Menu Close
Atanu Aame

నిజమే
ఆమె
నేలపై
నడిచే
ఆకాశమే

అతనే
ప్రక్కనే
ఉన్న
ఆకాశపు
మనసును
అందుకోలేకపోతున్నాడు

ఆమె-అతను

ఆమె
చెప్పిందల్లా
చేస్తానని
ఒట్టేయమంది

అతనేమో
గుడ్డిగా
తలూపి
సరే అన్నాడు

పాపం
అతనుకేం తెలుసు
మూడు ముళ్ళు
వేయమని చెప్పి
జీవితాంతం
ఫూల్ ను చేస్తుందని

ఆమె-అతను

నిజానిజాలను
వేలెత్తి చూపే
నిలువుటద్దం
ఆమె

ఆ అద్దాన్ని
చూసి
తప్పు ఒప్పులను
సరిదిద్దుకుని
సాగిపోయేవాడు
అతను

ఆమె-అతను

ఆమె
ఓ గులాబీ పువ్వు
అతనేమో
అనుమానపు ముల్లు
అందుకే
ఆ పువ్వుకు
ఉండాల్సిన పరిమళం
వాడిపోయింది

ఆమె-అతను

ఆమె
మండిపడుతున్నది
ఎండలో
గొడుగెందుకు
తీసుకెళ్ళలేదని

అతను
చల్లగా చెప్పాడు
నిన్ను మించి
ఎండలు
మండడంలేదని

ఆమె-అతను

ఆమె
అభివృద్ధికై
అహర్నిశలు
ప్రవాహనదై
పరుగులు తీస్తుంటే
అతనే
అనుమానపు రాయై
అడ్డుకట్ట వేస్తున్నాడు
స్వార్ధాన్ని బయటపెడుతూ

ఆమె- అతను

ఆమె
ఎంత గొప్పదో
గుండెలో
సంసార ముల్లు
నిత్యం గుచ్చుతున్న
గులాబై
పరిమళిస్తున్నది

అతనెంత
నీచుడో
ముళ్ళుగుచ్చిన
ఆ గుండెను
ఎత్తిపొడుస్తుంటాడు

ఆమె-నేను

సంసారాన్ని
పరుగులు పెట్టించే
ప్రవాహనది ఆమె

ఆమెలోనే
కామక్రోధాలతో
ఎగిసెగిసిపడి
తనలోనే
కలిసిపోయే
అల అతను

నేను
ఎన్ని వెకిలివేశాలేసిన
భరించే ఆ మనసు
ఎంత గొప్పదో కదా

... సశేషం ....

Posted in November 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!