Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మనిషి జీవితం, కాలమనే ప్రవాహంలో ముందుకు మాత్రమె సాగుతున్న ఒక చిన్న పడవ వంటిది. పడవ అని ఎందుకు అంటున్నానంటే ఈ విశ్వాంతరాళంలో మానవుని ఆయుఃప్రమాణం అత్యంత సూక్షమైనది. ఆ పడవ అనే జీవనస్రవంతి లో కష్టాలనే సుడిగుండాలు, సహజ మానసిక ఉల్లాసాన్నందించే సుఖమయ ప్రామాణిక అంశాలు ఇలా ఎన్నో ఉంటాయి. ఆ సుడిగుండాలని తట్టుకుని పడవను సవ్యమైన దిశలో నడిపిన కాలంలో మన కోరికల ఉధృతిని తట్టుకుని మనసును నియంత్రించుకుంటూ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా నిదానంగా ప్రవాహ వేగంతో ప్రమేయం లేకుండా మన ప్రయాణం సాగిన రోజు మన జీవితంలో ఎన్నో మధురానుభూతులు మిగులుతాయి. అవే మనతో చివరివరకు ప్రయాణిస్తాయి. ఒక్కో మజిలీని దాటుకుంటూ వెళుతుంటే మరలా వెనుకకు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. అందుకే అంటారు ‘ఏ వయసులో ఉండవలసిన ముచ్చట ఆ వయసులో ఉండాలి’ అని. మన జీవన పరమార్థం సవ్యంగా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా ప్రయాణిస్తూ సార్థకతను చేకూర్చుకొంటే అది మనకు ఎన్నో విలువకట్టలేని సంపదలను, మానసిక ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ సంపదలు అంటే ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత. అందుకొరకు పదవీవిరమణ వయసు వరకు వేచి ఉండనవసరం లేదు. ఎందుకంటే మొదటి మజిలీలో పొందవలసిన అనుభూతులను చివరి మజిలీలో పొందలేము అలాగని మరలా వెనుకకు ప్రయాణించలేము.

బస్తాలో ఎన్ని గింజలు పడతాయో అన్ని మాత్రమే నింపాలి. ఎక్కువ వేస్తే అవి ఒలికిపోయి మొత్తం ఖాళీ అవుతుంది. అలాగే మన సామర్ధ్యం, పరిజ్ఞానం ఏపాటిదో తెలుసుకుని వాటిని మరింత పదును పెట్టుకునే ఆలోచనలతో కృషి చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాము. అలా కాకుండా నేను ఏ పనైనా చేయగలను అనుకుంటే చేయవచ్చు కానీ దానికి ఉన్న పరిమితుల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి, అందుకు మానసికంగా ఏర్పడే ఒత్తడిని తట్టుకునే సంకల్పంతో స్థిరంగా ఉండాలి. అప్పుడే అది సాధ్యమౌతుంది. ఆ సంకల్ప స్థిరత్వం కొరవడినప్పుడు జరిగే అనర్ధాలు తద్వారా ఏర్పడే మానసిక అశాంతి అనన్యము. అదే చివరకు మన ఆరోగ్య సమస్యలకు మూలహేతువు అవుతుంది.

మనం ఎందుకు సామాజిక సేవ చేయాలి అనే ప్రశ్న ఈ మధ్యనే నా స్నేహితుడు ఒకరు అడిగారు. మన గురించి ఆలోచించుకుని మన సౌఖ్యాలను పదిలపరుచుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక ఇతరుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ అని అన్నారు. అదే విధమైన ఆలోచనల పరిధిలోనే మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఉంటూనే ఉంటాము. ఎందుకంటే తనను మించిన ధర్మం వేరొకటి ఉండదు కనుక. అయితే మనందరం ఒక్క విషయం మరిచిపోతున్నాము. ఏదైనా ఒక పని మనకు ఆనందాన్ని అందించినప్పుడు ఆ మానసిక ఉత్తేజాన్ని ఇతరులతో పంచుకోవడానికి కుతూహల పడటం అనేది ఎవరికైనా సహజం. మరి అదే ఆనందాన్ని అవతలి వారు కూడా స్వీయ అనుభవంతో పొందగలిగేందుకు మనం చేయూతనందిస్తే తద్వారా వారు కూడా ఆ మానసిక అనుభూతిని పొంది మనకు కృతజ్ఞతలు తెలిపితే ఆ ప్రక్రియలో మనకు కలిగే ఆత్మసంతృప్తి విలువ కట్టలేనిది. అదే మనలను మానసిక దృఢత్వంలో మనగలిగేటట్లు చేస్తుంది. ఆ స్థిరత్వమే మనలో చక్కటి ఆలోచనలను పెంచి మన శరీరాన్ని దృఢత్వంగా ఉంచుతుంది. మనలోని రోగనిరోధక సాంద్రత పెంపుకు కృషి చేస్తుంది.

ప్రతి మనిషి తన యుక్తవయస్సులో చేయగలిగిన శారీరక శ్రమ తన ముది వయసులో చేయలేరు. కానీ మన మానసిక పరిణత స్వీయ అనుభవంతో కలిసి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుకనే భౌతిక, మానసిక పనులు రెండిటినీ నేర్పుతో, ఓర్పుతో అన్ని వయసులల్లోనూ చేయగలుగుతాము. ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న ఎన్నో సహజవనరుల సంపదను చక్కగా వినియోగించుకుంటూ, సామాజిక బాధ్యతతో మన కర్తవ్యాలను నిర్వర్తించిన నాడు మన ఎదుగుదల, మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎంతో అభివృద్ధిని సంతరించుకుంటుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in June 2022, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!