Menu Close
Page Title

'ఆంధ్ర మహిళ ' సంక్షేమ సారథి- దుర్గాబాయి దేశముఖ్

Durgabhai Deshmukhగత శతాబ్దం ఆరంభంలో స్త్రీల పరిస్థితి, సంఘ సంస్కర్తలు మరియు గ్రంథ కర్తలు అయిన  కందుకూరి వీరేశలింగంగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, గురజాడ అప్పారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా అనేకమంది వారి వారి రచనల ద్వారా వివరించినట్లు చాలా దయనీయంగా ఉండేది. వివాహం, దాని బాధ్యతలు, పరిధులు, కట్టుబాట్లు, పూర్తిగా అవగాహన చేసుకోలేని పిన్నవయస్సులోనే పిల్ల తల్లితండ్రులు తమ ఆర్ధిక దుస్థితి వల్లనో, వయస్సు దాటితే పిల్లలకు పెళ్ళికాదేమోనన్న సంఘపు దెప్పిపొడుపుల భయంతోనో, కన్యాశుల్కం తీసుకుని, వరుని వయస్సుతో నిమిత్తంలేకుండా కూతుళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టి పెళ్లిళ్లు జరిపించేవారు. ఆమెకు వయస్సు వచ్చి సాంఘిక కట్టుబాట్లు అవగాహన చేసుకునే సమయానికి వయసుమీరిన భర్త గతించడమో, రోగపీడితుడై మంచాన్ని ఆశ్రయించడమో జరిగి ఏమీ చెయ్యలేని స్థితిలో ఎటువంటి సౌఖ్యాన్ని చవిచుడలేని విధిని దూషిస్తూ దగ్గర బంధువులవద్ద గాని, ఆశ్రయం ఇచ్చినవారి వద్ద వంటమనిషిగా వాళ్ళ సంసారాలకి తోడు నీడగా ఉంటూ మిగిలి రోజులు వెళ్ళబుచ్చడం జరిగేది, ఎటువంటి సుఖాలకి నోచుకోని ఆ దుఃఖితులు మిగిలిన జీవితాన్ని తిట్టుకుంటూ, విపరీత మానసిక స్థితిలో కొట్టుమిట్టాడుతూ తమ బంధువర్గానికే గాక సమాజానికీ తలనొప్పిగా మిగిలేవారు. భర్త కొంచం వయసుమీరిన వాడైతే ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తరువాత గతిస్తే ఏ చదువు లేని ఆమె తన పిల్లలతో సహా మరో కుటుంబానికి బరువుగా మిగిలేది. దీనికి పరిష్కారంగా కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు తమవంతు గట్టి ప్రయత్నంతో సామాజిక స్పృహ కలిగించి, సాంఘిక దృక్పధంలో కొన్ని మార్పులు తేగలిగినా అవి సమాజంలో ఆశించిన ప్రగతిని చూపించక లేకపోయాయి.  ఆ పరిస్థితిలో దుర్గాబాయి గారు ఒక బాధితురాలిగా తనకు ఎనిమిదవ ఏట మేనమావతో (గుమ్మడిదల సుబ్బారావు గారితో) జరిగిన బాల్యవివాహాన్ని ఎదురించి, తల్లి, అన్నల సహాయంతో ఆయనకు వేరొక యుక్త వయస్సురాలైన తిమ్మాయమ్మ గారితో  వివాహం జరిపించి, పిన్నవయస్సులోనే ఆదర్శ మూర్తిగా, ఆచరణాత్మక సంఘ సంస్కర్తగా నిలిచింది.

Durgabhai Deshmukh15 జూలై 1905 లో రాజమహేంద్రవరంలో శ్రీ బెన్నూరి రామారావు, కృష్ణవేణమ్మలకు జన్మించిన దుర్గాబాయమ్మ సామాన్య స్కూల్ చదువులు లేనిదైనా స్వయంకృషితో హిందీ నేర్చుకొని, 'బాలిక హిందీ పాఠశాల' అనే బోధనా సంస్థ పేరుతో అన్ని వయస్సుల వారికి హిందీ నేర్పి, ఆ సంపాదనతో మెట్రిక్; బి ఏ, తరువాత క్రమంగా 1930 లో ఎం ఏ (పొలిటికల్ సైన్స్) ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. 1942 లో న్యాయ శాస్త్రంలో మదరాసు విశ్వవిద్యాలయం నుంచి పట్టా పుచ్చుకుని మద్రాసు హైకోర్ట్ లో సాధన ప్రారంభించారు. క్రిమినల్ లాయరు గా చాలా ప్రఖ్యాతి గాంచారు.

తన చిన్నవయసులో తీవ్రతరం దాల్చిన స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితురాలై, 12 వ ఏటనే గాంధీగారి స్వాతంత్ర సమర బాటనే నడచి ఆయన హిందీ ఉపన్యాసాలని తెలుగులోకి అనువదించారు. ఒకసారి స్వాతంత్రోద్యమానికి విరాళంగా తన ఒంటిమీది బంగారమంతా ఇచ్చి పిన్న వయస్సులోనే దేశభక్తి ని ప్రకటించి శభాషనిపించుకున్నారు. 1923 లో యవనేతగా కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో నెహ్రూగారినే టిక్కెట్లేదని అడ్డగించి కర్తవ్యనిర్వహణ లో నిజాయతి నిరూపించుకుని అధినేతల మెప్పుని పొందారు. గాంధీ గారి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని నిర్బంధింపబడి అనేక సార్లు జైలు పాలైనారు. 1937 లో 'లిటిల్ లేడీస్ అఫ్ బృందావన్' అనే బాలల సంఘాన్ని స్థాపించారు. సమాజంలో మూర్ఖఆచార పీడితులైన అసహాయ స్త్రీల సేవ నిమిత్తం "ఆంధ్ర మహిళ” అనే సంస్థని మదరాసులో ప్రారంభించారు. 1941 లో 'ఆంధ్ర మహిళ' సంస్కరణల ఉద్దేశ్యాలు, ప్రయత్నాలు, వాటి ఫలితాలు వివరిస్తూ 'ఆంధ్ర మహిళ' అనే పత్రికని తన స్వీయ సంపాదకత్వంలో ప్రారంభిచారు. 1958 లో "ఆంధ్ర మహిళాసభ" పేరుతోనే హైద్రాబాదులో కూడా ఒక సంస్థని ప్ర్రారంభించారు. స్రీలకై రెండు హాస్పిటల్స్, మూడు ఉన్నత పాఠశాలలు, రెండు మహిళా కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్ హోమ్ లు; మూగ బధిర బాధితులు, మానసిక వికలాంగులకు వృత్తి విద్యా కేంద్రాలు నిర్మించి స్త్రీ సమాజ సంక్షేమానికి అసమాన సేవ చేశారు. అవి అన్నీ నేటికీ అశేష పీడిత స్త్రీ జనాలకి ఆధార కేంద్రాలుగా నిలిచి వాళ్ళను తమ కాళ్ళ పై నిలబడగలిగే స్థాయికి చేర్చుతున్నాయి.

Durgabhai Deshmukhదేశ స్వాతంత్రం అనంతరం1946 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యురాలిగా పనిచేసి రాజ్యాంగము వ్రాయడంలో స్త్రీ గా, న్యాయవాదిగా తనవంతు తోడ్పడ్డారు. 1952 లో 'ప్లానింగ్ కమిషన్' సభ్యురాలిగా దేశ దిశానిర్దేశానికి తనవంతు సేవచేసి నవభారత నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆమె 'బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్' కి అధ్యక్షురాలిగా కూడా చాలాకాలం సేవలందించారు. దుర్గాబాయి చేసిన వికలాంగుల ఉద్ధరణ,  స్త్రీజన సేవకు భారత ప్రభుత్వం గుర్తింపుగా 'పద్మవిభూషణ్' బిరుదు ప్రదానం చేసినది. ఈనాటి భారత దేశ పురోభివృద్ధికి ఆమెతో బాటు అనేకుల దూరదృష్టి, ప్రణాళిక రచనా నైపుణ్యం కారణాలని నిస్సందేహముగా చెప్పవచ్చు. ఆమె ఉన్నత ప్రగతి శీలత, కఠిన నిర్ణయాలు తీసుకుని ఆచరించ గల సామర్ధ్యం ఆమెను  ప్రజల్లోనూ, అప్పటి నాయకశ్రేణిలోనూ ఉన్నత రాజకీయ నాయకురాలిగా గుర్తింపు తెచ్చాయి. ఆ గుణాలే దేశ ప్రధమ ఆర్ధిక మంత్రి, మొట్టమొదటి మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్, సంస్కృత కవి అయిన చింతామన్ ద్వారకానాథ్ దేశముఖ్ ని ఆమె వైపు ఆకర్షితుణ్ణి చేశాయి. అంతకుముందే భార్యావిహితుడై మొదటి భార్యకు కలిగిన కూతుర్ని బంధు జనాల దోపిడీ, తాకిడుల నుంచి రక్షించి పెంచి ఆమెను ప్రగతి మార్గంవైపు నడిపించ గలిగే సామర్ధ్యం గల వనిత దుర్గాబాయేనని నిశ్చయించుకున్న చింతామన్ దేశముఖ్ దుర్గాబాయిని వివాహానికి కోరగా, ఆమె ఒప్పుకున్నదట. వారి వివాహం 1953 లో పండిత జవహరలాల్ నెహ్రూ సమక్షంలో జరిగింది. ఆమె తెలుగు వనిత అయి ఉండి కూడా మరాఠీ బంధువర్గ తాకిడికి ఎదురు నిలబడి అయన ఆశలు ఫలింపచేయడంలో కృతకృత్యురాలైనదట.

ఆమె 1958 లో స్థాపించిన 'నేషనల్ కౌన్సిల్ ఆన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్' కు ప్రధమ అధ్యక్షురాలిగా స్త్రీల విద్యావిధానంలో చాలా మార్పులు తెచ్చారు. ఆమె సేవకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, తమ విశ్వవిద్యాలయం లోని 'డిపార్ట్మెంట్ ఫర్ విమెన్'స్ స్టడీస్' ని "డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ విమెన్'స్ స్టడీస్” గా మార్చినది. ఇది నిజంగా ఆమెకు దక్కిన అరుదైన గౌరవం. దుర్గాబాయి గారు 1962 లో దుర్గాబాయ్ దేశముఖ్ హాస్పిటల్ ప్రారంభిచారు.

దుర్గాబాయి గారి వ్యకిత్వపు ఔన్నత్యానికి అద్దము పట్టే సంఘటనలు నాకు తెలిసే అనేకం ఉన్నా మా నాన్నగారి దూరపు సోదరిగా మాకు ఎదురైన కొన్ని అనుభవాలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. దుర్గాబాయి గారి గురించి నాకు తెలిసిన మొదటి సంఘటన, అది 1947 సంవత్సరం అనుకుంటాను, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇంకా రాలేదు. మా తాతగారి అన్నగారు కాకినాడలో పెద్ద ఉద్యోగమే చేసి రిటైర్ అయిన తమ్ముణ్ణి చూడడానికి రాజమహేంద్రవరం వస్తుండేవారు. ఆయన మధుమేహవ్యాధి తో బాధ పడుతూండేవారని వినికిడి. ఒకరోజున ఆయనకి బాగుండలేదని కబురువస్తే తాతగారు కాకినాడ వెళ్లారు. మరునాడు తిరిగి వచ్చి ఆయన కాన్సర్ తో పోయారని చెప్పి, వెంటనే ఆయన భార్య వెంకుబాయమ్మగారి భవిష్యత్తుని గురించి అలోచించి, అప్పుడే స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు చురుకుగా చేస్తున్న దుర్గాబాయిపేర ఒక ఉత్తరంవ్రాసి తిమ్మబాయమ్మగారికి ఇచ్చి మదరాసు పంపించారు. ఏమి చదువురాని ఆవిడని మెట్రిక్ పాస్ చేయించి మదరాసులోని ఆంధ్ర మహిళా సభ హాస్టల్ కి వార్డెన్ గా చేర్పించి ఆవిడకి ఒక జీవన మార్గం చూపించిందట. తిమ్మబాయమ్మ గారు జీవించినంతకాలం అక్కడే పిల్లమధ్య వారిచేత ఆప్యాయంగా 'అత్తగారు' అని పిలిపించుకుంటూ సంతోషంగా గడిపారు. అదే నేను మొదటిసారి దుర్గాబాయి గారి సౌజన్యత, స్త్రీ సేవా నిరతి గురించి తెలుసుకోవడం.

Chintaman Deshmukhమరొక సంగతి: అవి 1955 లో నేను బెంగళూరు లో కాలేజీ లో చదువుకునే రోజులు. దేశముఖ్ గారు అప్పటి దేశ ఆర్ధికమంత్రిగా బెంగళూరువచ్చే వివరాలు మా నాన్నగారు పేపరులో చదివి, దుర్గాబాయిగారు కూడా ఆయనతో వస్తున్నారన్న విషయం తెలుసుకుని, అతికష్టంమీద ఆవిడని 'పే' ఫోనులో పలకరించి, మర్యాదకి ‘మా ఇంటికి భోజనానికి రమ్మ’ ని పిలిచారు. ఆవిడ, దేశముఖ్ గారిని అడిగి చెబుతానని నాన్న గారిని ఫోనులోనే ఉంచి, అడిగి మరునాడు రాత్రి వస్తామని చెప్పారు. వెంటనే మానాన్నగారు మా అడ్రస్ చెప్పి, ధన్యవాదాలు తెలియచేసారు. సాయంకాలం ఇంటికి వచ్చాక మాకు ఈ సంగతి తెలియచెబుతే మేము సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. మా అమ్మకు ఏ వంటలు చెయ్యాలని సందేహం - ఆంధ్ర వంటలా, మరాఠీ వంటలా? తనకు మరాఠీ వంటలు రావు, నేర్చుకుని చెయ్యాలా? అది అయ్యే పనికాదు. ఇంకా వాళ్ళ అలవాట్లు పద్ధతులు మాకు తెలియవు. ఇంట్లో నేలపై పీటలమీద కూర్చుని కంచాలలో తినే అలవాటు మాది. వాళ్లకు అలా పెట్టలేము కదా, మరి డైనింగ్ టేబుల్ దానికి కుర్చీలు ఎక్కడనుంచి తెచ్చేది? అప్పుడు అద్దెకు ఇచ్చే పద్దతి ఇంకా వాడుకలోకి రాలేదు. మాకు చదువుకునేందుకు మడత బల్ల ఒకటి ఉండేది, దానినే మంచి తెల్లటి గుడ్డ కప్పి డైనింగ్ టేబుల్ గాను, మాఇంట్లో వున్న మడత కుర్చీలే దానికి కుర్చీలుగాను వాడదామని నిశ్చయించాము. మరునాడుఁ సాయంత్రం ఆరుగంటలకల్లా పోలీసులు వచ్చి మేముంటున్న చిన్న సందుని రెండువైపులా అడ్డగించి ఆర్ధికమంత్రి రక్షణకై కట్టుదిట్టం చేశారు. మేము ఆ వింత చూస్తుండగానే నాలుగు కారులు వచ్చి ఇంటిముందు ఆగాయి. మానాన్నగార్కి సంతోషంతో బాటు గుండెల్లో రాయి పడిందట. ఎంతమంది భోజనానికి వస్తారో ముందు తెలియదు. ఇంట్లో ఇంకా వంట పూర్తి కాలేదు. మా అమ్మ ‘బాదం ఖీర్’ చేసే ఉద్దేశ్యంతో నానబెట్టిన బాదంపప్పులు రోటిలో రుబ్బుతొంది. అప్పటికింకా మిక్సీలు లేవు. దుర్గాబాయి గారు లోనికి వస్తూనే మా అమ్మని ‘శాంతాబాయమ్మ, ఏం చేస్తున్నావు’ అని అడిగారు. అమ్మ చెప్పగానే, "లే నువ్వు వంట సంగతి చూడు, నేను దీని సంగతి చూస్తా, మేము తొందరగా వెళ్ళాలి, మాకు అట్టే టైం లేదు' అని పీటమీద కూర్చుని రుబ్బడం ప్రారంభించారు. పాపం దేశముఖ్ గారు మేము వేసిన మడత కుర్చీలో కూర్చుని మా యోగక్షేమాలు అడుగుతూ సంభాషణలో పడ్డారు. ఇక భోజనాలు ప్రారభించేముందు దుర్గాబాయి గారు 'నేను ఆయనికి వడ్డించి తరువాత తింటాను' అని అడిగి దేశముఖ్ గారికి విశేషాలు చెబుతూ కొసరి వడ్డించారు. ఆయన భోజనమైన తరువాత, అమ్మ, దుర్గాబాయ్ గారు పీటలేసుకు నేలమీద భోజనానికి కూర్చున్నారు. ఆవిడకి టమాటో సయించదట, అమ్మకి ఆవిషయం తెలియక రుచిగా ఉంటుందని టమాటో పప్పు, నిమ్మరసంతో వేరుశనగ పప్పు పచ్చడి, టమాటో పచ్చడి, టమాటో రసం, చేసింది. దుర్గాబాయి ఏమి తినటం లేదని చూసిన అమ్మ చిన్నబుచ్చు కోవడం చూసి, ఆవిడ కబుర్లు చెబుతూ, సంగతులతో సముదాయిస్తూ, వేరుశనగ పచ్చడి తోటి, పెరుగు, ‘బాదం ఖీర్’ తోటి అయిందనిపించింది. వారిద్దరూ నవ్వుతూ అమ్మకి నాన్నగారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకోవడం ఇప్పటికి వారిరువురి నిరాడంబరత సౌశీల్యం మా మనస్సులలో చెరగని ముద్ర వేసింది.

Durgabhai Deshmukh Stampమరో మరపురాని సంఘటన, మా పెళ్లి అయిన కొత్తలో వారిరువురు 1966 లో పనిమీద హైదరాబాద్ వచ్చారు. మేము అప్పుడు అక్కడే కొన్నాళ్ళు ఉన్నాము. వారిల్లు "రచన" లో ఉండేవారు, అది వారుకట్టుకున్న ఇంటికి పెట్టుకున్న పేరు, అక్కడ దుర్గాబాయిని దేశముఖ్ గారిని కలిసి వారి దీవెనలు తీసుకోమని నాన్నగారు మా యిరువురిని పంపారు. దుర్గాబాయిగారు నన్ను చూస్తూనే పలకరించి ఈవిడ నీ భార్యా అని అడిగారు. నేను అవునంటే మమ్మల్ని దేశముఖ్ గారికి పరిచయం చేయబోతే ఆయన వెంటనే 'అవును బెంగళూరు లో వాళ్ళింటికి వెళ్ళాము కదా' అని గుర్తు తెచ్చుకున్నారు. దుర్గాబాయి గారు లోపలికివెళ్ళి ఒక కొత్తచీర పసుపు కుంకుమ తెచ్చి మా ఆవిడకి ఇచ్చి, వాళ్ళ గది చూపించి చీర మార్చుకుని రమ్మన్నారు. వచ్చిన తరువాత మేమిరువురం వారిరువురికి పాదాభివందనం చేస్తుంటే సంస్కృత పండితుడు, కవి అయిన దేశముఖ్ సంస్కృతంలో శ్రావ్యంగా ఆశీర్వదించడం పులకరింపుతో కూడిన ఆనందాన్ని ఇచ్చింది.

ఆమె చివరి రోజులలో ''The Stone That Speaketh'' అనే పుస్తకం, "Chintaman & I" అనే ఆత్మకథ వ్రాశారు. పిల్లల, స్త్రీల, దీనుల సేవా నిరతురాలు, అనురాగమయి అయిన దుర్గాబాయి 1981 మే 9 న పరమపదించారు. ఆమె మరణానంతరం ఆవిడ చేసిన సాంఘిక సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం ఒక తపాలాబిళ్ల ని విడుదల చేసింది.

-o0o-

Posted in November 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *