Menu Close
Kadambam Page Title
రైతు పోరాటం
గవిడి శ్రీనివాస్

ఇన్ని గొంతులు ప్రశ్నిస్తున్నాయంటే
హక్కుల్ని నులిమే
కాళరాత్రులు  రాబోతున్నాయని అర్ధం.

మట్టినే నమ్మే మనిషికి పన్ను
ఆ మనిషిని కూల్చే దళారి కి దన్ను
పంటను ఎగరేసుకుపోయే చట్టాలు
ఉపిరిలూదుతున్నాయి.

ఆసరాగా నిలవాల్సిన
మద్దతు ధరలు అడుగు వేయక
ఇంకా మంటలు రేపుతూనే ఉన్నాయి.

రైతు చితికి పోతున్నాడు
తన పొలంలోనే కూలీ అవుతున్నాడు
పొలం పై స్వతంత్రం కోల్పోతున్నాడు.

ఏమి పండించాలో
ఎవరికి అమ్మాలో
అన్నీ ముందే నిర్ణయించబడతాయి.

కష్టాన్ని ఎత్తుకోవటం తప్పా
ఏదీ నీది గాదు
గొంతు తడారి పోవటం తప్పా
నీ పంటకు స్వేచ్ఛలేదు
పీల్చే గాలికి  స్వేచ్ఛలేదు

రహదారుల వెంట
పోరాటాల నడుమ
బతుకు ఉడికిపోతోంది.

దేశ రైతాంగమంతా
కష్టానికి భరోసా, మనిషికి ఆసరా
జీవితానికి తగిన స్వేచ్ఛ
దోపిడీ లేని రాజ్యం కోసం
పోరాటబాట పడుతున్నాయి.

మరో సూర్యోదయం కోసం
నిరసన జెండాలూపుతూ ..

Posted in February 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!