Menu Close
Kadambam Page Title
నువ్వొస్తే.......
-- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

భావమై నువ్వొస్తే భాషనై నే కలుస్తా
ప్రాసవై నువ్వొస్తే పదాన్నై నే కలుస్తా
అర్ధమై నువ్వొస్తే పరమార్ధమై నే కలుస్తా
ఊహలా నువ్వొస్తే ఊపిరై  నే కలుస్తా
కమలమై నువ్వొస్తే కిరణమై నే కలుస్తా
అమృతమై నువ్వొస్తే అనంతమై నే కలుస్తా
కలలా నువ్వొస్తే కవ్వింపునై నే కలుస్తా
హఠాత్తుగా నువ్వొస్తే ఆశ్చర్యమై నే కలుస్తా.
రేయిలా నువ్వొస్తే హాయిలా  నే కలుస్తా
నిలకడై నువ్వొస్తే నమ్రతై నే కలుస్తా.
గానమై నువ్వొస్తే మౌనమై నే కలుస్తా.
ప్రాణమై నువ్వొస్తే అర్పణయి నే కలుస్తా.
వెన్నెలై నువ్వొస్తే వన్నెనై నే కలుస్తా.
వయసువై నువ్వొస్తే వలపునై నే కలుస్తా.
ఎండమావివై నువ్వొస్తే నీటిబావిలా నే కలుస్తా.
అసత్యమై నువ్వొస్తే ఆవేదనై నే కలుస్తా.
శాశ్వతమై నువ్వొస్తే విశ్రాంతినై నే కలుస్తా.
నిద్రలో నువ్వొస్తే కలలా నే కలుస్తా.
నిజంలా నువ్వొస్తే సత్యమై నే కలుస్తా.
ఆత్మలా నువ్వొస్తే జ్యోతిలా నే కలుస్తా
పోరాటమై నువ్వొస్తే ఆరాటమై నే కలుస్తా.
నీతివై నువ్వొస్తే ఖ్యాతిలా నే కలుస్తా.
శిలలా నువ్వొస్తే శిల్పినై నే కలుస్తా.
సంద్రంలా నువ్వొస్తే కెరటమై నే కలుస్తా.
సాధనై నువ్వొస్తే సాధ్యమై నే కలుస్తా.
ఆదివై నువ్వొస్తే అంతమై నే కలుస్తా.
ఆత్రమై నువ్వొస్తే సూత్రమై నే కలుస్తా.
మృతివై నువ్వొస్తే స్మృతినై నే కలుస్తా.
దేవతై నువ్వొస్తే భక్తుడనై నే కొలుస్తా!!!!!!

Posted in November 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!