ఆ తొలి చూపే తొలకరి.
ఎన్నో భావాలకు ఊపిరి.
చిగురులు తొడిగిన పరిచయం
ఆశను మోసిన పెనుబంధం.
పచ్చని మనసుతో
కలివిడికి ప్రాణంపోసిన
మధురమైన మాటతనమే
కలిమిదనం...
చెలిమిదనం..
ప్రేమదనం...
మనసంతా అల్లుకున్న
ఆకుపచ్చని ఆనందమే
ఒక అందమైన ఆత్మీయానుభవం.
అనిర్వచనీయమైన అనుభూతి.
పాదు చేయని
నీళ్ళు పోయని
కంచె వేయని
ఓ "నవ్వుల చెట్టు"
మనసు నడి బొడ్డులో పడిమొలిచినా
నిత్యం గంపెడు నవ్వుల్ని
విరగ్గాయడం విచిత్రం....
నవ్వులు పూచి,
ఆనందాన్ని కాసి,
అందాన్ని రుచిచూపి,
హృదయమంతా రాలి,
నీడతో పాటు తోడునందించిన సాంగత్యం పరమపదం.
మనిషి అలికిడికి
మనసు స్పర్శకు
మాట తేమకు
పాలనవ్వుల పలకరింపు
తీగలా పాకుతూ
సన్నగా తాకుతూ
రాలే మంచు బిందువుల్లా
అడుగులు రకరకాలుగా మొలకెత్తి
రంగురంగులుగా విస్తరించి
జింక పరుగుళ్లుతో
మనిషి చుట్టేసుకొని తిరుగుతూ..
నది పరవళ్లతో
మనసంతా కలయ తిరుగాడుతూ
చురకలతో...చిటికలతో...
చిలిపి హాస్యాన్ని
చిరు రహాస్యంలా దాచి ఏడ్పించినట్లు
గుప్పటను తెరచి నవ్వించినట్లు
చిందులు వేస్తూ...విందులు చేస్తూ
ముఖంపై చిలకరిస్తూ...
వయసు కనిపించని
మనసు ముచ్చట విస్మయం.
మనుషుల మధ్య
మనసుల మధ్య
అసంతృప్తి, అశాంతి, అసహనాలని
మాయం చేసే ఓ మందును
నవ్వు రూపంలో
దేవుడు నింపిన ఆ ముఖం
ఉద్దీపం...
ఉల్లాసం...
ఉదాత్తం....
అడిగి అడకగానే
చెప్పి చెప్పకనే
దగ్గరుగా వచ్చే మానవత
ముఖంలో నేరుగా దూరి
మనసును తట్టి మరీ ఓదార్చి
సమస్యలకు
మంచితనంతో పరిష్కారాన్ని
చూపడం..చెప్పడం
దేవుడిచ్చిన వరం.
తీయని మాటతో తేలికగా కలిసిపోవడం
కష్టాలను , ఇష్టాలను మనసులో మౌనంగా భరించే అభిమానం.
అసమాన లక్షణం.
దగ్గరితనాన్ని చూపే ఆదరణ
ఆదరణలో ఆణిగిమణిగి ఉన్న వినయం
మనసుకు అలంకారాలు.
ఆత్మీయులను సాధించిపెట్టిన అదృష్టాలు.
అందుకే
ఆమె పేరు వెంటే
మనసు ఉరకలు వేస్తుంది.
ఆమె నడిచి వస్తుంటే
మమత స్వాగతం పలుకుతుంది.
ఆమె గొంతు సవ్వడిలో
చెవులు జలకాలాడతాయి.
ఆమె నవ్వుకు
బాధలో తలలువంచి సలాం చేస్తాయి.
ఆమె ఎక్కడున్నా ఓ పండుగే
ఆమె గలగలలు ఓ తిరుణాలే
ఆమెను కలసిన క్షణం ఓ తీపి జ్ఞాపకం
ఆమె గడిపితే ఓ మధురయాత్ర.
ఆమె చుట్టూ ఉన్న మనుషులకు
ఆనందాల పందిరి.
ఆమెను చుట్టేసిన మనసులకు
జీవితమంతా సందడి.
ఆమె మనిషిగా భంధం.
ఆమె మనసుగా గంధం
ఆమెకు ఇష్టంగా మారటం
ఆమెలో నిజమై మెలగడం
అందం.....ఆనందం...అదృష్టం...
దేవుడు వ్రాసిన వ్రాతలో
ఓ పదమై
ఆమె పాదాలను తాకడం ఓ వరం....
ఈ జన్మకు...మరు జన్మకు కూడా.