ఇన్ని రోజులూ నేను చెప్పిన కార్తీకపురాణం విన్నారు. మీరు ఏమి గ్రహించారో దాన్ని ఆచరణలో ఉంచండి" అని చెప్పాడు.

ఆ తర్వాత ఆయన గ్రామం వదలి వెళ్ళే ముందు శాంతమ్మను దగ్గరకు పిలిచి "తల్లీ! ఇంతకాలం ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంతో సేవ చేశావు. మా గురువుగారు నాకు ఇచ్చిన ఈ ఈతాకుల తట్ట నీకు ఇవ్వదలచాను, స్వీకరించు"అంటూ అందించాడు.

శాంతమ్మ"అయ్యా! నేను ఒక్కరోజూ మీకేమీ కానుకలు సమర్పించలేదు. హారతి సమయంలో ఒక్క రోజైనా ఉండలేదు. మీరు దీన్ని నాకెందుకు ఇస్తున్నారు? ఈ ఈతాకు తట్ట నేనేమి చేసుకోను? తమ గురుదేవులు ఇచ్చారంటున్న దీన్ని నాకివ్వడంలో అర్ధమేంటి? తమరే దీన్ని ఉంచుకోడం సబబేమో!" అంది.

"అమ్మా! ఇది ఇంత కాలం నా వద్ద ఉన్నా నేను సరిగా ఉపయోగించ లేదు. నీకు ఉపయోగ పడవచ్చు కనుక ఉంచు తల్లీ!" అని ఆమె చేతుల్లో దాన్ని ఉంచి ఆ వేదపండితుడు గ్రామం వదలి మరో గ్రామంలోపురాణం చెప్పను వెళ్ళిపోయాడు.

మరునాడు శాంతమ్మ తమ ఇంట కాసిన జామకాయలు కోసి తన అలవాటు ప్రకారం పేద పిల్లలకు పంచుదామని ఆ తట్టలో ఉంచింది. వెంటనే అవి రెండింతలయ్యాయి. ఆమె ఆశ్చర్యంగా వాటిని పక్కన ఉంచి తమ పెరటిలోని అరటిగెలలో పండిన కాయలు కోసి ఆ తట్టలో ఉంచింది. అవీ వెంటనే రెట్టింపయ్యాయి. శాంతమ్మ వాటి నన్నింటినీ పెద్ద గంపలో ఉంచుకుని ఊరి బయట ఉంటున్న పేదవాడ కెళ్ళి అన్నీ పంచివచ్చింది.

ఆ మధ్యాహ్నం పక్కింటి వనజమ్మ వచ్చి తాను చేసిన లడ్డు ఒకటి ఆమె కిచ్చింది రుచి చూసి చెప్పమని. శాంతమ్మ ఆమె ముందే దాన్ని పండితుడిచ్చిన తట్టలో ఉంచగా రెండు లడ్లయ్యాయి. శాంతమ్మ ఆ రెండు లడ్లనూ తీసి మరలా తట్టలో ఉంచగా అవి నాలుగయ్యాయి. వాటిని తీసి మరలా ఉంచగా అవి 8 అయ్యాయి. అలా తన పెద్ద గంప నిండగానే శాంతమ్మ వాటిని తీసుకెళ్ళి పొలం పనులు చేస్తున్న రైతు కూలీలకు ఉచితంగా పంచి వచ్చింది.

శాంతమ్మ తట్ట మహత్యం వనజమ్మ ద్వారా ఈ నోట ఆ నోటా ఊరంతా తెలిసి పోయింది. మరునాడు శాంతమ్మ తన పొరుగు గ్రామంలోని పేద వాడలోని ప్రజలు చలికి తట్టుకోలేక పోతున్నట్లు వినగానే తన రాగి కాగు అమ్మి వచ్చిన డబ్బుతో ఒక మంచి రగ్గు కొని దాన్ని ఆ తట్టలో ఉంచగానే  రెండయ్యాయి, వాటిని మరలా ఉంచగానే నాలుగయ్యాయి. అలా ఆమె వాడవారికి సరిపడా రగ్గులు వచ్చాక వెళ్ళి వారందరికీ మొత్తం రగ్గులు పంచివచ్చింది.

మరికొన్నాళ్ళకు అతివృష్టికి బాహుదానదికి ఉప్పెన రాగా కట్టుబట్టలతో సహా కొట్టుకుపోయి నిరాశ్రయులైన పొరుగు గ్రామస్తుల బాధలు చూసి, తన ఇంట మిగిలి ఉన్న ఒకే ఒక ఇత్తడి బిందెను అమ్మి, ఆ డబ్బుతో చీర, పంచె, దుప్పటి కొని ఆ తట్టలో ఉంచగానే అవి రెట్టింపయ్యాయి. అలా వాటిని ఆ గ్రామస్తులకు సరిపడా చేసి తీసుకెళ్ళి పంచి వచ్చింది. అంతేకాక వారు తిండికి సైతం ఇబ్బంది పడుతున్నట్లు గమనించి, తన ఇంట వున్న బియ్యం, పచారీ సరుకులు ఆ తట్టలో ఉంచి, అవి రెట్టింపవుతూ పెరగగానే తీసుకెళ్ళి అందరికీ ఇచ్చివచ్చింది.

ఇదంతా గమనిస్తున్న పక్కింటి పిసినారి భాగ్యమ్మ ఎలాగైనా మహత్తుగల ఆ తట్టను కాజేసి తన నగలను రెట్టింపు చేసుకోవాలని భావించి ఓ రాత్రి శాంతమ్మ నిద్రిస్తున్న సమయంలో అలాంటి మరో ఈత తట్టను అక్కడ ఉంచి శాంతమ్మ తట్టను తెచ్చుకుని తన బీరువా లో దాచుకుంది. మరునాడు శాంతమ్మ ఇతరులకు ఏమైనా ఎలా ఇవ్వగలదో చూడాలని ఏదో పని ఉన్నదానిలా ఆమె ఇంటికెళ్ళింది.

శాంతమ్మ ప్రతిరోజూ ఉదయాన్నే పెద్ద బాన నిండా రాగి గంజి కాచి పల్లెలోని పిల్లలందరికీ పంచేది. ఆ రోజు ఉదయాన్నే యధా ప్రకారం బాన నింపుకుని బయల్దేరింది.

భాగ్యమ్మ అది చూసి "ఏం వదినా! నీ నిత్య కృత్యం మొదలెట్టావా!" అని పలకరించింది.

"ఔను వదినా! ఆ పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు. వచ్చాక తీరుబాటుగా మాట్లాడతాను. భగవంతుడిచ్చిన శరీరాన్ని ఆయన సృష్టించిన మానవుల సేవకు ఉపయోగించకపోతే జన్మ వృధావుతుంది. వస్తాను. మళ్ళీ మాట్లాడుతాను." అని చెప్పివెళ్ళాక, భాగ్యమ్మకు అనుమానం వచ్చింది. 'శాంతమ్మ ఇంత గంజి ఆ తట్ట మహత్యం లేకుండా ఎలా కాచింది? నన్ను మోసం చేయను అసలు తట్టను మరో చోట దాచిందేమో! ఎందుకైనా మంచిది ఆమె వచ్చే లోగా ఆ తట్ట తెచ్చి ఉంచి, అసలు తట్ట ఎక్కడుందో తెల్సుకుని తీసుకెళ్ళవచ్చు.' అనుకుని, తాను దొంగిలించిన తట్టను తెచ్చి యధాస్థానంలో ఉంచింది.

శాంతమ్మ తిరిగి రాగానే మరలా వచ్చి "ఏం వదినా! గంజి పంచడం ఐపోయిందా! ఓ ముంతెడు గంజి కాస్తావా ఆ బాన నిండను? నీ మహిమ గల తట్ట వలన బానెడు అవుతాయి కదా!" అని అడిగింది.

"లేదు వదినా! నేను అత్యవసరమైనపుడు మాత్రమే ఆ మహత్యం గల తట్టను వాడతాను. ప్రతిరోజూ నేనే రాగులు విసిరి గంజి కాస్తాను. కేవలం ఆపత్కాలంలో ఇతరులకు సాయపడను మాత్రమే దాన్ని ఉపయోగిస్తాను. భగవంతుడు మనకు శక్తి ఇచ్చినపుడు, దాన్ని ఉపయోగించకపోవడం సోమరితనం, దొంగతనం, నేరమూ అవుతాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయను మన శక్తి చాలనపుడు మాత్రమే ఆ మహిమగల తట్ట శక్తిని  ఉపయోగించాలనేది నా మతం." అని చెప్పగానే భాగ్యమ్మకు 'పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లై' నిదానంగా ఆలోచించి శాంతమ్మ మంచి తనానికి ఙ్ఞానోదయమై నిండుమనస్సుతో శాంతమ్మను మెచ్చుకుంది.

మంచి మనస్సుతో పేదలకు అవసరమైన వారికీ సేవచేయడం భగవంతుడు మెచ్చేపని.

Posted in October 2020, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *