Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
మందలింపు

పెద్దలమాట పెరుగన్నపు మూట

ఆదివారం సెలవుకావడంతో గండుచీమ ముద్దులకొడుకు చిన్నూ, ఏనుగు కొడుకు గున్న నున్నా స్కూటర్ పందాలు వేసుకున్నాయి.

వాళ్ల నాన్నలు మధ్యాహ్నం భోజనమయ్యాక కునుకు తీసే సమయంలో దొంగతనంగా వాళ్ళ నాన్నల జేబుల్లోంచీ తాళాలు సంపాదించుకుని వాళ్ళ నాన్నల స్కూటర్లు తెచ్చుకుని రోడ్డెక్కాయి.

చిన్నూ అన్నాడు కదా "దూరంగా కనిపించే ఆ నేరేడు చెట్టు వద్దకు ఎవరు ముందు చేరితే వారు గెలిచినట్లు." అని. ఏనుగు గున్న నున్నా సరేనంది. ఇద్దరూ రెడీ చెప్పుకుని స్కూటర్లు స్టార్ట్ చేశారు.

చిన్నూ, నున్నా సమాన వేగంతో దౌడు తీస్తున్నాయి స్కూటర్ల మీద. ఇంతలో టర్నింగ్ లో నున్నా స్కూటర్ ఎదురుగా ముసలి పిల్లితాత 'పుస్సీ' వస్తున్నాడు. అసలే ముసలివాడు పైగా కళ్ళు సరిగా కనిపించవు. పుస్సీ తాతను తప్పించబోయి నున్నా స్కూటర్ పక్కకు తిప్పగానే ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేక నున్నా పక్కనున్న వేప చెట్టును ఢీ కొట్టి పక్కన దూరంగా ఎగిరి పడిపోయాడు.

చిన్నూ తన స్కూటర్ పక్కన స్టాండ్ వేసి వచ్చి నున్నాను చూడగా తలకు బలమైన గాయం తగిలి రక్తం కారుతోంది. భయంతో చిన్నూ కెవ్వున కేకవేసి పది అడుగుల దూరంలో వున్న కుందేలు డాక్టర్ ' కెర్రీ ' గారి  హాస్పిటల్ కు పరుగుతీసింది. ఆదివారం మధ్యాహ్నం హాస్పెటల్ కట్టేసి భార్యాపిల్లలతో మ్యాటినీ కెళదామని ప్రామిస్ చేసిన డాక్టర్ 'కెర్రీ', చిన్నూను చూసి, మంచి స్నేహభావం కలిగి, అందరికీ సహాయం చేసే మంచి వాడైన చిన్నూ మాట విని, అతడి స్నేహితుడు 'నున్నా' ఆపదలో ఉన్నాడని చెప్పగానే, అర్ధం చేసుకుని వెంటనే తన మూవింగ్ హాస్పిటల్ లాంటి ఆంబులెన్సును రెడీ చేసుకుని బయల్దేరాడు. అక్కడ స్పృహలేకుండా పడివున్న 'నున్నా'ను ఎలాగో స్ట్రెచెర్ మీదకు ఎక్కించారు. సిస్టర్ నెమలి 'నెల్లీ' తన పింఛంతో నున్నాకు గాలి విసురుతూ స్ట్రెచెర్  మోస్తున్న బాతు మేల్ నర్సులైన 'డెక్క్' లకు జాగ్రత్తలు చెప్తూ హాస్పిటల్ చేరారు. వెంటనే డాక్టర్ 'కెర్రీ' ప్రధమ చికిత్సచేసి ప్రమాదం నుండి కాపాడాడు. ఐతే నున్నాకు చాలా రక్తం పోవటాన తన బ్లడ్ బ్యాంకులో నున్నా గ్రూపు రక్తమైన 'ఏ పాజిటివ్' లేదని బాధపడుతుండగా, చీమకొడుకైన 'చిన్నూ' తన రక్తం ఏ పాజిటివ్ అని నెమలి సిస్టర్ నెల్లీ కి చెప్పి ఒకబాటిల్ రక్తం తన ఫ్రండ్ 'నున్నా' కు ఇచ్చింది.

వారి మధుర స్నేహానికి సంతోషించిన డాక్టర్ కెర్రీ, ఇది యాక్సిడెంట్ కేసు గనుక నీవు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి, రామచిలుక ఎస్.ఐ ని పిలుచుకురా. మనం ప్రాణంకాపాడినా, రూల్సు పాటించాలి అని చెప్పి చిన్నీ ని పంపింది. చిన్నీ తన స్కూటర్ మీద వెళ్ళి పోలీస్ స్టేషన్లో రామచిలుక ఎస్.ఐ గారి గురించి అడిగింది. గుంటనక్క 201 కానిస్టేబుల్ ఏం. ఎస్.ఐ గారు నీకు బాబాయనుకున్నావా? ఐనా యాక్సిడెంట్ కేసు ముందుగా మాకు చెప్పి మేము కేసు బుక్ చేసుకుని పర్మిషన్ ఇచ్చాక హాస్పిటల్ కు కెళ్లాలి. అసలు మీకు ట్రీట్ చేసిన డాక్టర్ను ముందు బుక్ చేస్తాం. వెళ్ళు వెళ్లి ఆ ఏనుగు గున్నా నున్నా ను ట్రైట్ చేసిన డాక్టర్ కెర్రీనీ కూడా ఇక్కడికి తీసుకురాపో అని అంది వెటకారంగా. ఇంతలో లోపలినుండి వచ్చిన ఎస్.ఐ. రామచిలుక ఎవర్ని 201 పోపో అంటున్నావ్! అంటూ వచ్చి విషయమంతా చిన్నూ చెప్పగా విని "ఏయ్! 201! నక్క 104 తీసుకురా!" అని అందరూ కలిసి పోలీస్ వ్యాన్ లో కుందేలు డాక్టర్ కెర్రీ హాస్పిటల్ కు వచ్చారు. చిన్నూ తన స్కూటర్లో ఫాలో ఐంది. రామచిలుక ఎస్.ఐ. కేసు బుక్ చేయబోగా ,"పోనీలెండి ఎస్.ఐ గారూ! పిల్లలుకదా! వదిలేయండి. అయినా వారు బాగానే డ్రైవ్ చేస్తున్నారు. ముసలి పిల్లితాత 'పుస్సీ' రోడ్డుకు అడ్డం రాగా తప్పించబోయి నున్నా తనే యాక్సిడెంట్ కు గురయ్యాడు కుర్రాడు పాపం. వీళ్ళు మరో మారు వాళ్ల నాన్నల స్కూటర్లు వారికి తెలియకుండా తీసుకోకుండా ఉండేందుకు వీళ్లను భయపెట్టడానికి మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నాను. అన్నాడు డాక్టర్ కెర్రీ. రామచిలుక ఎస్.ఐ. "నా స్కేహితుడు డాక్టర్ కెర్రీ చెప్పాడు కనుక మిమ్ములను వదిలేస్తున్నాను. మరోసారి ఇలా మీ పెద్దలకు తెలీకుండా స్కూటర్లు దొంగిలించి తెచ్చారో మిమ్మలని వదిలేదిలేదు. ఐనా స్కూటర్ తో పాటుగ నున్నా వాళ్ల నాన్న హెల్మెట్ కూడా తెచ్చుకుని ఉంటే ఈ ప్రమాదం తప్పేది. చిన్నూకు హెల్మెట్ ఉండటం వల్ల భద్రంగా ఉంది. జాగ్రత్త మరెప్పుడూ పెద్దలకు తెలీకుండా స్కూటర్ తోలను ప్రయత్నించకండి. మీవయస్సుకు తగినట్లు చేయాలి." అని మందలించి వదిలేసింది.

చిన్నూ, నున్నా ఇద్దరూ రామచిలుక ఎస్.ఐ కి ధన్యవాదాలు చెప్పారు.

Posted in November 2020, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *