Menu Close
రూమ్ నెంబర్ 117
-- డా. వి. వి. బి. రామారావు

గత సంచిక తరువాయి...

తెల్లవారిన తరువాత కాఫీకి మెస్సు కెళుతూ ఉంటె దయానిధి కనబడ్డాడు. “కాఫీ తాగిన తరువాత నా రూమ్ కి వస్తారా విక్టర్ గారు!” మర్యాదగానే ఆహ్వానించాడు.

కొంతసేపయాక దయానిధి అడిగాడు. “నిన్న రాత్రి మీ కాశీపతి ఏం చేశాడో తెలుసా?”

నేను సినిమాకు వెళ్లాను. ఏం, ఏం జరిగింది?”

“నా థియరీ రైట్. నిన్న రాత్రి మేమంతా లౌంజ్ లో కూర్చున్నాం. రాత్రి పదిగంటలయింది. ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటుండగా ఎక్కడి నుంచో మల్లెపూల వాసన, మత్తెక్కించే సెంటు వాసన గుబాళించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కణ్ణుంచో తెలుసుకోకుండా ఉండలేకపోయాం. వాసన మీ రూమ్ వద్ద నుంచే వస్తున్నట్లు తెలుసుకోవడానికి మాకు అట్టే సేపు పట్టలేదు. సుందర్రావ్ గది దగ్గరకు వచ్చేసరికి మీ గదిలో ఏదో చిత్రమైన వ్యవహారం జరుగుతున్నట్టు ఊహించాము (మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సి.ఐ.డి అనుమానితుణ్ణి దంచేస్తున్నట్టు దంచేస్తున్నాడు). గది లోని అద్భుత సౌరభం వేసి ఉన్న తలుపుల్లోంచి బ్లాకంతా అలుముకుంటూంది. మగపిల్లల హాస్టల్స్ లో ఆడపిల్లలు, సువాసనలు అతి విశేషం (ఆ రోజుల్లో). అందుకు వచ్చిన నలుగురితోనూ చెప్పాను. ఓ కాస్సేపు తర్జన భర్జన చేసి మీ రూమ్ తలుపు తట్టాం. ఇంకా వాసన దట్టంగానే ఉంది. కాశీపతి తలుపు తీశాడు. నేలోపలికి వెళ్ళలేదనుకోండి. ఉగ్రుడై కాశీపతి “జస్ట్ లీవ్ మి అలోన్...ఆల్ అఫ్ యు గెట్ అవుట్!”. మీరైనా చెప్పండి విక్టర్ గారు, ఆ ఎముక పారెయ్యమని.”

అన్నయ్యకు విషయం బోధపడలేదు. ఇంకా వివరాలు కావలిస్తే ఎవరివ్వగలరు? సుందర్రావ్ దగ్గరికి వెళ్ళాడు. వాసన మాత్రం నిజమేనని, లోపల స్త్రీ కంఠం తన భావన అయితే అయి ఉండవచ్చునని అన్నాడు సుందర్రావ్. అన్నయ్య కేం చెయ్యాలో తెలియలేదు.

అన్నయ్య రూమ్ కి వచ్చేసరికి కాశీపతి మంచం మీద కూర్చున్నాడు. మనిషి ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా ఉన్నాడు. అన్నయ్యే కదిపాడు మెల్లగా. “ఏం కాశీపతి, నువ్ చెప్పావు కదా అని యూనివర్సిటీలో డాన్స్ ప్రోగ్రాం మానుకుని, సినిమా వద్ద చూశాను నీ కోసం. నేను గదిలో ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు.”

“సారీ విక్టర్. ఇదంతా నా రాత. నేను ఈ వ్యవహారం ఇంత ముదురుతుందని అనుకోలేదు. ఇక దీని విషయం మరిచిపో. ప్లీజ్! మరి దీని గురించి నాతో ప్రస్తావించకు.”

అన్నయ్య ఏమి అనలేకపోయాడు. వాసన వ్యవహారం తెలిసిన వాళ్ళు మాత్రం దయ్యాలకు దూరంగా ఉండటం మంచిదనుకున్నారు. కొన్ని రోజులు పోయిన తరువాత మరో సంఘటన జరిగిందట.

ఆ రోజు బ్లాక్ లో ఎక్కువమంది ఎందుకనో లేరు. ఓ నలుగురైదుగురు మాత్రం రేడియో వింటూ కూర్చున్నారట. మళ్ళీ వాసన. తోటి విద్యార్థులు మరి ఆగలేకపోయారు. ఒక్క ఉదుటున పరిగెత్తి నూట పదిహేడు వైపు రాసాగారు. వీళ్ళు చూస్తుండగానే గది తలుపులు తెరుచుకున్నాయి. ఒక స్త్రీ ఆకారం. తెల్లని చీర, పొడుగాటి జడ, జడ నిండా మల్లెలు. కుర్రాళ్ళు రావడం చూసి వెనక్కి తిరిగి అటు పక్క మెట్లవెంబడి దిగిపోయింది. ఆమెను వెంబడించాలని ఎవరికీ ఊహ కలగలేదు. కళ్ళ ముందు దయ్యం. కెవ్వున కేకవేసాడొకడు. తలుపులు తెరిచే ఉన్నాయి. కాశీపతి మాత్రం మంచాన్ని కరచి పట్టుకున్నట్లు పడుకున్నాడు.”

“అయితే దయ్యానికి, కాశీపతికి సంబంధం ఏమిటి? అతని చావుకు దయ్యం కారణమా?” అని నాకు అడగాలనే అనిపించింది. కాని, అన్నయ్య ఆలోచనలకు అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు.

భవానీ శంకరం కూడా ఆలోచనలో పడ్డాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. దయ్యాల కథలు వింటున్నప్పుడు ప్రతి వారికీ వారి వారి జీవితాల లోని దయ్యాలకు సంబంధించిన సంఘటనలు జ్ఞాపకం రావడం కద్దు. “నిజంగా దయ్యాలుంటాయా? కాశీపతి గదిలోకి వచ్చిందెవరు?” భవానీ అడిగాడు.

“నర్స్ మిస్ మార్టరీ. దయ్యాన్ని ఇప్పటి వరకూ ఎవ్వరూ పదిమందిగా చూడటం జరగలేదు. విద్యార్థులంతా చూశారని అన్నయ్య కధనం. ఇందులో ఏదో రహస్యం ఉంది. అన్నయ్య ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దయ్యం కాదు. సొంతంగా దీనిని వాకబు చెయ్యాలని అన్నయ్య మరో క్లాస్ మేట్ చక్రధర్ దగ్గరికి వెళ్లాను. ఇప్పుడతను రాజమండ్రిలో ప్రాక్టీసు చేస్తున్నాడు. కాలేజీలో ఫైనల్ చేరడానికి వస్తూ రాజమండ్రిలో దిగా.

మాటల మధ్య యధాలాపంగా వాళ్ళ క్లాస్ మేట్, కాశీపతి ప్రస్తావన తెచ్చాను. కాశీపతి మాటవిని ఫక్కున నవ్వాడు చక్రధర్. నాకు నిజంగానే కోపం వచ్చింది. నా మోహంలో సీరియస్ నెస్ చూసి అతనే అన్నాడు.

“సారీ! నిల్ నిసీ బోనం అని మీరు చనిపోయిన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడారు కదూ? కాని, కాశీపతి మమ్మల్నంతా వెధవల్ని చేసి ఆడించాడు. మీ అన్నయ్య గొప్ప లయోల్టీ తో కాశీపతి ని కవర్ చేశాడు. మీ అన్నయ్యే అతన్ని అకామడేట్ చెయ్యకపోతే అసలు కాశీపతి ఆటలు సాగేవి కావు.”

“మిమ్మల్ని ఫూల్ చేయడానికి తను చచ్చిపోయాడా?” కొంచెం విసురుగానే అడిగాడు చక్రధర్ని.

“అతని చావు మాకందరికీ విచారాన్ని కలిగించింది. ఆటను మమ్మల్ని ఎంత ఫూల్ చేసినా. కాని, అతని ప్రవర్తనకీ, అతని చావుకూ ఏ మాత్రం సంబంధం లేదు.”

“అంటే?”

“అతను ల్యుకేమియా, అంటే బ్లడ్ కాన్సర్ వల్ల చనిపోయాడు. అది ఘోరమైన జబ్బు. అప్పటికి, ఇప్పటికీ దానికి మందులేదు.” నాకు కొంచెం విసుగు అనిపించింది. మీ డాక్టర్లందరికీ ఉన్న జబ్బే ఇది. ఒకలా మాట్లాడాక మహా సీరియస్ గా ప్రొఫెషనల్ పేస్ పెట్టేస్తారు. కొంచెం కదిల్చామా, వ్యాధుల గురించి, ఇటియాలజీ, ప్రోగ్నోసిస్, ట్రీట్మెంట్ దంచేస్తారు వినేవాళ్లుండాలి గాని.

“అతను ల్యుకేమియా తో చనిపోయాడని అన్నయ్యే చెప్పాడు.”

“అంతేనా? అసలు సంగతి చెప్పలేదూ?”

“అందుకే మీ దగ్గరకు వచ్చాను.” మరి ముంత దాచలేదు.

మీ అన్నయ్య లాయల్టీ అమోఘం. (చిరునవ్వు) అసలు జరిగిన సంగతి ఇది. నీకు తెలుసేమో అనుకున్నాను. మిస్ మార్టరీ అనే నర్స్ కీ, కాశీపతి కి పరిచయమయి, చిక్కపడి ప్రేమాయణంలో పడింది. కాశీపతి బ్యాక్ గ్రౌండ్ తెలిసిన దయానిధికి ఈ ప్రేమాయణం చాలా అసహ్యంగా ఉండేది. కాశీపతి , మార్టరీ ఎక్కడ కలిసేవాళ్ళో మాకు తెలియదు. కాని, రెండు సార్లు హాస్టల్ లో, మీ అన్నయ్య గదిలోనే వాళ్ళు హుషారు చేసినట్లు మాకందరికీ తెలుసు. దాని కోసం కాశీపతి ఆడిన నాటకం అద్భుతం.

ఏదో ఓ ఎముక కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఇడియట్ దయానిధి గాడు దాన్ని కొంతవరకు నమ్మాడు. మీ అన్నయ్యకు దయ్యాల మీద నమ్మకం లేదు. కాశీపతి నాటకమాడుతూంటే మీ అన్నయ్య సైలెంట్ గా ఉండటానికి కారణాలు – మొదటిది; కాశీపతి, తనూ చాలా దగ్గరి స్నేహితులు. రెండవది; మిస్ మార్టరీ క్రిస్టియన్. మూడవది;తన గదిలోనే ఇది జరుగుతున్నట్టు అంతా అయిపోయే వరకూ తెలియదు. ఇంతకీ ఇప్పుడతను చనిపోయిన తన స్నేహితుని గురించి చెడు చెప్పడు.”

“మిత్రులంతా వాళ్ళ గదిలో ఉన్నప్పుడు తలుపు తడితే, లేదూ, ఆ అమ్మాయిని వెంబడిస్తే...” మళ్ళీ ప్రారంభించాడు జాన్. “ఇలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం తెలియదు. మాగ్జిమం ఏం జరిగేదీ వార్డెన్ కు తెలిసేది. సస్పెండ్ అయి ఉండేవాడు కాశీపతి.”

మెల్లగా లేచాడు జాన్.

“మేమూ వస్తాం. బస్ స్టాప్ వరకూ”

అని పంతులూ, భాస్కరం, భవానీ, జాన్ వెంబడి నడిచారు. నూట పదిహేడో గదికి కొంచెం ముందుగానే అద్భుతమైన అగరువత్తుల వాసన వేసింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పంతులు చొరవ చేసి గది తలుపు తట్టాడు మెల్లగా. కొంచెం సేపటి తరువాతి మెల్లగా తలుపు తెరుచుకుంది. ముగ్గురూ లోపలికెళ్ళారు. జాన్ మాత్రం బయటే ఉన్నాడు. ఒక పెద్ద సాయిబాబా పటానికి పెద్ద పూలమాల వేసి ఉంది. ముందు అగరవత్తులు, గది నిండా సువాసన.

“సారీ మిస్టర్ సత్యం.. నువ్వు పూజలో ఉన్నావని మాకు తెలియదు – రేపు ఎలక్షన్లకి...” ఏదో అబద్ధం ఆడాడు పంతులు గాడు. (ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక, 1974)

**** సమాప్తం ****

Posted in November 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!