Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-24 -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

రిస్క్

పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.

గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు సీరియస్ గా నవ్వుతో చూస్తారు.
నేను వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూనే ఉంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!

.

పెగ్-2
మనం మళ్లీ ఇవతలికి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
బాటిల్ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: మన శర్మ కూతురు అప్పుడే పెళ్లీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్లి వయసేమిటి? అడ్డగాడిదలా ముప్ఫైయ్యేళ్లొస్తుంటే!

.

పెగ్-3
మనం మళ్లా చెక్కబీరువాలోంచి చపాతీపిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్షమవుతుంది.
బాటిల్ తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతుంటారు.
అటకని పిండిమీద పెట్టేసి తాతయ్యని కడిగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బీరువాలో సద్దు ఆ బీరువాలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏంటే? మా శర్మగారిని గాడిదంటావా... తోలు వలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చేయకుండా వెళ్లి పడుకోండి!

.

పెగ్-4
మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం. చెక్కబీరువాలో ఓ పెగ్ కలుపుతాం.
బాత్రూంని కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీతాత వంట చేస్తుంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్లి ఆ గాడిదతో అయ్యిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్ నీళ్లు పోశానంటే... వెళ్లండి, బయటికి!

.

పెగ్-5
నేను మళ్లీ కిచెన్లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను. 
డ్రాయింగ్‌రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
తొంగిచూస్తే... మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటక్కన మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్కోర్స్ తాతయ్య ఎప్పుడూ రిస్క్ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ మనం ఫొటోలో కూర్చుని మా ఆవిణ్ని చూస్తూ నవ్వుతుంటాం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

.

మరాఠీమూలం: నెట్ లో అజ్ఞాత రచయిత
తెలుగు అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.

జాలి సెలవులు -- కాసాల గౌరీ

కరోనా పుణ్యమాని దొరికిన రెండు వారాల సెలవులని "జాలీ" (jolly)గా గడిపేయొచ్చని తెగ సంబర పడిపోయాడు గుర్నాధం. అందుకు శ్రీకారం లా పదకొండున్నర అవుతున్నా తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చున్నాడు.

వేడి వేడిగా కాఫీ చప్పరిస్తూ చదివితే మరింత మజాగా ఉంటుందనిపించింది. వంటింట్లోకి వెళ్లి అడిగితే ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో మెల్లగా వంటింట్లోకి వెళ్ళాడు. న్యూస్ పేపర్ వేళ్ళ మధ్య పట్టుకుని...

సింకు దగ్గర కుడి చెయ్యి పిడికిలిని పంపు మీద మెట్టి నురుగు వచ్చేలా బరబరా తిప్పుతోంది కాంతమ్మ.

"ఒసేయ్ ఒసేయ్ ఏంటి పంపుకి తలంటి పోస్తూన్నావ్"... అని అరిచాడు బొంగురు కీచుగాని మధ్య గొంతుతో.... ఏమీ జవాబివ్వకుండా "వై దిస్ కొలవరి కొలవరి కొలవరి డి" అనే పాటని మూడుసార్లు పాడాక వెనక్కి తల తిప్పి కోపంగా "ఈ లోకం లోనే వున్నారా... ప్రపంచమంతా కరోనా గురించి అల్లాడుతుంటే..

భర్తని చూస్తూ గయ్ మంది.

ఐతే.....

పంపుకు తలంటు ఎందుకన్నట్టు...

అయోమయంగా చూశాడు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది... తరచూ చేతులు కడుక్కోవాలి అంటున్నారుగా..

అవునూ..ఇంకా అయోమయం గా చూశాడు.

చేతులు కడుక్కున్నాక పంపు ఆపాలిగా....అంతకన్నా ముందుగా దాని మీద పురుగుల్ని (వైరస్ అనుకుంటా) చంపాలిగా..

సరే....సరే.. మరి పాట..

ఎందుకు అనే లోపే.....గయ్ మంది భార్యామణి.

అయ్యోరామా.... 30 సెకండ్లు ఎలా తెలుస్తుంది.

పాపం ఆయనెవరో కాలిఫోర్నియా డాక్టర్ ఈ వుపాయంచెప్పాడు.. పుణ్యాత్ముడు ... కళ్ళుమూసుకుని ఆయనకి మనసులో దణ్ణమెత్తుకుంది.

సరే.....

'మీరెందుకిలా దయచేసారూ.' అన్నట్టు దీర్ఘం తీసింది..

కొంచం.. కాఫీ.... నసుగుతూ అంటుంటే...

కాఫీ లేదు గీఫీ లేదు మీరు అ వెధవ పేపర్ పట్టుకుని వంటింట్లోకి రాకండి..

అవతలకి తగలడండి... వాటిమీదా పాలప్యాకెట్టుల మీద కూడా అవి తగలడతాయిట. పొద్దున్నే పట్టకారు కాల్చి దాంతో పాల ప్యాకెట్టు వేడినీళ్లలో ముంచి తీసాను... వేళ్ళు మండి తగలడ్డాయి..... మిమ్మల్ని కాల్చి తగలడలేనుగా .. అందుకని గీజర్ ఆన్ లోనే ఉంచి చచ్చాను ... రేపట్నుంచి పేపర్ వేయొద్దని ఆ పేపర్ పీనుక్కి చెప్పాను. ఇవాల్టికి వేసి తగలడ్డాడు కాబట్టి ఆ డబ్బులు ఎలాగూ ఇవ్వాలి కాబట్టి ఆమూల కూచుని చదివి దాన్ని బయట తగలెట్టి వేడి వేడి నీళ్ళు పోసుకురండి. అదీ 12గం లోపల.. అయిపోవాలి అపరాహ్ణ స్థానం అరిష్టం కూడాను..

ఈలోగా వంట చేసి తగలడతాను.... దండకం చదువుతూనే సర్జరీ చేయడానికి ముందు డాక్టర్లలా రెండు చేతులు ముందుకి పెట్టి స్టవ్ దగ్గరకు వెళ్తున్న భార్యని నిలువు గుడ్లేసుకుని చూస్తుండిపోయాడు గుర్నాధం. నాకెందుకీ "కొలవెరి” అని మనసులోనే జాలిగా పాడుకుంటూ..

శ్రీవారికో లేఖ -- శ్రీముఖి

"భారతీ" పిలిచారు విశ్వమూర్తి. బరువు గా ఉన్న కనురెప్పలను మెల్లగా పైకెత్తి చూసిందామె.

"ఎలా ఉంది?" అడిగారాయన.

నవ్వటానికి  ప్రయత్నిస్తూ ఎదురు  ప్రశ్నించింది ఆమె.

"డాక్టర్ చెప్పలేదా?"

"చెప్పారు..నీవు..త్వరగానే...కోలుకుంటావని..."తడబడుతూ అన్నారు.

నీరసంగా నవ్విందామె. వాడిన ఆమె పెదవులపై నవ్వూ..ఆ  నవ్వు లో ఏదో.. వెలితీ కనిపించాయి ఆయనకు.

మనస్సంతా చేదుగా...ఆమె పై జాలిగా అనిపించింది.

"అలా నవ్వకు భారతీ..నీకు నయమై పోతుంది..” ఇన్నేళ్ళుగా రాని ఒక భయంకరమైన ఊహ ఆయన్ని అతలాకుతలం చేయ సాగింది. భారతి నాకు దక్కదా?

"భారతీ.. నీకు తీరని కోరికలు ఏమైన ఉన్నాయా?" లాలనగా అడిగారు.

ఆమె ఓసారి ఆయన వేపు చూసి..కళ్ళు మూసుకుంది.

"చెప్పు భారతి..అమ్మాయికి కబురు పెట్టాను. అమ్మాయి,అల్లుడు వస్తారు..."

"కబురు చేస్తారని వస్తారని...తెలుసు.."

"మరింకెమిటి...దేనికో సందేహిస్తున్నట్లున్నావ్?"

"............"

"ఈ సమయంలో కూడా సంకోచమా?"

"తీరుస్తారా? చివరి కోరిక...పెద్ద కోరికేమో..."

"చెప్పవోయ్...దేవుడులాంటి వాడిని కాక పోయినా రాక్షసుడిని కూడా కాదులే"

ఆమె కొన్ని క్షణాల పాటు తట పటా యించింది.

తర్వాత తల వేపు పరుపు క్రింద తడిమి ఓ కవరు తీసింది. కంపిస్తున్న చేతులతో ఆయన చేతిలో పెట్టింది.

ఆమె పెదవులు ఉద్వేగంతో వణుకు తున్నాయ్..కళ్ళు నీళ్లతో తొణికిస లాడుతున్నాయి...

"భారతీ.. ఆ కన్నీళ్లేమిటి?ఈ కవరేంటి?”

"కన్నీళ్లు...అప్పుడప్పుడూ మీరు చూసేవే...కవరు...చూడండి..."

అప్పుడే హాస్పిటల్ రూమ్ లోకి వస్తున్న కొడుకు, కోడల్ని చూసి కవరు జేబులో పెట్టుకున్నారు విశ్వమూర్తి.

"అమ్మా, ఎలావుందిపుడు ...నాన్నా మీరు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోండి." కొడుకు మాటలకు 'సరే' నంటూ లేచారాయన. ఇంటికి వస్తూ దారిలో ఆలోచించ సాగారు.

'భారతి ఏం రాసి ఉంటుంది? ఎప్పుడూ ఎదురు గానే వుండే ఆమె...ఈ స్థితిలో రాయాలిసినంత అవసరం ఏమొచ్చింది? అయినా...నేను బుర్రపాడుచేసుకోవటం గానీ...ఈ ఆడవాళ్లు రాసే వీలునామాల్లో ఏముంటాయ్
"నా నగలన్నీఅమ్మాయికి ఇవ్వండి...కొన్ని పట్టుచీరలు పాపం కోడలికి కూడా ఇవ్వండి..అబ్బాయిని ఇదివరకులా ఏం అనకండి..మీ ఇద్దరిని సమర్దించుకు రావటానికి నేనుండను.."
చటుక్కున మరో ఆలోచన కూడా స్ఫురించింది ...
'భారతి పైకి కనిపించదు కానీ..తెలివయింది..'
"నిండా అరవై ఏళ్లు కూడా లేని మీరు..నేను పోతే...తోడు కోసం..."కనిపించని హాస రేఖ పెదవుల పై తారాడింది.

"పిచ్చి భారతీ.. ఇవేనా నీవు రాసింది?"ఆలోచనల్లోనే ఇల్లు వచ్చింది.

ఆ కవరు లో 'ఏముందోననే ఉత్సుకత ఆయన్ని తొందర పెట్ట సాగింది. పడక కుర్చీ లో వాలి కవరు విప్పారు  విశ్వమూర్తి...

"ప్రియమయిన శ్రీవారికి నమస్కరించి వ్రాయునది. సదా మీ సమక్షం లోనే ఉండే నేను ..ఇంత పెద్ద లేఖ వ్రాయటం ..వింతగా ఉంది కదూ? మీతో ఎన్నో చెప్పాలని ఉంటుంది నాకు. అందుకు అనువయిన సమయం, అవసరమయిన ధైర్యం..ఒకప్పుడు ఉండేవి  కావు. తప్పదు..తెగించి ఇప్పుడు చెప్పేద్దామని ఉన్నా.. ప్రస్తుతపు వయస్సు..ఈ అనారోగ్యం నాకు సహకరించటము లేదు..కానీ..అప్పుడూ..ఇప్పుడూ.. అప్పుడప్పుడు..చెమ్మగిల్లే కనులు..ఎప్పుడూ స్పందించే  మనస్సూ...నాహృదయ ఘోషను
ఒక్కసారి..మీకు వెల్లడి చేయమని..మారాం చేస్తూనే ఉన్నాయి.. అందుకే  ఓపిక చేసుకుని ఇది వ్రాస్తున్నా.
నాకు తెలుసు..మీకు ఓర్పు తక్కువని..దయచేసి చివరివరకూ చదవండి.....ఒక్కసారి...మనం
ముప్పై ఏళ్ళు వెనక్కి వెళదామా.?"చదువు తున్న విశ్వమూర్తి ఆగారు...ఆయన మనోనేత్రం ముందు..అప్పటి భారతి రూపం..తళుక్కుమన్నది. "అప్పటి నీ అందాన్నిమర్చిపోలేను గానీ..విషయం ఏమిటో చెప్పవోయ్!" మురిపెంగా  విసుక్కుంటూ చదవ సాగారు...

$$$$

"...అప్పటికి  నాకింకా మీతో వివాహం కాలేదు కానీ.. వయస్సు ప్రభావంతో.. మనస్సు కూ వయసొచ్చేసింది...భావిజీవితం పైనా, రాబోయే భర్త మీదా ఎన్నెన్నో..ఆశలు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఊహిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసే కలలు....ఆ..సమయం లోనే..మీరు మరో ఇద్దరు స్నేహితులతో మా ఎదురు ఇంట్లో అద్దెకుంటూ...డిగ్రీ ఫైనలియర్  చదువుతున్నారు...మీ ముగ్గురిలో ఒకరు నన్నమితంగా ఆకర్షించారు”

“నాకు తెలుసులే ఆ రాకుమారుణ్ణి..నేనేనని!" ముసిముసిగా నవ్వుకుంటూ చదవ సాగారు విశ్వమూర్తి.

"తనతో ప్రేమించానని చెప్పే సాహసం గానీ ప్రేమ లేఖలు రాసే ధైర్యం గాని లేవు..అతన్ని మర్చిపోవటం అసాధ్యం అనిపించింది..
తర్వాత...కొద్ది రోజులకు...కనీసం మాట మాత్రం చెప్పకుండానే..నా అభిప్రాయం అడగకుండానే..మానాన్న మీ సంబంధాన్ని ఖాయం చేసేశారు...పెళ్ళిజరిగిపోయింది..."

చదవటం ఆపారు...

"అయితే...భారతీ.. నీవు...ఇష్టపడ్డవాడిని..నేను...కాదా...!!?"

అప్రయత్నంగా పైకే గొణుక్కుంటూ..ఆలోచనలో పడ్డారు...

అప్పుడు..తనతో పాటు రూమ్ లో ఉండి చదివిన వాళ్ళు...రామదాసు..వాడు..ఈ లోకంతో సంబంధం లేనట్టుండే మాలోకం..వాడు కాదు...
రెండోవాడు..మాధవ...తల మాసిన వాడిలా..చెవులు మూసేసిన హిప్పీక్రాపూ..లంగాలుంగీ లాంటి..బెల్ బాటమ్ ప్యాంటు..తో..రోమియో కటింగ్స్ కొడుతుండే వాడు...వాడా..?
య్యస్...వాడే అయ్యుంటాడు. ఆడాళ్లను ఎవరూ బాగు చెయ్యలేరు...చిరాగ్గా చదవ సాగారు..

"మీకు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయి కాపురం పెట్టాం..మనకొచ్చే ఆదాయం..పొదుపుగా వాడే  ఖర్చుతో ఆర్థికంగా ఇబ్బందులు లేవు. వచ్చిన చిక్కల్లా మీ మనస్తత్వం తోనే...అన్ని విషయాలు మనిద్దరం చర్చించు కోవాలని..మన బంధంలా అనుబంధం కూడా పటిష్టంగా ఉండాలని..కోరుకునేదాన్ని..
కానీ..మీరో..? పనివాడి పైఅధికారిలా, యంత్రం ముందు వర్కర్ లా..మీ ప్రవర్తన ..తీరని మనస్తాపంలా ఉండేది..మీతో వివరంగా మాట్లాడాలని..మన మధ్య దూరాన్ని తగ్గించాలని..తాపత్రయం. మీరు అవకాశం ఇస్తేనా.
ఆ..సమయం లోనే.. ఒక సారి..మన ప్రక్కింటి శారద..ఆమె..భర్త గూర్చి మీరేం అన్నారో..గుర్తుందా?"

ఏమన్నాను...ఉహూ..గుర్తు లేదు..చెప్పేయ్..

"భారతీ..శారద అన్ని విషయాల్లో అంత చలాకీగా..అందరితో అంత..చనువుగా ఉంటుంది. వాళ్ళాయన మూడీ గా ఉంటాడు...వాళ్ళ దాంపత్యం ఎలా ఉంటుందంటావ్?"
"నిజమేనండీ..శారదలా ఎప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ..సరదాగా ఉంటే బావుంటుంది..కదూ?"
"ఆపాపు..ఎదురింటి ఆడది అలా ఉంటే సరదాగానే ఉంటుంది...మనింట్లో..ఆడది అలా ఉంటే అసహ్యంగా ఉంటుంది.."
"అదేమిటి!!?"
"అదంతేలే గానీ.. నేననుకోవటం..."అన్ని” విషయాల్లో ...ఆమెదే యాక్టివ్ పార్టు అనుకుంటున్నాను..."
“గుంభన గా నవ్వుతూ..మీరన్న..ఆ మాటల్లోని నర్మగర్భపు భావాన్ని...అర్థం చేసుకోలేని పిచ్చిదాన్నా"? మీలో..మరో మనిషిని మీ..అసలు రంగునీ చూసి..మ్రాన్పడి పోయాను...ఆ రోజు నుంచీ.. నాలోని చలనాన్ని.. సంచలనాన్నీ అణచుకుంటు..మీకు నచ్చేలా..ఉండాలని నిర్ణయించుకున్నాను...ఏకాంతంలో..భర్త సాన్నిధ్యంలో కూడా ..స్వేచ్ఛగా..మైమరపుగా ..ఉండకూడదనే మీ ఆధిక్యత..నన్ను నిప్పులా కాలుస్తూ ఉండేది...! హైందవ స్త్రీ ని కదా!!?? పతివ్రతా ధర్మాలన్నీ కలసి 'కొరడా'లా వెంటాడుతుంటే చచ్చినట్టు..తలవంచే దాన్ని. వాస్తవ జీవితంలో విషాదం ఎదురయిన వాళ్ళు...పరువు మర్యాద లాంటి పట్టుపరదాల మాటున..ఉక్కిరిబిక్కిరి అయ్యే వాళ్ళు..ఉపశాంతి కై  ఆశ్రయించేది.. రహస్య జీవితాన్ని!!
ఆ పనే చేశాను..నేనుకూడా!.." అదిరి పాటు గా కుర్చీలో నిటారుగా కూర్చున్నారు విశ్వమూర్తి గారు...

"ఏమిటీ ...రహస్యజీవితమా?"...కళ్ళద్దాలు తీసి,తుడిచి..మళ్ళిపెట్టు కున్నారు..

"...అంటే...కొంప తీసి..." ఆందోళనగా..ఆతృత గా అక్షరాల వెంట పరుగులు తీయసాగారు..

"..ఆరోజుల్లో...మీ..ముగ్గురి.లో ఒకరు నన్నాకర్షించారని..చెప్పాను కదూ? మీతో విసిగి పోయినప్పుడు..సేద తీరాలను కున్నపుడు..అతన్ని ఆహ్వానించుకుంటు ఉండేదాన్ని..."

"చ్చ...నయ వంచకీ.."కోపం తో ..కాగితాలు ..విసిరివేయాలని  ఉన్నా..చదవ సాగారు..

"...వివాహితనైన నేను మీ ముందే..అతన్ని ..మరోలా మన్నించ లేను..ఈ వయస్సులో ..అసహజం గా..కూడా ఉంటుంది...నా ఊహలు రూపం దాల్చి నట్లు..నన్ను.. లాలనగా..ఆత్మీయంగా చూసుకునే..అతని పేరు.."ఊహామూర్తి" గా మాత్రమే  చెబుతాను.."

ఆయనలో అసహనం అంచెలంచెలుగా.. పెరుగుతుంది...

"....నేను మిమ్ములను కోరేది ఒక్కటే..నేను కను మూసే లోపు ఒక్క సారి..ఆయన్ని నా కళ్లెదుటకు తెచ్చి చూపించమని..!"

చావు ముందు వచ్చే సంధి ప్రేలాపనలా?...లేక ఎలాగూ చస్తున్నాను.. కనుక..ఏం చేస్తాడనే  ధీమానా?

"...ఇన్నేళ్ళుగా కాపురం చేసి ఈ విపరీత బుద్దులేమిటి? అనుకుంటున్నారా?
చూడండీ... కేవలం దాహం మాత్రమే తీర్చుకుంటే.. కడుపు నిండదు కదా? అలాగని..అచ్చంగా ఆహారమే తీసుకుని నీళ్లు త్రాగకుండా కూడా ఉండలేం..
ఆరోగ్యంగా ఉండటానికి ఆ రెండూ ఎంత అవసరమో...జీవితానికి భౌతిక సౌకర్యాల తో పాటు..ఆంతరంగిక సంతృప్తి కూడా అంతే అవసరం!
ఇంక... వ్రాయలేక పోతున్నాను..చివరికి వచ్చేశాను..అన్ని రకాలుగా...మీరు...తరతరాల నుండి.. అడ్డుపెట్టుకుంటూ వస్తున్న..ఆ  గాంభీర్యపు తెరను తొలగించండి..దాని వెనుక నున్న స్నేహ వాత్సల్యాలు.. బయటకు వస్తాయ్..మీకై తపించి పోయే నా అనురాగం అర్థమవుతుంది...అప్పుడు..ఖచ్ఛితంగా నా "ఊహా మూర్తి" లో ఊహలు..నిజాలై..వాస్తవ మూర్తి గా..నేను కోరుకునే "విశ్వమూర్తి"గా ప్రత్యక్ష మవుతారు...
ఆయనే నండీ..నాకు కావలసిన..నా చిరకాల..స్నేహితుడు!! అర్థమయ్యిందనుకుంటా?
..........మీ..భారతి."

కొద్ది క్షణాలు అలాగే చూస్తూండి పోయారు విశ్వమూర్తి గారు...లోపల..అణువణువు కదిలిపోతున్నట్లు ..కరిగిపోతున్నట్లు..ఆర్థ్రత ఆరంభం అయి అది..అక్షరాలయ్.. ఆ అక్షరాలు..ఆమె పేరై.. ఆ పేరు... పిలుపై..
ఆ.పిలుపు..ధ్వని గా మారింది..
"భా.. ర..తీ.."
దోసిట్లో ఉన్న కాగితాలు ఆమె రూపం లా తోచాయ్ ఆబగా.. ఆర్తిగా..ఆ..కాగితాల్లో ముఖం దాచుకున్నారు.

లాక్ డౌన్ వెతలు – 16 -- అత్తలూరి విజయలక్ష్మి

చిరుజల్లు

“ఒక గుడి లేదు, ఒక భజన లేదు, పెళ్లి లేదు, పేరంటం లేదు... మా తమ్ముడు మనవడి పెళ్లి చేయాలనుకున్నాడు ఈ శ్రావణమాసంలో .. పాపం వాడెంత బాధ పడుతున్నాడో.. ఓ చుట్టం రాక లేదు, ఓ స్నేహితుల పలకరింపు లేదు.. మన నలుగురి మొహాలు తప్ప మరో మొహం కనిపించడం లేదు.. ఏం బతుకో! ఏం గోలో! పుట్టి బుద్ధెరిగాక ఇలాంటి బతుకు చూడలేదు... ఇలా బతుకుతామని ఊహించలేదు కూడా! ఎక్కడో ఎవడో ఏదో తినడం ఏవిటి? మనం దాని ఫలితం అనుభవించడం ఏంటి ఖర్మ కాకపొతే!” అత్తగారి సణుగుడు వింటున్న స్వప్న అంతకన్నా విసుగ్గా అంది.

“మీకే అలా ఉంటే నాకెలా ఉండాలి... ఓ సినిమా లేదు, ఓ షికారు లేదు.. పిల్లలకి సెలవలు ఇవ్వగానే ఈ సంవత్సరం మైసూరు, ఊటీ అన్నీ తిరిగి వద్దాం అన్నారు మీ అబ్బాయి. పోయినేడాది అనుకున్నాం ... కుదరలేదు.. ఈ సంవత్సరం ఇలా అయింది.. నవంబర్ లో మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి శ్రీలంక టూర్ ప్రోగ్రాం కూడా పెట్టారు. పిల్లలని మీ అబ్బాయి దగ్గర వదిలేసి మనిద్దరం వెళ్ళాలి అని కూడా అనుకున్నాను.....మనుషుల సంగతి పక్కన పెట్టండి... సూర్య,చంద్రులను చూసి రెండు నెలలైంది.”

“బాగుంది.... ఆడవాళ్ళు మీ ఇద్దరికే అలా ఉంటే నాకెలా ఉండాలి... ఆఫీస్ లేదు, ఫ్రెండ్స్, పార్టీలు, క్లబ్, అసలు నేను మగాడినేనా అని నాకే అనుమానంగా ఉంది.”

“అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇల్లు, పిల్లలు పట్టకుండా బయట తిరగడం మగతనమా! దాన్ని బాధ్యతా రాహిత్యం అంటారు.”

“ఎలా అవుతుంది? రోజంతా కష్టపడి పని చేసి అలసిపోయే మాకు రిలీఫ్ ఇచ్చేది ఏముంది క్లబ్ తప్ప...”

“మరి నిద్ర లేచిన దగ్గరనుంచీ యంత్రంలా ఇంటిల్లిపాదికీ అన్ని అమర్చే మాకు రిలీఫ్ ఏంటి?”

“మీకు టి వి లో సీరియల్స్ ఉన్నాయి.. బోలెడు సినిమాలు ఉన్నాయి.”

“ఆ సీరియల్స్ మీరూ చూడచ్చు... వాటికి ఆడ, మగ తేడా లేదు...”

“థాంక్స్ .... మాకు వద్దు తల్లి .... ఆ ఆనందం సంపూర్ణంగా మీరే దక్కించుకోండి.. అసలు మీకు ఇక్కడ ఏ మాత్రం కాంపిటేషన్ లేదు. సమాన హక్కులు కూడా వద్దు.. అన్ని హక్కులు మీరే తీసుకోవచ్చు..”

“ఏం ఫర్వాలేదు మీరూ తీసుకోవచ్చు సమానంగా కాదు కొంచెం ఎక్కువ ఇస్తాము తీసుకోండి.”

“అంటే మాకు టివి సీరియల్స్ అంట గట్టి మీరు సినిమాలు, షికార్లు చేస్తారా”

“ఏం చేస్తే తప్పా!"

“తప్పా! తప్పున్నారా!"

కొడుకూ, కోడలు వాదన తారాస్థాయికి వెళ్తుండడంతో ఆవిడ కంగారు పడిపోయింది..” ఈ లాక్ డౌన్ అయిపోనివ్వు చెప్తా నీ పని” అంటోంది స్వప్న...

“నేనూ చెప్తా లాక్ డౌన్ అయిపోనీ,”

“ఏం చెప్తావు..”

“నువ్వేం చెప్తావు..”

“ఒరేయ్ ఆపండి ఇంక... అమ్మాయ్ స్వప్నా! వెళ్ళు లోపల పని చూసుకో...” గాభరాగా అంది .” “అత్తయ్యగారూ! ఇలా రండి...” రామం వచ్చి ఆవిడని వేరే గదిలోకి లాక్కెళ్ళాడు.

“చిలికి, చిలికి గాలివాన అయేలా ఉందయ్యా...” అందావిడ భయంగా..

“ఏమి అవదు మీరేం కంగారు పడకండి. ఈ లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ కాసేపు కూర్చుని సరదాగా మాట్లాడుకున్నది లేదు.. ఆవిడ వంట గదిలోంచి రాదు, ఆయన మంచం దిగడు ... కనీసం సరదాగా పోట్లాడుకోనీండి.. లేకపోతె వాళ్ళు భార్యాభార్తలేనా అని వాళ్ళకే కాదు మనకీ అనుమానం వస్తుంది.. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా చిరుజల్లుల్లో తడుస్తున్నట్టు ఉంది “పరవశంగా అంటున్న రామం వైపు అయోమయంగా చూసింది ఆవిడ.

Posted in November 2020, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *