Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

కుటుంబ వ్యవస్థ నాడు-నేడు

నాడు పెద్దవారిని వృద్ధాప్యంలో తమ దగ్గరే ఉంచుకొని వారి బాగోగులు చూచుకోవడం అనేది పరిపాటి. నేడు పెద్దవారు మాకు మేముగా విడిగా ఉంటాము అనే ధైర్యాన్ని కూడగట్టుకుని సొంతంగా ఒంటరిగా ఉంటున్నారు. బహుశా సమాజంలో వస్తున్నా మార్పులకు అనుగుణంగా అందరి ఆలోచనలు మారుతున్నాయి.

నాడు సమాజంలో ఉన్నాం గనుక సమాజానికి భయపడుతూ కొన్ని జీవన అలవాట్లను ఇష్టం లేకున్ననూ పాటించేవారు. ముఖ్యంగా లింగ వివక్ష చాలా విధిగా పాటిస్తూ కేవలం మగవారు మాత్రమె పూర్తి స్వేచ్ఛను అనుభవించారు. నేడు సమాజంలో వస్తున్నా మార్పులకు వీలుగా మనిషి ఆలోచనలో మార్పు కనపడుతున్నది. ప్రక్కవారు ఏమనుకుంటారో అనే ధోరణి వదిలి తమకు నచ్చినట్లు నివసించాలనే భావన అందరిలో కలుగుతున్నది. శ్రుతి మించనంత వరకు అది నిజంగా శుభ పరిణామము.

పనిచేసేవాడి కన్నా, పర్యవేక్షించే వాడే ఎక్కువ లాభం పొందుతున్నారు. పేరు గడిస్తున్నారు. మానవత్వ విలువలను మరిచిపోతున్నారు. బానిసత్వం తొలగిపోయిందనే భావన కలిగిస్తున్నారు. నిజానికి వ్యవస్థలోనే అది నిక్షిప్తమై ఉంది. ఆలోచన ఒకరిది. ఆచరణ వారి పైవారిది. పేరు వచ్చేది పెద్దవారికి, కష్టపడి ఫలితాన్ని సాధించేది క్రింది వర్గం వారే.

దూరమైన కొలది పెరుగును అని పాత నానుడి. దూరమైన కొలది తరుగును అనురాగం దాని పరిమాణం సాంద్రత అనేది నేటి నానుడి. వాస్తవిక దృక్పథం.

మనిషి ఆలోచనల ఉధృతి సృష్టించే పదాల ఒరవడి కొన్ని సమయాలలో అర్థాలను మార్చి అవతలి వారికి చెడు సంకేతాలను వెలువరిస్తుంది. ఆ తరుణంలో మన మాటలు ఎదుటివారికి ఒక అపోహను సృష్టించే ప్రమాదముంది. అటువంటి పరిస్థితి కలిగినప్పుడు మౌనంగా ప్రక్కకు తప్పుకొని మరల మాటలు కలిపితే అది సామరస్య వాతావరణం కలిగించే ఆస్కారం ఉంది. మానవ బంధ అనుబంధాలు అన్నీ ఒక సున్నితమైన ఆత్మాభిమానం అనే పొరతో ముడివడి చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు ఆ పొరకు చిల్లుపడి ఆత్మీయుల మధ్యన అనవసరమైన బేధాభిప్రాయాలు వచ్చేందుకు అవకాశం ఉంది. అటువంటి సమయంలో ‘మౌనమే’ అన్ని సున్నిత మనస్పర్ధలు సమసిపోయే సరైన మందు అవుతుంది.

నిజ జీవితంలో సమతుల్యం తో అలవరుచుకున్న ఆహారపు అలవాట్లు, తద్వారా లభించిన ఆరోగ్యకర, ఆనందకర జీవన యానం సాఫీగా సాగుతున్నప్పుడు ఏదో అవుతుందనే అపోహతో కూడిన భయంతో, మనలో చెలరేగే అనవసరమైన సంఘర్షణల వలన మానసిక వత్తిడులకు లోనౌతూ మనకు సరిపోని అలవాట్లను ఎవరో చెప్పారని గుడ్డిగా పాటిస్తూ వెళితే ఫలితాలు అంతా గందరగోళంగా కనిపిస్తాయి. కనుక ఉన్న ప్రశాంతత ను వదిలి వేరే విధంగా ప్రశాంతతను పొందాలనే తపన ఎందుకో మనలను మనమే ప్రశ్నించుకోవలసిన తరుణం ప్రస్తుత కాలంలో ఏర్పడుతున్నది. అందుకు మరో కారణం అరచేతిలో ఇమిడిపోయే చిన్ని ఫోన్ ద్వారా అన్ని రకాలైన సమాచారం అత్యంత సులభతరంగా లభించడమే మనలో లేనిపోని సందిగ్ద స్థితిని కల్పిస్తున్నది.

మనిషి యొక్క జీవన వాహినిలో ఆరోగ్యకర ఆహారం అనేది అత్యంత ముఖ్యమైనది. మనం పెరిగిన భౌగోళిక, నైసర్గిక స్వరూపాల ఆధారంగా మన జీవన ఆహారపు అలవాట్లు ఏర్పడుతాయి. మన శరీరంలోని కణజాలాలు కూడా తదనుగుణంగానే మార్పులు చెంది మన జీవనక్రియ సరిగా సాగేందుకు దోహదపతాయి. ఈ పదార్ధం పూర్తిగా ఆరోగ్యకరము కనుక ఆ పదార్థాన్నే భుజించాలి అనే నియమం ఏమీ లేదు. ఈ సృష్టిలో ఏ ఒక్క పదార్ధం కూడా అన్ని పోషకాలను కలిగి ఉండదు. అది పూర్తిగా శాస్త్రీయ బద్ధమైన సృష్టి విరుద్ధ చర్య. ఎందుకంటే ఈ సకల చరాచర విశ్వంలో అన్ని విషయాలు, పదార్థాలు, స్వభావాలు అన్నీ కూడా ఒక సమతుల్యమైన సిద్ధాంత ధోరణిలో సృష్టించ బడడం జరిగింది. ముఖ్యంగా మానవాళికి జీవన విధాన క్రమం మరింత క్రమపద్ధతిలో కొనసాగుతుంది. మన దైనందిన ప్రక్రియలకు సరైన ఇంధనాన్ని అందించవలసిన బాధ్యత మనదే అవుతుంది. సరైన పోషకాలు అందించే ఏ పదార్థాన్ని అయిన క్రమ పద్దతిలో, సరైన పాళ్ళలో తీసుకుంటూ, అవసరమైన వ్యాయామం చేసుకుంటూ, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను, మన శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ, మనమే మన ఆనందానికి కారణమవుతూ, మన చుట్టూ కూడా చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి, మనం చేస్తున్న మంచి కార్యాలను స్థిరచిత్తంతో ఆచరిస్తూ, మన ఉనికికి ఒక సార్థకత కల్పించిన నాడు, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in December 2023, ఆరోగ్యం

3 Comments

  1. వెన్నెలకంటి సుబ్బు నారాయణ

    నిజం మధూ, చాలా మంది పెద్దవారు విడిగా ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. కారణాలు అనేకం. నీవు వ్రాసినట్లు దూరమైన కొలదీ ఆప్యాయతలు, అనురాగాలు పెరగకుండా తగ్గిపోతున్నాయి. చక్కగా వివరించావు.

    • Sirimalle

      మీ అశీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలు – మధు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!