Menu Close
భగవద్విభూతి
-- ఆర్. శర్మ దంతుర్తి

మానవజీవితం, సత్యం, పూర్తి సంతోషం – 1

భూమి మీద ప్రాణి ఏ రూపంలో ఎక్కడ మొదలైనా అది చేసే మొదటి పని ఆహారం సంపాదించుకోవడం. కడుపు నిండిన తర్వాత మిగతా విషయాలు గణనలోకి వస్తాయి. అంటే తాను, తనకి కావాల్సిన మిగతా అవసరాలు (పడుకోవడానికో చోటు, కష్టం సుఖం చెప్పుకోవడానికో తోడు వగైరా). ఈ సందడిలో ఒకరితో ఒకరికి స్నేహం, శతృత్వం, సిగపట్లు, చంపుకోవడం, ఏదో ఒక వృత్తిలో స్థిరపడడానికి అవస్థలు, అవన్నీ చూసేసరికి జీవితం సగానికి పైగా గడిచిపోతుంది. మానవుడన్నవాడికి అప్పటికి తెలిసేదేమంటే, జీవితంలో తానేదో సాధించాడు సరే కానీ తన జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు కలిగాక చివరి దశలో కూడా “పూర్తిగా“ ఎందుకు సంతోషం కలగడంలేదు? జీవితంలో తాను చేసినది చాలదా? లేదా, చేయవల్సినది ఎంతో మిగిలి ఉందా? పోనీ ఆ మిగిలిన పని ఎంత/ఏమిటి అనేది తనకి తెలుసా? తనకి తెలియక పోయినా ఎవరో చూపిస్తే, ఆ మిగిలిన పని కూడా చేస్తే తనకి పూర్తి శాంతి లభిస్తుందా?

ఇవన్నీ అలా ఉంచితే, మానవుడు అనే ఆలోచించగలిగే ప్రాణి, పుట్టి, పెరిగి, సంసారపు బండి లాగుతూ అసలు ఇంత కష్టం ఎందుకు పడాలి? పోనీ పడినా కష్టం వెనుక వచ్చే సుఖం మనిషికి అతి తక్కువగా మాత్రమే ఎందుకుంది? ఉదాహరణకి ఎన్నాళ్లనుంచో నిద్రలేని మనిషి తీరిక ఉంటే పది రోజులు పడుకుందాం అనుకుంటాడు కదా? అటువంటి మనిషికి నిజంగానే పది రోజులు తీరిక వస్తే రెండు రోజుల మించి ఎందుకు పడుకోలేడు? నిజానికి మనం కోరుకున్నది మనకి లభిస్తే దాని వల్ల వచ్చే ఆనందం క్షణికంగానే ఎందుకు ఉంటుంది? ‘నాకు కోటానుకోట్ల ఆస్తి రావా’లనుకునే మనిషి తీరా ఆ ఆస్తి వచ్చాక పూర్తిగా సంతోషంగా ఎందుకు ఉండడం లేకపోతున్నాడు? సంతోషం సంగతి అలా ఉంచితే, వచ్చిన కోటానుకోట్ల ఆస్థికి మరింత చేరుద్దామనే తీరని కోరిక ఎందుకు కలుగుతోంది?

ఇవన్నీ ఆలోచిస్తే తేలేదేమంటే కోరిక అనేది ఎప్పటికీ తీరేది కాదు. అదొగ దావాగ్ని. దాన్ని ఊదుతూ, నేయి, నూనె పోసి రగిల్చినంతకాలం అది ఇంతకుముందు కంటే బాగా జ్వలించడం మొదలుపెడుతుంది. పదహారో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవి, ధూర్జటి లో ఏమని చెప్తున్నాడో చూడండి కోరిక తీరడం గురించి.

మ.    అమరస్త్రీల రమించినన్జెడదు మోహంబింతయున్బ్రహ్మ ప
ట్టము సిద్ధించిన నాశదీరదు, నీ రూఢ క్రోధమున్ సర్వ లో
కములన్మ్రింగిన మానదిందుగల సౌఖ్యంబొల్ల, నీ సేవచే
సి మహాపాతకవారాసి గడుతున్ శ్రీకాళహస్తీశ్వరా           [శ్రీకాళహస్తీశ్వర శతకం. 42]

దేవతా స్త్రీలని అనుభవించినా కోరిక తీరదు, బ్రహ్మ అంతటి పదవి లభించినా ఆశకి అంతుండదు. మూడు లోకాలనీ దహించినా కోపం అనేది తగ్గదు. అందువల్ల అవన్నీ వదిలేసి నీ సేవచేసి తరిస్తాను అంటున్నాడు కవి. ఇప్పుడు మనం చేసే పని, ఆ పని వల్ల సంతోషం ఎందుకు కలగడంలేదు అనే దాని సంగతి చూద్దాం. సముద్రంలో జీవించే ప్రాణి భూమి మీదకి వచ్చి, మార్పు చెందుతూ అద్భుతంగా ఆలోచించే మానవుడిగా ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావంలో మన రోజువారీ ఏడుపులు చూసి విసుగొచ్చిన కొంతమంది అసలు ఈ ఏడుపులు ఎందుకొస్తున్నాయి, వీటికి అంతం, ఆరంభం ఉన్నాయా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఉదాహరణకి పెళ్ళి చేసుకు సంసారం మొదలు పెట్టి పిల్లలతో ఉన్నవాడు సుఖంగా లేడు అనుకుందాం. దీనికి అనేకానేక కారణాలు కనిపించవచ్చు. ఒకటి తనకి ఉన్న స్వేచ్ఛ పోయింది, రెండు తన సమయం అంతా కుటుంబం కోసమే ఖర్చు అవుతోంది. మూడు, తనకి, పెళ్ళి చేసుకుంటే ఉంటుందనుకున్న సంతోషం పెళ్ళి చేసుకున్నాక లేదు. నాలుగు, తనకి అక్కర్లేదనుకున్న విషయాలు వచ్చి తగులుతున్నాయి (బంధువుల రాకపోకలు, వాళ్ళతో కుస్తీలు వగైరా). ఐదు, తనని భార్య/భర్త సాధిస్తోంది/న్నాడు. సరే ఇది అలా ఉంచుదాం. మరి పెళ్ళి అక్కర్లేదనుకుని పెళ్ళే చేసుకోకుండా ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడా? వాడి కష్టాలు వాడివి. అయ్యో పెళ్ళే చేసుకుంటే ఎవరో తోడు ఉండేవారేమో? నా తర్వాత ఎవరూ లేరు కుటుంబానికి అనే వ్యధా, చింతా సంతోషం లేకుండా చేస్తున్నాయి కదా? దీనివల్ల తేలేదేమంటే, ఇదీ దారి అనుకుంటూ ఒకవైపు వెళ్తే సంతోషం లేదు, అది కాదు దారి అని మరో వైపు వెళ్ళినా సంతోషం లేదు.

ఇవన్నీ చూసాక మరికొన్ని సందేహాలు రావడం సహజం. ఎన్ని దారుల్లో వెళ్ళినా సంతోషం ఉండనప్పుడు బతకడమే దండగ కదా? ఆ మాట అలా ఉంచితే, మనిషన్నవాడు అసలు వద్దనుకుంటున్నా ఓ పని ఎందుకు చేయాల్సి వస్తోంది? ఎవరో తనని బలవంతంగా చేయిస్తున్నట్టూ తాను ఏ పనైతే వద్దనుకున్నాడో ఆ పని ఎందుకు చేయాల్సి వస్తోంది? కొంతమంది ఎంత చేద్దామనుకున్నా ఓ పని ఎన్నటికీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఉదాహరణకి, చదువులో బాగా ముందు ఉండే ఒకాయన వైద్యుడు అవుదామనుకున్నాడు. అన్నీ సజావుగా సాగిపోతున్నప్పుడు తల్లో, తండ్రో మరణించారు. చదువు ఆపి ఏదో గుమాస్తా ఉద్యోగం చేయాల్సి వచ్చింది కుటుంబాన్ని పోషించడానికి. తనకి ఏ గుమాస్తా ఉద్యోగం అయితే అత్యంత అసహ్యమో అదే ఉద్యోగం తాను జీవితాంతం చేయాల్సి వచ్చింది. ఈ గుమాస్తా ఉద్యోగం కూడా తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నిర్ణయించబడింది. తానేం తప్పుచేసాడు? అయితే అందరికీ ఇలాగే లేదు పరిస్థితి. కొంతమంది తాము నిర్ణయించుకున్న పని అతి సులువుగా చేయగల్గుతున్నారు. మరికొంతందికి చేద్దామనుకున్న పనీ, చేరుదామనుకున్న గమ్యం కష్టమైనా కిందో మీదో పడితే సాధ్యమౌతోంది. ఎందుకీ తేడాలు మనకి తెలియకుండా జరుగుతున్నాయి?

ఈ ఏడుపులూ, కన్నీళ్ళూ, కష్టనష్టాలు చూసి జీవితాన్ని తెలుసుకోవడంకోసం ఆలోచించేవారిని జిజ్ఞాసువులు అన్నారు. వీళ్ళు ప్రతి దానిలో ఉండే తర్క వితర్కాలు బాగా ఆలోచించి, ప్రతి పనికీ అవి అలా జరగడానికీ కొన్ని కారణాలు కనుక్కున్నవారు. ఫలానా పని చేస్తే చేతులు కాల్తాయి. చేయకపోతే కాస్త సంతోషం, అనేవి వీరు ప్రతిపాదించగలరు. అయితే వీళ్ళు కూడా పూర్తి సంతోషం పొందినవారు కాదు. వీళ్ళు కూడా తమకి తెలియనిదాని గురించి, “మనకి తెలియని అదృశ్య శక్తి ఏదో ఉంది, దాన్ని మనము ఎన్నటికీ అధిగమించలేము” అనే సూత్రం ప్రతిపాదించారు. ఆ సూత్రాన్ని ఎంతమంది నమ్ముతారు అన్నది వేరే విషయం. ఈ జిజ్ఞాసువులలోంచి మరి కొంతమంది జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేవారు బయల్దేరారు. వీళ్లవల్ల మరికొన్ని విషయాలు తెలిసాయి. మీరు ఏదో కోరుకున్నారు. కోరిక తీరిందనుకుందాం. దానివల్ల  సంతోషం కలిగినా అది క్షణికంగా ఉండి, ఆ సంతోషం మళ్ళీ కావాలనుకుంటూ మరింత కోరిక కలుగుతోంది. ఈ మరింత కోరిక రావడానిక్కారణం ముందు కోరుకున్న చిన్న కోరిక తీరడమే; అసలు కోరికే తీరకపోతే ఆ కోరిక అలాగే ఉంది. ఏది ఏమైనా చివరకి మనకి తేలినదేమంటే ఈ తీరిన/తీరని కోరికే మన కష్టాలకి కారణం. అందువల్ల ఈ జిజ్ఞాసువుల్లో కొంతమంది లోతుగా ఆలోచించేవారు ప్రతిపాదించినదేమంటే, కోరికలు విడనాడాలి. వాళ్ళు అలా చేసి మామూలు మనుషులమైన మనకంటే, మనకన్నా బాగా ఆలోచించగల జిజ్ఞాసువులకంటే సంతోషంగా ఉన్నారు. వీళ్ళని ముముక్షువులు అనడం మొదలుపెట్టారు. అయితే ఈ ముముక్షువులు కూడా పూర్తి సంతోషంగా ఉన్నవారు కాదు. మనకన్నా చాలా రెట్లు సంతోషంగా ఉన్నారు కోరికలు విడిచిపెట్టి.

అయితే అసలు పూర్తి సంతోషం అంటే ఏమిటి? సర్వకాల సర్వావ్యవస్థలలోనూ పూర్తిగా సంతోషంగా ఉండడం సాధ్యమేనా? అటువంటి స్థితి ఒకటి నిజంగా ఉందా? ఉంటే అందరికీ ఎందుకు లభించదు? ఆ స్థితి లభించడానికీ, లభించకపోవడానికీ ఎవరో కొంతమంది ప్రతిపాదించిన అదృశ్య శక్తే కారణమా? అదే కారణమైతే ఆ శక్తి ఒకరికి సహాయం చేయడమూ మరొకరికి ఏమీ సహాయం చేయకపోవడమూ ఎందుకు చేస్తోంది? ఈ పక్షపాతానికి, ఆ శక్తి కొంతమంది మీద కక్ష కట్టడానికేమిటి కారణం? మనం ప్రతిపాదించిన ఈ అదృశ్య శక్తే కనక ఒకటి ఉంది అనుకుంటే అది ఎక్కడ ఉంది? దాన్ని తెలుసుకోవడం, ఎలా? దాని స్వరూపం ఏమిటి? ఎక్కడ వెతకాలి దాని గురించి? తెలుసుకున్న తర్వాత ఆ శక్తి మనపట్ల ఉదారంగా ఉంటుందా లేకపోతే తనని తెలుసుకున్నందుకు కోపం వచ్చి మనని నాశనం చేస్తుందా?

మానవజాతి ఎప్పటికప్పుడు బాగా అభివృద్ధి చెందుతోంది కనక ఈ ముముక్షువుల్లో కొంతమంది మరింత ముందుకెళ్ళగలిగారు. వీళ్ళ ప్రకారం ప్రతి చర్యకీ ఓ ప్రతిచర్య ఉండి తీరుతుంది. మనం ఎవరికైనా అపకారం చేస్తే అది మనకి తిరిగి అపకారం చేస్తుంది. ఉపకారం చేస్తే అదే తిరిగి ఇవ్వబడుతోంది. అందువల్ల ఎవరికీ అపకారం చేయకూడదు. ఉపకారం చేస్తే కూడా అది తిరిగిచ్చే ప్రత్యుపకారం అనుభవించాలి కనక ఉపకారం చేసినా దాని గురించి వచ్చే లాభం నష్టం చూడకుండా/ఆశించకుండా ఉపకారం చేయాలి. నిజంగానే ఆ ఉపకారం వల్ల ఏదైనా తిరిగి వస్తే ‘వద్దు’ అని వెనక్కి ఇచ్చేయగలిగి ఉండాలి, ఎందుకంటే మనం ఉపకారం చేసినది ఏదో ఫలం ఆశించి కాదు. ఏ పనైనా చేస్తే దాని వల్ల అంటుకునే ఫలితాన్ని బంధనం అనడం మొదలుపెట్టారు. అంటే మనం ఏ పనిచేసినా మంచో చెడో ఏదో ఒక బంధనం తగులుకుంటోంది. ఎందువల్ల? చేసిన పని వల్ల ఏదో ఆశిస్తున్నాం కనక. ఆ ఆశ వదుల్చుకుంటే మనం చేసే పని వల్ల బంధనం అంటుకోదు. బంధనాలు ఎప్పుడైతే అంటుకోవో అప్పుడు మరింత సుఖంగా ఉండగలుగుతున్నాం. ఈ ఉపకారం, అపకారం అవన్నీ ఓ కర్మ - అంటే ఏదో ఒక పని చేయడం. అసలేమీ పని చేయకుండా ఉండడం అసంభవం కనక ఏదో ఒకటి చేస్తూ ఉంటాం జీవితంలో. అందువల్ల మనం చేసే కర్మ తాలూకు బంధనం మనకి అంటుకుంటోంది. అది అంటుకోకుండా ఉండడానికొకటే సాధనం, ఆ కర్మ కి సంబంధించిన ఫలం విసర్జించడం. ఆ ఫలం ఎటువంటిదైనా దాని గురించి సంతోషం గానీ దుఖం కానీ పొందకపోవడం. ఇటువంటివాటినే సృష్టి నిర్మాణ క్రమంలో సూత్రాలు అనడం మొదలుపెట్టారు. ఈ సూత్రాల ప్రకారం మనం చేసిన కర్మలవల్లనే మనం ప్రస్తుత జీవితం నిర్మాణమై ఉంది. ఇప్పుడు మనం చేసే కర్మలే భవిష్యత్తులో మన జీవితాన్ని శాసిస్తాయి.

మరికాస్త లోతుగా అవలోకిస్తే, మనం ఏదో కర్మ చేస్తున్నాం, లేదా చేసాం ఎప్పుడో, దాని ఫలితం ఇప్పుడు అనుభవించడం ఏమిటి? దీనికి సమాధానం సులభంగా చెప్పవచ్చు. చేసిన అన్ని కర్మలకీ ఫలితం వెనక్కి వెంటనే లభించాలని లేదు కదా? విత్తనం నాటడానికీ అది మొలకెత్తి పంట ఇవ్వడానికీ సమయం పట్టినట్టే మనం చేసే కర్మ అనే విత్తనం నాటాక అది ఫలం ఇవ్వడానికి సమయం పడుతోంది. అది తిరిగి వచ్చేసరికి మన జీవితంలో ఆయుష్షు తీరిపోవచ్చు. అయితే ఈ కర్మ తాలూకు బంధనం, ఫలితం అనుభవించక తప్పదు కనక అవి మనని బంకలాగా పట్టుకుని వదలకుండా వస్తాయి. దీనివల్లనే పునర్జన్మ అనేది ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక ప్రాణి చేసిన కర్మ వల్లనే మరో జన్మ కలుగుతోంది. ఈ జన్మలో చేసే మంచి (పుణ్యం), చెడూ (పాపం) వల్లనే మనకి మరో జన్మ కలుగుతోంది. అంటే ఈ జన్మ ఇలా ఉండడానిక్కారణం మనమే, మనం చేసిన పూర్వ జన్మ కర్మలే. మన విధికి మనమే నిర్మాతలం. దీనినే జన్మ మరణ చక్రం అనడం మొదలుపెట్టారు. ఎక్కువ కర్మ చేసే కొద్దీ ఈ చక్రం వేగంగా తిరగడం, బంధనాలు ఎక్కువగా లేనప్పుడు కర్మ చక్రం మందకొడిగా తిరగడం జరుగుతోంది. ఈ జనన మరణ చక్రం ఎవరిది వారిదే. ఈ చక్రంలో ఇలా ఇరుక్కోవడంవల్లే మనకి సంతోషం అనేది లేదు. దీని నుండి తప్పించుకోవడం అసాధ్యం. నిజంగానే అసాధ్యమా? అలాగైతే పూర్తి సంతోషం కలగడం ఎలా?

పైన చెప్పిన జిజ్ఞాసువులలోంచి వేరుపడిన ముముక్షువుల్లో కొంతమంది శోధించి కనుక్కున్నదేమంటే, ఈ చక్రంలోంచి తప్పించుకోవచ్చు. కష్టమే కానీ అసాధ్యం కాదు. ఎలాగంటే చేసే కర్మ బంధనాలనుంచి తప్పించుకోవడం వల్ల. అంటే చేసే పనిలో అత్యంత ఆశక్తి చూపడం, ఆ పని వల్ల వచ్చే ఫలితాలని – అవి మంచివైనా, చెడువైనా వదులుకోవడం. ఏమీ ఆశించకపోవడం – కోరిక పూర్తిగా విడనాడడం. ఎప్పుడైతే కర్మ నుంచి విడుదలయ్యామో అప్పుడు “పూర్తి సంతోషం” కలగడం మొదలౌతుంది. ఈ పూర్తి సంతోషం ఎవరికి కలుగుతోందని మరో మారు వెనక్కి చూసుకుంటే తేలేదేమంటే, ఎటువంటి కోరికలు లేనివారికి మాత్రమే. ఇలా పట్టువదలకుండా చివరి వరకూ శోధించి ఈ విషయాలని కనుక్కున్న ముముక్షువులు వారు స్వతహాగా దర్శించినదాన్ని సత్యం అనడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పడం ప్రకారం ఈ సత్యం అనేది ఏనాడూ మార్పు చెందనిది. ఇదొక్కటే ప్రపంచంలో ఏ మార్పూ లేకుండా స్థిరంగా ఉండేది. సత్యం పరం ధీమహి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని దర్శిస్తామో అప్పుడు ఈ చరాచర ప్రపంచం ఇలా ఎందుకు ఉందో, ఎలాగే ఎందుకు ఉంటుందో ఆ సత్యం ఎన్నటికీ ఎందుకుమారదో, అనే మిగతా విషయాలు తెల్సివస్తాయి. ముందు చెప్పుకున్న ఈ అదృశ్య శక్తే ఈ సత్యం. అయితే ఒకటే చిక్కు. ఈ సత్యాన్ని తెలుసుకోవడాన్కి దారి కష్టాతి కష్టం. కానీ అసాధ్యం కాదు. ఇలా సత్యాన్ని కనుకున్నవాళ్ళు మాత్రమే ఈ జనన మరణ చక్రంలోంచి తప్పించుకోగలరు. అలా తప్పించుకున్నవారే జీవన్ముక్తులు.

ఈ జీవన్ముక్తులు దర్శించిన సత్యం ఒకటే (దీనిని ధర్మం అనండి, భగవంతుడు అనండి, లేదా శక్తి అనండి) పూర్తి సంతోషం ఇవ్వగలిగేది. ఈ చరాచర ప్రపంచం అంతా కూడా ఈ సత్యం చుట్టూ తిరుగుతోంది. మానవ జీతానికి పరమావధి పూర్తి సంతోషం అనుకుంటే అది లభించడానికి ఈ మార్పులేని సత్యం కనుక్కోవడం తప్ప మరోదారి లేదు. నాన్య పంధా విద్యతే అయనాయ.

****సశేషం****

Posted in November 2020, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *