నాడు-నేడు
నాడు తండ్రి అంటే ఒక గౌరవం, ఒక దిక్సూచి, ఒక కుటుంబ పెద్ద.
నేడు తండ్రి అంటే ఒక మంచి స్నేహితుడు, ప్రేమికుడు అందరి ఆలోచనలకు విలువనిచ్చి గౌరవించే వాడు.
నాడు, మనసు స్థిరంగా ఉండి శారీరక ధారుడ్యం కలిగి ఆర్ధిక స్థితిగతులు అంత గొప్పగా లేకున్ననూ మనిషి సామాజిక బంధ బలంతో బ్రతికినంత కాలం ప్రశాంతంగా జీవిస్తూ ఆరోగ్యంగా ధైర్యంగా ఉండేవారు. ఈ వైద్య విజ్ఞాన పోకడలు నాడు లేనందున ఎక్కువ శాస్త్రీయ వైద్య పరిజ్ఞానం కూడా తెలియలేదు. ఒక విధంగా అది మంచిదే అయ్యింది. అట్లని విధివిధానాలు, రోగ నిర్ధారణ పద్దతులు లేవని కాదు. ఎందుకంటే పతంజలి మొదలు ఎంతోమంది వైద్య శిఖామణులు అత్యంత చక్కగా అన్ని విశ్లేషణలు ఇచ్చేశారు. వేదాలలో మన మెదడు ఎలా పనిచేస్తుంది అని కూడా చక్కగా చెప్పడం జరిగింది.
నేడు, మనసుకు, భౌతిక దేహానికి మధ్యన ఉన్న ఆ సన్నని పొరను భయం అనే మసితో మూసివేయడం జరుగుతున్నది. ఈ సమాజ వ్యాపార ధోరణి అందుకు కారణం. ఆధునిక వైద్య ఆవిష్కరణలు మనలో భయానికి బదులు భరోసా కలిగించాలి. అది జరిగితే సమాజం బాగుపడుతుంది కానీ సంస్థలు బాగుపడవు (corporate). కనుకనే మానసిక ధైర్యాన్ని కోల్పోయిన బలహీనులు అన్నివిధాలా ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బు సమృద్ధిగా ఉన్నప్పుడు భయం కూడా సమృద్ధిగా సమకూర్చుకుంటున్నారు.
నాడు దైనందిన జీవన అవసరాలు శారీరక కష్టం తోనే తీరేవి. తినే పదార్థాల విషయంలో కూడా సనాతన పద్దతులతో సహజ వనరుల పోషకాలను కలిగి, శరీరానికి కావలిసిన పౌష్టికాహారం లభించేది. సరైన వ్యాయామం కూడా ఉన్నందున ఒక విధమైన మనోధైర్యం కూడా ఉండేది.
నేడు జీవన అవసరాలు అన్నీ సులభంగా శరీరాన్ని కష్టపెట్టకుండా యంత్రాలతో వీలౌతున్నది. మరి శరీరానికి కావలిసిన వ్యాయామం ఉండటం లేదు. అదేమంటే రోజూ వాకింగ్ చేస్తున్నాము అంటున్నారు అదే కాదు అన్ని కీళ్ళు సరిగ్గా పనిచేయాలంటే ఆయిలింగ్ అవసరమైనట్లే, కండరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే వివిధ రకాలైన పనులను నిత్యం చేస్తూనే ఉండాలి. వాకింగ్ చేసేశాను అని సోఫాలో కూర్చుని తింటూ ఉంటె శరీరానికి కావలిసిన వ్యాయామం అందదు. కానీ నేడు జరుగుతున్నది అదే. అదే విధంగా తీసుకునే ఆహార విషయంలో కూడా కృత్రిమ అందాలతో కూడిన పోషకాలు చోటుచేసుకున్న విధానాలకు అందరూ ఆకర్షితులయ్యారు. మన శరీరం అందిస్తున్న సంకేతాలను జాగురూకతతో గమనించి తదనుగుణంగా మన దైనందిన జీవన యానం సాగాలి. ముఖ్యంగా ఆహార నియమాలను సమతుల్యంతో పాటించాలి. మనలను సదా పరిరక్షిస్తున్న ఇంద్రియాలకు, అవయవాలకు వాటి సామర్ధ్యాలను గుర్తెరిగి తదనుగుణంగా కనీస ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది.
మానసిక ప్రశాంతతకు మించిన మందు లేదు. అది సహజ సిద్ధమైన ఉపశమనం మరియు రోగనిరోధక మంత్రం. మరి అది ఎలా లభిస్తుంది?
౧. మంచి కుటుంబం కలిగి సరైన అవగాహనతో ఒకరినొకరు అర్థం చేసుకొని పారదర్శకంగా ప్రవర్తిస్తే అనవసరమైన మనస్ఫర్థలు తొలగి సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.
౨. చక్కటి సమతుల్య ఆహారాన్ని భుజించడం అత్యంత ముఖ్యం.
౩. నిత్య శారీరక వ్యాయామం ఎంతో అవసరం. మన పని మనం చేసుకోవడం నామోషి అనే భావన రాకూడదు. అవసరమైతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ పనులను పంచుకొని బాధ్యతతో నిర్వర్తించాలి.
౪. మన గురించే కాక మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తూ సంఘం కొరకు ఏవైనా సేవాభావ పనులను చేపట్టాలి.
౫. అన్నింటికన్నా ముఖ్యమైనది వీలైనంత వరకు మానసిక వత్తిడిని తగ్గించుకోవాలి. అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ జీవన అభివృద్ధి కొరకు మనలో కలిగే ఆలోచనలను మన సామర్ధ్యం మేర కుదించుకొని ఆచరణలో చూపించాలి.
పై అయిదు సూత్రాలను మనందరం పాటిస్తున్నవే అయినప్పటికీ అప్పుడప్పుడు మనకు తెలియకుండానే ప్రశాంతత ను కోల్పోతుంటాము. ఆ బలహీనతను జయించిన రోజు మనలో ఎన్నడూలేని ధైర్యం కలిగి అదే మనలను సరైన ఆలోచనల పథంలో నడిపిస్తుంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’
ప్రస్తుతం పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల అందరూ కలసి భోజనం చెయ్యటం కుదరటంలేదు. పైగా చాల కుటుంబాల్లో అందరూ కలసి భోజనం చేసే అలవాటు లేదు. కనుక కనీసం ప్రతి కుటుంబంలో రాత్రిపూట అందరూ కలసి భోజనమే, పలహారమో కలసి తినండి. దీని వలన అందరి మధ్య ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో హిందువుల కొంపల్లో అప్యాయత అనురాగాలూ కరువైపోయాయి