Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

చిదంబరం

Chidambaram Temple

సింహాచలం తర్వాత చిదంబరం వెళ్ళాము. చెన్నైలో పొద్దున్నే కారెక్కి దారిలో పల్లెటూళ్ళ అందం చూస్తూ, అక్కడ స్థానికంగా దొరికే ఆహార రుచులని ఆస్వాదిస్తూ వెళ్ళాము. చెన్నై నించి చిదంబరం కి దారి అంతా కాలిఫోర్నియాలోని రూట్ 1 లాగా ఉన్నది. మంచి హైవే ఉన్నది. చాలా చోట్ల ఎంతో అందంగా, పొద్దున్న ఉదయ భాస్కరుడి అందాలతో మెరుస్తూ ఉన్నది. చిదంబరం వెళ్ళడానికి కారణం - 'చిదంబర రహస్యం' గురించి  చిన్నప్పటినుంచి వింటున్నాను కానీ అది అనుభవించి, తెలుసుకునే అవకాశభాగ్యం ఇప్పుడే కలిగింది.

Chidambaram Templeగుడి ప్రధాన ద్వార గోపురం అత్యంత రమణీయంగా చాలా పెద్దదిగా ఉన్నది. 13 కలశాలతో, 11 అంతస్తులతో గంభీరంగా ఉన్నది. కుడ్య సౌందర్యం రమణీయం. ముందర ఆవరణలోని ఒక ప్రదేశంలో నెయ్యి దీపం వెలిగించి మనమే హారతి చూపించి అక్కడే కొబ్బరికాయ మనమే కొట్టాలి. ఆ తరువాత గుడిలోకి ప్రవేశించాలి. చాలా పెద్ద గుడి. ఆవరణ చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఆ ప్రధాన గోపురమే ఒక అబ్బురం. అన్ని వందల, వేల ఏళ్ల క్రితం ఎంత పకడ్బందీగా, ఎంత అందంగా రాతితో చెక్కిన కట్టడాలో! కింద పొందు చేసిన వీడియోలు ఆ మాటని ధ్రువ పరుస్తాయి. గుడి లోపలకి వెళ్లి, ఎండాకాలం వల్ల మండుతున్న రాళ్లమీద నడిచి ఆలయంలోకి ప్రవేశించాము. ఎదురుగా పెద్ద రహదారిలాంటి తోవ. దానికి ఎడమచేతి వైపు మందిరాలున్నాయి. ప్రధాన దేవాలయాలకి అటూ ఇటూ చక్కగా చెక్కబడిన స్తంభాలతో దారి ఉన్నది. ఆ దారికి అటూ ఇటూ కూడా కూర్చుందుకి గట్టులాగా కట్టి ఉన్నది. ఎడమచేతివైపు వెళ్లి మళ్ళీ కుడికి తిరిగి ఆ కుడ్య సౌందర్యాలు చూస్తూ ధ్వజస్తంభం వైపు వెళ్ళాము. ముందర అక్కడ స్థంబాల పైన రాతి చెక్కడాలు ఎంత అందంగా ఉన్నాయో ఫొటోలో  చూడవచ్చు.  ఒకొక్క స్తంభం పైన ఎంతో  అందమైన, చాలా నున్నని కుడ్యాలు కనిపిస్తాయి. అప్పటి శిల్పులు ఉలులతో చెక్కి ఉండచ్చు; కానీ, అంత  నున్నగా ఎలా తయారు చెయ్య గలిగారు? ప్రతి స్తంభం మీదా ఒకే సైజులో ఎలా చెక్కగలిగారు? ఒకే షేపులో ఎలా తయారు చేయగలిగారు? ఏ కొంచెం తప్పయినా మొత్తం స్తంభం పాడయిపోతుంది కదా? వంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ కారిడార్ ఒక చివరినించి చూస్తే ఎంత అందంగా ఉంటుందో! ఆ ధ్వజ స్థంభం ముందరనించి  కుడికి తిరిగి లోపలికి  వెళ్ళగానే నాకు చిదంబరంలోని అద్వైత భావం బోధ పడింది. ఒకే ఆవరణలో ఇటు ఎడంచేతివైపు శయన పద్మనాభుడైన రంగనాధుడు, అటు ఎదురుగా అరూప రూపియైన పరమేశ్వరుడు ఉన్నారు. ముందుగా ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అక్కడి 'వైద్యనాథ శివ దీక్షితర్ ' అనే ఆయన్ని కలిసి చెప్పమని అర్థించాం. ఆయన తండ్రి గొప్ప పండితుడు, చాలా ఏళ్ళు అక్కడ అర్చకులుగా పనిచేసిన వారు.

Chidambaram Templeఇక్కడి శివలింగం పంచభూత లింగాలలో ఒకటి. ఆకాశ లింగ రూపం. ఆకాశ తత్త్వం కాబట్టి, రూపం ఉండదు. పక్కనే నటరాజ మూర్తి రూపంలో సగుణంగా మనకి దర్శనమిస్తాడు ఈశ్వరుడు. అందుకే ఈ రెండూ కలిసిన చిదంబర రూపాన్ని  'అరూపరూపి ' అంటారు. ఈ ఆకాశ లింగ రూపం ముందు చిన్న చిన్న చతురస్ర కన్నాలు ఉన్న వెండి జాలీ ఉన్నది. మనం ఒక 15 అడుగుల దూరంలో నుంచుని (గర్భాలయం బయటనించి) చూడాలి. ఒక ముహూర్తం సమయంలో - అంటే రోజులో ఆరు ప్రదోషాల సమయాల్లో - ఆలయ ప్రధాన గంటలు మోగిస్తూ, చిత్ర గంటలు మోగిస్తూ ఒక మహోత్కృష్టమైన ఘటన జరగ బోతున్నదన్న విషయం మనకి తెలియజేస్తారు. కళ్ళు అప్పగించి అందరూ చూస్తుండగా హెచ్చరికతో ఒక్కసారిగా ఈ జాలీ వెనుక ఉన్న తెరని తీస్తారు. మొత్తం 5 నించి 8 క్షణాలు మాత్రమే తెరుస్తారు. వెనుక ఒక చిన్న దీపం తప్ప ఏమీ ఉండదు. నేను ఎంత జాగ్రత్తగా చూసినా ఆ కొద్ధి క్షణాల్లో ఏంచూడాలో, ఎలా దృష్టి సారించాలో అర్థం కాలేదు. నా ప్రయత్నం ఫలించేలోపలే మూసేసారు. అయ్యో అని మళ్ళీ వైద్యనాథుల వారిని ఆశ్రయించాము. ఆయన వల్ల ఒక ప్రత్యేక టికెట్టు కొని అంతరాలయంలోకి ప్రవేశించి, అద్భుతమైన నటరాజస్వామి పూజలు చూశాము. అర్చన, విశేష హారతులు చూసే భాగ్యం కలిగింది. ఎన్నో తైల దీపాలు వెలుగుతూంటే వచ్చే వేడి, అటు వేదోచ్చారణలు, ఇటు హారతులు, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తాయి మనకి.  అటునించి కుడి వైపు వచ్చి, శివలింగాభిషేకాలు ప్రధాన అర్చకులు చేస్తుండగా చూసాము. అప్పుడు వైద్యనాథుల వారి ద్వారా తెలిసింది. ఆ లింగం శుద్ధ స్ఫటిక లింగం. ఒక 5 అంగుళాల వ్యాసం, 5 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్నది కానీ, చాలా బరువు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లింగం చేతితో తీసి పట్టుకుని ఒక ప్రత్యేక పానుమట్టం  మీద ప్రతిష్టించి, రక రకాల ద్రవ్యాలతో నమక చమకాలతో అభిషేకం చేస్తారు. జలాధివాసం, పుష్పాధి వాసం, అన్నాధివాసం, మొదలైన ద్రవ్యాలు ధారాళంగా వాడతారు. ఈ అభిషేకాలన్నీ చూసి, మళ్ళీ ప్రత్యేక హారతులు నటరాజస్వామి వారికి చూసాము. తృప్తి తీరక, ఈ సారి ఇంకో విధంగా ఆకాశ లింగం చూసే అవకాశం కలిగించమని అడిగాం. అప్పుడు అందరికీ తెలియని ఒక కోణం చూపి ఇక్కడి నించి చూస్తున్నప్పుడు బంగారం మెరుస్తున్నట్లు కనిపిస్తే అదే ఆకాశలింగమని చెప్పారు. మళ్ళీ పెద్ద పెద్ద నిలువెత్తు గంటల మ్రోత మధ్య, మళ్ళీ ఆకాశలింగ దర్శనం తెలియజేసారు. జాగ్రత్తగా చూసాము; ఈ సారి ఒక బంగారు హారం చూసాననిపించింది. అప్పుడు వైద్యనాథుల వారి కొడుకు శివ దీక్షితర్  కథనం: పైన చెప్పిన వెండి జాలీ వెనక ఒక రాతి గోడ ఉన్నది. దాంట్లో ఆకాశ లింగ యంత్రం ప్రతిష్టింపబడింది. దాని ముందర బంగారు హారాలు వేలాడదీసి ఉంటాయి. మనం జాగ్రత్తగా చూస్తే సన్నటి దీపపు వెలుగులో ఆ  'హారం' కనిపించ వచ్చు. అదే ఆకాశ లింగ దర్శనం. అప్పుడు నేనడిగాను - మాకు సరిగ్గా కనపడలేదు, అదృష్టం లేనట్లేనా అని. ఆయన అన్నారు, మీరు చూసినా లేకపోయినా, శివుడు మిమ్మల్ని చూసాడుగా - అని. అప్పుడు ఒక గొప్ప విషయం బోధ పడింది. ఆలయ దర్శనంలో మనదే ముఖ్య పాత్ర అని అనుకోవడం పొరపాటు. దేముడు మనల్ని అనుగ్రహించడమే అసలు ప్రయోజనం. మన మనస్సు బాగా లగ్నం చేస్తే ఆయనే అనుగ్రహించి అవకాశాలు కల్పిస్తాడు, అని. ఆకాశ లింగ తత్త్వం మిగతా అన్నితత్వాలకన్నా (పృథ్వీ, జల, అగ్ని, వాయు) సూక్ష్మమైన పరమాత్మ తత్త్వం. అందుకే అన్ని తత్వాలకన్నా విస్తృతమైనది.

Chidambaram Templeఆ తరువాత రంగనాథ దర్శనం చేసుకున్నాము. ఈ గుడి మనం నటరాజస్వామి ఆలయం (పైన చెప్పినట్లు ఆకాశలింగం, నటరాజ విగ్రహం పక్క పక్కనే ఉండే ఆలయం) ఎదురుగా నిల్చుంటే ఎడమ చేతివైపు ఉండే ఆలయం. ఆది శేషుడి మీద పడుకున్న పద్మనాభ స్వామిగా విష్ణుమూర్తి అవతారం. పెద్ద విగ్రహం. అమ్మవారు అయ్యవారి పాదాల చెంత ఉంటారు కానీ మన దృష్టి పద్మనాభ స్వామి మీదే ఉంటుంది. బ్రహ్మ దేవుడు నాభి కమలంలో చక్కగా కనబడతారు. ప్రదక్షిణం చేసి వచ్చేసరికి తీర్థం ఇచ్చారు. ఏ శివుడి గుడిలోనైనా, విభూతే ప్రసాదం, కానీ వైష్ణవాలయాల్లో మాత్రం పానకం తీర్థంగా ఇస్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ రెండు గుళ్ల ముందర - శివాలయం ఎదురుగా ధ్వజస్తంభం ఉన్నదని చెప్పానుగా? (ఫొటోలో చూడండి) ఆ ధ్వజస్తంభం వైష్ణవ ఆగమాల ప్రకారం ఉన్నది. అది ఎలా గుర్తించాననేది రాసి నిరూపణ చెయ్యడం ఈ వ్యాసం పరిధికి మించినది. గొప్పతనం ఏమిటంటే శివ, విష్ణువులకి అభేదం ఈ ఆలయం యొక్క ప్రధాన సందేశం.

ఆ తరువాత శివకామి మాత  దర్శనం చేసుకుని బయటకి వచ్చాము. ఇక్కడ గుళ్ళలో అమ్మవారు, అయ్యవారు కలిసి ఉండరు. విడి విడి గుళ్ళు ఉంటాయి. అద్భుతమైన అలంకారంతో శివకామి అమ్మవారు మెరిసి పోతున్నారు. శివ శివా అని ప్రార్థించుకోవటమే!

మిగతా పంచభూత లింగాలు: కాళహస్తిలో వాయు లింగం, అరుణాచలం లో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జల లింగం, కంచి ఏకామ్రేశ్వర క్షేత్రంలో పృథ్వీ లింగం. వీటిగురించి తరువాత రాస్తాను.

### సశేషం ###

Posted in November 2020, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *