Menu Close
Page Title
తరిగిపోని కరిగిపోని ప్రాచీన పద సంపద

ఈ శాసనం ద్వారా మన తెలుగు ఎంతో ప్రాచీనమైనదని మరొక్కసారి ఋజువైనది.

ఆనాటినుండి ఈ నాటివరకు చెక్కుచెదరని తెలుగు పదాలను గూర్చి, ఆనాటివి ఈనాడు మార్పుచెందిన పదాలను శాసనాల నుండి, ఇతరత్రా సేకరించి ఆరుద్ర చర్చించారు.

౧. నేటి ‘రెడ్డి’ అనే పదాన్ని ‘రట్టగుడి’ అనేవారు. ఇది ఒక పదవి. “గంగ రట్ట గుళ్ళు...రట్ట గుడి పట్టంబు గట్టి నిల్పి” అని ఒక శాసనంలో ఉంది. (స.ఆం.సా. 1వ సం. పుట 44).

౨. ఆనాడు కృష్ణపక్షాన్ని ‘చీకు’ అని శుక్లపక్షాన్ని ‘పెంపు’ అనేవారు.

౩. అడుగడుగున; ఈ నుడికారం ఈనాడు మనం వాడుతూనే ఉన్నాం. అడుగడుగునా అన్నీ కష్టాలే ..మొ||నవి. ఈ నుడికారాన్ని చెప్తూ ఆరుద్ర “ఏడుకొండలవాణ్ని ....అడుగడుగు దండాల వాడు” అంటాం. కానీ ఇది నన్నయ్య గారికి పూర్వమే మొదలైంది. నలంజపాడు శాసనంలో “అడుగడుగశ్వమేధంబున ఫలంబగు” అని ఉన్న దానిని తన పరిశోధనలో వెల్లడించారు ఆరుద్ర.

‘బోయ’ అన్నది ‘భోజ’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది అని చెప్తూ ‘భోజకులు’ అంటే ఊరిపెద్దలు అని తెల్పారు (స.ఆం.సా. 1వ సం. పుట 46).

నాణాల పైన శాసనాలలో ఛందస్సు

ఆరుగురు శాతవాహన రాజులు వెండి నాణేలను వేయించారు. ఆ నాణేలకు బొరుసు వైపు తెలుగు మాటలున్నాయని గుర్తించిన వారు పురావస్తుశాఖ లో ప్రముఖులైన పురాణం రాధాకృష్ణ ప్రసాదు గారు, ఇంగువ కార్తికేయ శర్మ గారు. కార్తికేయ శర్మ “కాయనేజ్ అఫ్ శాతవాహన ఎంపైర్” అన్న గ్రంథం వ్రాస్తే, రాధాకృష్ణ ప్రసాదు గారు ఒక పరిశోధనా పత్రం సమర్పించారు.

నాణేలు: భారతదేశంలో శాతవాహనులకు ముందు నాణేలు లేవు. విదేశీయులవి మాత్రమే ఉండేవి. రాజుల రూపాలు ఉన్న నాణేలను రూప్యము అనే వారు. అదే నేటి రూపాయిగా పిలువబడుతున్నది. శాతవాహనుల నాణేలు ఏయే ప్రదేశాలలో దొరికాయో ఆరుద్ర ఒక పటంలో చూపించారు.

ఇప్పటి క్రీ.శ. 88 నుండి, 220 సంవత్సరం దాకా పరిపాలించిన ఆరుగురు శాతవాహనరాజుల నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణేల మీద బ్రాహ్మీ లిపిలో- ఒక పక్క ప్రాకృతంలోనూ, మరో పక్క తెలుగులోనూ తమ నామదేయాల వక్కణాన్ని (వృత్తాంతాన్ని) చెక్కించారు. తెలుగు వక్కణం మాత్రా ఛందస్సులో ఉండడం గమనార్హం. ఆరుద్ర ఆరు నాణేల లోని ఛందస్సుని విడమర్చి చెప్పి “శాతవాహనుల నాణేలలో కనపడే ఈ రగడలు ఖండగతికి చెందినవి” అని వివరించారు (స.ఆం.సా. 1వ సం. పుటలు 22-25).

గద్య శాసనాలు: గద్య శాసనాలలో ఛందస్సుతో ఉన్న రచనలున్నాయి. పుణ్యకుమారుని పొట్లదుర్తి – మాలెపాడు శాసనంలో ద్విరదగతి రగడ ఉందని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి గారు తెల్పారు. ప్రాఙ్నన్నయ యుగపు గద్య శాసనాలలో ఛందోబద్ధమైన భాగాలను ఒక పదమూడింటిని గూర్చి దివాకర్ల వెంకటావధాని గారు చర్చించారు. అయితే, సంపూర్ణంగా చందోబద్ధ శాసనాలు మనకు గుణగ విజయాదిత్యుని కాలం (క్రీ.శ. 848) నుండే కనబడతాయి అని ఆరుద్రలాంటి పరిశోధకుల మాట. గుణగ విజయాదిత్యుడు తెలుగు కవిత్వాన్ని తెలుగు గడ్డ మీద పాదుకొలిపాడు.

ఆనాటి వచన రచన

క్రీ.శ. 9 వ శతాబ్దంలో రాజులు వేయించిన శాసనాలలో గుణగ విజయాదిత్యుని సేనాని పండ రంగడు చేసిన దానాన్ని తెలిపే శాసనం – గుంటూరు మండలం లోని అద్దంకి గ్రామంలో ఒక పొలంలో దొరికింది. ఇది తెలుగులో మొదటి పద్య శాసనం. తరువోజ అనే పద్యం ఇందులో ఉంది.  కందుకూరులో, ధర్మవరంలో రెండు శాసనాలు దొరికాయి. ఒక్కొక్క శాసనంలో ఒక్కొక్క సీస పద్యం ఉంది. అద్దంకి శాసనంలో చెప్పబడిన పండ రంగని ప్రశంసిస్తూ వ్రాసినవి ఆ సీస పద్యాలు. కందుకూరు శాసనంలో సీస పద్యం ఉందని చెప్పిన వారు కొమఱ్ఱాజు లక్ష్మణ రావు గారు.

ఈ పద్యాలలో కొంతమటుకు తత్సమ పదాలున్నాయని ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా ఉండే గునుగు సీస పద్యం ఇదని ఆరుద్ర తెల్పారు  (స.ఆం.సా. 1వ సం. పుటలు 50-51).

క్రీ.శ. 850 నాటి గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో వచన రచనలో సలక్షణత్వానికి సాక్ష్యం ఇస్తుందని అంటారు ఆరుద్ర. అది అక్షర సత్యం. “విజయాదిత్య పాద పద్మ భ్రమరాయమాణ శ్రీమత్కడయ రాజు గుణగణా భరణుండు తనకెని ఈశ్వరునకు కార్తికేయుండు బోలె...” ఇది ఆ శాసనంలోని వచనం. ఆరుద్ర చెప్పినట్లు ‘ఎంత చక్కటిది. చక్కని గద్యకుసుమాలు ఆనాడు వికసించక పోలేదు’ (స.ఆం.సా. 1వ సం. పుట 60).

కందమే మూలకందం

శాసనాలలో కనపడే దేశీయ ఛందస్సుకు సంబంధించిన పద్యాలలో కందం ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. దీనిని గూర్చి ఆరుద్ర మాటలు మరియు సారాంశం –

“కందాన్ని గూర్చి ముచ్చడించుకునే ముందు ‘గాథా’ ఛందస్సును గూర్చి కూడా తెలుసుకోవాలి. 64 మాత్రలున్న పరిపూర్ణ గాథను (ఛందస్సును) ప్రాకృత భాషలో ‘ఖండ ఆ’ అని పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన కంద పద్య లక్షణాలు, ‘ఖండ ఆ’ లక్షణాలు పూర్తిగా ఒక్కటే. ఏమైనా ఇది తెలుగు వాళ్ళ దగ్గరనుండి ప్రాకృతంలోకి, ప్రాకృతం నుండి సంస్కృతానికి వెళ్ళింది. సంస్కృతంలో దీనిని ‘ఆర్య’ అంటారు.”

ఇంత ప్రాచుర్యమున్న కంద పద్యాలు ఒక్కచోట మాత్రమే లభించాయి. జనవల్లభుడు వేయించిన బొమ్మలగుట్ట – కుర్కియాల శాసనంలో మూడు కంద పద్యాలున్నాయి. అయితే యుద్ధమల్లుని కుమారుడు బాడప మహారాజు (క్రీ.శ. 927-934) వేయించిన ‘అమందాక’ శాసనంలో మాత్రం సంస్కృత భాషలో వ్రాసిన కంద పద్యం ఉన్నది. ఆనాడు కంద పద్యరచన విరివిగా జరగలేదు అనే అభిప్రాయానికి శ్రీ సంపత్కుమార గారు తన ‘తెలుగు ఛందోవికాసము’ లో ఇలా వివరించారు –

“ఈ పద్యమును (అమందాక సంస్కృత పద్యం) బట్టి తెలుగు ఛందమగు కందమునకు అధిక ప్రచారముండెనని చెప్పవచ్చును. ఎంతో ప్రచారముండిననే, సంస్కృత మయమయిన శాసనమునందు తెలుగు లక్షణములతో గూడిన పద్యమునకు ప్రవేశము కల్గునని చెప్పుటకు వీలగును.....” (స.ఆం.సా. 1వ సం. పుటలు 25-27).

మల్లియ రేచన (క్రీ.శ.940)

మల్లియ రేచన నివాసం వేములవాడ. యితడు జైన మతస్థుడు. వైశ్యకుల చూడామణి. ఇతడు కవే కాక ఆనాటి సంస్కృత కవులైన విద్యారాశి, పిచ్చన భట్ట మొదలైన వారిని సత్కరించారు. కవులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల రేచనకు  ‘కవిజనాశ్రయుడు’ అనే బిరుదు కూడా ఉంది. ఇతనికి జైన కులస్థుడు మరియు ఎంతో ప్రఖ్యాతి గాంచిన చినవల్లభుడు ప్రాణమిత్రుడు. కన్నడ సంస్కృతాలలో గ్రంథాలు, లక్షణ గ్రందాలు ఉన్నందువల్ల – తెలుగులో కూడా ఆది పురాణం వంటి గ్రంధాలున్నప్పటికి తెలుగులో ఒక లక్షణగ్రంథం వ్రాస్తే బాగుంటుందని మల్లియ రేచన, చిన వల్లభుడు తలచారు. తత్పలితంగా మల్లియ రేచన ఒక లక్షణగ్రంథం వ్రాసి దానికి “కవిజనాశ్రయము” అని తన బిరుదనామమును కలిసి వచ్చేటట్లుగా ఆ గ్రంథానికి పేరుపెట్టాడు. దీనికి భీముని ఛందము అని పేరు కూడా ఉంది.

రేచన “కవిజనాశ్రయము” ను, రేచన తర్వాతి కవులు బాగా వాడుకొన్నారు. అయితే వారు చేసిన ఒక తప్పిదం సంకటస్థితికి కారణమైంది. ఆ విషయాన్ని ఆరుద్ర ఇలా వివరించారు.

“మన సాహిత్యంలో తర్వాతి లాక్షణికులు అనంతుడు, విన్నకోట పెద్దన, వెల్లంకి తాతం భట్టు, లింగమగుంట తిమ్మన, అప్పకవి, కస్తూరి లింగకవి మొదలైన వాళ్ళందరూ ఈ కవిజనాశ్రయాన్ని చదివిన వాళ్ళే. అందులోని పద్యాలకు, పద్యాలు వాడుకొన్న వాళ్ళే. ఈ గ్రంథం ఇంత ప్రాచీనమైనా, ఇంత ప్రశస్తమైనా దీని రచయిత ఎవరో తేల్చుకోలేని పరిస్థితి ఆ లాక్షిణీకుల వల్ల తెలుగు భాషలో ఏర్పడటం శోచనీయం.”

పై విషయానికి, ఆరుద్ర కొన్ని ప్రశ్నలు వేసుకొని సమాధానాలు ఇలా చెప్పుకొన్నాడు.

“రేచన బ్రాహ్మణుడు కాడు. పోనీ వైదిక భక్తితత్పరుడు కూడా కాదు. జైన మతస్థుడు. కాబట్టి ఇతనికి పెద్ద పీట వేయవలసిన అవసరం మన వాళ్లకు కలగలేదు. వేములవాడ భీమకవి పనిగట్టుకొని డబ్బు కోసం రేచన వ్రాసినట్లు ఈ పుస్తకం వ్రాశాడని ప్రచారం చేశారు.”

“వేములవాడను వెలిసిన...” అనే పద్యం వ్రాసి అవతారికలో ఇరికించారని అన్న ఆరుద్ర “కవితావైఖరిని బట్టి ఈ అవతారిక ప్రక్షిప్తం కాదని నమ్మిన జయంతి రామయ్య పంతులు గారిని ఏమనగలం? వారు ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున కవిజనాశ్రయాన్ని వేములవాడ భీమకవి కృతిగా 1917 లో తొలిసారి అచ్చువేయించారు. లాక్షణిక లోకంలో చిరకాలం నుంచి ఇదే అభిప్రాయం చలామణి అవుతున్నది కాబట్టి అలా చేసారనుకోవాలి. ..భీమకవి రేచనకు చాలా అర్ధ్వాచీనుడు.” (స.ఆం.సా. 1వ సం. పుటలు 100-106).

ఆరుద్ర అభిప్రాయములో “కవిజనాశ్రయము” నూటికి నూరు పాళ్ళు మల్లియ రేచన రచించిన లక్షణ గ్రంథం రేచనను గూర్చి ఆరుద్ర ఇంకా కొంత చర్చించారు.

**** వచ్చే సంచికలో కృతజ్ఞతా కుసుమాలు మరియు ఆరుద్ర జీవన ప్రస్థానం ****

Posted in November 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!