రక్షాబంధం
అందమైన అమ్మాయి అధారాలపై
అలవోకగా మెరిసిన చిరునవ్వు -
అది పొరుగింటి ఎలదోటలో
అర విరిసిన గులాబీ పువ్వు !
కనువిందౌ దానిని గాంచి
ఆనందించు ఎదలో నువ్వు.
దరికి రానీకు సుమీ (ఫాల్స్)లవ్వు.!
దారిని కాచి అల్లరి పెడుతూ,
అనరాని మాటల అవమానిస్తూ
అదే లవ్వంటూ ఆరడి చేస్తూ
తప్పించుకు పోడం నీ తరమా!
"ఎవడురా వాడు? ఎవరు ఇలాగ
నా చెల్లిని అవమానించిన వాడు?
ఎలాగ వాడిక ఈ భువిపై బ్రతికేది!"
ఇదే కదా ప్రతి అన్నా పలికే మాట!
కానీ,
ఉండరు కదా అందరికీ అన్నలు!
కావాలి ఇక నువ్వే ఆమె కొక అన్న!
ఆమె కందించాలి నీ అమలిన ప్రేమ,
అండై నిలవాలి ఆపదలొచ్చిన వేళల్లో!
ఇదే కదా శ్రావణ పూర్ణిమ సందేశం,
రాఖీ బంధన మిచ్చే రక్షా కవచం!
ఆడపిల్లల ఆత్మ గౌరవం
ఆదర్శాలకే అలంకారం!
నీ జాతిని భ్రష్టం కానీకు,
ఘన నీతికి వంచన రానీకు!