Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మనుధర్మ శాస్త్రంలో మన శరీరంలోని ఇంద్రియాల గురించిన వివరణ ఉంది. మొత్తం పదకొండు ఇంద్రియాలు మనలను అన్ని విధాల సౌఖ్యంగా ఉండేటట్లు చేస్తున్నాయి. అవి వరుసగా –

శ్రోత్రింద్రియం (చెవి), త్వగింద్రియం (చర్మం), చాక్షుసేంద్రియం (కన్ను), రసనేంద్రియం (నాలుక), ఘ్రాణేంద్రియం (నాసికా - ముక్కు) - ఈ ఐదూ జ్ఞానేంద్రియాలు.

మలద్వారము, స్త్రీ / పురుష మర్మావయవము, కాలు, చేయి, వాక్కు - ఈ ఐదింటినీ పంచ కర్మేంద్రియములు అంటారు.

మనస్సు పదకొండవ ఇంద్రియం. ఇది జ్ఞానేంద్రియాలనూ, కర్మేంద్రియాలనూ అదుపు చేస్తుంది. మనస్సును అదుపులో ఉంచుకున్న వ్యక్తి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నట్టే. అందుకే ఇంద్రియ నిగ్రహంతో పాటు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం ఎంతో అవసరం.

అలాగే మన శరీరంలో లోపల అన్ని చర్యలను, ప్రక్రియలను నిర్వర్తిస్తూ, నియంత్రిస్తూ ఉండే అవయవాల ప్రాధాన్యం కూడా ఎంతో ఉంది. ప్రతి అవయము వివిధ రకములైన కణజాల సముదాయ మిళితమై ఆ కణజాలాలు తమలో తాము సమన్వయించుకొని మన శరీరంలోని అతి ముఖ్యమైన పనులను నిర్వర్తించడంలో ఎంతగానో తోడ్పడతాయి. అందుకే ఇంద్రియాలతో పాటు లోపల ఉండే అవయవాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది.

ఇక మన శరీరం లోపల ఉన్న అవయవాల గురించి చెప్పాలంటే;

చర్మం: మన దేహాన్ని వేడి నుండి చలి నుండి కాపాడుతూ మన శరీరంలోని ఉష్ణోగ్రత ను నియంత్రిస్తూ ఉన్న చర్మం అటు అవయంగా ఇటు ఇంద్రియంగా కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నది. శరీరానికి కావలిసిన ఆక్సిజన్ ను కూడా కొంత అందిస్తుంది. అందుకే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకొని చర్మ రంధ్రాలు మలినంతో మూసుకుపోకుండా చూసుకోవాలి. అంటే నిత్యం స్నానం చేస్తుండాలి.

మెదడు: మన శరీరంలోని అవయవాలకు రాజు వంటిది. ప్రధానమైనది. ఇది మన ఆలోచనలకు, జ్ఞాపకశక్తికి, మిగిలిన అవయవాలను నియంత్రించే అన్నీ సక్రమంగా పనిచేసేటట్లు చేస్తూ పర్యవేక్షించే ప్రధాన కేంద్రం. అందుకే మెదడులోని నాడీవ్యవస్థ ప్రధాన కేంద్రం ఎంతో పటిష్టంగా, సమర్ధవంతంగా  పనిచేస్తూ ఉండాలి. అందుకు కావలిసిన ఆక్సిజన్ నిరంతరం సరఫరా అవుతుండాలి. మన మెదడుకు 30 నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే కోమాలోకి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గుండె: మన శరీరం మొత్తం మంచి రక్తం నిరంతరం సరఫరా చేసే యంత్రం. గుండె చప్పుడు ఆగితే మనిషికి మనుగడ లేదు. మన నాడీవ్యవస్థ నిరంతరం ఉత్తేజంగా ఉండాలంటే గుండె యొక్క పాత్ర ఎంతోవుంది.

ఊపిరితిత్తులు: మన శరీరానికి కావలిసిన ఆక్సిజన్ ను గాలి నుండి వేరుచేసే అతి ముఖ్య యంత్రం.

జీర్ణకోశం: మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలిసిన శక్తి ని అందిస్తుంది.

ప్రేగులు: మనం తిన్న ఆహారంలోని పోషకాలను శరీరానికి నిరంతరంగా అందిస్తూ జీర్ణకోశానికి సహాయకారిగా ఉండేవి. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు రెండూ వివిధ రకములైన పనులను చేస్తాయి.

కాలేయము: మన రక్తంలోని విషపదార్ధాలను వడపోసి వేరుచేసే యంత్రం.

మూత్రపిండాలు: మన రక్తంలోని చెడు ద్రవాలను మూత్రంగా మార్చే యంత్రం.

మనిషి రక్తం గురించి చెప్పాలంటే ఒక వ్యాసమే వ్రాయవచ్చు. రక్తహీనత ఎట్టి పరిస్తితిలోనూ మంచిది కాదు. అందుకే రక్తదానానికి మించిని శ్రేష్ఠమైన సేవ మరొకటి ఉండదు. దైనందిన జీవన విధానంలో మనకు ఎన్నో విధమైన వత్తిడులు, ఆలోచనలు మనకు రక్తపోటును కలిగించే ఆస్కారం ఉంది. మనుషులం కనుక మానసిక ఒడిదుడుకులు అత్యంత సహజం. అయితే మన ఆలోచనా విధానంతో, అనుభవంతో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రక్తపోటును నివారించేందుకు ఆస్కారం ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరానికి సంబంధించిన ప్రతి ఇంద్రియము, అవయము తమ వంతు కర్తవ్యాలను ఎంతో నిబద్ధతతో, క్రమం తప్పక నిర్విరామంగా నిర్వర్తిస్తూ ఉంటాయి. శరీరంలోని ప్రతి అణువూ, భాగము ఎంతో విలువైనది, ముఖ్యమైనది. కొత్త కారు కొని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ దానికి కావలిసిన సర్వీసులు సక్రమంగా చేయిస్తున్నట్లే మన శరీరం యొక్క ఇంద్రియాల మరియు అవయవాల ఆలనాపాలనా చూసుకోవలసిన బాధ్యత మనదే అవుతుంది. క్షణిక సుఖాలను అందించే అలవాట్లకు అలవాటుపడి, అదుపుతప్పి ఆ అవయావాల మీద వత్తిడి పెంచి పనిచేయిస్తే అవి చెడిపోవడం లేక సామర్ధ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అసలు మానవ శరీర నిర్మాణమే ఒక అద్భుతం. మరి అంతటి అద్భుతమైన శరీరాన్ని కలిగి మనుషులమైన మనము, కొంచెం జాగ్రత్తతో ఉండవలసిన అవసరం, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకు మనకు సహాయకారిగా ఉండేది ‘రోగ నిరోధక సాంద్రత’. మరి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా!

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in November 2020, ఆరోగ్యం

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *